దూరం జరిగే అలవాటు మానలేదింకా!

నిర్వహణ: పేర్ల రాము

1.
ఆశగా కొడుకు వైపు…
విరిగిపోయిన హృదయం
కన్నీటినదికి ఆనకట్ట ఎత్తేస్తే
ఆ నదిని ఎవ్వరికి తెలియకుండా దోసెట్లో పట్టుకుంటుంది..
కమిలిన చేతులకు
బాల్యఙ్ఞాపకాలను రాస్తూ
తను అప్పటి మనిషికాదు
మారిపోయిందామె!
పావురంలా ఎగిరే తన స్వేచ్ఛ
ఆమె తాలిబొట్టుకే ఉరేసుకుంది
సమాజంకి భయపడి తన గొంతును తనే తెంపుకుంది
గ్యాస్ సిలిండర్ మంట
పిలుస్తుంటే
వెళ్లాలని ఉన్నా
మూడేళ్ళ తన కొడుకును చూసి ఆగిపోతుంది
తను అప్పటి మనిషికాదు
మారిపోయిందామె!
పరాయి ఆడదానికి
రుచి మఱిగిన భర్త
పంటిగాటుగానో
కర్రవాతలు గానో ప్రతీరాత్రి
అయినా
తన ప్రేమదీపం ఎందుకో ఆరిపోట్లేదు
గిన్నె వేడిగా ఉన్నప్పుడే పట్టుకునే మసిగుడ్డ
భర్తకు వేడెక్కినప్పుడే గుర్తుకొచ్చే తను
ఒక్కటని తెలుసుకుంది
వివక్షలేని సమాజం రాదని తెలిసినా
తనేందుకో ఆశగా కొడుకువైపు చూస్తుంది
తను అప్పటి మనిషికాదు
మారిపోయిందామె!
 2.
దండోరాలు వేసేటోళ్లం
గుండెల్లో మూసేసుకున్న గేట్లను తెరవలేదింకా
దూరం జరిగే అలవాటు మానలేదింకా
గోలుసుల్లేని
స్వేచ్ఛకూడా లేని
జీవితాలె మావి ఇంకా…
అగ్గిలేని గుండెలు మావి
ఆళ్ళ ఆలోచనల కంచల్నీ
అందుకే తగలెట్టలేకపోతున్నాం
ఎవరైనా…
ఒంటరిగా బగ్గుమంటే
బతుకుని అమావాస్య చీకటి చేస్తారు
మా జీవితాలు
కన్నీళ్ళతో తడిసిన పుస్తకాలు
ఆ తడికూడా మడేమో
అందుకే ఎవ్వరూ ముట్టరు
మావి కలర్ పేజీలు కాదు
కట్టాల పేజీలు
అందుకే చదవరు..
గాళ్ళు గొప్పోళ్ళు
నడుస్తుంటే దండాలు
మేము వేరు
దండోరాలు వేసేటోళ్లం
దండాలు పెట్టేవాళ్ళం
అవి ఆశించకూడదంట…
మేము..
కన్నీళ్లు విలువ తెలిసినోళ్లం
వాటిని వాడుకునేటోళ్లం కాదు
కష్టాన్ని అమ్ముకునేవాళ్ళమే
కానీ మనసుని అమ్ముకునేటోళ్లం కాదు
అందుకేనేమో మేమింకా అంటరానోళ్ళమే.
అదేదో
మనిషి రోగానికి
మందు కనిపెడుతున్నారంటగా
ఈ మానసికరోగులకు కూడా ఏదో ఒక మందుకనిపెట్టండి పాపం!
*
నా పేరు రావేళ్ళ రవీంద్ర బాబు ఖమ్మం దగ్గర అమ్మపాలం గ్రామం,చదువు కోసం హైదరాబాద్ వచ్చాను..నాకు చిన్నప్పటి నుంచి తెలుగు బోధించిన ఉపాధ్యాయుల వలనే కవిత్వంపై ఆసక్తి మొదలైంది..మొదట్లో ఏదో ప్రాసతో  నాలుగు లైన్లు రాసి అదే కవిత్వం అనుకునే వాడ్ని కానీ నేను ఏం చెప్పినా అమ్మ మాత్రం చప్పట్లు కొట్టి భుజం తట్టేది (ఇప్పటికి నేనేం రాసినా ముందు అమ్మకే చెప్తాను) అలా మెల్లగా హృదయంతో రాయడం మొదలుపెట్టాను.
ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను.
చిత్రం: స్వాతి శ్రీకర్

రవీంద్ర రావెళ్ళ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కంగ్రాట్స్ చైతూ .రాము నిర్వహణలో చైతూ కవితలు చూడటం చాలా ఆనందదాయకం .నా తమ్ముళ్ళిద్దరికి అభినందనలు .

  • ఆశగా కొడుకు వైపు…కవిత మారాల్సిన ఇప్పటి తరాన్ని చూపించింది.భర్త చేతిలో అనేక హింసలకు గురైనా ఇంకా కొడుకుల కోసం బతుకుతున్న తల్లుల బతుకుచిత్రమిది.తమ్ముడు రవీంద్రకు,రాముకు అలాయ్ బలాయ్ !

  • రవి..అభినందనలు కవితలు బాగున్నాయి..ఆశగా కొడుకు వైపు కవితలోకి తల్లి పడుతున్న బాధను తీసుకొని రావడం. రెండవ కవితలో ఎంతో ఆలోచన కలిగించేలా రాయడం బాగుంది.. ఇలాగే రాస్తూ ఉండూ..💐💐👍👍.

  • వయసుకి మించి రాసారు. చాలా బాగున్నాయ్ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు