గెంగాలమ్మ సాచ్చిగా..

రయొల్ల పాకల్లో యే పేనం నిలవట్లేదు. ఏ పాకలో యబ్బుడు యే పేనం పోతాదో తెలియక బిక్కుబిక్కుమంటుంది జెనం. మూడేండ్లలో మూడొందల పాకల్లో యవురొకరు మట్టిలో కలవని పాకంటూ లేనేలేదు. మూడేండ్లుగా వూరుసుట్టూత పారే ఉప్పు కాలువ తుప్పుబట్టిపోయి పంటపైర్లకు కూడా పేనం లేదు. బలికూడు సల్లేప్పుడు జగడాలొచ్చి నడీది గెంగమ్మను నడీదిలోనే వొదిలేసి ఎవరిండ్లకు వోళ్ళు యల్లిపూడ్సినప్పుడు సుట్టుకున్న శని. ఉడుము శనేమో! ఇంకా వొదల్లేదు. కాలువ కయ్యిలంతా పాదాలకు యడుపులొచ్చినట్టు పగిలిపూడ్సినాయి. గట్టిపరక్కూడా మొల్లేదు. మట్టెండిపోతే డొక్కెన్డిపోతుంది గదా!

అట్టాగ కొంపకొకరు పిల్లాజల్లా, ముసిలిముతకని తేడా ల్యాకుండా వరిపొట్టు మాదిరి యీడ్సికొట్టుకొని తూర్పుదిక్కుకు కాళ్లుసాపి కాటికి పూడ్సినారు. ‘గెంగాలమ్మ జాతర సేయకనే యేడేడు పద్నాలుగేళ్ల శని మూడేల్లోనే పట్టుకుందని’ అనుకోని జీవజిక్కి వూళ్ళో లేనేల్యేదు. ఆడిమాసంలో కాళస్త్రి ఏడు గంగమ్మల జాతర, నాన్నారం తొమ్మిది గంగమ్మల జాతరకు మూడు నెల్ల ముందే చిత్రమాసంలో గెంగాల పండగ సెయ్యాల. కరువు కష్టం పోయి కాపురాలు నిలబడాలని రచ్చబండ కాడ జాతర మద్దీసంలో మాట్లాడుకున్నారు వూరి జెనం. చివర్లో పినిపెద్ది లేసి టువాలు గుడ్డను కిరీటం మాదిరి తలకు సుట్టి “సూడండబ్బా! జరిగినదంతా మర్సిపోయి. జగడాలు పడకుండా అందరూ కల్సిమెల్సి మన గేమ దేవత గెంగాలమ్మను సళ్ళబర్చాల. అబ్బుడే మన  కరువుపోయి కొంపలు నిలబడతాయి” అన్నాడు.

అందరూ తలలూపారు. “హా…!కల్సిమెల్సి…యీల్లు. ఊరంతా వొకేవోళ్ళు అయినబ్బుడికీ పనోల్లైన తోటి, వన్నారు, సలవాది వోల్లపైన చిన్నచూపు, వివచ్చ లేనిదెప్పుడు? కడాన వూరి పెద్దమనిషి, తోటి పినిపెద్దికి అయినా వివచ్ఛ పోయిందా? కనీసం పనోళ్లలో కూడా తమకన్నా కిందున్నోల్లని తక్కువగానే గదా సూసేది” అని మద్దీసంలోనే నిలదీశాడు పీజీ సదూకున్న రవిగాడు. పినిపెద్ది మొఖంలో రత్తమే లేనంతగా వాడిపోయినాది. ఊరోళ్ళు తలలు మన్నుకు వంగినాయి. “అబ్బాయా! నువ్వనేది వాస్తవమేరా. కానీ యింకెబ్బుడు అలా జరగదు. ఏమంటారుయా?” అన్నాడు పినిపెద్ది మందిని చూసి. “అవును! అలా జరగదు…జరగదు” అన్నారు జనం. ‘ఏమో’ అని సందేహంగా యవరిండ్లకు వోళ్ళు చేర్నారు.

***                                                                                             

వచ్చే ఆదేరం నడిరేయప్పుడు వూరిసుట్టున్న గెంగరాయిలకు పసుపు కంకణాలు కట్టి సాటింపేసి మంగలారం గెంగమ్మకు పెళ్లి జెయ్యాల్ల. జాతరంటే గెంగమ్మకు పెళ్ళిచేసి వూరేగించి, నొచ్చిలి చెట్టు మండలతో గుడిసిల్లు కట్టి, పెండ్లి జంట మరవళ్ళకు పోయినట్టు గుడిసిలో నగర కుంభమేసి, వూరిసుట్టున్న పంటపైర్లను, వూర్ని కాపాడాలని బలికూడు సల్లి, తల్లి వొడిలో బిడ్డను నిద్రపుచ్చినట్టు బుదారం నడిరేయిలో దిగుగెవుని జల్జిలోకి గెంగమ్మని గంగ ఒడిలో నిద్రపుచ్చడమే గదా! ఇదంతా సెయ్యాలంటే వొగిరివల్లవుతుందా? పని సులువు కోసం వొక్కో యిళ్ళు వొక్కొక్క పని సెయ్యాల.

అందుకే యీ గురారం పల్లె పినిపెద్ది, పెద్ద మనుషులంతా కల్సి పూలుపండ్లు తీస్కొని గెంగమ్మ పుట్టినిల్లైన వన్నారోళ్ళ యింటికి వచ్చి “మొట్టన్నా! వూరి బాక్కోసం మీ యింటి ఆడబిడ్డను మా యింటికివ్వండి” అన్నాడు తోటి పినిపెద్ది కన్నయ్య. అదును జూసి పదునేసినట్టు యిదే అవకాశమని “పోయినేడు పిల్లనిస్తే ఏం చేసారు? నడీదిలో ఏడిపించారు కదా! మళ్ళా ఏ మొఖం పెట్టుకొని వచ్చార్రా? మీ బతుకులు చెడా!” అని కన్నీళ్లు పెట్టుకుంటూ భుజంపైనున్న టువాలని చేతికెత్తుకొని గాండ్రించి కారివుమ్మాడు మొట్టన్న.

“పోయినేడు మీరు మాట్లాడిన దుడ్డును మాట్లాడినట్టు యిచ్చారా? మీ అవసరానికి మేము కావల్ల గానీ తిండి తిప్పలు కాడ మీరు మాత్రం బలే కట్టుబాట్లతో వుంటారు గదా?” అని కల్లెర్ర చేశాడు డిగిరీ సదివిన మొట్టన్న మనవుడు భాస్కరుడు. మామ గంగడు మాత్రం ‘భాస్కరుడే యీల్లకి సరైన మొగుడు. వాడు అడిగేది, చేసేదన్నీ కరెక్టే’ అనుకుని  నోట్లో కుడుములు పెట్టుకున్నట్టు నోరు మెదపకుండా వూరి జెనానికి బయపడి గొమ్మునే వున్నాడు. పక్కనే ఉన్న నాయన కదిరేలు యంటనే లేచి “రేయ్…తూ..ఆపురా! పెద్దోళ్ళ కాడ యాందిరా మాటలు. మనం పనోళ్లురా” అని సముదాయించాడు. “నాయనా! పనోళ్ళయితే యాందీ? పనోళ్లు దేముడికి తప్పా యీళ్ళకి కాదు” అని కుండ బద్దలుకొట్టాడు భాస్కరుడు. ఊరి పెద్దమనుషులు నాగడు, సారావోడు, టికిరోడు, తోలోడు, గోసితాత మొకాలు నేలకొరిగాయి. బుర్రమీసాల నాగడు లేచి “అబ్బాయా! నువ్ అడిగేది నేయమేరా! యింకట్లా జరగదు” అన్నాక తట్లు మార్చుకున్నారు.

“యింకేమిరా?అవ్వాల్సిన పొనులు సూడుపొండి. చెరొక చెయ్యేసి తలోక పనిచేసి సెవుటమ్మ ఉగ్గరాన్ని చల్లబర్చాల” అని చెప్పేసరికి బద్దిగొర్రె, దున్నపోతు, బలికుట్టి, కరగ్గాటం, టపాసులు కోసం నలుదిక్కులకు పైనమయ్యారు. 

***

శుక్రారం పొద్దుమొల్సి కోడికూసిందో లేదో పన్నెండు సదూకున్న సలవాది వాసుదేవ కొడుకు బుడ్డోడు పంబకం దుడ్ల కోసం సంకలో పుస్తకమెట్టుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఊరి పెద్దలు టపాసులకి, మైకు సెట్టుకు పుత్తూర్లో ఉన్న సొట్టోడికి ముందు దుడ్లిచ్చి సిరం చేసుకున్నారు. శనేరం రాత్రి కిష్టమూర్తి ఉచ్చవం చేసి యేడుకొండల వాడ్ని సెల్లి పెళ్లికి పిలవడానికి పూజ సామాన్లు కొనడానికి కొంతమంది నాన్నారం పోయొచ్చారు.

యింటికొకరు పూలు టెంకాయ కర్పురాలతో భజన గుడికాడికొచ్చారు. పినపెద్ది కన్నడు టెంకాయ కొట్టి “గోయిందా… గోయిందా… గోయిందా..” అని మూడు సూర్లు అరిచాడు. యనకాలే పెద్దమనుషులు, వూరి జెనాలు “గోయిందా” లేసారు. ఊరి తూర్పుకున్న గోయింద రాయికి గుమ్మడికాయ కొట్టి దండేసి దండం పెట్టుకున్నారు. ఏడుకొండలవాడు గెంగాలమ్మ పెండ్లికి వొచ్చాడుకున్నారు. యింక మిగిలింది ఆదేరం పైవూరికి పోయి అంకాళ పరమేశ్వరికి పొంగళ్ళు పెట్టి తన సెల్లెలు  పెళ్లికి పిల్చటమే. ఆదేరం నడెండప్పుడు వూరి మధ్యలో యాపచెట్టు కింద గెంగాలమ్మ గుడి యదురుగా పలకలతో వొరసగా నిలబడినారు తోటోల్లు మిద్దికుప్పం మురగడు, కుప్పయ్య, భూపతి, శీరాలుగోడు. వన్నారు కదిరేలు, గంగడు, భాస్కరుడు గంగరాయికి బొట్లు పెట్టి మాలేసారు.

జానికిలో పసుపు కుంకుమాలు కలుపుకుని వూరు పినిపెద్దికి, పెద్ద మనుషులకి, తోటొల్లకి పెద్ద పెద్ద బొట్లు పెట్టారు. గుడ్చుట్టూ జాతర వాసన గుమ్ముని వస్తాండాది. గెంగమ్మ వాసన వూరి సుట్టూత మంచుపొగలాగ సుట్టుకున్నాది. వూరి జెనం వాసన కోసం ముక్కులతో గట్టిగా గాలి పీల్చుకున్నారు. మొనుసంతా యేదో తెలియని ఆనందంతో పన్నీరు పోసినట్టు నిమ్మలమైనాది. అబ్బుడు ‘జెజ్జనకనక..జెజ్జ జెజ్జనకనక..జెన్జెజ్జ జనకనక’ అని. గుమికూడిన జెనం పెదాలపైన ముళ్ళపూలు విరుచుకున్నట్టు సన్నని నవ్వు, యలుతురు పురుగు కాంతిని చిమ్మినట్టు కళ్ళల్లో కొత్త యలుతురు కనిపిస్తున్నాయి. ‘గెంగాలమ్మ పండగ మొదులైనాదిరోయ్. యింక రచ్చ రచ్చే’ అని యీడుపిళ్ళలంతా పలకల ముందు యీలలు, కేకలతో చెవులు జుమ్మనిపించారు. వూరిడిసెల్లిన వాళ్ళు నెత్తిలోకపిల్ల, సంకలోకపిల్ల, యీపులోకపిల్లలతో వొక్కొక్కరిగా గెసబుసతో వస్తాండారు.

పలకల మొదటి చుట్టు యచ్చరిక కోసం, రెండో చుట్టు పొంగలి సట్టి యార్పాట్లు కోసం, మూడో సుట్టులో పొంగలి సట్లు ఎత్తుకొని రంగులు రంగులుగా ఆడోల్లు వస్తావుండారు. యనకాలే చీమలు మాదిరిగా మొగోళ్ళు కూడా. వూరి జనానంతా వొకేసారిగా చూస్తుంటే కళ్ళల్లో ఆనందం పొంగలి కన్నా ముందే పొంగిపోతుండాది భాస్కరుడికి. అందరూ చెరుకుతోట గెనాల మీంద నడుచుకుంటూ పైవూరు గెవుని కాడ నిలిచారు. కమ్మ నాయుడ్లుండే వూరు దాటుకొని అంకాలమ్మ గుడి దగ్గర పొంగళ్ళు పెట్టాలి. కాళ్ళకుండే చెప్పులను చేతుల్లోకి తీసుకున్నారు కొందరు. బొరువయ్యి చెరుకు తోటలోనే చెప్పుల్ని దాచారు యింకొందరు. భాస్కరుడు మాత్రం చెప్పులిప్పడం యిష్టం లేక యాపాకులు, తెల్లపంచె, అమ్మోరు కత్తి తీసుకుని బండ్లో పుత్తూరు మీదగా గుడికి వొచ్చాడు. వానితోపాటే జతకాపైన పినిపెద్ది బామర్ది, గిడ్డకిందోళ్ళ మనవుడు రవిగాడు కూడా పోయాడు. పిలకాయిలు పొంగళ్ళు పెట్టడానికి యిటుక రాళ్ళు యేరిచ్చేసి వందేండ్లు దాటిన మర్రిచెట్టు వూడలతో వుయ్యాలూగుతున్నారు.

మాటల మధ్యలో అరగంట్లోనే మనుసులో ఆనందం పొంగిన మాదిరిగానే పొంగళ్ళు కూడా పొంగినాది. అంకాలమ్మ ముందర యాపాకులు పరిచి దానిపైన పంచె పరిచాడు గంగడు. వూరోల్ల దగ్గిర పొంగళ్ళను సట్లోనుంచి వొక్కో గెరిట పంచె పైన వేస్తున్నాడు భాస్కరుడు. ‘నాది తీస్కో..నాది తీస్కో’ అని యగబడుతున్నారు జనం. గంగడు టెంకాయ కర్పూరం కొట్టాడు. యనకాలే అందరు ‘టపా..టపా..టపా’ కొట్టారు. ప్రతి యేడు క్రమం తప్పకుండా నరికే పూంగోడి వాల్ల నల్లయాటను వొకే యేట్లో యేసాడు గంగడు. గరీమని తెగిపడినాది మేకపోతు తల. అంకాలమ్మను తన సెల్లి గంగమ్మ పెళ్లికి రావాలని దండాలు పెట్టుకున్నారు జెనం. పంచలో పొంగలిని మూట గట్టుకొని అన్నగంపలో పెట్టి గెనాల మీద నడుచుకుంటూ గెంగాలమ్మ గుడి దగ్గర పెట్టాడు గంగడు.

యాట తలను, కత్తిని తీస్కొని మళ్ళా బండెక్కి కొంపకు చేరినారు భాస్కరుడు, రవిగాడు. జెనమంతా చెరుకు తోట కాడ చెప్పులేసుకుని గుడి కాడకి వొచ్చేసరికే సొట్టోడి రేడియో పాటలు ఆరంభమైనాయి. పినిపెద్ది, పెద్దలు గెంగాలమ్మకు టెంకాయ కొట్టి మొక్కుకున్నారు. అంకాలమ్మ కూడా చెల్లి పెళ్లికి మూడు దినాలు ముందే వచ్చేసినాదని కుశాలుగా ఉన్నారు. మొత్తం పొంగలిని అయిదు భాగాలు చేసి వూరి పనోల్లైన వన్నారోళ్ళకి, తోటోల్లకి, సలవాదోళ్ళకి, గిడ్డకిందోళ్ళకి, కంబుకుటోళ్ళకి పంచారు. గంగడు నెత్తి నిండుగా పసుపు కుంకుమాల బండారుతో కొంపకొచ్చినాడు. వచ్చీరాగానే కదిరేలుతో కల్సి నడిరేయి సాటింపుకి దీపిటీలు చుట్టే పనిలో పడినారు. సూరీడు గూట్లో పడినబ్బుడు పెద్ద మనుషులు సాటు సామాన్లు కోసం నాన్నరం పోయి చీకటి పడినాక వొచ్చారు. చీకటి మరింత నల్లదైనాది. పినిపెద్ది వాళ్ళు మనుషులొచ్చి “మొట్టన్నా! సాటు సామాన్ల కోసం రమ్మన్నారు” అన్నారు. 

“అట్టాగే సామీ! రేయ్ కదిరేలు, టువాలు తీస్కొని పోరా! గంగా..దీపిటీలు పక్కన పెట్టుకోరా! భాస్కరా..బండారు పెట్టిలో యాపాకులు పెట్టుకోరా!” అని ఆరుపదుల అనుభవంతో బలే హుషారుగా చెప్పాడు. గంగడు బండారు పెట్టి ఎత్తుకున్నాడు. భాస్కరుడు, రవిగాడు గంగణ్ని రెండు పక్కలా పట్టుకున్నారు. ఇంట్లో ఆడోల్లు పసుపు నీళ్ళు చల్లారు. దిగ గెవునికాడ బండారు పెట్టిని పెట్టేసి సాటు పొంగలి సట్టి కోసం కాసుకోనుండారు. “రేయ్ కదిరేలూ..వొచ్చావా?” పినిపెద్ది. 

“వొచ్చాను సామీ!”

“హా..పోయి సలవాదింట్లో సాటు సామాన్లు తీస్కో”.

“అట్టాగే సామీ! ఉత్తరువు సామీ” అని వొంగి వొంగి వచ్చాడు కదిరేలు. టువాలు చాచి పసుపు, కుంకుమ, సెంటు, కస్తూరి, గాజులు, పూలు, నిమ్మపండ్లు, తెల్లదారం చుట్ట, టెంకాయ, కర్పూరం తీస్కున్నాడు. రేయి పదకొండు దాటింది. “అన్నా! నడిరేయి అవుతుండాది. సాటు పొంగలి సట్టి ఎత్తుదామా?” అన్నాడు పినిపెద్ది తమ్ముడు తోటి కుప్పడు.

“కుప్పడా! సాటు పొంగలి సట్టి ఎత్తటమంటే అంత సులువనుకున్నావా యాందీ? యంత యాలైనా గెవులి సప్పుడు రూపంలో గెంగాలమ్మ ఉత్తరువు యియ్యాల. సాటు సట్టిలోని నీళ్ళు అలమకుండా, తేమకుండా, కదలకుండా వొక్క బొట్టు కూడా కింద పడకుండా ఎగవీధి నుండి దిగీధి దాటుకొని దిగ గెవునికి పోవల్లా. వోపిక పట్టురా! తమాషనుకుంటున్నావా యాందీ?” అన్నాడు పినిపెద్ది. 

నోటి నిండుగా ఆవలింతలతో కాళ్ళు తిమ్మిరెక్కేలా నిలబడున్నారు తోటోల్లు, వన్నారోళ్ళు. చీకటి యింకా నలుపెక్కింది. యబ్బుడెబ్బుడు బల్లి అరవపోతుందా అని నోర్లు తెర్చుకుని గోడలనే చూస్తున్నారు. బల్లింకా సప్పుడు జెయ్యలేదు. చీకటి కాటికైనాది. ఉన్నటుండి పూజగదిలో “తుచ్…తుచ్…తుచ్” గెవులి సప్పుడు జేసింది. అందరి ముకాలు చీకట్లో బుడ్డిదీపం మాదిర్తో యలిగిపోయినాయి. పూజగదిలో సాటు పొంగలి సట్టికి మల్లెపూలు చుట్టివుండాది. సట్టి నిండుగా నీళ్ళు తేటగాండాయి. టెంకాయ కర్పూరం కొట్టి మొక్కుకున్నారు అందరు. పినిపెద్దికి తెల్ల టువాలు నోరుకి అడ్డంగా కట్టారు.

మెడకి మూర మల్లెపూలు చుట్టారు. కాళ్ళు చేతులు వొనకతాండాయి. కింది కడుపులో పేగుల్ని చేతులు దేముతుండాయి. చలి జొరం వొచ్చిన్నట్టుగా వుండాది. పినిపెద్దికి గిడ్డకిందోళ్ళ కొడుకు రాజేంద్రుడు, కుప్పడు ధైరిం చెప్పి తలా వొక పక్క పట్టుకున్నారు. పినిపెద్ది సాటు పొంగలి సట్టిని సందమామను చేతుల్లోకి తీసుకున్నట్టు నిండుగా తీసుకున్నాడు. సాటు పొంగలిని ఎత్తుకొని నడిచేవాళ్ళని చూస్తుంటే కరువు కాటక రాచ్చెసులను తొక్కుకుంటూ వొక్కొక్క అడుగు ముందుకు పడుతున్నట్టు అవుపడుతుండారు వూరోల్లకి. వాల్ల యనకాల యింకో అయిదు పది మంది పెద్ద మనుషులు వస్తున్నారు.

తోటి సీరాలుగోడు “పొంగలి…పొంగలి…సాటు పొంగలి వస్తుండాది. ఎవరూ ఎదురుపడమాకండమ్మా…” అని దోవ పొడుక్కి అరుచుకుంటా పోతుండాడు. వీధిలో రెండు వైపులా నిలబడి చూసేటోల్లంత రెండు చేతులెత్తి దండాలు పెట్టుకుంటున్నారు. చంప దెబ్బలు యేసుకుంటున్నారు. సాటు పొంగలి సట్టి భద్రంగా దిగువ గెవునికి చేరినాది. రవిగాడు సాటు సట్టిని పురుడు బిడ్డని తీసుకున్నట్టు జాగిర్తగా తీసుకున్నాడు. పినిపెద్దికి కుప్పడు నీళ్ళిచ్చి పక్కన కూకోబెట్టాడు. కదిరేలు, రవి, భాస్కరుడు నాలుగు యిటుక రాళ్ళు కడిగి మూడు వొక పక్క దానికెదురుగా వొక యిటుక పెట్టి పసుపు కుంకుమలతో సింగారిస్తున్నారు.

తోటోల్లు దానికి కొంచం యడంగా వూరి గెంగరాయికి యదురుగా మూడు యిటుకలతో  పొయ్యి కట్టారు. కట్టెలు జవురుకొని కర్పూరంతో గెంగాలమ్మను మొక్కొని ముట్టించారు. పొయ్యిలో గుప్‌మని నిప్పులు బుసకొట్టినాది. యడంగా కూకున్న పినిపెద్ది లేచి “సాటు పొంగలి పొంగే వొరకు ఎవరూ మాట్లాడకూడదు. నోర్లకి బీగాలెయ్యండి. రేయ్ కుప్పా! పొయ్యిలో కట్టెలు పెట్టు. శీరాల పోయి పలకల త్యా. బుడ్డోడా! దీపిటీలకు కిరసనాయిలు తెచ్చుకో” అని నలభై యేళ్ళుగా జాతర జేసిన అనుభగం పెద్దరికంతో ముందుగానే యచ్చరికగా చెప్పాడు. అనుబగమున్న రాజేంద్రుడు, మొట్టన్న అమ్మోరి అలంకారానికి సూచనలిస్తున్నారు. కోడితలకాయోడు యాడ్నుండి వచ్చాడో తెల్లేదు గానీ, నేరానికి సరిగ్గా వొచ్చి గెవునిలో దిగాడు. కొందరు వాన్ని చూసి భయపడితే యింకొందరు పకపకా నవ్వుకుంటున్నారు. తాగిన కైపులో వూగతా వూగతా వచ్చీరాగానే “రేయ్ గూదోడా! బలికుట్టి నువ్వే కొయ్యాలా? నేనూ అదే వొంశంలోనే పుట్యా” అన్నాడు.

“అవున్రా! నీ శీసి ఎముకులు కలిపి సరిగ్గా యాభై కిలోలుండవు. నువ్ కోస్తావా? అయినా నువ్వు కిరుస్తోడివి కదా! నువెట్ట కోస్తావు?” అన్నారు.

“రేయ్! తూ..ఆపురా యింక. గెంగాలమ్మ మాయమ్మరా! మాయమ్మకి నేను సెయ్యకపోతే యట్టాగ? ఈతూరి నేను కోస్తా అంతే! ఏమియా పినిపెద్ది?” అన్నాడు రొమ్మిరిసి కల్లెగరేస్తూ.

“సరేరా సామీ! నువ్ యట్ట సెప్తే అట్టనే. జగడాలు పెట్టకురా. సాటు నిశ్చయం లాంటిదబ్బా! ఇబ్బుడు అర్సుకుంటే జాతర్లో కూడా జగడాలు అవుతాది. నీకు దణ్ణం పెడతా సామీ” అని చేతులెత్తి మొక్కాడు.

“అడిగేవాడే ఈ కాలానికి కావాలి” అని మనసులో ముసిముసిగా నవ్వుతున్నారు భాస్కరుడు, రవిగాడు.

సొట్టలు లేని పసుపు కొమ్ముల్ని తెల్లదారంతో అమ్మోరికి కాపు కంకణాలు కడుతున్నారు. నిమ్మపండ్లు కోసుకున్నారు. బండారు పెట్టిని అమ్మోరు మధ్యలో పెట్టాడు రవిగాడు. దానిలో యాపాకులు, దానిపైన విస్తరాకులు పరిచాడు భాస్కరుడు. సాటు పొంగలి సట్టి అగ్గిపర్వతంలాగ పొంగి పొయ్యిలో పోసుకున్నాది. చుట్టూన్నవాళ్ళు ‘వెట్.. కిల్లాలల్లాల…ల్ల…కిల్లాలల్లాల…ల్ల…’ అని కిలారించినారు. రవిగాడు అమ్మోరుపైన సెంటు చల్లి, పొంగలి విస్తరాకులో వేసాడు. “ఇటు సూడండియా! పలకలు కణకణకణకణ మోగాలి. డప్పులకు అమ్మోరు రావాలి” అన్నాడు కోడి తలకాయోడు. పలకల డప్పులు మొదులైనాయి. ‘జెన్ జెజ్జజనకనక…జెన్జెజ్జజనకనక…జెన్జెజ్జజనకనక…జెజ్జజెజ్జనక నక…జెజ్జజెజ్జ నకనక…జెన్జెజ్జజనకనక…’ అని డప్పులు ఆగకుండా మోగుతూనే వున్నాయి.

ఎముకలగూడు శరీరంతో డింగు డింగుమని నోట్లో సొంగ కారడం తెలీకుండా ఆడుతున్నాడు కొడితలకాయోడు. ఈలలు కేకలతో యువకులు.  పినిపెద్దికి వొనుకులు మొదులైనాయి. మొఖం కల తప్పినాది. దీపకొల్చంలో కర్పూరం ముట్టించాడు కదిరేలు. రాజేంద్రుడు నల్లకోడి తలకాయని చేత్తోనే పీకి ముండంలోంచి చిమ్ముతున్న రత్తాన్ని అమ్మోరికి మూడు సూర్లు చుట్టారు. పినిపెద్దికి ఆరతి యిచ్చేబ్బుడే అమ్మోరు పూనింది. నాలుక బయటొచ్చేసి బ్యార్‌మని అరుస్తా గాల్లో ఎగిరినాడు. రవిగాడు, భాస్కరుడు నోట్లోకి నిమ్మపండ్లు గుక్కి కిందకు లాగి, మంచి నీళ్లిచ్చి కూకోబెట్టారు. సూస్తుండగానే కదిరేలుకి కాళ్ళు చేతులు వొనుకుతున్నాయి. తర్వాత గంగడికి, కుప్పడికి, రాజేంద్రుడికి, మురగయ్యకి వొర్సగా వణుకులొచ్చాయి.

ఒక్కొక్కరు ఆరతి యిచ్చేబ్బుడంతా అమ్మోరు పూని నాలుక బయటొచ్చి గాల్లో ఎగురుతుంటే, అందర్నీ కిందకి లాగి నిమ్మపండ్లేసి కూకోబెట్టడమే పనైనాది రవి, భాస్కరుడికి. అందరిదీ ఆరతిచ్చే వంతు అయినాది. యింక గంగడు బండారు పెట్టిలోని సాటు పొంగలిని గెంగాలమ్మ గుడి కాడికి తీస్కొని పోవాలి. ఇదే యిబ్బుడు పెద్ద పని. గంగడు కాళ్ళు చేతులు వొనకతా బండారు పెట్టిని చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మోరు పూనింది. రవి, భాస్కరుడు రెండు పక్కలా పట్టుకున్నారు. ఆకాశం నేరుగా కనిపీకుండా గుడ్డను ముగ్గురి తలపైన పట్టుకున్నారు యింకో యిద్దరు. పలకలు ముందుకు నడుస్తున్నాయి. యనకాల సాటు పొంగలి. వారి యనకాల పెద్ద మనుషులు, యువకులు. అక్కడక్కడ గంగడు గాల్లో ఎగురుతున్నాడు.

అయినా మనిషిని గట్టిగా పట్టుకుని తీసుకెళుతున్నారు. రొవ్వ దూరం పోగానే కదిరేలుకి అమ్మోరు పూనింది. కదిరేలుని రాజేంద్రుడు పట్టుకుని నిమ్మపండ్లు యాస్తా గుడి దగ్గిర  వరకు తెస్తున్నారు. వీది ముట్టు సందులో గంగడు భార్య రాణి, కదిరేలు భార్య కుప్పమ్మ, ముగ్గురు ఆడబిడ్డలు యేడుస్తూ నిలబడినారు. బండారు పెట్టిను లాగి గుడిలోపల పెట్టాడు మొట్టన్న. ‘హమ్మయ్యా! పనైపోయిందని’ వూపిరి పీల్చుకున్నారు. పెద్ద మనుషులు యాపాకుల తోరణాలు కడుతున్నారు. గంగడు, కోడి తలకాయోడు, గూదోడు, రవిగాడు వూరి హద్దులు సుట్టూన్న గెంగ రాళ్ళకు బొట్లు పెట్టి, కాపు కంకణాలు కట్టేకి దీపిటి కిరసనాయిలుతో పయనమయ్యారు. బుర్రమీసాల నాగడు గుండాయిలో బెల్లం పండ్ల పానకం కలుపుతున్నాడు.

కాపు కంకణాలను, తోరణాలను మొదుటిగా అమ్మోరు గెంగ రాయికి, తర్వాత స్తంభాలకి, యాపసెట్టుకి కట్టారు కదిరేలు, భాస్కరుడు. పోయినోళ్ళు వస్తే సాటింపు వెయ్యాలని కన్నుల్లో వొత్తులేసుకుని కాస్కొని వుండారందరు. తప్పిపూడ్సిన గొర్రెలు మందనెతుక్కొని వొక్కోటిగా వొచ్చినట్టు వొకరెనకాల వొకరు వస్తాండారు. వాళ్ళని జూసి గట్టిగా వూపిరి పీల్సుకుని వొదిలారు. అందరు లోటాయిలో పానకం తాగారు. రాజేంద్రుడు మాత్రం ముట్టుకోలేదు. “రేయ్! రాజేంద్రుడిని పిలవండిరా. సాటింపు వెయ్యాలి” అన్నాడు పినిపెద్ది.

“మావో! యీడ్నే వుండాను. నాకు చేరాల్సింది నాకిస్తే నా పని నేను చేస్తాను” అని ముదిగారంగా మొండికేసాడు.

“ఏమి చేరాలిరా నీకు?”

“యాంది మావా తెలినట్టు అడగతుండావు?” అని చేతులు కొట్టి “సారాయి మావా” అని తల వంచుకుని నవ్వాడు.

“నీ పాసుగాల! దానికి మొండికేస్తున్నావ్‌రా…”  అని నవ్వాడు పినిపెద్ది. అందరు ముసిముసిగా నవ్వుకున్నారు. 

లోటాయి సారాయిని లొటుక్కున వొకే గుక్కులో గుటగుటా తాగాడు రాజేంద్రుడు. 

“రేయ్! సొక్కాయి, లుంగి యిప్పేసి గోసి కట్టురా” అన్నాడు పినిపెద్ది.

తండ్రి సొక్కాయిప్పడం నచ్చక కొడుకు రవి ‘యీల్లు మారరు’ అన్నట్టు మొరస్తా తల బాదుకున్నాడు. గెంగాలమ్మ యదురుగా తోటి పలకని భుజానికేసున్నాడు రాజేంద్రుడు. ఎడమ కాలిని పైకి లేపాడు. కుడికాళ్ళు నేల మీద బెట్టి వొంటికాళ్ళతో బొంగరం తిరిగినట్టు గిరగిరా మూడు సూర్లు తిరిగి అమ్మోరుకి యదురుగా ధ్వజస్తంభం మాదిరి నిటారుగా నిలబడినాడు. కుడికాళ్ళ కిందున్న మట్టిదీసుకుని బొట్టు పెట్టుకున్నాడు.

‘ఆహ్! శభాష్ రా! నీలో మీ నాయన సుబ్బడు కనిపిస్తున్నాడు’ అని మెచ్చుకోలుగా అనుకున్నారందరూ. యువకులు గర్వం నిండిన కళ్ళతో రాజేంద్రుడు వీరాన్ని చూసి యీలలు, కేకలతో కేరింతలు కొట్టారు. రాజేంద్రుడికి కుడిపక్క కదిరేలు దీపిటితో, యడం పక్క గూదోడు ‘వూ…’ కొట్టేకి నిలబడినారు. అబ్బుడేసినాడు సాటుదరువు ‘జెన్.. జెడ్జన్..జెన్…జెడ్జన్..జెన్…జెడ్జన్…జెన్’.

“వాయు…వాయు నగర వాయు

నల్లాత్తూరు వాయు నాన్నార వాయు 

ఇళ్లతూరు వాయు నల్లత్తూరు వాయు

పేరైనా పేరే బీరపాలెం వాయువు    “ఆహ్..”

 

చిన్ని పిండి సిప్పలో చిన్ని దీపం

పెద్ద పిండి సిప్పలో పెద్ద దీపం పెట్టి

మేక తలకు కొండేసి

తంగేడు పూల పసుపు పూసి       “ఆహ్..”

 

వచ్చే మంగళారం 

అమ్మకు

పిడికెడు కుడుములు పట్టి

మునగాకు తాలింపేసి

మన గేమ దేవతైన 

గెంగాలమ్మకు పెళ్లమ్మో…” అని పరసాటాడు. గుడిని తిరిగి సూడకుండా యీదులెంబడి సాటింపు యేసుకుంటా పోయారు. వూర్లోని యీదులన్నీ సాటింపు యేస్కొని వొచ్చారు. మొక్కుబడితో కత్తి గుచ్చేవాళ్ళు, కొక్కి గుచ్చుకుని ఆటోలకి, టాకుటరుకు యాలాడేవాళ్ళు కంకణాలు కట్టుకున్నారు.

“అయ్యా! సాటింపు అయిపోయింది. యింక వూరొదిలి యవురూ పోడానికి లేదు. అంటు ముట్టు కాకుండా సుబ్బరంగా వుండాల” అన్నాడు పినిపెద్ది.

“అవునబ్బా… అందరు నిష్టంగుండాలి” అన్నాడు రెండో పినిపెద్ది నాగడు.

***

ఆదేరం సొట్టోడు వేసిన రేడియో సోమారం గూడా యిరామం లేకుండా పాడతానే వుండాది. దేముడు పాటలు, గానా పాటలకి వెత్యాసం లేకుండా తాగిన కైపులో వూగాతానే వున్నారు జెనం. తోటోల్లు గుడిసిల్లు కట్టేకి నొచ్చిలి మండల కోసరం నగిరి ముక్కు కొండకు యలబారినారు. ఊర్లోని ప్రతి యింటికి పదిమందికి తగ్గకుండా చుట్టాలొస్తున్నారు. ఊరే  జాతర కళతో కళకల్లాడుతుండాది.

మంగళారం పెట్టినాది. గెంగాలమ్మ పసుపు, మల్లి పూల సువాసన వూరంతా గుమగుమలాడుతుండాది. యదురింటోల్లు యదురింటోల్లు కల్సి యాపాకు తోరణాలు కట్టుకుంటుంటున్నారు. తోరణాల్లో మామిడికాయలు, రామసీతాఫలాలు, తంగేడుపూలు కూడా జిగేలు జిగేలుమనివున్నాయి. ఊరంతా యాపాకు తోరణాల గొడుగు కింద వుండాది. యీదులంతా ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గు పిండితో రంగురంగుల ముగ్గులున్నాయి. ఊరే ముత్యాలపందిరయినాది. నడెండయినాది గెంగాలమ్మ గుడికాడ తోటి పలకలతోపాటుగా పంబ, ఉడక, జమికిడి శబ్దాలు యినిపిస్తుండాయి. మొదుటి సుట్టు అంబిలి పోయడానికి యచ్చరిక కోసం. రెండో సుట్టు అంబిలి సిద్ధపర్చడం కోసం. మూడో సుట్టులో దున్నపోతుకి నాలుగు మూరల పసుపు గుడ్డను పైన కప్పి పూజలు చేసి గెంగమ్మగా మొక్కాలి. మళ్ళా పినిపెద్దికి ఆరతి యిచ్చేబ్బుడు అమ్మోరు పూనింది. నాలుక బయటకొచ్చింది. గాల్లో ఎగిరినాడు. రవిగాడు భాస్కరుడు వాల్ల పని జేశారు.

ప్రతి యిల్లు దున్నపోతుపైన యాపాకులు కలిపిన పసుపు నీళ్ళు పోసి, టెంకాయలు కొట్టి ఆరతిచ్చి మొక్కుకుంటున్నారు. దున్నపోతును పట్టుకున్న పడుచు పిల్లలు నీళ్లన్నీ వాళ్ల పైనే పోస్కుకుంటున్నారు. దున్నపోతు ముందుకు కదలకపోతే యనకాల వొటకాయిలును ద్రాచ్చిపండును పిసికినట్టు పిసుకుతున్నారు. నలిపే నొప్పికి తట్టుకోలేక ముందరకి గీంకరించి పరిగిత్తాంది దున్న.

రవిగాడు, భాస్కరుడు మాత్రం వంశపారంపర్యమైన పూజ పనులు చేసుకుంటున్నారు. అంబిలి ఎత్తేవాళ్ళంత యాపాకు తోరణాలను బట్టలుగా చుట్టుకుని, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, చన్నీల్లు తలపైన పోసుకుని, మెడకు మల్లెపూల మాలేసుకుని యనకాల నడుస్తున్నారు. గుడి దగ్గర అంబిలి పోశారు. టెంకాయ కర్పూరం కొట్టి మొక్కాడు పినిపెద్ది. పెద్ద మనుషులు వొరసగా ఆరతిచ్చారు. గుడి యనకాలుండే ముత్తేది పైన అమ్మోరు పూని అంబిలి తాగి “బాలా! నేను తృప్తిగా వుండినా” అని సెలవిచ్చినాది.

నడిరేయబ్బుడు గాలి గెంగమ్మ ఎత్తాలి. ఆ మట్టితో పిడశల గెంగమ్మను జెయ్యాలి. ఇదే జాతరలో ముఖ్యమైన పని. కదిరేలు జాతర సామాన్లు కోసం పినిపెద్ది యింటికి పోయినాడు. తోటోల్లు, పంబలోల్లు దరువులేసినారు. గంగడు గోసి కట్టాడు. కాళ్ళు చేతులు వొనకతుండాది. రవిగాడు, భాస్కరుడు నిమ్మపండ్లతో రెండు పక్కలా నిలబడినారు. గంగడు బండారు పెట్టెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అమ్మోరు పూనింది. రాజేంద్రుడు యాపాకులతో పసుపు నీళ్ళు చల్లి దారిమ్మన్నాడు. పలకలు ముందు నడుస్తున్నాయి. పినిపెద్ది నిమ్మపండు గుచ్చిన అమ్మోరు కత్తిని తీస్కొని యనక నడుస్తున్నాడు. దాని యనక గంగడు బండారు పెట్టెను ఎత్తుకుని నడుస్తున్నాడు. ఆకాశం కనిపీకుండా ముగ్గురి తలపైన యిద్దరు టువాలు కప్పారు. వీదుల్లో యీగలు దోమలు కూడా అడ్డుపడలేదు. గంగడు ‘బ్యార్…’ అని అరుస్తా నాలుక బయటకు పెట్టి గాల్లో ఎగిరాడు.

రవిగాడు నిమ్మపండు నోట్లో గుక్కి వొడుపుగా రసం పిండి కిందకు లాగుతుంటే, భాస్కరుడు బండారు పెట్టను గట్టిగా పట్టుకుంటున్నాడు. కొలనులో బంకమట్టి గోపురానికి మల్లెపూలు వేసి, తలపైన యాపాకులు గుచ్చి, పసుపు కుంకుమలు, కస్తూరి చల్లి, గాజులు తొడిగి  ఆరతిచ్చాడు కదిరేలు. రాజేంద్రుడు నల్లకోడిని కోసి రత్తాన్ని దిష్టి దీశాడు. గాలి గెంగమ్మని పదిమంది కల్సి బండారు పెట్టెలో పెట్టారు. గంగడు మళ్ళా బండారు పెట్టెను ఎత్తుకున్నాడు. గంగడు, కదిరేలుకి అమ్మోరు పూనింది. గెవనం తప్పినారు. గాల్లో ఎగిరారు. కిందకి లాగి ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు రవిగాడు, భాస్కరుడు. వాల్ల పరిస్థితి చూసి రాణి, కుప్పమ్మల, బిడ్డల కళ్ళు వెంట కాలువలు పారుతుండాయి.

తరతరాలుగా రాజేంద్రుడు యింటి నుంచి రావాల్సిన పసుపు కుంకుమలు, తాళి బొట్లు, నగలు, పూలను మేళతాళాలతో తెచ్చాడు. గాలి గెంగమ్మతో పిడశల గెంగమ్మను చేసారు. కొద్దిసేపు ముసుగేశారు. పెద్ద మనుషులు అందరొచ్చాక ముసుగుదీసి యింద్రధనుస్సు గుడ్డలతో దిష్టి తీశాడు మొట్టన్న. ఆగిన పలకలు, పంబలు మళ్ళా మోగాయి. గెంగాలమ్మ కాళ్ళ కింద పడి మొక్కుకున్నారు పెద్ద మనుషులు. ఎద్దుల బండ్లో పెట్టేకి గంగడు తలపైన అమ్మోరుని ఎత్తిపెట్టారు. అమ్మోరు పూనింది. భాస్కరుడు రత్తం కూడుని అమ్మోరు మొఖం పైన చల్లాడు. కదిరేలు టువాలు పరిచి దానిపైన అన్నం, కుడుములు, పెద్ద కైసు ముక్కలు, మునగాకు తాలింపు, పిండి దీపాలతో మొదుటి యదురు కుంభం యేసాడు.

రాజేంద్రుడు కోడిని కోసి బలిచ్చాడు. వూరేగింపుకు అమ్మోరు ఎద్దుల బండికెక్కినాది. పూజల కోసం రవి, మానిక్కుడు అమ్మోరితో వున్నారు. తమిళనాడు కాటుపాడి, వాలాజ నుంచొచ్చిన కరగ్గాటం వాళ్ళు గంగ గెరిగను తలపైన పెట్టుకుని వర్షాలు పడాలని, వూరు సల్లగుండాలని అమ్మోరు ఎదురుగా చిందులేస్తున్నారు. యువకులంతా కళ్ళార్పకుండా చూస్తున్నారు. యీలలు  కేకలతో వారితో కల్సి చిందులెయ్యాలని ఆరాటపడుతున్నారు. కొన్ని మురికిచూపు యీట్లు వాల్ల దేహాలను గుచ్చుకుంటునే వున్నాయి. అయినా వూరోల్ల ఉల్లాసం కోసం ఆడుతున్నారు ఆటగాళ్లు. పాడుతున్నారు పాటగాళ్ళు.

బుదారం దుడ్లు తీసుకునేవొరకు యీట్ల తూటాలు ఆగవు. పొట్టకూటి కోసం వాళ్లకీ గుండెకోతలు తప్పవు. టపాసులు ‘టపా…టపా..టపా..’ అని అరగంట ఆగకుండా ఆకాశంలో పేలుతున్నాది. ఊరి సుట్టున్న పల్లెల చూపంతా ఆకాశం వైపే. టపాసులు ఆకాశంలో రంగురంగుల పాలపుంత అయినాది. అమ్మోరు నేరుగా మెట్టినిళ్లైన తోటోల్ల యింటి కాడికి పోయి ఆరతి, యదురు కుంభం తీసుకుంది. కదిరేలు టువాలును తలగుడ్డ కట్టి యాటను వొకే యేట్లో తలముండాలను వేరు చేసి వూరి జెనాల చేత మొగోడు అనిపించుకుంటున్నాడు.

ఊర్లోని ప్రతి గడప సామర్ధ్యం బట్టి వొక యాటనో, కోడ్నో, దున్నపోతునో బలిచ్చి అమ్మోరు దాహం తీర్చుతున్నారు. బలిచ్చిన ప్రతి సూరి పాపం చేతులకి అంటకుండా యాపాకుతో నీరు బట్టించి ‘ఖలో జగాలేసి’ కడిగేసుకుంటున్నారు. గెంగాలమ్మ వూరేగుతుంటే తన యింటి బిడ్డ పెళ్ళై కోలమొచ్చినట్టే వుండాది వూర్లోవాళ్ళకి. చానామంది అవ్వాతాతలకు కళ్ళెంబడి నీళ్ళు కమ్ముతున్నాయి. ప్రభ తగిలి యీదులు ఆనుకొని వున్న యాప, కానుగ, తంగేడు పసుపుపూలతో వొక్కొక్కసూరి వొక్కో యీదిలో పుష్పాభిషేకాలు సహజంగానే జరుగుతుండాది అమ్మోరికి. పూలు ఆకాశం నుండి నచ్చత్రాలు రాలినట్టు అగుపడుతుండాది. 

***

బుదారం పొద్దు మొల్సినాది. గెంగాలమ్మ గుడిసెలోకి పోయే యాలైంది. యేకువ జామబ్బుడు గెంగాలమ్మ పురుడు సూరీడు యలుతురులో పున్నమి సంద్రుడులాగ జున్నుపాల వొర్ణంలో పసపసాని యలిగిపోతున్నాది. తూర్పు దిక్కుకు అమ్మోరు ముఖాన్ని తిప్పి, గుమికూడిన జెనం మద్దిలో యీలలు, కేకలు, చప్పట్ల నడుమ మూడు సూర్లు ముందుకి యనక్కి వుయ్యాలూపితే గుడిసిలోకెళ్ళినాది గెంగాలమ్మ. తోటోల్లు, వూరోల్లు నడీదిలో రెండు గుంతలు తవ్వడం మొదులుపెట్టినారు. ఒగిటి బద్ది గొర్రె రత్తానికి, యింకోటి దున్నపోతు రత్తానికి. కదిరేలు, రవిగాడు, భాస్కరుడు గుడిసెను చీరలతో చుట్టే పనిలో పడినారు. పంబలోల్లు జమికిడి, పంబ వాయిస్తూ గుడిసె సుట్టూ చేతులూపి వూపి బూతు పెండ్లిపాటందుకున్నారు. పినిపెద్ది యింటి నుండి అన్నగంపలో నగర కుంభం వొచ్చినాది.

నొచ్చిలి మండల గుడిసింటికి యాలాడ గట్టిన యాపాకుల తోరణాలు. పచ్చ పసుపుపైన యర్రటి కుంకుమలు. జిగుజిగుమని జిమికే చెంకీలతో వొంటి నిండుగా వేయి వెండికళ్ళు, శిరస్సుపైన వెండి గొడుగులు, చేతుల్లో వెండి కోరలు, శూలాలు, వెండి పాదాలతో నిగనిగలాడే పిడసల గెంగమ్మ. యదురుంగా మూడు విస్తరాకుల నగర కుంభం కూడు. కూడుపైన గుమగుమలాడే తుంటి కాళ్ళ కూర. సెనిగా గింజల మునగాకు వేయింపుడు. తొమ్మిది పిడికెల కుడుములు. ఏడు పిండిదీపాలు జోతుల యలుగులో యలిగిపోతున్న మట్టి గెంగాలమ్మ దివ్య సొరూపం.

పెద్ద సానుగ కుండలో పేడ. పేడపైన దీపం. ఆ అఖండల జోతి అమ్మోరు గుడిసెలో వున్నంత వొరకూ దివ్యజోతిగా యలుగుతుంటాది. అదిగో ‘జెన్..జెజ్జజనకనక…జెన్జెజ్జజనకనక…జెన్జెజ్జజనకనక…జెజ్జజెజ్జనకనక…జెజ్జజెజ్జనకనక…జెన్జెజ్జజనకనక…’ అని యినిపిస్తాండాదా తోటి తోలు పలకల డప్పు దరువులు. మద్ధిమద్దిలో జమికిడి టింగు టింగుమని, పంబ టముకు…టముకుమని కలగలిసిన సప్పుడ్లు. డప్పు దరువులు పంబ వాయిద్యాలు జోడేసుకుని జనాలని జమాయిస్తా వుండాది. పినిపెద్ది సొక్కా యిప్పాడు. గోసి కట్టాడు. కదిరేలు పినిపెద్ది చాతుల పైన, నెత్తిలో పొడుగాటి బొట్లు పెట్టాడు.

బలిచ్చేది అమ్మోరికి కనిపిచ్చేట్లు మొట్టన్న గుడిసెకి చుట్టున్న చీరని కొంచం పైకి లేపాడు. పినిపెద్ది పొడుగాటి అమ్మోరు కత్తిని తీసుకున్నాడు. ‘కిలల్లలల…కిలాలల్లల…’ అని కిలారింతలతో జెనం కిక్కిరిసిపోయినాది. కత్తిని పైకి లేపాడు. ఊపిరి తీసుకున్నాడు. ఒకే యేటు బద్ది గొర్రె తలకాయి బంతిలాగ ఎగిరి దూరంగా పడినాది. రత్తాన్ని గుంతలోకి పట్టారు. బద్ది గొర్రె కుడికాలు నరికి నోట్లో పెట్టి కడుపు పేగులు సందులోంచి తెల్ల బుడ్డ కోసి, గొర్రె తలకాయి పైన పరిచి, దానిపైన పిండి దీపం పెట్టి అమ్మోరు యదురుగా ఉన్న నగర కుంభంకూడు పైన పెట్టారు. ఏడు పిండి దీపాలకి ఎనిమిదో దీపం తొడైనాది.

అసలైంది యిబ్బుడే మొదులైనాది. దున్నపోతును నరకడం. డప్పుల సప్పుడు మొగతానే వుండాది. కదిరేలు మొదటిగా కత్తి తీసుకున్నాడు. కిలారింతలు యింకా గట్టిగా మొదులైనాయి. మూడుసార్లు నరికేటట్టు పోయి నరకకుండా కత్తిని మారిచ్చాడు. పినిపెద్ది గెంగాలమ్మకి సాష్టాంగంగా మొక్కి కత్తి తీసుకున్నాడు. డప్పులు జోరందుకుంది. కిలారింతలు మరింత వూపందుకుంది. రాగులేసిన రాలనంత జెనం. నలుదిక్కుల చుట్టూ గుమికూడారు. ఒక చేత్తో కత్తిని పట్టుకుని, యింకో చేతిని జెనం వైపు వూపుతూ

 “ఉత్తరువా సామి… ఉత్తరువా…ఉత్తరువా…ఉత్తరువా?” అని నాలుగు వైపులా అడిగాడు. జెనమంతా “ఊ..ఊ..ఊ..ఊ” అని బూమెద్ది మాదిరి తలలూపారు.

“ఒకే యేట్లో వేస్తే పినిపెద్ది మొనగాడురా!” అని చెవులు కొరుక్కుంటున్నారు జనం. ఉత్కంఠగా చూస్తున్నారు జనం. యవరి గుండె సప్పుడు వాళ్ళకే యినిపిస్తుండాది. కత్తిని రెండు చేతులతో పట్టుకున్నాడు. కత్తిని పైకి లేపాడు. వూపిరి పీల్చుకున్నాడు. సన్నగా వొదిలాడు. దున్నపోతు మెడను చూసాడు. బలగొద్ది బాదాడు. తల వేరు ముండం వేరుగా అయినాది. అమ్మోరు పూనింది. కత్తితోపాటే పినిపెద్ది గాల్లో ఎగురుతున్నాడు. నాలుక బయటకొచ్చింది. బ్యార్‌మని అరుస్తున్నాడు. నిమ్మపండ్లు వేసి కిందకి లాగారు రవి, భాస్కరుడు.

“అమ్మా! ఎవరైనా పంచపాత్రలో నీళ్లివ్వండమ్మా!” అని అడుగుతున్నాడు భాస్కరుడు. ఎవరూ త్యాలేదు. “అక్కా! నీళ్ళు యివ్వండికా! పేనం పోతాదికా!” అని యింకో యిల్లును అడిగాడు. జెనంలో ఉలుకుపలుకు లేదు. ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటున్నారు. నీళ్ళు మాత్రం యివ్వలేదు.

“అయ్యా! నీళ్లివ్వండయ్యా! మీ పుణ్యం వుంటాది” అని కుప్పడు కూడా వొక్కొక్కరి దగ్గిరకు పోయి కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు. కుక్కను యిదిలించినట్టు యిదిలించేసారు. ముసలి మొట్టన్న చేతులెత్తి మొక్కుకున్నాడు. అయినా నీళ్ళిచ్చే నాథుడే కరువయ్యాడు.

“యోవ్! తోటోల్లకంతా నీళ్ళిస్తే తీటు అయిపోమా?” అన్నారు జెనం. ఆకాశం యిరిగి నెత్తిమీద పడినట్లు అయినాది భాస్కరుడికి. కొందరు బింది నిండుగా నీళ్ళు తెచ్చి తల తెగి కాళ్ళు కొట్టుకుంటున్న దున్నపోతు మీద పోస్తుండారు గానీ నాలుకెండిపోతున్న మనిషికి నీళ్ళు పొయ్యలేదు.

“రేయ్! నరకాల్సింది మూగజీవాల్ని కాదురా, మీలో ఉన్న కులాన్ని.  మైలంటేది మాక్కాదు. మీరే మైలంటుకొని ఉన్నార్రా!” అంటూ ఆవేశంలో కత్తి తీసుకున్నాడు రవిగాడు. పది మంది వొచ్చి అడ్డుపడినారు. ‘వొకే మట్టిలో, వొకే జాతిలో పుట్టినవాళ్ళ మధ్యలో యాందీ వివచ్చ? ఎవరు పెంచిన విషమాను యిదీ?’ అనే ప్రశ్నలు రవి బుర్ర నిండుగా సుడిగుండం తిరుగుతుండాయి. కన్నీళ్ళు కమ్ముకున్నాయి. తోటి పినిపెద్దికి గెవనం తప్పిపూడ్సినాది. ఊరి జెనాల దేహంపైన కులం తల పెద్ద మృగంలా అవుపడుతుండాది భాస్కరుడికి. గెంగాలమ్మ ముందర దున్నపోతు తల తెగిపడిపూడ్సినట్టు, కులం తల పుటుక్కున తెగిపడే రోజు కోసం కారుకమ్మిన కళ్ళతో గెంగమ్మకి రెండు సేతులెత్తి  దండం పెట్టుకొంటున్నారు రవి, భాస్కరుడు. వాళ్ల యేడుపులకి తోడై ఆకాశంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి. బలమైన యీదురు గాలూలుతోపాటు చినుకులు మొదులైనాయి. గంగే తోటి దాహాన్ని తీర్చింది. గుడిసె మూలలో అఖండ దీపం ఆరిపోతే మరుజాతర జెయ్యాల్ల. కుండ లోపలో సన్నగా యలుగుతున్న దీపం ఆరిపోకుండా రెండు సేతులతో అఖండలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదిరేలు. ఊరు మాత్రం కులం చీకట్లతోనే వుండాది.

*

ఐదు నవలలకు సరిపడా కథలున్నాయి

* హాయ్ మాణిక్యం! మీ గురించి చెప్పండి.

మాది తిరుపతి జిల్లా నారాయణవనం మండలం బ్రాహ్మణతాంగల్(బీరపాళ్యం). పదో తరగతి వరకూ నారాయణవనంలో చదివి ఆ తర్వాత పుత్తూరులో డిగ్రీ చేశాను. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ(జంతుశాస్త్రం) చేసి ప్రస్తుతం అక్కడే పీహెచ్డీ చేస్తున్నాను. మా కుటుంబంలోనే కాదు, మా ఊరిలోనే మొదటిగా పీజీ చదివింది నేనే. 

* కథలు రాయాలన్న ఎలా వచ్చింది?

నా జీవితంలో గోల్డెన్ డేస్ అంటే హైస్కూల్ చదివిన రోజులనే చెప్తాను. అక్కడ ప్రతి శనివారం లిటరరీ అసోసియేషన్ కార్యక్రమం జరిగేది. అందులో వ్యాసరచన పోటీలు నిర్వహించేవారు. ఏడో తరగతిలో మొదటిసారి జామెట్రీ బాక్స్ బహుమతి కోసం ఓ వ్యాసం రాసి ప్రైజ్ గెలుచుకున్నాను. అక్కడ లైబ్రరీలో పుస్తకాలు బాగా చదివేవాణ్ని. అప్పుడే మొదటిసారి అంబేడ్కర్, కార్ల్‌మార్క్స్, పెరియార్ పుస్తకాలు చదివి ప్రభావితున్నయ్యాను. అక్కడ మా నీరజ మేడం, శ్రీదేవి మేడం, రవి సార్ నన్ను పుస్తకాలు చదవమని చాలా ప్రోత్సహించేవారు.

ఆ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు సిలబస్‌లో భాగంగా సీనియర్ రచయిత కొలకలూరి ఇనాక్ రాసిన ఆకలికథ చదివాను. ఆ కథ నాకు చాలా నచ్చింది. ఆ కథ చెప్పాక మా లెక్చరర్ నీరజ మేడమ్ మమ్మల్ని సొంతంగా ఒక కథ రాయమన్నారు. అప్పుడే నేను నేరస్తుడెవరు?’ అనే కథ రాసి ఆమెకు చూపించాను. నీ కథ పర్లేదు. కానీ నీకింకా కథకుల లక్షణాలు తెలియడం లేదు. కథలు బాగా చదువుఅన్నారు. ఆమె మాటతో కథలు చదవడం మొదలుపెట్టాను. ఇప్పటికీ విరివిగా చదువుతూనే ఉన్నాను. 

* మొదటి కథ ఎప్పుడు ప్రచురితమైంది?

డిగ్రీలో ఉన్నప్పుడే బ్లూ క్రోఅనే కథ రాశాను. అయితే ఎవరికీ చూపించలేదు. ఏడాది తర్వాత కడపలో రచయిత వేంపల్లె షరీఫ్ ఆధ్వర్యంలో కథల వర్క్‌షాప్ జరిగితే అందులో పాల్గొన్నాను. రచయితలు జి.ఉమామహేశ్వర్, శ్రీనివాసమూర్తి అక్కడికి వచ్చి కథారచన గురించి వివరించారు. అప్పుడు ఏర్పడ్డ పరిచయంతో బ్లూ క్రోకథను ఉమామహేశ్వర్ గారికి పంపాను. ఆయన చదివి కొన్ని సూచనలు చెప్పారు. కథలో సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పాలి. అసాధారణమైన విషయాన్ని సాధారణంగా చెప్పాలిఅని ఆయన అన్నారు. ఆ తర్వాత కొన్ని మార్పులతో ఆ కథను పాలపిట్ట మాసపత్రికకు పంపించాను. 2022 దీపావళి కథల ప్రత్యేక సంచికలో ప్రచురించారు. ఇప్పటికి ఐదు కథలు రాశాను. 

* కథలతోపాటు ఇతర ప్రక్రియలూ రాశారు కదా?

అవును. మా నాన్న గురించి హిడెన్ హీరో నాన్నఅనే కవిత రాశాను. ఆ తర్వాత మరికొన్ని అంశాల మీద కవితలు రాశాను. ఆ తర్వాత చాలా పుస్తక సమీక్షలు చేశాను. వ్యాసాలు రాశాను. తమిళ నుంచి తెలుగులోకి 52 హైకూలను అనువదించాను. ఈ మధ్యే ఆ హైకూలన్నీ కలిపి దిగులు కొంగపేరుతో పుస్తకం వచ్చింది. ఇన్ని రాసినా కథ, నవల మీద నాకు ఇష్టం ఎక్కువ. 

* మీకు నచ్చిన రచయితలు?

నేను అన్ని రకాల పుస్తకాలూ చదివాను. చదువుతున్నాను. అందువల్లే అన్ని రకాల ప్రక్రియలూ రాయగలుగుతున్నానని అనుకుంటాను. ఎవరైతే వాస్తవ జీవితాన్ని రాస్తారో వారి రచనల్ని ఇష్టపడతాను. అందులోనూ పల్లె జీవితాన్ని యథాతథంగా చిత్రించిన రచనల్ని ఇంకా ఇష్టంగా చదువుతాను. తమిళ కథలు, నవలలు కూడా ఎక్కువగా చదవటం అలవాటు. ఇలా చాలామంది రచయితల రచనలు ఇష్టం. 

* ఇంకా ఏమేం రాయాలని ఉంది?

ఈ ఏడాది చివరికి కథాసంపుటి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నాను. అందుకోసం కథలు రాస్తున్నాను. ఆ తర్వాత నవలలపై దృష్టి పెడతాను. నా దగ్గర ఐదు నవలలకు సరిపడా కథలున్నాయి. సాంస్కృతిక చరిత్రల నేపథ్యంలో పరిశోధన గ్రంథాలు కూడా రాయాలనుంది. వాటిని రాయాలి.

*

గిడ్డకింద మాణిక్యం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గ్రేట్ మాణిక్యం ఇలాగే మంచి మంచి కథలు ఇంకొన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు