దృశ్యాల్లో దాగిన రహస్యాలకు  కూసింత చోటు …

థ పుట్టుకకు కారణాలు పాతవే అయినా కథ మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉండాలి. అది చెప్పే కథకుడి మానసిక ప్రపంచంపై ఆధారపడి ఉండాలి. వస్తువు, కథనం రెండు కొత్తవై పాఠకులను మెప్పించగలిగితే ఆ కథ తప్పుకుండా శిఖరాగ్రానికి చేరుతుంది. రచయిత గుండెలోతుల్లోంచి ఉవ్వెత్తున లావాలా అక్షరాలు పదాలై, పదాలు వాక్యాలై, పుటలపై ద్రవించాలి. పాఠకుల గుండెల్లో ఘనీభవించాలి. అలాంటి కథను సెన్సార్ చేస్తే దాని ప్రాణం పోవచ్చు లేదా ఆయుష్షు తగ్గొచ్చు. అలాగని రచయిత కథనంపై దృష్టి సారించకుండా రాసేస్తానంటే కుదరదు. ప్రతి అక్షరాన్ని ఆచి, తూచి అమ్ములపొదిలోని బాణంలా ప్రయోగించాల్సిందే. అనుభూతి, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం, క్లుప్తత కథకు నాలుగు స్తంభాల్లాంటివి. సంవిధానం నుంచి శైలి వరకు ప్రతిదీ కథను ఏకబిగిని చదివించే నిర్మాణ రహస్యాలే.

కొన్ని కథల్లో ఇతివృత్తంతో వస్తువు కలిసిపోతుంది. జీవితంలోంచి బతికిన క్షణాలు ఏరుకున్నట్లు నిర్మాణంలో కథను వెతుక్కోవాలి. భావధారగా కురుసిన కథలో పాత్రలు, వాటి తాలూకు సంఘర్షణలు, సమాజం, తాత్వికభావనలు… ఒకటేంటి ప్రతి అంశాన్ని ముత్యాల్లా గూర్తించాలి. అప్పుడే కథ తాలూకూ బ్రహ్మానందాన్ని ఆశ్వాదించగలం. అనుభూతించగలం. మార్మిక సౌందర్యాన్ని కళాత్మకంగా ఆఘ్రూనించగలం. ఇంతటి నిగూఢ దార్శనికతతో కథ రాయడం అంత తేలికైనా విషయం కాదు. రాసినా మెప్పించడం సులభం కాదు. కానీ సుమారు అర్ధ దశాబ్దం కిందటే కథాలోకంలోకి అడుగుపెట్టి ఇలాంటి కథలను తెలుగు పాఠకులకు అందిస్తున్నారు మోహిత. ఆమె “కూసింతచోటు” కథలో జీవితపు ఆటుపోటులను, సున్నిత హృదయకోతల ఘర్షణలను ట్రాఫిక్ స్నిగ్నల్స్ మధ్య చిత్రించింది. కథనంలో రంగరించి పాత్ర స్వభావాన్ని, జీవితాన్ని, టైమ్ సెన్స్ తో కలిపి గాఢతతో ఆవిష్కరించింది.

సాయంత్రం ఆరుగంటలకు ఆఫీసుకెళ్లి పంచ్ కొట్టాల్సిన వ్యక్తి బండి పై చేసే ప్రయాణమే ఈ కథ. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాల కలబోత. అతడికి ఏఏ దృశ్యాలు కనిపించాయి?. వాటిలోంచి తన గతాన్ని ఎలా గుర్తుచేసుకున్నాడు?. ఆ ఆలోచనల్లోంచి ఇంకా ఏం మాట్లాడాడు?… ఇలాంటివి ఎన్నో పాఠకుల్ని కట్టిపడేస్తాయి. మనో నేత్రాలు విచ్చుకునేలా చేస్తాయి. సమాజాన్ని, జీవన వాస్తవికతను, తాత్విక ధోరణులను కథనంలో రచయిత్రి ఇమిడ్చిన తీరు అబ్బురపరుస్తుంది. కథ సర్వసాక్షిదృష్టికోణంలో ఒక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాగని కథకురాలు ఎక్కడా కథలో ప్రవేశించరు. చెప్పాలనుకున్న విషయాలన్నింటిని పాత్ర, ఆలోచనలు, దృశ్యాల ద్వారా పాఠకులకు అందిస్తారు. అవి ఏంటో, వాటిని నిర్మలంగా, నర్మగర్భితంగా ఎలా చెప్పారో తెలుసుకోవాలి. అప్పుడే కథతో పాఠకులకు పరిష్వంగం.

దృశ్యాలు… నిజాలు

మొదటిది తెలుగువాళ్ల సహనాన్ని ప్రశ్నించేది. అనువాదంలోని లోపాలను ఎత్తిచూపేది. బండి పై వెళ్తున్న అతడికి తలనూనె ప్రకటనున్న హోర్డింగ్ కనిపిస్తుంది. దానిలో ‘Natural remedy for hair growth’ వాక్యానికి “ప్రకృతి సహకరించే అందపు జుట్టు” అనే తెలుగు అనువాదం ఉంటుంది. దాని గురించి పత్రికాఫీసుకు ఫోన్ చేయాలనుకుంటాడు. కానీ ట్రాఫిక్ కదలడంతో ఆవేశాన్ని నిగ్రహించుకుంటాడు. ఈ మొదటి దృశ్య సన్నివేశంలోనే అతడిది ఆచరణకు నోచుకోని జీవితం, లక్ష్యాలు కోర్కెలు నెరవేరని నిరాశ అని కాస్త ఆలోచిస్తే తెలుసుకోగలం. ఇంకో దృశ్యంలో బైక్ మీద వెళ్తున్న ఒక జంటను చూస్తాడు. ‘వాళ్లిద్దరూ భార్యాభర్త అవునా? కాదా?’ అని ఆలోచన చేస్తాడు. ఆ బైక్ పై కూర్చున్న ఆమె కొప్పులోని చేమంతి రెక్క కాంతులీనుతున్న ఆమె వీపు మీద పడినప్పుడు అతడి కుడి బుగ్గమీద నుంచి కన్నీటిచుక్క రాలుతుంది. ఈ దృశ్యం అతడు స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడని, ఆ బాధను భరించలేనంతగా గుండెల్లో మోస్తున్నాడని అర్థమవుతుంది. మరో దృశ్యసంఘటన ఇనుపకడ్డీలు తీసుకెళ్తున్న ట్రాలీ దగ్గరకొచ్చాక బండి పక్కకు తిప్పి యాక్సిడెంట్ నుంచి అతడు బయటపడడం. ఇది పాత్ర ఆలోచనలనే కాకుండా అతడు మానసికంగా కూడా అనేక యాక్సిడెంట్లను తప్పించుకున్నాడని తెలియజేస్తుంది. కానీ ఏదీ అతడిని పూర్తిగా నాశనం చేయలేదనడానికి ఓ రుజువుగా కూడా కథకురాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకో దృశ్యం అంబులెన్స్, దాని సైరన్. అయితే రచయిత్రి వెంటనే అతడి తండ్రి చనిపోయిన జ్ఞాపకాన్ని గుర్తుచేసి, ఆ దృశ్యంతో అతడికున్న లింకును విప్పేశారు. కానీ అది అతని మనోలోతుల్లో దాగున్నదని, ఆ ప్రభావం నుంచి  బయటపడలేదన్న నిజాన్ని అందించారు. మరో దృశ్య సన్నివేశం “పెళ్లి ఊరేగింపు, గుర్రాల రథం, మిలమిలలాడే ముఖాలు బట్టలూ…”. దాన్ని చూసి పెళ్లి ఉత్సాహం ఎంతోకాలం నిలవదన్న సత్యాన్ని గ్రహిస్తాడు. తన జీవితంలోని నిరాశతో పోల్చుకుంటాడు. దీని ద్వారా అతడి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా, అతడి ప్రస్తుత మానసిక స్థితిని చెప్పే ప్రయత్నం చేశారు మోహిత.

పాత్రలు… ప్రభావాలు

ఈ కథలో ప్రధాన పాత్ర ఒక్కటే. కానీ రచయిత్రి కథనంలో అంతర్గతంగా పాత్ర ఆలోచనల్లోంచి అతడి జీవితాన్ని, మరికొన్ని పాత్రలను, అవి ప్రధాన పాత్ర భౌతిక, మానసిక ప్రపంచంపై చూపిన ప్రభావాల్ని చెప్పారు. తల్లి. “పదహారూ ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి… స్త్రీ సహజమైన మమతాసూయలతో తల్లికామె నచ్చలేదు. ఆ తర్వాత అతడికి ఇంకెవ్వరూ నచ్చలేదు”. అందుకే జ్ఞాపకాలన్నీ ఎండిపోయిన నీళ్లగ్లాసులో చారికలు కట్టాయన్నారు కథకురాలు. పైగా అతడిని తల్లి “చక్కగా గూడ్సుబండిలా పొడువుగా అందంగా మంచివాడిలా బరువు మోసే వాడిలా” పెంచింది. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పి మరీ పెంచింది. తల్లి ప్రభావం అతడి మీద అమితంగా ఉందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అందుకే అతడిలో సొంతదైన వ్యక్తిత్వం రూపుదిద్దుకోలేదు.

బాబాయి చేసింది సరైనదే”. ఈ వాక్యం అర్థం కావాలంటే కథకురాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేసిన వర్ణనల్లోని “సమయం చూసి సందు చూసి వేరే వాళ్ల స్థలాన్ని కబ్జా చేసినట్టు బైకులు చాకచక్యంగా మన్ముందుకు దూరుతుంటే ముసలిస్థల యజమానుల్లా కార్లు నిలబడిపోతున్నాయ”న్న వాక్యం అర్థం కావాలి. అప్పుడే ఆ పాత్ర స్థలాన్ని అతడి బాబాయి కబ్జా చేశాడని, ఇతడు మానసికంగా ముసలివాడు కాబట్టి ఏమీ చేయలేకపోయాడని అవగతమవుతుంది. ఇక తండ్రి మరణాన్నీ చెప్పారు రచయిత్రి.

ఇంకో పాత్ర ఆఫీసులోని స్త్రీ. “ఆమె చెయ్యెత్తు మనిషి. జీన్స్, టీ-షర్ట్ ఆమె యూనిఫామ్. షర్ట్ తియ్యకుండా బ్రా విప్పి తీసెయ్యగలదు… … … అదే బాస్‌కు నచ్చడంతో ప్రమోషన్ ఇచ్చాడు… … … తరువాత బ్రెయిన్ వాడటం మొదలుపెట్టి ఎంతో ఎత్తుకి ఎదిగింది. దాంతో పోటీదారులు ఆమెకు స్వర్గంలో చోటు కల్పించారు.” అని ఆమె బాహ్యరూపాన్ని, స్వభావాన్ని క్లుప్తీకరించారు రచయిత్రి. తెలుగు అనువాదం కచ్చితంగ లేదని ఆవేశపడిన పాత్ర, అంబులెన్స్‌ కు దారి కల్పించిన ట్రాఫిక్ పోలీస్‌ను అభినందించిన పాత్ర, ట్రాలీ అద్దాలు పగిలితే ‘సారీ’ చెప్పి ఐదొందలు ఇచ్చిన పాత్ర లోలోపలి గుణాన్ని, ముసుగేసిన మనసును ఇక్కడ ఒకే ఒక్క సన్నివేశంలో చూపించారు మోహిత. అదేమంటే..! “ఆమె చూడకుండా తస్కరించిన ఒక నల్లటి లేస్ బ్రా ఇంకా అతడి అండర్‌వేర్ల మధ్య గర్వంగా ఉందంటే అతని మనసులో ఆమెకెంత చోటుందో తెలీడంలా?” అని. ఇలా తెగిన అతడి హృదయాన్ని అతికించే ప్రయత్నం చేశారు. దీంతో పాత్ర అంతర్ బహిర్ స్వభావాలను సంపూర్ణంగా ఆవిష్కరించే నిష్కల్మషమైన కథకుల లిస్ట్ లో ఈ రచయిత్రి చేరారనిపిస్తుంది. ఈ పాత్ర “అసమర్ధుని జీవయాత్ర”లో సీతారామారావు, “అల్పజీవి”లో సుబ్బయ్య, “చివరకు మిగిలేది”లో దయానిధు”ల నీడలా అనిపిస్తుంది కూడా.

సమాజం… జీవితం

ట్రాఫిక్ మధ్య ప్రయాణించే వ్యక్తినే కథా వస్తువుగా ఎంచుకున్నా అనేక సన్నివేశాలను కల్పించి సమాజంలోని పలు విషయాలను చర్చకు పెట్టారు కథకురాలు. ట్రాఫిక్ జామ్, వాహనాల ద్వారా విడుదలయ్యే ఉద్గారాల వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు. నాలాలు నుంచి వచ్చే దుర్గంధం. అలాగే “భూమ్మీద నాగరికతలన్నీ నదుల ఒడ్డున సర్దుకున్నాయి” అనడంలో కొంత వ్యంగ్యం, వాస్తవికత. మనిషిలోని అనైతికం కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడి.  జాగ్రత్తగా డ్రైవ్ చేకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్లు. ఆఫీసు టైమింగ్స్, మనిషి ఆర్థిక స్థితిని నిర్ణయించే పంచ్ మిషన్లు… ఇలాంటివెన్నో.!

పాత్ర ఆలోచనా సరళి నుంచి చూస్తే కథకురాలు చేసిన వర్ణనలు కూడా ఆలోచించదగినవే. జీవితాన్ని దర్శించే క్రమంలో మనుషుల స్వభావాన్ని నిర్ణయించేవే. “ఏ విషయానికైనా ఆడవాళ్లు ప్రతిస్పందించే తీరుకి పూర్తిగా వ్యతిరేకంగా, భిన్నంగా ఉండటమే పురుష లక్షణం” ఇది పురుషాధిక్యతను చూపించేదిగా ఉన్నా మగవాళ్లలోని సహజత్వాన్ని చెరిపేసేది కూడా. “ఫ్లై ఓవర్ మీద ప్రయాణం అతనికిష్టం” అనే వాక్యంలో మనుషుల ఆలోచనలు, ఊహలు ఎత్తుగా ఉంటాయని, వాటిని అందరూ చేరుకోలేరని తెలుస్తుంది. అలాగే “పెట్రోల్, డీజిల్ వాహనాలను నడిపినట్టు నమ్మకం మనిషిని నడిపిస్తుంది. …. …. బతుక్కి గమ్యం లేకపోతే ఏమి? కర్మయోగం ఉందిగా” లాంటి వాక్యాలు మనిషి బంధాలకు ముఖ్యమైనదేదో చెప్తూనే, లక్ష్యం లేని జీవితాలు తెగిన గాలిపటాలని కూడా గుర్తుచేస్తుంది. “ ‘మనువు’ నుంచి వచ్చినవాడు మానవుడా? ‘మనువు’ ద్వారా పేగు తెంచుకున్న వాడు మానవుడా?” అని హిందూమత మూలాలను ప్రశ్నిస్తుంది ఈ పాత్ర. మరోచోట దేవుడి అస్తిత్వాన్ని, మనిషి భయాన్ని వివరిస్తూ… మతాన్ని, దేవుడి ఉనికిని నిర్ణయించిన మనిషి గురించి “ప్రార్థనలు ఆయుష్షును పెంచుతాయని చావుకి భయపడే ప్రతివాడూ అనుకుంటాడు”, “ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ‘దేవుడా’ అనబడే ఒకే ఒక దేవుణ్ణి ప్రార్థించాడు.” అనిపిస్తుంది పాత్ర ద్వారా రచయిత్రి . ఇక మనిషికి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలితే అంత చైతన్యవంతుడవుతాడు. పైకి ఎదుగుతాడు అని చెప్తూ “దెబ్బ తగిలితే బుద్ధి వికసిస్తుంది. ఆ వెంటనే హృదయం విచ్చుకుంటుంది” అని పాత్ర ద్వారానే చెప్పిస్తుంది. సమయాన్ని ధనంతో పోల్చుతూ “కాలంతో పోటీపడి గెలిచిన మొనగాడు ఇంకా పుట్టలేదు” అని కథలో పాత్రకు లింకు పెట్టి సత్యాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఇలాంటివి ఎన్నో కథాగమనంలో పాఠకులను ఆలోచింపజేస్తాయి. తర్కించుకోమంటాయి. నిజానిజాలను నిగ్గుతేల్చుకొని నమ్మమంటాయి. మనిషి మనిషిలా ఎలా బతకాలో నేర్చుకోమంటాయి.

టైం… క్లూ

“కూసింత చోటు” కథ పూర్తిగా టైం సెన్స్‌తో ముడిపడి ఉంది. మనిషి చావు పుట్టుకల మధ్య ఉన్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అన్యాపదేశంగా చెప్తుంది. ప్రధాన పాత్ర కథలో అనేకసార్లు టైం చూసుకుంటుంది. తను వెళ్లాల్సిన సమయాన్ని లెక్కలు వేసుకుంటుంది. “గేర్ మారుస్తూ మణికట్టుకున్న పాత గడియారాన్ని చూశాడు. ఐదుంబావు. టైం లేదు. ఎలా అయినా సరే అరగంటలో చేరుకోవాలి. ఈ లోపు చేరుకోలేక పోతే…?”, “పర్సు జేబులో పెట్టుకుంటూ వాచీ వంక చూసుకున్నాడు. ఐదు ఇరవై ఐదు.” ఇలా టైం గురించి కథ మధ్యలో చాలాసార్లు వస్తుంది. కానీ మొదటిసారి టైం చూసుకున్నప్పుడు “పాతగడియారం” అనే క్లూ కథకురాలు ఇచ్చారు. దీన్ని కరెక్టుగా పట్టుకుంటే కథ ముగింపును అక్కడే పసిగట్టగలం. పాతది అంటే చెడిపోయే అవకాశం ఉంది కనుక అతడు ఆరుగంటలకు ఆఫీసుకు చేరుకోలేడన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాం. కవిత్వంలోని భావచిత్రాన్ని కథలో తెలివిగా వాడారు రచయిత్రి. పైగా కథలో అక్కడక్కడా కవితాత్మక వాక్యాలు చైతన్యస్రవంతి కథనపద్ధతికి దగ్గరగా ఉన్నాయి. ముగింపులో “యుద్ధంలో అమితంగా గాయపడ్డ గుర్రం పరిగెత్తకపోయినా కుంటుకుంటూ నడిచి తన రౌతును మాత్రం క్షేమంగా ఇంటికి చేర్చి ప్రాణాలు విడిచింది” అని వర్ణిస్తూ గడియారాన్ని ప్రతీక చేశారు.

కథలోని ప్రతి వాక్యం వెనుక ఏదో ఒక అర్థమో, పరమార్థమో, జీవన సత్యమో, సామాజిక సూత్రమో చెప్పారు మోహిత. తరిచి తరిచి చూస్తే తప్ప ఈ లోతులు అర్థంకావు. కథకురాలి దృష్టీ బోధపడదు. సాధారణ కథగా చదివే కథకాదు ఇది. మనసును లయం చేసి కథతోపాటు నడవాలి. లేకపోతే రచయిత్రి కథలో చెప్పినట్లు “ఎందుకనో ఎక్కువమంది ఈ ఎత్తుదాకా రారు. వచ్చినా ఆ ఎత్తులో ఎక్కువసేపు నిలవలేరు.” అన్న సత్యం కథకూ అన్వయిస్తుంది. ఇచ్చిన వివరణలు, విశ్లేషణలు కథను కొంతవరకు రుచిచూపుతాయి. ఇక మీకై మీరే కథా సాగరంలో పడి ఈదితే తప్ప స్వానుభవం కాదు. స్వయంతృప్తులు కాలేరు.

*

 

          కూసింత చోటు

  • -మోహిత

హఠాత్తుగా తల ఎత్తిన అతనికి ఎదురుగా ఒక హోర్డింగ్ కనపడి ఈ తెలుగువాళ్లకి సహనం మామూలుగా లేదుగా! ‘Natural edy for hair growth’ అని ఆంగ్లంలో ఉన్న వాక్యం పక్కనే ‘ప్రకృతి సహకరించే అందపు జుట్టు’ అని తెలుగులో రాసుంది. దానిలో ముందు, తరువాత అని ఒక బట్టతల బాబువి ఫోటోషాప్ చేసిన ఫోటోలు, ఎర్రరంగులో ఉన్న నూనె సీసా కేవలం కొంతకే అని ఓ టోల్ ఫ్రీ నంబర్. ఇంత ప్రజ్ఞావంతమైన అనువాదాన్ని అతను ఎప్పుడూ చూసి ఉండకపోవటం చేత చటుక్కున జేబులోంచి ఫోన్ తీసి ఫోటో తీసి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు అప్పటికప్పుడే ఫోన్లోనే ఈమెయిల్ చేసేద్దాం అన్నంత కోపం వచ్చింది. గ్రీన్ లైట్ మరో ముప్ఫై సెకన్లలో పడుతుందనగా వాహనాలు కదలసాగాయి. దాంతో బల వంతంగా తన ఆవేశాన్ని నిగ్రహించుకొని ఇంజన్ స్టార్ట్ చేశాడు.

గేర్ మారుస్తూ మణికట్టుకున్న పాత గడియారాన్ని చూశాడు. ఐదుంబావు. టైం లేదు, ఎలా అయినా సరే ఒక అరగంటలో చేరుకోవాలి. ఈ లోపు చేరుకోలేకపోతే…? వెనక నుంచి ఒకటే హారన్ల మోత. మళ్లీ ఆవేశం. గ్రీన్ లైట్ పడ్డాక బండి తీయక అక్కడే కాపురం చేస్తారా ఏంటి? ఆగి చావలేరు వెధవలు. చిరాకుపడ్డాడు.

కూడలి దాటాక బండ్ల ఉద్గారాలు తగ్గి కొంచెం మంచి గాలి వీచసాగింది. గుండెల నిండా గాలి పీల్చుకుందామని ప్రయత్నించాడు. నాలా నుంచి వచ్చిన దుర్గంధం అతని ఊపిరితిత్తుల్లోకి చేరి వికారాన్ని కలిగించి వాంతిలా బయటకు ఉరికింది. లెఫ్ట్ నుంచి ఓవర్ టేక్ చేసిన ఓ బైక్ మెరుపులా మాయమైంది. ఇంకా నయం, వాడి మీద గానీ పడుంటే? అయినా ఆ వేగం చూస్తే వాడి కొంపలు అంటుకున్నట్టే ఉంది. తనకంటేనా? వైరాగ్యం, నైరాశ్యం కలిసిన నవ్వు – అతనికి మాత్రమే సాధ్యమయ్యే నవ్వునొకదాన్ని నవ్వాడు. అది గమ నించటానికి ఎవరికీ టైం లేదేమో, పొలోమని వెళ్లిపోతున్నారు.

మరీ ఇంత సున్నితమైతే ఎలా? తల్లి ఎన్నిసార్లు అనేది ఈ మాటని! అబ్బాయి అంటే రఫ్ అండ్ టఫ్ గా ఉండాలని ఆమె బలంగా నమ్మింది. ఏ విషయానికైనా ఆడవాళ్లు ప్రతిస్పందించే తీరు పూర్తిగా వ్యతిరేకంగా, భిన్నంగా ఉండటమే పురుష లక్షణం అని నూరి పోసింది.

టైం చూశాడు. ఐదూ పదహారు. పదహారూ ప్రాయంలో నా గర్ల్ ఫ్రెండ్ కావాలి… స్త్రీ సహజమైన మమతాసూయలతో తల్లికామె నచ్చలేదు. ఇంకెవ్వరూ అతనికి నచ్చలేదు. ఎండిపోయిన నీళ్ల గ్లాసులో చారికలు కట్టినట్టు ఏవో జ్ఞాపకాలు. తల్లి ఎంత చక్కగా పెంచింది తనని. పట్టాలు తప్పని గూడ్పుబండిలా పొడువుగా అందంగా మంచివాడిగా బరువు మోసేవాలా.

వికారం తగ్గేట్టు లేదు. తన వాంతికింత చోటిచ్చి ఆదరించిన రోడ్డుకి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా బయలుదేరాడు. ఎదురుగా బైక్ మీద ఒక జంట. అలుమగలు అవునో కాదో, నవ్వుకున్నాడు. కలిసున్న ఏ ఇద్దర్ని చూసినా ఈ ప్రశ్న మదిలో మెలగటం అతనికి కొత్తేమీ కాదు. ఆమె పట్టుచీరకు నప్పేట్లు కొప్పనిండా చేమంతి పూలు, కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్లిద్దరి ముఖాలు చూడాలనిపించింది. కొంచెం వేగంగా ఎడమ నుంచి క్రాస్ చేశాడు. కర్పూర వీటికామోద సమాకర్షదిగంతం.

అతనికి తెలిసిన పెళ్లి భోజనం పప్పన్నం, కిల్లి, కర్పూరం కడ్డి, మానవుడు వాసనా బలం గలిగినవాడు. జన్మజన్మల వాసన కుడివైపు అరేబియన్ దర్బార్‌ నుంచి వస్తున్న పేగులు కాలుతున్న వాసన కన్నా దుర్భరమైనది. ఎందుకీ వేళ ఇంత ఆలోచిస్తున్నాడు? ‘మనువు’ నుంచి వచ్చిన వాడు మానవుడా? ‘మనువు’ ద్వారా పేరు తెంచుకున్న వాడు మానవుడా? అసలు తనకి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయని అతని మీద అతనికే ఆశ్చర్యం వేసింది.

ఎదురుగా మరో రెడ్ సిగ్నల్, చచ్చినట్టు ఆగాల్సి వచ్చింది. బైకులు కార్లు బస్సులు స్టాప్ లైన్ దాటకుండా చక్కగా సర్దుకుంటున్నాయి. భూమ్మీద నాగరికతలన్నీ చక్కగా నదుల ఒడ్డున సర్దుకున్నట్టు, సమయం చూసి సందు చూసి వేరే వాళ్ల స్థలాన్ని కబ్జా చేసినట్టు బైకులు చాకచక్యంగా మున్ముందుకు దూరుతుంటే ముందుకుగాని వెనక్కుగాని వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని ముసలి స్థల యజమానుల్లా కార్లు నిలబడిపోతున్నాయి. ఈ నూట ఇరవై సెకన్లలోనే చోటు కోసం ఇంత గొడవైతే జీవిత పర్యంతం ఎన్నో గొడవలుండటంలో తప్పు లేదనిపించింది అతనికి. బాబాయి చేసింది సరైనదే.

ఆకుపచ్చ పడ్డా ట్రాఫిక్ పోలీస్ వెళ్లనివ్వడం లేదు. అటువైపు నుంచి అంబులెన్సు. అందులో ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని లోపలి వైపు కిందకు చూస్తున్నారు. బొయ్యిబొయ్యిమని చప్పుడు చేసే సైరెన్. అసలు ఆ చప్పుడుకే పేషెంట్ సగం చస్తాడేమో అనిపిస్తుంది. అతను ఎప్పుడూ అంబులెన్సును చూసినా ‘ఈ ప్రాణాన్ని కాపాడు దేవుడా,’ అని ఒకసారైనా అనుకుంటాడు. చిన్నపుడు చదివిన ఒక కథ ప్రభావం అది. ప్రార్థనలు ఆయుష్షును పెంచుతాయని చావుకి భయపడే ప్రతివాడూ అనుకుంటాడు. ఆక్సిజన్ సిలిండర్ లేని దీనస్థితిలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పది లక్షలు పోసి కొన్నతండ్రి శవంతో ఆరోజు అంబులెన్సులో ఇలానే ఆ ఇద్దరి స్థానంలో తానూ తల్లీ. అప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థించానని తర్వాత తల్లి చెప్పింది. ఈ విషయంలో హిందూ ధర్మం మనిషికి చాలా ఛాయిస్ ని ఇచ్చింది. అతను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ‘దేవుడా’ అనబడే ఒకే ఒక దేవుణ్ణి ప్రార్థించాడు.

హార్న్ కొట్టీ కొట్టీ విసుక్కుని చేమంతి కొప్పు అతన్ని దాటుకుని ముందర ఇరుక్కుంది. ఆ విసురుకి చేమంతి రెక్క ఒకటి రాలి కుందన్ల మెరుపులలో నెక్ బ్లౌజ్ మధ్య కావి రంగులో కాంతులీనుతున్న ఆమె వీపు మీద పడింది. అతడి కుడి బుగ్గ మీద నుంచి ఒక కన్నీటి చుక్క రాలి చేతి మీద పడింది. ఉలిక్కిపడి విదిలించాడు. టైం ఐదూ ఇరవై, నింపాదిగా ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వెళ్లి అతన్ని అభినందించాడు. మంచికింకా ఈ లోకంలో చోటుందని చాటావన్నాడు. పోలీస్ మొహమాటానికి ముందు సిగ్గుపడ్డా తర్వాత కాలరెగరేశాడు.

పెట్రోల్, డీజిల్ వాహనాలను నడిపినట్టు నమ్మకం మనిషిని నడిపిస్తుంది. ఒకోసారి పరిగెత్తిస్తుంది కూడా. ఎంత దూరం ఆ ప్రయాణం? ఎక్కడికి అది? సంకల్పబలం అనేది హనుమంతుణ్ణి దక్షిణ సముద్రం దాటించినట్టు మనిషిని ఎత్తి గిరవాటు వేయగలుగుతుంది. ఇదంతా లక్ష్యం అంటూ ఒకటి ఏడిసినప్పుడు. చుక్కాని లేని నావలా చాలా జీవితాలు ఉంటాయి కదూ. నడకా లేక నడిపించేవారూ లేక, బతుక్కి గమ్యం లేకపోతే ఏమి? కర్మయోగం ఉందిగా.

పొడవాటి ఇనుప కడ్డీలు కట్టగట్టి తీసుకెళ్తున్న ట్రాలీ. పసుపు రంగు ట్రాలీ కనపడింది గాని సంజె చీకట్లో చువ్వలు కనపడలేదు. చాల దగ్గరికొచ్చాక బండి పక్కకు తిప్పాడు. త్రుటిలో ఘోరం తప్పింది. ట్రాలీ కుడివైపు అద్దం పగిలింది. గుండె లబాలబా కొట్టుకున్న ట్రాలీవాడు కిందకు దిగి తిట్లు అందుకున్నాడు. అతను ‘సారీ భయ్యా’ అనంటూ వాలెట్ తీసి ఐదు వందలు ఇచ్చాడు. పర్సు జేబులో పెట్టుకుంటూ వాచీ వంక చూసుకున్నాడు. ఐదు ఇరవై ఐదు. సరిగ్గా ఐదైదు నిమిషాలకు చూసుకుంటున్నానే అనుకొని నవ్వుకున్నాడు.

ఇదేమీ పట్టనట్టు వెళ్లిపోయినాయి ఇతర వాహనాలు. ఛ ఛ వాహనాలు వెళ్లవు. మనము తీసుకెళ్తే వెళ్తాయి. యంత్రాలవి. వాటిలో కూర్చునేదీ యంత్రాలే. దెబ్బతిన్న మనుషులకు వాటిలో చోటుండదు. ఎందుకంటే దెబ్బ తగిలితే బుద్ధి వికసిస్తుంది. ఆ వెంటనే హృదయం విచ్చుకుంటుంది. ఈ రెండూ కాసులు రాల్చలేవు. సమయమే ధనం. ధనానికి ఇనప్పెట్టెలో చోటుంటుంది. హృదయమే లేనప్పుడు బుద్దే లేనప్పుడు సమయానికింక చోటెక్కడ? అందుకే కదిలిపోతుంటుంది.

కదిలే కాలం గురించి ఆలోచిస్తూ తను కదలకుండా ఉండిపోతే ఎలా? అర గంటలో చేరుకోవాలనుకుని మొదలుపెట్టాడు. కాలంతో పోటీపడి గెలిచిన మొనగాడు ఇంకా పుట్టలేదు. అరవై దాటినా ఎనభై దాటుతున్నా… అది వయసైనా వేగమైన

ఏదో పెళ్లి ఊరేగింపులా ఉంది. ఆ వైభవం చూడు. గుర్రాల రథం. ధగధగలాడే విద్యుద్దీపాలు, మిలమిలలాడే ముఖాలూ బట్టలూ, పెళపెళలాడే వయసు, తర్వాత్తర్వాత వీళ్లే కళవెళపోతారని ఎవ్వరికీ తెలియనట్టు అసలా అవకాశమే లేనట్టూ డప్పులు డాన్సులు. అసలు ఎందుకింత ఉత్సాహం? తనకెందుకింత నిరుత్సాహం అనుకొని తల విదిల్చాడు. వాంతి బైకూ, చేమంతి కొప్పు, కడ్డీల ట్రాలీ అన్నీ ఆగిపోయినాయి. ఎంత సవాహమైనా కట్ట కడితే ఆగినట్టు, కులాసాగా సాగిపోతున్న జీవితం మూడు ముళ్ళ కట్ట దగ్గర ఆగాల్సిందేనని తల్లి చెప్పింది. కలిసి ప్రవహిస్తాయి అనుకున్న రెండు పాయలూ దేని దారిన అవి పారాయి. అవి కలిసిన కొద్ది దూరంలోనే అందమైన దీవి ఏర్పడింది స్థిరంగా. ఆ దీవిని వదిలి రాక తప్పలేదు అతనికి. ఎప్పుడో దాటేసిన మజిలీ అది.

ఇప్పుడు ఇది దాటాలంటే ఆలస్యమయేలా ఉంది. దగ్గరి దారి కోసం అటూ సూచూశాడు. ఫ్లై ఓవర్ ఎక్కితే మళ్లీ దిగి చుట్టూ తిరిగి వెళ్లాలి. తప్పదు. ఎలాగో చోటుచేసుకొని చిన్నగా ఫ్లై ఓవర్ అంచుకి చేరుకున్నాడు. తాము చూస్తున్న వినోదానికి ఆటంకం కలిగిస్తున్న అతని మీద చిర్రుబుర్రులాడుతూనే కదిలారు అడ్డంగా ఉన్నవాళ్లు,

ఫ్లైవర్ మీద ప్రయాణం అతనికిష్టం. ఈ బేవార్సు లోకానికి పైన అంతెత్తు నున్నట్టు భ్రమపడటమంటే మోజు. ఎందుకనో ఎక్కువ మంది ఈ ఎత్తు దాకా రారు. వచ్చినా ఆ ఎత్తులో ఎక్కువ సేపు నిలవలేరు. నిలుపుకోలేరు అనాలేమో కదా?

చెయ్యెత్తు మనిషి ఆమె. జీన్స్, టీ-షర్ట్స్ ఆమె యూనిఫామ్. షర్ట్ తియ్యకుండా బ్రా విప్పి తీసెయ్యగలదు. ఎంతోమంది తత్తరపడే ఈ ఫీట్ ను ఆమె అవలీలగా చేసేసేది. అదే బాస్ కి నచ్చడంతో ప్రమోషన్ ఇచ్చాడు. ముందు బ్రా వాడిన ఆమె తరువాత బ్రెయిన్ వాడటం మొదలు పెట్టి ఎంతో ఎత్తుకి ఎదిగింది. దాంతో పోటీ దారులు ఆమెకు స్వర్గంలో చోటు చేశారు. అప్పరసలు స్వర్గంలోనే కదా మరి ఉండాలి!. ఆమెకు కంపెనీ ఇచ్చిన ఫ్లాట్ ని ఖాళీ చేయటానికి వచ్చిన చెల్లెలు అక్క బట్టలన్నిటినీ అనాథ శరణాలయంలో ఇచ్చేసింది. ఆమె చూడకుండా తస్కరించిన ఒక నల్లటి లేస్ బ్రా ఇంకా అతని అండర్వేర్ల మధ్య గర్వంగా ఉందంటే అతని మనసులో ఆమెకెంత చోటుందో తెలీడంలా?

ఇంకా పది కిలోమీటర్లు ఉంది. టైం పది నిముషాలే ఉంది. లాస్ట్ ఓవర్, సిక్స్ రన్స్ ఫర్ విక్టరీ అన్నట్టు. ఆడగలడా? ‘నేను సెంచరీ నాటవుట్’ అని పిలిచి పిలిచి చెప్పే ఎదురింటాయన సిక్ట్సీకే బౌల్డ్ కాలా? వజ్రదేహుడైన పక్కింటాయన కాలి చిటికెన వేలికి సెప్టిక్ అయి వొళ్లంతా ఇన్ఫెక్షన్ వచ్చి పోలా? చివరిదాకా వచ్చి ఆఖరి అడుగులో కుప్పకూలిపోవటం వింతనుకుంటాం. చావుకి చోటుండదని అనుకుంటాం. అరబ్బు షేకూ ఒంటె కథలాగా, వస్తే చోటంతా దానిదే.

ఎన్నో అనుకున్నాడు దారిలో చేద్దామని. వీలైతే ఒక ప్లేట్ భోజనం, కుదిరితే నాలుగు కప్పుల చాయ్, ఇంకా వీలైతే ఒక దమ్ము- ఉహూ ఏవీ కుదరలా, తన ప్రయాణంలో వాటికి ఓ గౌరవప్రదమైన చోటుని కల్పించాలనుకున్నాడు. చలించని సమయంతో సమానంగా వెళ్లాలంటే తను చలించకూడదనుకుని వాటిని మరచి పోయాడు. అయినా ఏమిటో లేటయిపోయింది. కాల్ చేస్తుంటే మిత్రులు జవాబే ఇవ్వటం లేదు. ఏమైపోయారంతా?

ఆఫీస్లో ఆరింటికి పంచ్ చేయాలి. లేకపోతే సగంరోజు జీతం దండగ. ఈ నిరామయ నిర్వికల్ప సంకల్పంతో ఐదింటికే బయలుదేరాడు. ఫ్యూయల్ రెడ్ లో పడిన సంగతి నిన్న చూసుకోలేదు. పెట్రోల్ బంక్ దగ్గర స్వైపింగ్ మిషిన్ పని చెయ్యలేదని పది నిముషాలు మింగాడు పిలగాడు. కోపాన్ని మింగలేక కక్కలేక కదిలాడు అతను.

చేరుకునే సరికి ఐదు యాభైతొమ్మిది. సంతోషంతో చల్లటి ఏసీ వాతావరణంలోకి అడుగుపెట్టాడు. విజయగర్వంతో పంచ్ చేసి, మొబైల్ ఫోన్ ని లాకర్లో పెట్టి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే అంతా పనిలో మునిగిపోయారు నిజంగా పనున్నట్టు, నిజంగానే పని చేస్తున్నట్టు. ఏదో తేడా ఉందే అనుకుంటు. ఇంతలో బాస్ పిలిచాడు ఇంటర్ కంలో. నిస్సంకోచంగా వెళ్లాడు.

“ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా?” బాస్ గద్దించాడు.

“ఆరూ ఒకటి”

“ఎనిమిది ఇరవై” రెట్టించి అన్నాడు.

“ఆర్యూ జోకింగ్?” అందరు తెలుగువాళ్లలాగే ఎమోషన్లో ఇంగ్లీష్ మాట్లాడాడు.

“చెక్” అని అధికారి తన మొబైల్ని, గోడ మీద గడియారాన్ని, డెస్క్ టాప్ ని. చేతికున్న వాచీని చూపించాడు. ఇన్ని ఆధారాలనీ తలదన్నే ఆధారం తన పాత వాచీ వంక చూశాడు అతను. ఐదు యాభై తొమ్మిది దగ్గర ఆగిపోయింది అది. యుద్ధంలో అమితంగా గాయపడ్డ గుర్రం పరిగెత్తకపోయినా కుంటుకుంటూ నడిచి తన రౌతును మాత్రం క్షేమంగా ఇంటికి చేర్చి ప్రాణాలు వదిలినట్టు.

*

ఎ.రవీంద్రబాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బావుంది. విశ్లేషణ చదివాక, కథ చదివితే మాత్రం సాదాగా అనిపించకపోదు. ఒక కథని అంతెత్తున ఎక్కడో నిలబెట్టగలిగే విశ్లేషకులు మన తెలుగులో ఉండటం ఆనందకరం. కథలో సారాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పాఠకుల కోసం ఎదురు చూస్తున్న మంచి రచయితలు కొందరు అజ్ఞాతంలో ఉండటమూ జరుగుతుంది. విమర్శకుల రాడార్ మరింత విశాలమయ్యి మరిన్ని మంచి కథలూ పరిచయమవ్వాలని ఆశిస్తున్నాను.

  • చక్కని విశ్లేషణ చేశావు రవీంద్ర.
    కథ పూర్తిగా చెప్పకుండా నే చెప్పారు. ఇది మంచి విమర్శకుల కు మాత్రమే పట్టుబడే లక్షణం. హృదయ పూర్వక అభినందనలు .

    • హరిత గారు..
      రవిందర్ వంగ దేశీయుడు కాదు. ఆరణాల ఆంధ్రుడు 😂

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు