నాన్నా..పులి

ఇంత ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేలా ఏమి రాసి ఉంటాడో అనే ఆతృతతో నా కళ్ళు అక్షరాల వెంట ఆసక్తిగా పరుగు పెడుతున్నాయి.

నాన్న మొదటి సంవత్సరీకానికి వచ్చిన బంధు మిత్రులతో ఇల్లు కిటకిటలాడిపోతోంది. అమెరికా నుండి అన్నయ్య, హైదరాబాద్ నుండి మేము, కర్నూలు నుండి చెల్లెలు, ఇంకా చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు, మనవళ్లతో ఇల్లు సందడి సందడిగా వుంది. రెండు రోజులనుండి ముప్ఫై మందితో నిండి పోయిన ఇంట్లో, తమ్ముడు సంతోష్, కావలిసిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాడు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఈ ఊరిని విడిచిపెట్టకుండా మా పేగు బంధాన్ని కాపాడుతున్నాడు వాడు. నాన్న చనిపోయిన తరువాత ఆయన గుర్తుగా ఊర్లో చిన్నపాటి లైబ్రరీ, దేవాలయం ప్రహరీగోడ నిర్మాణం చేపట్టాము. సంతోషే అన్ని పనులూ దగ్గరుండి చేయించాడు. సాయంత్రం వరకూ అందరమూ ఆ మీటింగుల  హడావుడిలోనే ఉన్నాము.

సాధారణంగా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూనో, రీల్స్ చూసుకుంటూనో, చాట్ చేసుకుంటూనో టైమ్ పాస్ చేసే పిల్లలను తన చుట్టూ కూర్చోబెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు సంతోష్. అరుపులు, నవ్వులు కేకలు, కేరింతలతో కింద హాల్లో స్కూలు వాతావరణం కనబడుతోంది.

మేడ మీద రూములోనుండి బయటకు వచ్చి నిల్చున్నాను.

కింద కిచెన్ లో రాత్రి భోజనపు ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. రెండు బెడ్ రూములలో ఆడవాళ్ళ మాటలు, నవ్వులు, గాజుల గలగలలలో కలిసిపోయాయి. వీటన్నిటిని మించి హాలు మధ్యలో కూర్చున్న సంతోష్, మాటల మంత్ర దండంతో చుట్టూ చేరిన పదిమంది పిల్లలను కట్టిపడేశాడు. పిల్లలు వాడి మాటలను ఎంజాయ్ చేస్తున్నారు.

సంతోష్ అందరినీ ఉద్దేశించి –

“మీరు మధ్యాహ్నం మీటింగ్ లో తాతయ్య గురించి పెద్దవాళ్ళు మాట్లాడినదంతా విన్నారు కదా ? తాతయ్య గురించి మీకేమర్ధమయ్యిందో మీ మాటల్లో చెప్పండి” పిల్లలను అడుగుతున్నాడు.

వాడి ఆలోచన నాకర్ధమయ్యింది. ఈ ట్రిప్ వల్ల మీరు నేర్చుకున్నదేంటి ? ఈ ఫంక్షన్ నుండి మీ టేకవే (take away) ఏంటి ? అని మేనేజ్మెంట్ పరిభాషలో కాకుండా అవే విషయాలను ఒక టీచర్ పాఠం చెప్పి సారాంశం చెప్పమని, పేరా గ్రాఫ్ ఇచ్చి ప్రెసి రైటింగ్ రాయమన్నట్టు అడుగుతున్నాడు.

అభిరామ్ తాను మాట్లాడతానని చేయి పైకెత్తి అడగటం నాకు ఆశ్చర్యం కలిగించింది. వాడు ఇంట్లో చాలా తక్కువ మాట్లాడుతాడు. సంతోష్ వాడిని చెప్పమని సైగ చేయగానే వాడు తలవూపుకుంటూ, చేతులు తిప్పుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు.

“తాతయ్య బాగా కష్టపడతాడు. మంచి టీచర్. చాలామంది పిల్లవాళ్లకు హెల్ప్ చేశాడు. బాగా చదివే పూర్ పిల్లలకు ఫీజులు కట్టాడు. బట్టలు కుట్టించాడు. ఇప్పటికీ వాళ్ళందరూ తాతయ్యను గుర్తుచేసుకుంటారు. తాతయ్య ఊరిలో కూడా అందరికీ హెల్పింగ్ గా వుండేవాడు. ఊరికి బస్సు రావడంలో, రోడ్డు వేయించడంలో కీ రోల్ ప్లే చేశాడు” అని ముగించాడు.

సంతోష్ తృప్తిగా తలాడిస్తూ, “సూపర్, బాగా చెప్పావు, వండర్ఫుల్” అని మెచ్చుకుంటూ,

“తాతయ్య మంచి మనిషి, మంచి టీచర్ మాత్రమే కాదు, మంచి నాన్న కూడా” ఏదో చెప్పాలని దీర్ఘాలోచన చేస్తున్నట్టు, ఇదొక ఉపోద్ఘాత వాక్యం లాగా చెప్పాడు. తరువాత ఏమి చెబుతాడా అని అందరూ సంతోష్ వైపే చూస్తున్నారు.

“తాతయ్య మాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక గుంజకు చాలా పొడవు తాడుతో నిన్ను బంధించి వదిలితే ఏమనిపిస్తుంది. నువ్వు తిరిగినంతమేరా అది నీకు కట్టినట్టే తెలియదు. నీదారికి అది ఆటంకం కాదు. ఎప్పుడైతే పరిధి దాటుతావో అప్పుడు మాత్రమే నిన్ను గుంజకు కట్టేసిన విషయం నీకు తెలుస్తుంది. తాతయ్య ఇచ్చిన స్వేచ్ఛ కూడా అట్లాంటిదే. పెద్దన్నయ్య డాక్టరు, చిన్నన్నయ్య ఇంజనీర్ అయ్యారు. ‘నేను టీచింగ్ లో ఉండాలనుకుంటున్నా’ అన్నాను. నేను కూడా ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి బయటకు వెళ్లాలని ఆయన కోరిక. అయితే నాకు ఈ ఊరినీ,తోటలనీ, పొలాలనీ వదిలి పోవడం ఇష్టం లేదు. నాకూ మా నాన్న లాంటి జీవితమే ఇష్టం. ఆ విషయమే చెబితే ఆయన ఇది కష్టపడే జీవితమనీ, మళ్ళీ తరువాత పశ్చాత్తాప పడకూడదనీ మాత్రమే చెప్పాడు”

సంతోష్ నాన్న గురించి చెబుతుంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. అన్నయ్య అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే నేను ఇంజనీరింగ్ లో చేరాను. ఒకవైపు, అందరూ వెళ్లిపోతే ఎలా అనే బెంగ వుండేది. అలా అని పిల్లలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరే ఉంచుకోవాలనే స్వార్ధం లేదు నాన్నకి. ఎప్పుడైతే సంతోష్,  తను ఊర్లోనే ఉంటానని చెప్పాడో, ఆయన మనసులో ఎంత సంతోషించాడో తెలుసు. అందుకే నాన్న మనసుని అర్థం చేసుకున్నతమ్ముడు మాకు మరో నాన్నలాగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తాడు.

సంతోష్ చెప్పిన ఏవో మాటలకు పిల్లలందరూ పెద్దగా నవ్వడంతో నేను ఆలోచనలనుండి బయటకు వచ్చాను. వదినె వాళ్ళు పిల్లలను భోజనాలకు పురమాయిస్తున్నారు.

“బాబాయి, ఇంకా చెప్పు.. తాతయ్య గురించి ఇంకా చెప్పు..” అంటున్నారు.

“మా నాన్న, అదే, మీ తాతయ్య ఏ విషయమూ నేరుగా చెప్పేవాడు కాదు. సూక్తులు చెబుతున్నట్టు ఉండేది కాదు. అన్నీ కథల రూపంలోనే చెప్పేవాడు. పట్టుదలకు భగీరధుడి కథ చెప్పేవాడు. పరోపకారం గురించి ధధీచి కథ, స్నేహం గురించి దుర్యోధనుడి కథ ఇలా పురాణపాత్రలను పరిచయం చేసేవాడు. దురాశకు పోవద్దని ఇనుప గొడ్డలి-బంగారు గొడ్డలి కథ, అబద్ధాలు చెప్పకూడదని ‘నాయనా పులి వచ్చె’ కథ, నిజాన్ని ఎల్లకాలం దాచివుంచలేమని కిర్రు కిర్రు లొడ్డప్పకథ .. ఇలా ఎన్ని కథలు చెప్పి వుంటాడో..”

ఏదో సంవత్సరీకపు తంతు ముగించాము. పూజలు చేశాము. భోజనాలు పెట్టించాము, దానధర్మాలు చేశాము,  అని కాకుండా సంతోష్ చేస్తున్న ఈ పని నాకు వాడి పట్ల గొప్ప గౌరవాన్ని కలిగించింది. నాన్నగురించి, ఆయన మంచితనం గురించి, ఆయన పెంపకం గురించి , జీవితం గురించి పిల్లల మెదళ్ళలో, ఆలోచననలలో ఆయనను భాగం చేయడంకంటే గొప్ప నివాళి ఏముంటుంది ఏ తండ్రికయినా? మనసులోనే వాణ్ణి అభినందిస్తుంటే మళ్ళీ వాడు ఇంకో సంఘటన ఏదో చెప్పడం ప్రారంభించినట్టున్నాడు.

“ఒకసారి పెద్దన్నయ్యకి జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీటింగ్ కర్నూల్లో. నేనూ, నాన్న కూడా వెళ్ళాము అన్నయ్య వెంట. బహుమతులు ఇస్తున్నప్పుడు లేట్ కాకూడదని పిల్లలందరినీ ముందు వరసల్లో కూర్చోబెట్టారు. నేనూ, తాతయ్య వెనుక కూర్చున్నాము. ఇంతలో ముందు వరసల్లో ఎక్కడో చిన్నగా కలకలం. ఎవరో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. వాళ్ళ మధ్య మాటా మాటా పెరిగి చివరికి కొట్టుకోవడం వరకూ వస్తోంది. ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవడం దాటి ఆ ఘర్షణ కుర్చీలు విసిరేసుకోవడం వరకూ వచ్చింది. రెండు పోట్ల గిద్దల మధ్య లేగదూడల్లాగా ముందు కూర్చున్న పిల్లలు భయంతో వణికి పోతున్నారు. అప్పుడే ఆ మధ్యలోనుండి ‘అమ్మా’ అని అన్నయ్య అరిచాడట. నాన్నఏ మాత్రం ముందు వెనుక చూడకుండా, గాడ్రేజీ కుర్చీలు బంతుల్లాగా గాల్లోకి ఎగురుతున్నా పట్టించుకోకుండా ఒక్క ఉదుటన వాటి మధ్యలో నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య దగ్గరికి చేరి వాణ్ణి స్టేజి అవతల వైపుకి తీసుకెళ్ళి నెమ్మది చేశాడు. ఈ విషయం అన్నయ్య, నేనూ ఎన్నో సార్లు గుర్తుచేసుకున్నాము” అని ముగించాడు.

“మరి తాతయ్యకి భయం వెయ్యలేదా” అభిరామ్ అడుగుతున్నాడు.

“మామూలుగా అయితే భయం ఉంటుంది. అయితే అక్కడ అన్నయ్య అరుపులో భయం నాన్న భయాన్ని పోగొట్టి బాధ్యతను గుర్తుచేస్తుంది. అందుకే భయం స్థానంలో తెగింపు వచ్చేస్తుంది” సంతోష్ వివరించాడు. ఈ వివరాలన్నీ పెద్దవాళ్ళు కూడా ఆసక్తిగా వింటూ మైమరచిపోతుంటే, మరదలు వచ్చి
“మీ బాబాయ్ మాటలు వింటూ మీరు అన్నాలు కూడా తినడం మర్చిపోతున్నారు.. లేవండి పిల్లలూ.. అంటూ అందరినీ లేపడంతో అందరూ భోజనాలకు కదిలారు.

నెలరోజులు గడిచాయి. అన్నయ్య వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయారు. అందరమూ మళ్ళీ రొటీన్ లో పడిపోయాము.

***

ఒక రోజు , ఆఫీస్ క్యాంటీన్ లో పిచ్చాపాటీ సాగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సామర్ధ్యాల మీద చర్చ నడుస్తోంది. యువల్ నోవా హారారీ రాసిన కొత్త పుస్తకం ‘నెక్సస్’ చదివిన వేణు రచయిత అభిప్రాయాలను చెబుతున్నాడు. దాని దుష్పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అని విశ్లేషణలు చేస్తున్నారు. ఎంత కృత్రిమ మేధ అయినా , ఎంత వేగంగా నేర్చుకున్నా మనిషి ఆలోచనా లోతుల్లోకి, అవధిలేని సృజనాత్మక పొరల్లోకి అది వెళ్లగలదా అని కొందరు సవాల్ విసురుతున్నారు..

ఉన్నట్టుండి నా ఫోన్ మోగింది. అది అభిరామ్ వాళ్ళ ప్రిన్సిపల్ నుండి. ఒక్క క్షణం అయోమయంలో పడిపోయాను. వాడికేమయినా జరిగిందా, వాడేమైనా అల్లరి చేశాడా,గొడవల్లో ఇరుక్కున్నాడా? ఆటలలో దెబ్బలు తగిలుంటాయా? ఆలోచనలను అదిమిపెట్టి ఫోన్ తీశాను.

“గుడాఫ్టర్నూన్ సార్, మీరు అభిరామ్ ఫాదర్ కదా..ఒకసారి మీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్కూలుకు రాగలరా ?” అని అడిగింది ఆవిడ. నేను కంగారుగా

“ఎందుకు మేడమ్, ఏం జరిగింది? అభిరాంకి ఏమయింది” అని అడుగుతుంటే, నా ఆదుర్దాని గమనించి

“కంగారుపడకండి. అంతా నార్మల్. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. దానికి సాధారణంగా ఎప్పుడూ మేడమే వస్తారు కదా” అని ఒక్క క్షణం అవతలవైపు ఎవరితోనో మాట్లాడి

“ మీతో కొంచెం మాట్లాడాలి. అందుకే ఈరోజు రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ ఒక కాజువల్ మీటింగ్, అంతే” ఫోన్ పెట్టేసింది.

నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఏమి చెప్పాలనుకుంటోంది? ఎందుకు కలవాలనుకుంటున్నారు? అవతల ఆమె మాట్లాడిన మరో వ్యక్తి ఎవరు? అయితే ఒక చిన్న రిలీఫ్. వాడి గురించి ఎటువంటి నెగటివ్ విషయమైతే కాదని తెలిసింది. ఫరవాలేదు. మరి పాజిటివ్ విషయమైతే  ఫోన్లో చెప్పేయొచ్చు కదా సాయంత్రం వరకూ ఎందుకు ఆగడం? ఎడతెగని ఆలోచనలు ఎంత వద్దనుకున్నా వస్తూనే వున్నాయి. సాయంత్రం వరకూ సస్పెన్స్ కొనసాగుతోంది.

సాయంత్రం నాలుగుకెల్లా స్కూలుకెళ్ళాను. అప్పటికే అభి, వాడి చెల్లెలు, ఆటోలో వెళ్ళిపోయారు. నేను నేరుగా ప్రిన్సిపాల్ రూముకెళ్ళాను. ఆవిడ నన్ను కూర్చోమని చెప్పి, వాళ్ళ తెలుగు టీచర్ కి ఫోన్ చేసి “అభిరామ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. పేపర్ తీసుకుని రండి” అని చెప్పడం వినిపించింది.

రెండు నిముషాల్లో తెలుగు మేడమ్ వచ్చారు. ఆవిడ నా వంక మెచ్చుకోలుగా చూస్తూ, నా పక్కనే చైర్లో కూర్చున్నారు.

ప్రిన్సిపాల్ ముందుగా

“మరేం లేదుసార్ , మొన్న హాఫియర్లీ పరీక్షలు జరిగాయి కదా..అందులో ‘సరదాకయినా అబద్దాలు చెప్పకూడదు’ అని బోధించే “నాన్నా పులి” అని ఒక పాఠముంది. ఆ కథని స్వంత వాక్యాల్లో రాయమని పది మార్కుల ప్రశ్నగా అడిగాము. దానికి మీ అబ్బాయి రాసిన సమాధానం మీకు చూపిద్దామని పిలిచాము. ఎలాగూ రేపు వాళ్ళ మమ్మీ వస్తారు కదా, ఆవిడకి చూపించొచ్చు. కానీ మా తెలుగు టీచర్ గారు ఈ కథ మీరు చదవాలని కోరుకున్నారు. అందుకే మిమ్మల్ని  ఇబ్బంది పెడుతున్నాము.. నవ్వుతూ చేతికి పేపరిచ్చినది. అమ్మయ్య.. కంగారుపడాల్సిన విషయమేమీ లేదు అని రిలాక్సవుతూ పేపర్ చేతిలోకి తీసుకున్నాను. అప్పటికే తెలుగు టీచర్ ఆ కథ రాసిన పేపర్ తీసి పెట్టి వుంచింది. ఇంత ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేలా ఏమి రాసి ఉంటాడో అనే ఆతృతతో నా కళ్ళు అక్షరాల వెంట ఆసక్తిగా పరుగు పెడుతున్నాయి.

“అనగనగా ఒక ఊర్లో కోటయ్య అనే రైతుకు కొండయ్య అనే కొడుకు ఉండేవాడు. కొండయ్య చాలా అల్లరి పిల్లవాడు. తన తుంటరి పనులతో ఇంటిమీదకు గొడవలు తెచ్చేవాడు. కోటయ్య ఎన్నిసార్లు చెప్పినా, ఎవరితో చెప్పించినా అతని అలవాట్లు మార్చుకోలేదు. ఆకతాయి కొండయ్య అనే పేరు తెచ్చుకున్నాడు.

ఒకరోజు కట్టెల కోసం కోటయ్య అడవికి వెళుతుంటే తను కూడా వస్తానని వెంటబడ్డాడు కొండయ్య. తండ్రి ఎంత నచ్చచెప్పినా వినకుండా వెంట నడిచాడు. కొంత అడవి లోపలికి పోయాక కోటయ్య కొడుకుతో ఇక్కడే ఆడుకుంటూ ఉండమని చెప్పి తను కట్టెలు కొట్టే పనిలో మునిగిపోయాడు. సహజంగానే తుంటరి అయిన కొండయ్య కొంతసేపు ఉడతలతో ఆడుకుంటూ, కాయలు పళ్ళు కోసుకుంటూ కాలం గడిపాక అతనికి విసుగేసింది. వాళ్ళ నాన్నను ఆట పట్టించాలని ఉన్నట్టుండి బిగ్గరగా ” నాన్నా పులి, నాన్నా పులి ” అని అరిచాడు. పక్కనే పనిచేసుకుంటున్న కోటయ్య పరుగెత్తుకుంటూ ఇవతలకి వచ్చి చూస్తే అక్కడ కొండయ్య వాళ్ళ నాన్నని చూసి ఎగతాళిగా”పులి లేదు, గిలిలేదు హిహిహి” అని నవ్వుతూ కనబడ్డాడు. కోటయ్య గాభరా తగ్గిన తరువాత ‘అలాంటి పనులు సరదాకి కూడా చేయకు’ అని కొడుకును మందలించాడు.

ఇంకొంచెం సేపు గడిచింది. కొండయ్యకు ఏమీ పొద్దు పోవడం లేదు. కోతులతో కొద్దిసేపు ఆడుకున్నాడు. పక్కనే చెరువులో నీళ్ళతో ఆదుకున్నాడు. ఇంకా నాన్న పని అయిపోలేదు. మళ్ళీ అతని బుర్రలో నాన్నని ఏడిపిద్దామని బుద్ది పుట్టింది. ఈసారి మునుపటికంటే గట్టిగా “నాన్నా పులి, నాన్నా పులి” అని గట్టిగా కేకలు పెట్టాడు. మళ్ళీ కోటయ్య వచ్చి చూస్తే అక్కడ పులిలేదు. కోటయ్యకు కోపం వచ్చింది. ఇలా అబద్దాలు చెప్పడం తప్పని, ఇంకోసారి ఇలాచేస్తే నిజంగా పులి వచ్చినా తను రానని కోపంగా చెప్పాడు.

మరికొద్ది సేపటికి మళ్ళీ “పులి.. నాన్నా పులి, నాన్నా పులి అని అరుపులు వినిపించాయి కోటయ్యకు.

ఇది కొండయ్య తుంటరి పనే అని భావించి కోటయ్య తిరిగి తన పనిలో మునిగి పోతుంటే.. మళ్ళీ “నాన్నా పులి, నాన్నా పులి” అని కొండయ్య అరుపులు వినిపించాయి. ఆ అరుపులు ఇందాకటి అరుపులలాగా లేవు. కోటయ్యలోని తండ్రి మనసు కొడుకు అరుపులలోని భయాన్ని పసిగట్టింది. ఇది నటన కాదని నిజంగానే పులి వచ్చిందేమోనని ఉన్నవాడున్నట్టుగా గొడ్డలి పట్టుకున్న చేత్తో అలాగే కొండయ్య అరుపులు వినిపించిన చోటుకు చేరుకున్నాడు. అక్కడ ఎదురైన దృశ్యం చూసి కోటయ్య నోటమాటరాలేదు. ఉన్నవాడున్నట్టే ఆగిపోయాడు. చింత నిప్పుల్లాంటి కళ్ళు, నల్లని చారల పెద్దపులి  కొండయ్యకు వంద అడుగుల దూరంలో గుర్రు గుర్రుమంటూ వాడిమీదకు దూకడానికి సిద్ధంగా వుంది.

నోట మాట రాని కోటయ్య చప్పున తేరుకొని, వెంటనే తెలివి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చేయగలిగిన పని ఒకటే..పులితో పోరాడటమే.. ధైర్యం తెచ్చుకున్నాడు. కొడుకుని కాపాడాలనే పట్టుదలతో తెగింపు వచ్చింది. పులిని సవాలు చేస్తున్నట్టు తన అడుగులతో అదిరిస్తూ అటు ఇటు కదులుతూ పులిని కవ్వించాడు. అతని చేష్టలకు రెచ్చిపోయిన పులి కొండయ్యను, కోటయ్యను మార్చి మార్చి చూసి ఒక్క అంగలో కసికొద్దీ పైనించి కోటయ్య మీదకు దూకింది. అది పైనుండి తన మీదకు దూకుతున్న సమయానికి తన చేతిలోని గొడ్డలి పులి గొంతులోకి దిగేలా అడ్డుకున్నాడు. అంత వేగంగా వస్తున్న పులి గొంతులో గొడ్డలి బలంగా దిగగానే పులి గట్టిగా అరుస్తూ విలవిలలాడుతూ నేల మీద పడి  బాధతో మెలికలు తిరుగుతోంది. దెబ్బకుదెబ్బ కొట్టాలని, కోటయ్య మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇదే సందని కోటయ్య, భయంతో గజగజ వణికిపోతున్నకొండయ్యను భుజాన వేసుకుని ఊరి వైపు పరుగెత్తాడు’

అంతవరకూ ఊపిరి బిగబట్టి చదివాక ఒక్కసారి పెద్దగా ఊపిరి తీసుకుని కుర్చీలో వెనక్కి వాలాను. ఇద్దరు వ్యక్తులు నన్ను గమనిస్తున్నారన్న స్పృహ అంతవరకూ కలగలేదు. చిన్నపాటి నవ్వు మొహాన పులుముకుని ఆ ఇద్దరి వైపూ చూస్తుంటే..‘ఇంకా ముందు చదవండి’ అంటూ రెప్పలు మూసి తలతో సైగ చేసింది తెలుగు టీచర్. మళ్ళీ కథలోకి నడిచాను.

“అలా చాలా దూరం పరిగెత్తాక ఇంక పులిరాదు అనుకుని నడకలోకి దిగాడు కోటయ్య. అప్పుడే తన భుజంపైన తుండుగుడ్డ తడిసిందేమిటా అని కుడిచేత్తో తడిమి చూసుకుంటే ఎక్కిళ్ల మధ్య ఏడుస్తున్న కొండయ్య కనిపించాడు. వాడి కంటినుండి నీళ్ళు కారిపోతున్నాయి. వెంటనే కొడుకు భుజాన్ని నిమురుతూ ‘ఏడవద్దు, ఏడవద్దు.. ఇప్పుడేం కాలేదులే’ అని చెప్పాడు. ఆ ఎక్కిళ్ల మధ్య ఆగి ఆగి కొండయ్య “నాన్నా.. ఇంకెప్పుడూ అబద్దాలు చెప్పను నాన్నా.. నిజ్జంగా ఇంకెప్పుడూ అబద్దాలు చెప్పను” అంటున్నాడు. అతని మాటలు విన్న కోటయ్య కొడుకులో వచ్చిన మార్పుకి సంతోషంతో తన చేత్తో కొడుకుని మరింత దగ్గరిగా హత్తుకున్నాడు. వాడు తండ్రి మెడ చుట్టూ వేసిన చేతులు మరింత బిగించాడు.

కథ అయిపోయింది. తల పైకెత్తి చూసాను. ప్రిన్సిపాల్ నావైపే చూస్తోంది. నేను కళ్ళనుండి రాలడానికి సిద్ధంగా వున్ననీటిని ఆపుకుంటూ కుర్చీలో వెనక్కి వాలి గట్టిగా ఊపిరి తీసుకున్నాను. అలా రెప్పవాల్చగానే రెండు కళ్ళనుండి నీళ్ళు ధారగా చెంపల మీదనుండి జారిపోతున్నాయి.మనసు ఉద్వేగభరితమైపోయింది. మౌనంగా ఉండిపోయాను.

మా ఆఫీసులో జరిగిన కృత్రిమమేధ చర్చలు జ్ఞాపకమొచ్చాయి. ఎప్పుడో నెలకింద బాబాయి చెప్పిన ఒక సంఘటన ఎక్కడో వాడి అంతఃచేతనలో నిక్షిప్తమై వాడి పుస్తకంలోని కథకు అన్వయించి చెప్పే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని కృత్రిమమేధ ఎంతమేరకు అందుకోగలదు? ఇన్నిభావోద్వేగాల పొరలను ఛేదించడం దానికి సాధ్యమా?

నా ఆలోచనలు ఎప్పటికి తెగేవో కానీ ప్రిన్సిపాల్ గారు

“ఈ కథ చదివి తెలుగు మేడం నాతో షేర్ చేసుకున్నారు. నేను అభిరామ్ ని అడిగాను, ఇలా కథని ఎందుకు మార్చావని. దానికా అబ్బాయి, ‘కొండయ్య చనిపోతే ఎలా మిస్? వాడి తప్పు తెలుసుకుని బతికితే బాగుంటుంది కదా” అని చెప్పాడు. మీ వాడి సున్నితమైన ఆలోచనకు నేను కదిలిపోయాను. యూ ఆరె ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్” అన్నది. ఆ క్షణంలో నాకు మా నాన్న, సంతోష్ గుర్తొచ్చారు. ఈ క్రెడిట్ అంతా వాళ్లదే అనుకున్నాను.

మళ్ళీ ప్రిన్సిపాల్ గారే

“మీరు పేరెంట్ టీచర్ మీటింగుకి వస్తే ఇంత వివరంగా తీరికగా మాట్లాడే అవకాశం ఉండేదికాదు. బహుశా అభిరాం  వాళ్ళ అమ్మ కూడా ఈ ఆనందం పొందకపోవచ్చు. వాడికి ఈ ఆలోచనలు ఎలా వచ్చాయో తెలియక పోయినా మీ పాత్ర తప్పకుండా ఉంటుందని నమ్మి మిమ్మల్ని రమ్మన్నాము” అన్నది తెలుగు టీచర్

కొద్దిసేపటి నిశ్శబ్దం తరువాత పేపర్ టీచర్ గారికి ఇస్తుంటే ఈ కథకు ఆవిడ వేసిన ‘సున్నా’ మార్కులు మార్జిన్ లో కనిపించాయి. నా మనసులో భావాన్ని పసిగట్టిన ప్రిన్సిపాల్ నవ్వుతూ

“ఓ, అదా.. మాకు టెక్స్టు బుక్కులో ఉండే సమాధానమే కావాలి. ఔటాఫ్ ద బాక్స్ సమాధానాలకు మార్కులు ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు. వాటికి రివార్డులు బయటి ప్రపంచం ఇస్తుంది” అన్నారు.

నేను ముసిముసిగా నవ్వుకుంటూ, సుమతీకారుడి పుత్రోత్సాహము పద్యం నెమరేసుకుంటూ సంతృప్తిగా బయటకు నడిచాను.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

జి.ఉమామహేశ్వర్

20 comments

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “సన్ ఆఫ్ సత్యమూర్తి” సినిమాలోని చిన్న సన్నివేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్వయించి కథగా, చాలా హృద్యంగా మలిచిన తీరు అద్భుతంగా ఉంది.
    రచయిత మేధస్సుకి, సృజనకి అభినందనలు.

  • ముగింపు superb
    విద్యా వ్యవస్థ లోపాలను ఎండగట్టింది
    భావోద్వేగాలదే పైచేయి

  • కథలో రచయిత స్వగతం దాగివుంది. అదే సమయంలో వర్తమాన ప్రపంచంలో పిల్లలకు పెద్దలకు మధ్య ఉన్న గ్యాప్ ఎంత ప్రమాదకరమైందో వారి మధ్య ఉండవలసిన అనుబంధం ఎంత అవసరమైందో ఈ కథ గుర్తు చేస్తుంది.
    నాన్న పులి కథలో సాధారణంగా కొడుకు పులికి బలి అవుతాడు. ఇక్కడ కొండయ్య బ్రతకాలి కొండయ్య తన తప్పు తెలుసుకుని బ్రతకాలనుకోవడం బాగుంది.
    అలాగే అభిరామ్ ఈ కథలో ఇంత సునీతత్వం తీసుకురావడం వెనుక అతని చిన్నాన్న సంతోషం ఉండటాన్ని తండ్రి గుర్తు చేసుకోవడం వెనుక పిల్లలతో సంతోష్ కనిపించిన క్షణాలు, పిల్లలతో పెద్దలు తీరిక చేసుకొని వారితో ముచ్చటిస్తే వారిలో గొప్ప నైపుణ్య శక్తి బయటకు వస్తుంది అని ఈ కథ తేట తెల్లం చేసింది. చివరగా ఈ కథ నేటి వర్తమాన విద్యా వ్యవస్థలో ఉన్న అత్యంత దుర్మార్గమైన స్థితిని అద్దం పట్టింది. విమర్శకు తీసుకువచ్చింది.
    విద్యార్థి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే దానికి సున్నా మార్కులు వేయడం, కేవలం టెక్స్ట్ బుక్ లో ఉన్నది మాత్రమే రాస్తే మంచి మార్కులు వేయడం అన్నది పిల్లల మనోవికాసానికి గొడ్డలి పెట్టు అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఉమామహేశ్వర్ గారు నేటి విద్యా వ్యవస్థ నుంచి ఆశించేది పిల్లల సృజనాత్మక శక్తిని వెలుగు తీసే తత్వమే తప్ప వారిని కేవలం ఉన్నది ఉన్నట్టు చదివి మార్కులు సంపాదించుకునే మర బొమ్మలు కాదు అన్నది ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

    • థాంక్యూ వెంకటయ్య గారూ .. బాగా అర్థం చేసుకుని
      విశ్లేషించారు . ధన్యవాదాలు

  • అవతలకు వెళ్ళి ఆలోచించడం అనేదే సృజనాత్మకత అనుకుంటా…అది పుష్కలంగా ఉంది ఇందులో…. గమ్మత్తైన సంగతి ఏమిటంటే…నాన్న..పులి కథ గురించి చాలా ఏళ్ల క్రితం త్రివిక్రమ్ ఎక్కడో చెప్పినట్టు గుర్తు..నాన్న ఇంకోసారి వచ్చి ఉంటే బాగుండేది అని… యాదృచ్ఛికంగా మీరు దాన్ని భలే పొందుపరిచారు వినూత్నంగా ఇందులో

  • మనిషి సృష్టించిన “కృత్రిమ మేధ” కృత్రిమమే గానీ మనిషిలా సహజంగా పొందే అనుభూతి,సంప్రదాయ కు భిన్నంగా వినూత్న ఆలోచన (out of box ) లాంటివి శూన్యం 👍కథనం చాలా బాగుంది సర్ 👌🌹

  • కథ చాలా బాగుంది. ఒక పాత నీతి కథను కొత్త నీతితో(మానవత్తపు నీతితో) చెప్పారు.
    ఇది AI చేయలేదు. సృజనాత్మక మేధ వున్న మనిషే చేయగలడు.
    మన విద్యావిధానం మీద కూడా కొరడా దెబ్బ వుంది. ఎప్పుడో యేవరో రాసిన textbook లోని కథను దాటి ఆలోచిస్తే… ఆ ఆ లోచన యెంత గొప్పదైనా ‘సర్టిఫికెట్ చదువులు’ మార్కులు ఇవ్వదని, విద్యావిధానాన్ని చల్లుమని చరిచారు.

    • థాంక్యూ అన్నా.. అన్ని పాయింట్స్ చక్కగా కవర్ చేశారు.

  • మీరు రాసిన నాన్న పులి కథ చాలా ఉన్నతంగా ఉంది, ముందు తరానికి మరియు ఇప్పటి తరానికి గొప్ప సంబంధం గురించి మీరు ప్రస్తావన చాలా అద్భుతoగా రాసారు, భవిష్యత్తులో AI గురించి ప్రస్తవన తీసుకోనిరావడం చాలా అద్భుతంగా రాసారు, మీరు వ్రాసే కథలు నాలాంటి సామాన్యుడికి కూడా ఎంతో ప్రేరణగా ఉంది, మీకు ధన్యవాదములు, ఇలాంటి కథలు మరిన్ని తీసుకుని వస్తారు అని భావిస్తున్నాము.

  • కథను ఇప్పటి విషయానికి అన్వయించి చెప్పిన ప్రయత్నం, పాత తరం కుటుంబ ప్రేమలు కలిపి చెప్పటం బాగుంది 👌

  • ఉమా గారు కథ చాలా బాగుంది.
    మీకు హృదయపూర్వక అభినందనలు.
    పెద్దవాళ్లు పిల్లలకు ఏ విలువలు అందించాలో అవి అందించాలి. అప్పుడే ఆ పసి హృదయాలు గొప్పగా ఆలోచించగలవు.
    కథ ఆద్యంతం చాలా హృద్యంగా సాగింది.
    👍👌👏👏💐💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు