తలపుల తలుపు

విశ్వనాథ్ ఆ రోజు ఒక శుభలేఖ అందుకున్నాడు. అది అతని ప్రాణ మిత్రుడు కనకాచారి కూతురి పెళ్లి శుభలేఖ. దాంతో పాటు ఒక లేఖలో అతను తప్పక పెళ్ళికి రావాలని, వస్తే అతనికో ‘సర్ ప్రైస్’ ఉంటుందని కనకాచారి ఊరించాడు. ఇద్దరు మిత్రుల మధ్య గాఢమైన స్నేహం ఉంది కనుక, ఆ సర్ ప్రైస్ ఉన్నా లేకపోయినా విశ్వనాథ్ పెళ్ళికి పోయేవాడే. కానీ సర్ ప్రైస్ ఏమిటో ఊహించలేక పోయాడు.

విశ్వనాథ్ ఈ సంవత్సరమే పదవీవిరమణ పొంది విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. దురదృష్టవశాత్తు అతని భార్య పది సంవత్సరాల ముందే క్యాన్సర్ తో చనిపోయింది. భార్య మరణాంతరం తన ఏకైక కుమార్తె సంగీత వివాహం చేసి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. కూతురు, అల్లుడు కూడా అతన్ని బాగా చూసుకుంటున్నారు, ముఖ్యంగా తల్లి లేని లోటు తెలియకుండా తన తండ్రిని బాగా చూసుకుంటుంది సంగీత. వారి ఇద్దరి పిల్లలతోనే అతనికి మంచి కాలక్షేపం. కనకాచారి, విశ్వనాథ్ కు స్కూల్ నుంచి మంచి స్నేహితుడు, ఆ స్నేహం కాలేజీలో కూడా కొనసాగింది. అతని కూతురు బిటెక్ చేసిన తర్వాత అమెరికా వెళ్లి యంఎస్ చేసి అక్కడే ఉద్యోగంలో స్థిరపడింది. అక్కడే తన కంపెనీలో పనిచేసే కన్నడ యువకుడిని ప్రేమించి, పెద్దలను కూడా పెళ్ళికి ఒప్పించి కాస్తా ఆలస్యంగా అయినా ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఆ ప్రేమ వివాహానికి ఇండియాలో ఉన్న వధూవరుల తల్లిదండ్రులకు ఒప్పుకోక తప్పలేదు. ఇరువురికీ అనుకూలంగా పెళ్లి తిరుపతిలో పెట్టుకున్నారు. ఎలాగూ తిరుపతి వెళ్తున్నాడు కనుక దైవ దర్శనానికి ముందుగానే స్లాట్ రిజర్వ్ చేసుకున్నాడు. ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం, తిరుపతి చేరుకొని అతని మిత్రుడిని కలుసుకున్నాడు. స్నేహితుడు అతని పేర ఒక స్టార్ హోటల్లో ముందుగానే బుక్ చేసిన గది చేరుకొని, స్నానపానాదులు ముగించుకుని కొండకు బయలుదేరేముందు స్నేహితుడిని ఫోన్లో అడిగాడు “ఏదో సర్పైస్ అన్నావు, ఏమీ కనబడలేదు కదరా” అని.

“నువ్వు దర్శనం చేసుకుని రా, మళ్ళా మాట్లాడుదాం, నీకు కొండ మీద కూడా ఒక గదిని రిజర్వ్ చేసాను, అందులోనే ఉండి రేపు సాయంత్రానికి రిసెప్షన్ సమయానికి రా, ఎందుకంటే నేను ఈ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను, నీకు కంపెనీ ఇవ్వలేను, ఇక నువ్వా, తిరుపతికి కొత్త, నాకేమీ సహాయం చేయలేవు” అని పంపేశాడు.

విశ్వనాథ్ శనివారం మధ్యాహ్నం కొండ దిగి, అమ్మవారి దర్శనం కూడా చేసుకుని నాలుగు గంటలకు తన గది చేరాడు. కాస్సేపు విశ్రాంతి తీసుకుని, స్నానం చేసి పెళ్లి మండపానికి బయలుదేరాడు. అప్పటికే బంధు మిత్రులతో నిండిన మండపంలో తన మిత్రుడిని కష్టపడి పట్టుకున్నాడు.

“దర్శనం బాగా జరిగిందా, కొండమీద చాల్లగా ఉందికదా, బాగా ఎంజాయ్ చేసావా” అంటూ తన బంధువులను పరిచయం చేసేందుకు ఆయుత్తమైనాడు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఒక చోట ఆగిపోయాడు. ఒక స్త్రీ అటువైపు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది “చెల్లాయ్, ఎవరొచ్చారో చూడు” అంటూనే ఆమె ఇటు తిరిగింది. ఆమెను చూస్తూనే విశ్వనాథ్ ద్రిగ్భమ చెంది ఒక రాయిలా మారిపోయాడు. ఆమె ఎవరో కాదు, ఒకప్పటి తన క్లాస్మేట్, తను ఎంతో గాఢంగా ప్రేమించిన కాంచన. ఆమెకూడా అతన్ని చూసి తబ్బిబ్బైపోయి కాస్సేపటివరకు నోట మాట రాలేదు. ముందు ఆమే సర్దుకుని “బాగున్నారా” అంది. కానీ విశ్వనాథ్ మాట్లాడే స్థితిలో లేదు, మౌనంగా తలాడించి, స్తబ్దుగా కూర్చున్నాడు. కాస్సేపాగి ఆమెవైపు చూసాడు. ఆమె బంధువులతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది. అతనికి గతం జ్ఞాపకమొచ్చింది.

నలభై మూడు సంవత్సరాలముందు విశ్వనాథ్, కనకాచారి, కాంచనలు డిగ్రీలో క్లాస్మేట్స్. పేరుకు తగ్గట్టు కాంచన బంగారు వర్ణంతో, ఎత్తుగా చాలా అందంగా ఉండేది. విశ్వనాథ్ కూడా అందగాడే. మొదటి సంవత్సరం పరిచయం రెండో సంవత్సరం ప్రేమలోకి మారింది. కనకాచారి ఆమె కజిన్ అవడం విశ్వనాథ్ కు కలిసివచ్చింది. అతనితోపాటు ఆమె ఇంటికి అనేకమార్లు పోయి, వారి తల్లిదండ్రులతో కూడా పరిచయం పెంచుకున్నాడు. కాంచన వాళ్లకి ఆ ఊర్లో బంగారు ఆభరణాల అంగడి ఉండేది. వారి ప్రేమకు కనకాచారి కూడా అభ్యంతరం పెట్టలేదు. ఆ రోజుల్లో విద్యార్ధులలో అభ్యుదయభావాలు ఉన్నవారిలో ఈ ఇద్దరు స్నేహితులూ ముందుండేవారు. ఇద్దరూ పీకలోతు ప్రేమలో పడ్డారు. వారి మధ్య ఉత్తరాల వారధి వారిని మరీ దగ్గరకు చేర్చింది. ఇప్పటికీ విశ్వనాథ్ హృదయంలో కాలేజీ రోజుల జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. డిగ్రీ అయిన తర్వాత ఇంట్లోవాళ్ళను పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఇద్దరి పెద్దలూ కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు సరికదా వారిపై తీవ్ర ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కాంచన గృహనిర్బంధంలోనే ఉండేది. విశ్వనాథ్ తండ్రి ఆ ఊరినుంచి బదిలీ నెపంతో మకాం మార్చేశాడు. అయినా విశ్వనాథ్ అప్పుడప్పుడూ వచ్చి కనకాచారి వద్దనుండి కాంచన వివరాలు తెలుసుకునే వాడు కానీ ఆమెను మాత్రం కలవలేక పోయాడు. ఈ రోజుల్లోలా అప్పుడు సెల్ ఫోనులే కాదు, అసలు ల్యాండ్ ఫోనులు కూడా ఉండేవి కావు. చివరకు కాంచన ఒక రోజు ఆమె ఇంట్లో ఉండే బావిలో దూకింది. నీళ్ళు తక్కువ ఉండడం వల్ల ఆమె చనిపోలేదు కానీ తీవ్ర గాయాలతో బతికి బయట పడింది. ఆ సంఘటనతో ఆమెను దూరపు బంధువుల ఇంటికి తరలించేసారు. ఆ తర్వాత కనకాచారి కూడా ఆమె సంగతులు తెలవలేదని చెప్పేవాడు. మరో రెండు సంవత్సరాల్లో విశ్వనాథ్ ఉద్యోగంలో చేరిపోయాడు, కానీ కాంచన కోసం ప్రయత్నం చేయడం మాత్రం మానలేదు. ఆమె తండ్రిని అంగడిలోనే కలిసి, తనకు ఉద్యోగం వచ్చిందని, తన కాళ్ళ మీద నిలబడ్డానని, దయచేసి పెళ్ళికి ఒప్పుకోమని అర్ధించాడు. ఆయన ఏ జవాబూ ఇవ్వలేదు, మౌనంగా సాగనంపాడు. మరోసారి తన తండ్రినే తీసుకుని వచ్చి ప్రయత్నం చేయాలని అనుకున్నాడు. ఇంతలో ఒకానొక రోజు కనకాచారి ఉత్తరం ద్వారా కాంచనకు వివాహం అయిపోయిందని, ఆమె ఎక్కడో బొంబాయిలో ఉందని వ్రాస్తూ, ఇక కాంచనను మరిచిపోయి అతన్ని కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించమన్న స్నేహితుడి సలహాకు అతని హృదయం పగిలింది. మరో రెండు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ, కాలం ఆ గాయాన్ని మాపి, అతనూ పెద్దల సలహా ప్రకారం పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. క్రమేణా కాంచన జ్ఞాపకాలు మనసు పొరల్లో మరుగున పడిపోయాయి. కనకాచారిని కలిసినప్పుడల్లా ఆమె వివరాలు ఎంతో ఆత్రుతతో తెలుసుకునేవాడు. ఆమెకు ఇద్దరు పిల్లలని, సంతోషంగా ఉందని తెలిసి ఆనంద పడినా ఆమె జ్ఞాపకాలు అతన్ని ఇంకా వెంటాడేవి. ఆ మధ్య ఆమె భర్త ఒక ఆక్సిడెంట్లో చనిపోయాడని కనకాచారి తెలిపాడు, కానీ ఆమె చిరునామా ఇచ్చేందుకు మాత్రం నిరాకరించాడు. కాలేజీ వదిలిన తర్వాత ఆమెను చూడడం ఇదే. ఆమె వైపు తలెత్తి చూసాడు, ఆమె ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఆమెలో పాత జ్ఞాపకాలు రాజుకోలేదా? ఆమె కూడా అతనిలా ఫీల్ కావడం లేదా? ఆమెను చూస్తే అలాంటి లక్షణాలు ఏవీ కనబడటం లేదు. స్త్రీలు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు, అంత సులభంగా బయటపడరు అనుకున్నాడు మనసులో. రిసెప్షన్లో విశ్వనాథ్ ఆమెను చూస్తూనే ఉన్నాడు, ఆమెలో అలనాటి అందం ఏమాత్రం తగ్గలేదనిపించింది, అంతే కాక ఆమె వయస్సు ఎంతో హుందాతనం కూడా కలిగించింది. రిసెప్షన్ అయిన తర్వాత కనకాచారి కొంతమంది బంధువులతో కలిపి ఇద్దరినీ ఒకే టాక్సీలో హోటల్ కు పంపాడు. టాక్సీ దిగిన తర్వాత అందరూ తమ రూములకు చేరుకున్నారు. ఆశ్చర్యంగా కాంచన గది విశ్వనాథ్ పక్క గదే. ఆమె అందరికీ ‘గుడ్ నైట్’ చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయింది.ఇద్దరి మధ్య ఎక్కడా మాటలు లేవు.

విశ్వనాథ్ ఇంకా ఆమె దర్శనం కలిగించిన విస్మయం నుండి తేరుకోలేదు. నిశ్శబ్దంగా తన గది చేరుకున్న విశ్వనాథ్, అప్పుడు చూసాడు, వారి ఇద్దరి గదుల మధ్య ఒక గడియ పెట్టిన తలుపు. సామాన్యంగా కొన్ని హోటళ్ళలో పెద్ద కుటుంబాలకు సౌకర్యంగా అలాంటి ఏర్పాట్లు చేసిఉంటారు. ఒక వేళ సింగిల్ రూమ్ అవసరమొస్తే ఆ తలుపు మూసి, బాడుగకు ఇచ్చేస్తారు. రెండు వైపులా గడియలు ఉంటాయి కనుక ఇద్దరూ అనుకుంటేగానీ ఆ తలుపులు తెరవలేరు. అది చూసిన విశ్వనాథ్ బట్టలు కూడా మార్చకుండా అలాగే సోఫాలో కూర్చుని ఆ తలుపును చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో చిన్నగా ఒక ఆశ బయలుదేరింది. ఆ తలుపును తీసుకుని కాంచన వస్తే ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఆ తలుపు గడియవైపు చూసి ఉలిక్కిపడి గబగబా వెళ్లి ఆ గడియను ఎలాంటి శబ్దం రాకుండా ఊపిరి బిగబెట్టి తీసిపెట్టాడు. ఇక అతని నిరీక్షణ మొదలయ్యింది. ఆమె కూడా ఆ తలుపును చూసి ఉండదా? కాలేజీలో ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు, ఎన్ని ఉత్తరాలు వ్రాసుకున్నారు, అవి ఆమెకూ జ్ఞాపకం రావా? ఆమెకూడా తన లాగే ఆలోచిస్తూ ఉంటుంది, తప్పక ఏదో ఒక సంకేతం ఇస్తుంది, అతని మనసు ఆశలతో నిండిపోతుంది. ఇద్దరూ కలిస్తే పాత విషయాలు మాట్లాడుకోవాలి, ఆమె పెళ్లి అయిందని తెలిసినా అతను ఎలా రెండు సంవత్సరాలు నిరాశతో పెళ్లి చేసుకోలేదో చెప్పాలి, ఆమె కుటుంబ విషయాలు, తన కుటుంబ విషయాలు మాట్లాడుకోవాలి. ఆ తలుపును అతను చూస్తూనే ఉన్నాడు. అతని కలలు కోటలు దాటుతూనే ఉన్నాయి. రాత్రి పన్నెండు గంటలు, హోటలంతా నిశ్శబ్దం ఆవరించింది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడుతున్నాడు. చిన్నగా లేచి ఆ తలుపును పరిశీలించాడు, అది మహా దుర్భేద్యంగా కనిపించింది. కనీసం అటువైపు గదిలో లైటు వెలుగుతుందా లేదా కూడా తెలియడం లేదు. మరలా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సమయం రెండు గంటలు, నిద్రలేమితో కళ్ళు మండుతున్నాయి, కానీ కళ్ళు మూస్తే ఎక్కడ ఒక అపురూపమైన అవకాశం చేయి జారుతుందో అని నిద్ర పట్టడం లేదు. మెల్లగా లేచాడు, తనే ఎందుకు చొరవ తీసుకోకూడదు? ఆ తలుపు వద్ద నిలబడి చెవి ఆనించి అవతలి గదిలో ఏవన్నా శబ్దం వస్తుందా అనివిన్నాడు. ఒకవేళ ఆమెకూడా తనలాగే తటపటాయిస్తుందా అని ఆలోచించి మెల్లగా ఆ తలుపుపై గోకాడు. ఒకవేళ ఆమె కూడా అవతలివైపు తనలాగే నిలబడి ఉంటే ఆ శబ్దం విని సంకేతంగా భావిస్తుంది కదా అని అతని ఆశ. ఎలాంటి స్పందన లేదు. తన కోసం చచ్చిపోయేదానికికూడా నిర్ణయించుకున్న ఆమె తనను కలవాలని ఆశ పడడం లేదా? తలుపు మీద బాదేందుకు అహం అడ్డు వచ్చింది, ఆమెకు నచ్చదేమో అని భయం కూడా కలిగింది. అతనిలో సన్నని వణుకు ప్రారంభ మైంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, చల్లగా ఉన్నా చిరుచెమటలు పడుతున్నాయి, మానసిక స్థితి గందరగోళంగా తయారై జీవితం మీదే విరక్తి పుడుతుంది. తెల్లవారి ఐదు గంటలు, హోటల్లో హడావిడి మొదలయ్యింది. కొన్ని గదుల తలుపులు తెరుచుకుని కాఫీ తెప్పించుకుంటున్నారు. కాంచన గదిలో కూడా కాఫీ సర్వ చేసిన శబ్దం వచ్చింది. ముహూర్తం తెల్లవారి ఎనిమిదీ తొమ్మిది గంటల మధ్య కనుక అందరూ సిద్ధమై పోతున్నారు. కనకాచారి టిఫనుకు మండపానికే వచ్చేయమని చెప్పి పంపాడు. నిరాశా నిస్పృహలతో అతను మంచంపై కూలిపోయాడు. అందరూ పెళ్లి మండపానికి వెళ్ళిపోయారు. విశ్వనాథ్ తీరిగ్గా ఎనిమిది గంటలకు లేచి రెడీ అయి బయలుదేరాడు. అతను పోయేసరికే అందరూ అక్షింతలు వేస్తున్నారు. అన్యమనస్కంగానే అతనూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మాంగల్యధారణ అయేంతవరకు కనకాచారికి తీరిక లేదు. ఆ తంతు పూర్తవుతూనే కాంచన మరో స్త్రీతో బయలుదేరింది, పోయేముందు విశ్వనాథ్ వద్దకు వచ్చి “నాకు ఫ్లైట్ కు టైం అవుతుంది, బయలుదేరుతున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది. అతను స్తబ్ధుగా కూర్చుండిపోయాడు.

ఆ రోజు సాయంత్రం కనకాచారి విశ్వనాథ్ కు వీడ్కోలు పలికేందుకు స్టేషన్ వచ్చాడు. అతను తన స్నేహితుడి పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. బండి కదిలే ముందు మెల్లగా చెప్పాడు “విశ్వా, నువ్వు ఎన్నోమార్లు కాంచన గురించి అడిగేవాడివి, నీకు ఆమె గురించి దిగులు ఉండవచ్చు లేదా ఏదైనా ఆశ ఉండవచ్చు, నాకైతే అర్ధం కాలేదు. కానీ ఒక స్త్రీ ప్రేమిస్తే ప్రాణం తీసుకునేందుకు కూడా సిద్ధపడుతుంది, అది విఫలమై మరొకడితో జీవించాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే అదే తన ప్రపంచంగా బతుకుతుంది. అదే ఆడ మగల మధ్య బేధం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సర్ప్రైస్ కాంచన దర్శనం కాదు, ఈ విషయం నిరూపించడమే”.

బండి కదిలింది, కనకాచారి విగ్రహం కనుమరుగైనా అతని మాటలు విశ్వనాథ్ చెవిలో గింగురుమంటున్నాయి.

****************************

షేక్ అహమద్ బాషా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు