దేశాన్ని పీడిస్తున్న ‘ఆకలి రోగం’

 “గోవధ జేయ్యద్దంటోడు గోవునేం బాగుజేత్తాండు? మన్సులనేం బాగుజేత్తంతాండు? కరువొచ్చి ఆకలి సావులు జత్తానపుడు ఇంత కలో గంజో పోసి… గడ్డో గరుకో ఏసి  బతికియాలె గని… కొట్టంల పసురం కొట్టంల్నే… గుడిసెల మనిషి గుడిసెల్నే సత్తట్టు జేత్తె ఇదేం గవుర్మెంటు..? ఇదేం ఏలుబడి..?”

ఉరి తాడు, ఉరి కొయ్య కనిపిచకుండానే దేశంలో గత మూడు దశాబ్దాలుగా సగటు మనిషి ఉరి వేయబడుతూనే ఉన్నాడు. సామాన్యుని ప్రాణాలు హరించే దాడులు కనిపించకుండానే జరుగుతున్నాయి. అదృశ్యంగా ఉండి దొంగ దెబ్బ తీయడం పెరిగిపోయింది. ఏదో అదృశ్య శక్తి ప్రజలతో గెరిల్లా యుద్ధం చేస్తున్నట్టే ఉంది వాతావరణం. వెట్టి చాకిరీ నుంచి, దొరల పీడన నుంచి బయట పడ్డ తెలంగాణ జీవి దాని తరువాత కూడా పిడికెడు మెతుకుల కోసం నిరంతరం కనిపించని ఆ శక్తితో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ బతుకు పోరాటాన్ని కడు ఆర్ద్రంగా, హృదయ విదారకంగా చిత్రించిన కథ ‘ఆకలి రోగం’. ఈ కథ మొదట 27 జూన్ 2003లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది.

ఆకలి రోగం” కథ ఇక్కడ చదవండి.

పద్మశాలి కులానికి చెందిన మంకయ్య కులవృత్తి కూడు పెట్టక పోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకుంటాడు. దానికి కారణం తన తాత, ముత్తాతల తరం నుండి తనదాకా ఒంట్లోని కండలన్నీ కరిగిపోయేలా ఆ ఊరి దొరకు వెట్టి చాకిరీ చేస్తే, రైతు కూలి ఉద్యమాలకు భయపడో, భార్య కూడా చనిపోవడంతోనో ఆ ఊరి దొర  ఊరును వదిలి పెట్టి  పోతూ పోతూ ఎందుకూ పనికిరాని రాళ్ళు రప్పలున్న రెండెకరాల పోరంబోకు భూమిని, ఒక పొట్టతోని ఉన్న బట్టావు నిచ్చించు.  అప్పటి నుంచి కొన్నేండ్లు తన భార్య సాయ మల్లవ్వ, కొడుకు, బట్టావుకు పుట్టిన గంగావు అందరూ కలిసి దాన్ని సాగు యోగ్యంగా మలిచి పంట పండిస్తారు. కాలం మంచిగై నాలుగిత్తులు పండుతున్నయని మురిసి పోయే సమయంలోనే తీవ్ర కరువు వస్తుంది. కనీసం తాగడానికి ఇన్ని మంచి నీళ్ళు, గోదలకు ఇంత గరక పోసలు కూడా దొరకవు. చివరికి కొడుకు తన బతుకుదారి తాను వెతుక్కుంటూ సూరత్ పోయి సాంచెలు నడుపుకుంటుంటే ఒక కొడుకు మాదిరిగా తన కుటుంబాన్ని ఆదుకున్న గంగావుతోని కలిసి నడిచిన బతుకు పయనమంతా కళ్ళల్లో మెదులుతుంటే, కరువుకు గిన్ని నీళ్ళు, గింత కుడితి పోయలేని తన అశక్తతను తిట్టుకుంటూ, కళ్ల వెంబడి కన్నీళ్లు కారుతుంటే మంకయ్య గంగావును కోతకు అమ్మేస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఎన్నో రోజుల్నుంచి ఆకలికి పేగులు ఒర్రీ ఒర్రీ కొస ప్రాణంతో కొట్లాడుతున్న భార్యను చుట్టుపక్కల వాళ్ళు ఇంటి ముందట గడ్డి మీద పడుకోబెడుతారు. తరువాత మంకయ్య, సాయ మల్లవ్వ, గంగావు గతి ఏమైంది? మంకయ్య కొడుకు సూరత్ నుంచి వచ్చాడా? గంగావు చుట్టూ అల్లుకున్న మంకయ్య ప్రేమ, తన్లాట, దాన్ని కోతకు అమ్మడానికి మంకయ్య పడిన నరక యాతన  తెలియాలంటే మనం ‘ఆకలి రోగం’ కథలోకి వెళ్ళాల్సిందే.

నాలుగు పేజీల ఈ కథలో దశాబ్దాల తెలంగాణ సామాజిక చరిత్రంతా కన్నీళ్లతో రాయబడింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం కన్నా ముందున్న వెట్టి చాకిరి, తరువాత ‘దున్నేవాడిడే భూమి’ నినాదంతో ఊపందుకున్న రైతుకూలి ఉద్యమాలతో గ్రామాలు వదిలి పెట్టి నగరాలకు పారిపోయిన దొరల చాకచక్యం, దాని తరువాత ప్రపంచీకరణ ఒక వైపు, తీవ్రమైన కరువు మరోవైపు రెండూ కలిసి  తెలంగాణాను ఉరి వేసిన విధానం అంతా కళ్ళకు కట్టిస్తాడు రచయిత.

ఈ కథలో మనిషి కథ, గోవు కథ జమిలీగా సాగిపోతుంటాయి. నాలుక సందున ముల్లు ఇరికినట్టుగా మారిపోయిన వ్యవసాయదారుని జీవితం ఒక వైపు, గోవు చుట్టూ ఉన్న రాజకీయాలు ఇంకో వైపు చాలా నర్మగర్భంగా చెప్పబడ్డాయి. ఇదిలా ఉంటే చితికిపోయిన పద్మశాలీయుల దీన స్థితిని కూడా ఈ కథ ప్రతిభావంతంగా చూపెట్టింది. రైతుకు, గోవుకు మధ్యగల అనుబంధం కదిలిస్తుంది. ఆకలికి తాళలేక మౌనంగా గంగావు కార్చిన కన్నీరు, అదే సమయంలో సాయ మల్లవ్వ ఆకలితో పోరాడుతూ ప్రాణాలు విడిచిన తీరు మనసును కలచి వేస్తుంది. దొరల జీవిత ఉన్నతీకరణకు బహుజనులు చేసే త్యాగం, నిర్బంధ శ్రమ దోపిడిని చిత్రించిన తీరు అద్భుతమనిపిస్తుంది. ఉత్పత్తి కులాల వీపులనే తివాచీలుగా చేసుకొని దొరల కూతుళ్ళు, కొడుకులు పై చదువులు చదువుకొని విదేశాలకు పోతారు. కానీ దొరల కోసమే జీవిత సర్వస్వం ధార పోసిన కష్ట జీవుల కొడుకులు మాత్రం ఇన్ని గంజి నీళ్ళ కోసం పారిశ్రామిక ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకొని వలస పోతారు. ఆధిపత్య వర్గాలకు బహుజన కులాలకు మధ్య విస్తరించిన ఈ అగాథాన్ని చిత్రించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడు. దొరల అరాచకత్వాన్ని కూడా రచయిత చాలా వాస్తవికంగా అక్షరీకరించాడు. దొరకే కాదు దొర సంతానానికి కూడా మానవత్వం లేదని ఈ కథ చాటి చెప్తుంది. తలాపున గోదావరి పారుకుంటూ పోతున్నా తెలంగాణ భూములకు చుక్క నీరు దక్కని వైనాన్ని తద్వారా ఇక్కడి భూములు బీడులుగా  మారిన విధానాన్ని, ఆ బీడు భూములను సాగులోకి తీసుకురావడానికి ఇక్కడి రైతులు పడే కష్టాన్ని కూడా చాలా బలంగా చిత్రించిందీ కథ. 1995-2005 మధ్య తెలంగాణను తీవ్రమైన కరువు ఆవరించింది. తత్ఫలితంగా తెలంగాణలో గ్రామాలకు గ్రామాలు వలస బాట పట్టాయి. మరెన్నో గ్రామాలు స్మశానాన్ని తలపించాయి. ఇప్పటికీ మనుషులకే కాదు కనీసం పశువులకు కూడా సరైన వైద్య సౌకర్యాలు లేవని చెప్పడానికి ఈ కథ ప్రయత్నించింది. గ్రామీణుల మధ్య పర్చుకున్న ఆత్మీయ, అనురాగాలతో పాటు అధికార పార్టీల నిర్ణయాలతో సామాన్యుల బతుకులు ఎలా ఆగమవుతాయో చెప్పడానికి ప్రయత్నించిన కథ.  కథలోని రెండు జీవుల మరణాలు మనల్ని నిలువెల్లా కంపనకు గురిచేస్తాయి.

కథ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ తో రాసిందే అయినా మనం గుర్తు పట్టలేం. చాలా అలవోకగా మనల్ని గతంలోకి తీసుకెళ్లి మళ్ళీ వర్తమానంలోకి తీసుకువస్తాడు కథకుడు. కథలో అసలు కథానాయకుడు గోవు పాత్ర. మంకయ్య పాత్ర తెలంగాణ సగటు రైతుకు ప్రతీక. సాయ మల్లవ్వ పాత్ర  వ్యవస్థ దేహం మీద మొలిచిన ఆకలి పుండు. ఈ దేశానికి అసలు రోగం పేదరికమేనని తన చావు ద్వారా చెప్పిన పాత్ర. రచయిత మనిషి దుఃఖాన్ని కూడా గోవు దుఃఖం, బాధలో కలిపి చెప్పడమే ఈ కథలోని అసలు ధ్వని.

తెలంగాణ తొలి తరం కథకులు గూడూరి సీతారాం, సురమౌళి, పాకాల యశోదారెడ్డి వంటి వారి వారసత్వాన్ని అందుకొని కథకుడు కథనంతా తెలంగాణ తెలుగులోనే నడిపించడం బాగా నచ్చుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వినిపించే ఎన్నో అందమైన తెలుగు పదాలు మన మనసును చూరగొంటాయి.

ఈ దేశంలో పేదరికం ఉన్నన్ని నాళ్లు, ఆకలి రోగం విజృంభించినన్ని నాళ్లు, అధికార పార్టీల నిర్ణయాలు, చట్టాలు సామాన్య రైతుల జీవితాలను ప్రభావితం చేసినన్ని నాళ్లు, మెడను తప్పించిన కోడిలాగా ఆకలితో గిలగిలా తన్నుకొని ఈ దేశంలో పేద వాడు ప్రాణాలు విడిచినన్ని నాళ్లు ఈ కథ మన మనో వీధిలో  మెదులుతూనే ఉంటుంది.

‘ఆకలి రోగం’ ను మన దేహం అనుభూతించేలా చేసిన కథకుడు వడ్డెబోయిన శ్రీనివాస్. కవిగా ప్రసిద్ధులైన శ్రీనివాస్ ఇప్పటిదాకా ‘పోస్ట్ మార్టం రిపోర్ట్ (1996), ‘దుఃఖ భాష’ (2004) అనే కవితా సంపుటాలతో పాటు 20కి పైగా దీర్ఘ కవితలు రాశారు. కొన్ని వందల కవితలు, పరిశోధన వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ‘పాడె కట్టె’, ‘దేవుడి పైసలు’ తదితర 25 కథలు రాశారు. ‘ఆమే… తలాకంది’ కథ చాలా వివాదాస్పదం అయింది. ఈ కథలన్నీ ఒక సంపుటిగా రావాల్సి ఉంది ఇదొక లోటు.  వరంగల్ జిల్లా వాస్తవ్యులైన శ్రీనివాస్ ప్రస్తుతం ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

6 comments

Leave a Reply to ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథల మీద మీరు చేసే విశ్లేషణ కథకునిలోని మరొక కోణాన్ని ఆవిష్కరిస్తుంది.అంతేగాక ఆ కథ యొక్క సామాజిక , సాహిత్య ప్రయోజనాన్ని విశదీకస్తారు.

  • పాఠకుల పఠనాభిరుచిలో మార్పువచ్చింది.నిజాల్నిదాచి, అవాస్తవలోకాన్నిరంగుటద్దాలలో చూపించి, పాఠకులను అవాస్తవభ్రమల ప్రపంచంలో విహరింపచేసే రచనలపై ఆసక్తితగ్గి, ఇప్పుడిప్పుడే జీవితంలోని సంఘటనలను, వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ, జీవితాన్ని కళ్ళకుకట్టేటట్లు రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగా చదువుచున్నారు.

    క్రమేపి కథాసంకలనపుస్తకాలకు ఆదరణపెరుగుతున్నది. ఈమార్పు హర్షించతగినదే.

    “ఆకలి రోగం” కథ బాగుంది.అచ్చంగా ఇలాంటి కరువు కథ
    “కసాయి కరువు” చక్రవేణు ఆంధ్రప్రభవీక్లీ-1986 లో ప్రచురితమయ్యింది. దీనిని ఇంటర్మీడియట్లో పాఠ్యాంశంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు. పిల్లలకు పాఠ్యాంశంగా బోధించాను. ఇన్నాళ్ళకు మళ్ళీ మన తెలంగాణలో మరింత విస్తృతంగా ఈ కథ వచ్చింది.

    కథ చదువుతున్నప్పుడు పాత అంశంగానే తోచినప్పటికీ, కథనం వాస్తవికతతో, ప్రాంతీయతకలిగి మనసుకు హత్తుకొనేటట్టుగా ఉంది. కథా విశ్లేషకులు వెల్దండి శ్రీధర్ గారు వివరించిన క్రమం ఆసక్తిగా ఉంది. కథను మరోసారి చదివించేదిగా ఉంది. కథలో లోతైన అంశాలను వెతికి చూపెట్టారు. భిన్నమైన దృక్కోణానాలను పరిచయం చేశారు. ప్రత్యేక విషయాలను టార్చ్ వేసి చూపారు.

    రచయితకు మరియు విశ్లేషకులు డా.వెల్దండి శ్రీధర్ గారికి హృదయపూర్వక అభినందనలు

  • ఈకథ
    నాకు నేనుగా ఆలోచించిన, ఆలోచిస్తున్న దానిని వడబోసుకునేందుకు అవకాశమిచ్చిన
    ఆకలి రోగం కథకులు వడ్డెబోయిన శ్రీనువాస్ గారికి, ఈకథ విశ్లేషనపై అభిప్రాయం తెలుపవలసిందిగా కోరిన వెల్ధండి శ్రీధర్ గారికి దన్యవాదాలు. తెలంగాణ ప్రాంతంలో వస్తువులు ఇచ్చిపుచ్చుకునే ధోరని నుండి అమ్మకం కోనుగోలును మహిళా రైతు మంకయ్య బార్యకు అనివార్యంగా వ్యవసాయమే నేర్పింది. సహయపడింది గంగావు. (తెలంగాణలో అప్పుడు మాత్రుస్వామిక కుటుంబాలు కాభట్టి) అలా ఏర్పడిన పశువుల సంత మార్కేట్ వ్యవస్థగా రూపాంతరం చెంది దాని నుండి తెలివిని నేర్చుకున్న బ్రాహ్మనీయ పెట్టుబడిదారి వ్యవస్థ బానిసలను యాజమాని గా ఒప్పుకోక తట్టుకోలేకపోయింది. అందుకే తన ఆధీనంలోనే పాలకులను ఉంచుకునే తెలివిని నేర్చుకున్నది.

    పాలకుల్లో చేరిపోయింది.
    పాలకులు పెట్టుబడీదారి వ్యవస్తలోనూ చేరారు.

    సంపాదనకు దారి చూపిన సంతను, వెట్టిచాకిరి చేసిన బానిసలకు వ్యవసాయంలో ఉపయోగపడిన గంగావును మొట్టమొదట చంపాలనుకున్నది.
    గంగావుకు
    ప్రత్యన్మాయంగా యంత్రాలతోనే భూమిని సాగుచేయాలనుకున్నది

    లేకుంటే–
    దున్నే వాడికే భూమి నినాదం స్తిరమైపోతుంది.
    రైతు కూలి ఉద్యమాలతో పారిపోయి ప్రాణం కాపాడుకున్న దొరలు వెట్టిచాకిరీ బానిసలపై కుట్రతోనే పెట్టుబడీదారులయ్యారు నేను లేకున్నా గ్రామంలోని నా బానిసలు యాజమాని గా గంగావుతో కలిసి వ్యవసాయం చేయడం జీర్ణించుకోలేకపోయారుతమ చేతి విధ్యతో బట్టలు నేసే నేతన్నలకు బతుకు బారంగా మార్చారు.
    ఇన్నిరోజులు ఊరునొదిలి మేమెల్లి పోవలసి వచ్చిన పరిస్థితులను కల్పించిన బానిసలకు నిలకడను, బతుకును దూరం చేయాలనుకుంది.

    సాయమల్లవ్వ కొడుకును సూరత్ కు పంపింది. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేసింది.
    ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విదానాలతో సాయమల్లవ్వను,గంగావును గాసం లేక కుడిది లేక ఆకలితో చనిపోయేటట్లు చేసింది. మంకయ్య ,సాయమల్లవ్వ,గంగావులు శ్రమజీవులు కాబట్టే గంగావు మేత పెట్టలేక దానిగోసను చూడలేకనే మంకయ్య సంతలో గంగావును వలవల ఏడ్చుకుంటూ అమ్మాడు. గంగావులాగే గాసం లేకనే సాయమల్లవ్వ చావుకూడాజరిగింది.

    దొరలకు దొర వారసులకు శ్రమవిలువను గుర్తించరు.
    మంకయ్య మాత్రం పశువైన గంగావును అమ్ముకునేటప్పుడు దానిపై ఆధారపడి నందుకు తనకు పక్రృతి అందించిన పూర్తి మానవత్వాన్ని నిజాయితీగా కనబరిచాడు. ఈఆర్థి దొరలకు ఉంటే మంకయ్య కుటుంబం ఆకలి రోగంతో ఉండేదికాదు. సాయమల్లవ్వ సంసారం నిలబెట్టిన గంగావును తనకుటుంబాన్ని ఆకలి రోగంన పడేసింది పాలకుల విదానేలే.

    గంగావును సాయమల్లవ్వను చంపించింది.

    పెట్టుబడీదారి వ్వవస్తకు యంత్రమే ముఖ్యం యంత్రం తయారి తెలివిని అందించిన గంగావును చంపకుండా సాయమల్లవ్వను చంపలేననుకుంది. ప్రజలను యాజమాని గా ఒప్పుకోలేని,జీర్ణీంచుకోలేని పెట్టుబడీదారి మార్కేట్ వ్యవస్త అన్ని వస్తువులను తామే తయారుచేసి ఇంకా బానిసలు కాని ప్రజలచేత కొనుగోలు చేయించి వారిని నిరుపేదలను చేయాలనుకుంది.
    ఏక కేంద్ర ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని చూస్తుంది ఈ పెట్టుబడీదారి వ్యవస్థ అందులో భాగమే ఆకలి రోగం కథ.
    ఈకథలో కథ చరిత్రను వర్ధమానానికి అందించి, భవిష్యత్తు దారులు వేయడానికే మంకయ్య బతికాడని,బతికున్నాడని అతను ఇంకా ఎందుకు బతికాడో అన్న విషయంపైన అతను పశువైన గంగావును అమ్మేటప్పుడు చూపిన మంకయ్య,అతనిబార్య సాయమల్లవ్వ గంగావుపై ఉన్న మానవత్వాన్ని మారకుండా గుర్తుచేస్తున్న విషయాన్ని ఎప్పటికైనా గుర్తుంచుకుందామని మంకయ్య మన నుండి ఆశించిన కార్యాచరణకు పూనుకుందాం.

    —- రాంపేట రంజీత్

  • ఈ కథను పత్రికలో అప్పుడు నేను చదివిన జ్ఞాపకం మళ్ళీ నన్ను మెలిపెడుతుంది. మంచి కథను మరొక్కసారి పరిచయం చేసిన వెల్దండి శ్రీధర్ అన్నకు కృతజ్ఞతలు.

  • ఆకలి రోగం కథ పేరులోనే వైవిధ్యం ఉంది. ఆకలి కూడా ఒక రోగమే అనే ధ్వని స్పురిస్తుంది. రచయిత వడ్డెబోయిన శ్రీనివాస్ తెలంగాణలోని గత చరిత్రకు సాక్ష్యంగా ఈ కథను రాశారు. నేటికి కూడా తెలంగాణ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో ఈ మంకయ్య, సాయి మల్లవ్వ ఇలాంటి వారు పడుతున్న పాట్లు తక్కువేమీ కాదు. వీరి కుమారుడు వలస పోయినట్లే నేటికి ఎంతో మంది వలసలు పోతూనే ఉన్నారు. ఒట్టిపోయిన కడుపులకు కలో గంజో దొరికే పరిస్థితి మనుషులకు లేనప్పుడు వారి నమ్ముకుని జీవించే మూగజీవాల వేదనేమీ తక్కువ కాదు. వ్యవసాయం చేసే ఎద్దులను రైతు కుటుంబాలు కన్నబిడ్డలాగా భావిస్తారు. అవి చావుకు దగ్గరైన కసాయి కొట్టుకు పంపడానికి ఇష్టపడరు. కానీ కొందరికి తప్పని పరిస్థితుల్లో అంతేగాని జీవనం వెళ్ళని కుటుంబాలు ఆడబిడ్డను అత్తవారింటికి పంపినప్పుడు ఎంత హృదయ వేదనను అనుభవిస్తారో అంతకన్నా ఎక్కువ వేదనను అనుభవిస్తారు. మూగ రోదనకు నిలువెత్తు సాక్ష్యం ఆకలి రోగం కథ. ప్రతాపరెడ్డి దొర మంకయ్యకు ఏమి చెల్లని భూమిని ఇచ్చినా, మంకయ్యలో ఉండే కృతజ్ఞత, మానవత్వం ఉట్టిపడతాయి. నేటికీ మంకయ్య లాంటి అమాయకులను ఆసరాగా చేసుకుని బ్రతికే వ్యవస్థ ఉంది. కాకుంటే నేడున్న దోపిడీకి పేర్లు మారాయి తప్ప దోపిడి మాత్రం ఆగలేదు. కేవలం ఆకలికి చచ్చి పోయే మనుషులు ఉన్నంత వరకు సాయి మల్లవ్వ, మంకయ్యలు సజీవ పాత్రలుగానే ఉంటారు.
    ఈ కథకు వెల్దండి శ్రీధర్ సార్ రచయితతో సమానంగా ఆకలింపు చేసుకున్నారు. భూస్వామ్య వ్యవస్థను, దొరల దోపిడీ ని, మూగజీవుల వేదనను, రైతులు పడే కష్టాలు, తెలంగాణ చరిత్రను అన్నిటిని కలిపి మంచి సమీక్ష చేశారు. ఈ కథ సమీక్ష చేసి, మంచి కథను అందించిన శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.

  • సిద్దెంకి బాబు తెలుగు పండిట్ వరంగల్ says:

    వెల్దండి శ్రీధర్ గారు వడ్డెబోయిన శ్రీనివాస్ గారి ఆకలి రోగం కథను ఎంతో అద్భుతంగా విశ్లేషించారు ఆ కథను నేను చదవకపోయినా ఈ విమర్శ వ్యాసం ద్వారా చదివిన అనుభూతి కలిగింది ధన్యవాదములు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు