గద్దర్ ఒక యుద్ధ నౌక

గద్దర్ తో అప్పటి సంచలన ముఖాముఖీ మళ్ళీ మీ కోసం….

గద్దర్ ఒక యుద్ధ నౌక అనే వాక్యం ఇప్పుడు ఎంత పాపులర్ అయిందంటే, ప్రతి సందర్భానికీ అదే మాట! అదే పదబంధం! 1982 లో  ప్రసిద్ధ కవి ఖాదర్ మొహియొద్దీన్ గద్దర్ ని  ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడిన వాక్యం ఇప్పటికీ అంతే పదునుగా అంతే బలంగా దూసుకుపోతోంది! గద్దర్ ని తలచుకుంటూ మరోసారి ఆ ఇంటర్వ్యూని “సారంగ” పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు ఖాదర్ మొహియొద్దీన్. 

 

నపదాలు కూడదీసుకున్న నూతన జవసత్వాల పేరు గద్దర్ ! పల్లె పదాలు పోసుకున్న ప్రాణం పేరు గద్దర్ ! అందుకున్న పాటల పోరాటంతో సాగుతున్న యుద్ధనౌక గద్దర్ ! గంధకపు రాశులపై నిప్పు కణికలతో రాయబడిన పోరుపాటకి మారుపేరు గద్దర్ ! అతని కంఠం ప్రజల బాగు కోసం ఎక్కుపెట్టిన తుపాకీ ! అతని కంఠం నుంచి దూసుకు వచ్చే ప్రతీ పాటా ఒక తుపాకీ తూటా ! మనిషినీ, మనిషిలోని మంచితనాన్నీ , పోరాటం ద్వారా మాత్రమే మనిషికి మంచి భవిష్యత్తు సాధ్యమనీ నమ్మిన ప్రజాకవి, పాటగాడు.

జనం దగ్గరికి వెళ్లి, వాళ్ళ బతుకుల్లోని నిజాల్ని పాటలుగా పాడి, వాళ్లు పెట్టింది తిని, వాళ్లతో కలిసిపోయి మసలుకునే జననాట్యమండలి దళం. పెచ్చులూడిపోయి ఉన్న గదిలో పైమీది  గుడ్డలు పరుచుకుని, కటిక నేలమీద పడుకుని ఉన్న పాతికమంది కుర్రకారు జనం. వాళ్ళమధ్య గొంతునొప్పితో బాధపడుతూ, అప్పుడపుడూ ఉప్పు కలిపిన వేడినీళ్లు తాగుతూ పడి ఉన్నాడు గద్దర్.

ఎంతో సాదరంగా  ఆహ్వానం.

వాళ్లందరికీ కలిపి ఉన్న ఒకే ఒక్క చిరుచాపను మాకు కేటాయించారు.

కుర్రాళ్లంతా ఆయన వెనక్కి చేరారు. అలసట, విశ్రాంతి, విరామం ఎరగకుండా నమ్మిన నిజాల కోసం కట్టుబడి కనీస సౌకర్యాలు, సౌఖ్యాలకు ఎడంగా, నిజమైన నేలతల్లి బిడ్డలుగా ఎదుగుతున్న వాళ్ల ఆచరణ ముందు తలవంచిన వాతావరణం మా కంఠాల నుంచి ప్రశ్నలు వెలువడకుండా అడ్డగిస్తున్నది.

గద్దర్ గొప్పతనం జనం గొప్పతనమే.

మేము అడిగిన మొదటి ప్రశ్న. జననాట్యమండలికి గాక వ్యక్తిగతంగా పెరిగిపోతున్న గద్దర్ ఇమేజ్ గురించి, సంస్థాపరంగా దీని వల్ల కలిగే నష్టాన్ని గురించి.

గద్దర్ : కేవలం వ్యక్తిగతంగా గద్దర్ ఇమేజ్ పెరగటం ఎంత మాత్రం మంచిది కాదు. జననాట్యమండలి లేకుండా విడిగా గద్దర్ లేడు. గద్దర్ లేకుండా జననాట్యమండలి ఉంటుంది. గద్దర్ ని జననాట్యమండలి నుంచి విడదీసి చూడటం ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. జననాట్యమండలి దళాలు గద్దర్ లేకుండా కూడా అనేక ప్రదర్శనలు ఇస్తున్నాయి. అవి విజయవంతం కూడా అవుతున్నాయి. జననాట్యమండలి ఏర్పడక పూర్వం కూడా గద్దర్ ఉన్నాడు. కుటుంబ నియంత్రణ గురించిన బుర్రకథలు, రేడియోలో పాటలు పాడుకుంటూ ఉండేవాడు అప్పుడు గద్దర్నీ ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే గద్దర్ జననాట్యమండలి సమష్టి కృషిలో భాగస్వామి అయి, రంగం మీదికి వచ్చాడో అప్పటినుంచే ప్రజలు అతన్ని గుర్తించటం మొదలుపెట్టారు. గద్దర్ ఇమేజ్ అప్పట్నుంచే పెరగడం మొదలైంది. దీన్నిబట్టి ఇది గద్దర్ వ్యక్తిగతమైన గొప్పతనం కాదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క జననాట్యమండలి వందలాది, వేలాది గద్దర్  లను సృష్టించగలదు. ఒక్క గద్దర్ ఏమీ చేయలేడు. వ్యక్తికంటే సంస్థ గొప్పది. ఇమేజ్ అన్నది కూడా వ్యక్తిగతంగా కాకుండా సంస్థాగతంగా పెరగటం ఆరోగ్యకరమైన పద్ధతి.

ప్రశ్న: కవి తన సృజనాత్మక కృషిని వైయక్తికంగానే కదా జరిపేది? సృజనాత్మకతకి సమష్టి కృషి ఎలా తోడ్పడుతుంది?

గద్దర్: ఇటీవల నేను ఒక పాట రాశాను. “మదనా సుందారి మదనా సుందారి” అని ప్రారంభమవుతుంది. ఇది ప్రజల్లో బాగా ప్రచారంలో ఉన్న బాణీ. “చురుకైన నీ కంటి కనుపాప జూశో” అంటూ ఇలా రకరకాలుగా స్త్రీ అందాన్ని వర్ణించుకుంటూ పోయి ” కామందు నీ మీద కన్నేసినాడో ” అని రాశాను. ఆ తరువాత కామందు మీదికి తిరగబడమని ప్రోత్సహించే విధంగా రాసి ముగించాలనుకున్నాను. దీన్ని మా వాళ్లకు వినిపించి నేను ఇవ్వదలుచుకున్న ముగింపును గురించి వివరించాను. అప్పుడు మా సంస్థ సభ్యులు బాగా ఆలోచించి పాటని నేననుకున్నట్టుగా కాకుండా ” కొడవళ్ళ కొసలు మెరిసిపోవంగా… బొమ్మజెముడు పొదలు నరికి వేయంగా” ముందుకు కదిలినట్టుగా ముగింపును సూచించారు. పాట ఎంతో శక్తివంతంగా తయారైంది. నేననుకున్నట్లు కొంచెం కృతకంగా కాకుండా ఎంతో సింబాలిక్  గా, ధ్వని ప్రధానంగా తయారయింది  ఇది సమిష్టి కృషివల్లనే కదా సాధ్యపడేది?!

ప్రశ్న: మీరు రాసిన పాటల్ని మారుస్తున్నప్పుడు కవిగా మీరు బాధపడరా?

గద్దర్: ఎందుకు బాధపడటం? మనం ప్రజల్లోకి వెళ్లి, ప్రజల మధ్య ప్రచారంలో ఉన్న బాణీలను తీసుకొని, వాటి ఆధారంతో ఆయా సందర్భాలకు అన్వయించి, ఆ ప్రజల మంచి కోసం, వాళ్లని చైతన్యవంతం చేయడం కోసం పాటలు రాస్తున్నప్పుడు, ఆ పాటల్ని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే మార్పులు చేర్పుల విషయంలో బాధ పడాల్సిన అవసరం ఏముంది? మనకు కావాల్సింది మనం రాసిన పాట శక్తివంతంగా మనం ఎవరికోసమైతే రాశామో, ఏ ప్రయోజనం కోసం అయితే రాశామో, దాని ఫలితం రావటమే కదా.

ప్రశ్న: పాట రాయాలని అనుకోవడానికి, ఆ పాటను జనం దగ్గరికి తీసుకువెళ్లడానికి మధ్య మీ అనుభవం ఏమిటి? మీరు అనుసరించే పద్ధతి ఏమిటి?

గద్దర్: పాటంటే ప్రజల పాట. ప్రజల పాట తప్పనిసరిగా ప్రజల బాణీలోనే రాయాలి. ప్రజా జీవితంతో పెనవేసుకుపోయి ఉన్న బాణీలను తీసుకుంటాను. దానిని పదే పదే మననం చేసుకుంటూ ఉంటాను. ఆ బాణీని, ఆ బాణీలో ఉన్న పాట సందర్భాన్ని, దాని తాలూకు వాతావరణాన్నీ అధ్యయనం చేస్తాను. ప్రజల సమస్యలపై పాట రాయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆ బాణీని ఏ సందర్భంలో పాడారో, ఆ సందర్భానికే అన్వయించి పాట రాస్తాను.

ఉదాహరణకి ” శ్రీరాముడు సీతసారీ వెళ్ళంగా… రావణా ఉయ్యాలో” అనే పాట ప్రజలలో ఉన్నది. అధ్యయనం చేసి, దానిమీద కమాండ్ సంపాదించిన కొంతకాలానికి ప్రజల పాట రాయాల్సి వచ్చింది. ఈమధ్య కామ్రేడ్ పెద్ది శంకర్ తన దళంతో పోరు చేస్తూ అమరుడైనాడు. ప్రజలు “శ్రీరాముడు సీతసారి వెళ్ళంగా.. ” అని పాడుకుంటే నేను దాన్ని ” పెద్ది శంకరన్న పోరెల్లి పోంగా ” అని మలిచాను. పాటకి ఒక రూపం ఏర్పడింది. ఏ ప్రాంతంలోనైతే కామ్రేడ్ పెద్ది శంకర్ ప్రజలలో మెలిగాడో, ఆ బెల్లంపల్లి ప్రాంతంలో పాట పాడేసరికి ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు చలించిపోయారు. వాళ్ళ రియాక్షన్ చూసి, తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని నోట్ చేసుకుని, అలాగే ఉద్యమ కార్యకర్తలు విప్లవ అభిమానుల నుండి వచ్చే విమర్శలను, సూచనలను తీసుకొని, ఆ పాటని తగువిధంగా మార్చి తిరిగి జనంలోకి తీసుకువెళ్తాం.

సాధారణంగా నేను పాట కోసం పాట రాయను. బాణీని ఎంత కాలంగా మననం చేసుకుంటూ ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలు తీవ్రరూపం దాల్చి, వాళ్లు ఉద్యమించినప్పుడు, ఆ ప్రజా విప్లవోద్యమం స్వయంగా ఎప్పుడు ఏ పాట రాయాలన్నది నిర్ణయిస్తుంది. డిమాండ్ చేస్తుంది.

ఆదిలాబాద్  గోండు ప్రజల గోడు

ప్రశ్న: ఆదిలాబాద్ గోండు ప్రజల గురించి మీ బ్యాలేని  గోండు ప్రజల ముందు ప్రదర్శించారా?

గద్దర్ : లేదు. పోలీసులు మాకు అవకాశం ఇవ్వడం లేదు.  అడ్డుపడుతున్నారు. ఇటీవల నేను, వరవరరావు ఇంద్రవెల్లిలో అమరవీరుల సంస్మరణ సభ జరపటానికి వెళ్ళాం. పోలీసులు గట్టి బందోబస్తు చేసి ఒక్క గోండు కూడా మా సభకు రాకుండా చేశారు. అటువైపు వచ్చిపోయే బస్సుల్ని రద్దు చేశారు. ఆ మార్గంలో ప్యాంటు – చొక్కా వేసుకొని కనిపించిన వ్యక్తినల్లా అనుమానించి, ప్రశ్నలతో వేధించుకు తిన్నారు. ఒక కళాకారుడు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకోవడానికి, ఒక చిన్న సభ చేసుకొని మృతవీరులని సంస్మరించుకోవడానికి కూడా వీల్లేని ఈ వ్యవస్థ ప్రజాస్వామికమైనదా? ఇటువంటి వ్యతిరేక వాతావరణంలో మేం ఈ కళారూపాలను రూపాన్ని వాళ్ల ముందు ఎలా ప్రదర్శించగలం?  ఈ బ్యాలేని గోండుల భాషలోకి అనువదించటం జరిగింది. ఇది పుస్తక రూపంలో కూడా రాబోతున్నది. గోండుల భాషలో వెలువడుతున్న తొలి పుస్తకం ఇదే అవుతుంది. దీన్ని గోండు ప్రజల ముందు ప్రదర్శిస్తున్నారు.

ప్రశ్న : వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?

గద్దర్: వాళ్లు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏ ప్రజల దగ్గరికి వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ జీవిత విశేషాలు మాత్రమే కాకుండా వాళ్లు మాటాడుకునే భాషను కూడా నేర్చుకుంటే సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా గొప్ప గొప్ప ఫలితాలను సాధించవచ్చు.

ప్రశ్న: మీ పాటల్ని అనేక ఇతర సాంస్కృతిక సంస్థలు వాడుకుంటున్నాయి కదా దాని గురించి మీ అభిప్రాయం?

గద్దర్: నా పాటలు అంటే జననాట్యమండలి పాటలు. ఒక స్పష్టమైన రాజకీయ అవగాహనతో రాసిన పాటలవి. వాటిని యధాతధంగా పాడుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ వాటిలోని సాహిత్యాన్ని మార్చివేసి పాడుకోవటాన్ని మాత్రం నిరసిస్తున్నాం. అది వాళ్ళ దివాలాకోరు మనస్తత్వాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.

ప్రశ్న: సభ్యులు తమ పాటల్ని వ్యాపార సినిమాలకు అమ్ముకోవడాన్ని జననాట్యమండలి అనుమతిస్తుందా?

గద్దర్: వ్యాపార చిత్రాలకు పాటలను అమ్ముకోవడాన్ని జననాట్యమండలి ఎంత మాత్రం అనుమతించదు. వ్యాపార చిత్రాలకు పాటల అమ్ముకొని వాటి ద్వారా ప్రచారం చేసుకోవటమే జననాట్యమండలి ధ్యేయమైతే ఇన్ని కష్టాలు, అరెస్టులు, బీభత్సాలని సహిస్తూ ఊరూరూ తిరిగి, అనేక కష్టాలు పడుతూ ప్రచారం చేయడం ఎందుకు? జననాట్యమండలి ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలే సర్వస్వంగా భావించి మసులుకుంటుంది. అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉంటున్న మహాకవి శ్రీశ్రీ ఇల్లు తాకట్టులో ఉంటే ఆయన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకున్న ఏ నిర్మాతా ఆదుకోలేదు. తిరిగి ఈ ప్రజలే చందాలు వేసుకుని ఆయన ఇంటిని తాకట్టు నుంచి విడిపించారు.

ప్రశ్న: మీరెంతో కష్టపడి బయటికి తెచ్చి, ప్రచారంలో పెట్టిన బాణీలను సినిమా వాళ్లు ఈమధ్య వాడుకుంటున్నారు గదా, దీని గురించి మీరేం చెప్తారు?

గద్దర్: ప్రజలు సమకూర్చి నిక్షిప్తం చేసి ఉంచిన బాణీలు అనంతం. అదొక తరగని గని. ఈ సినిమా వాళ్లు ఏవో నాలుగు బాణీలు తీసుకున్నంత మాత్రాన అది తరుగుతుందా? ఇదొక వెల్లువ. ఇలా కొంతకాలం పాటు వాడుకుంటారు. దీనిమీద మొహం మొత్తి మళ్లీ దేన్నో పట్టుకుంటారు. సినిమా వాళ్ళవల్ల దీనికి వచ్చిన ప్రమాదం లెక్కచేయదగింది కాదు.

ప్రజలే మహాకవులు

ప్రశ్న: మీ మీద వస్తున్న విమర్శలు?

గద్దర్: నన్ను గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళు, “వాడిదేముందిరా బూతు పాటలు పాడి నవ్విస్తాడు” అని కొట్టిపారేస్తుంటారు. మరి కొంతమంది నేను నా పాటల ద్వారా కులాల్ని ఎత్తిచూపుతున్నానని, ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని అంటున్నారు. కానీ నేను నా పాటల ద్వారా కులాల్ని ఎత్తిచూపటం లేదు. సమాజంలో అతి నీచంగా చూడబడుతున్న కులాల ప్రజల్ని ప్రేమగా లేవనెత్తి, నా హృదయానికి హత్తుకుంటున్నాను. వాళ్లతో నా మమేకతనీ, సంఘీభావాన్ని స్పష్టం చేస్తున్నాను. నేనే వాళ్ళ గుండెల నుంచి కంఠాల నుంచి పాడుతున్నాను.

ప్రశ్న: జననాట్యమండలి కళాకారునిగా ప్రజల నుంచి మీ అనుభవాలు…

గద్దర్: ప్రజలు మహాకవులు. ప్రజలే మహాకవులు. సజీవమైన కవిత్వం వాళ్ళ దగ్గరనే ఉంది. వాళ్ల బతుకులతో మమేకం కాకుండా, వాళ్ళని గురించి అచ్చమైన కవిత్వాన్ని సృష్టించలేం.  వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ కష్టసుఖాల్ని పాటలుగా పాడి వినిపిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు మా ప్రదర్శనలో గొప్ప గొప్ప సీనరీలు, సెట్టింగులు లేవు. ఒక తబలా, ఒక ఫ్లూటు, గజ్జెలు. అయినా సరే, ప్రజలు మా ప్రదర్శనలతో ఉత్తేజితులు అవుతున్నారు. ఎందుకంటే మేము చెప్తున్నవి నిజాలు కాబట్టి. ప్రజలు నిజాలను ప్రేమిస్తారు. నిజమాడే వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమ పోరాటపటిమా, వాళ్ళ శక్తి, వాళ్ళ మంచితనం ఇవే నాకు నిత్యం లభించే ఉద్దేశం వాళ్లలో కలిసిపోవాలి.

ఒక అరుదైన సన్నివేశం

అడ్డకట్టు గోచీ, మెడలో పాత గళ్ళ సిల్క్ లుంగీ, భుజం మీంచి కిందికి వేలాడే నల్లదుప్పటి, చేతిలో ఎర్రజెండా, కాళ్లకు గజ్జెలు, ముచ్చటైన బొజ్జ. గడ్డం. ఇదీ గద్దర్ రూపం. 

ప్రశ్న: మీరు ఈ డ్రెస్ ని ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా?

గద్దర్: మొదట్లో నేను మామూలుగా ప్యాంటు, షర్టు వేసుకునే పాటలు పాడేవాణ్ణి. కానీ నేను పాడే పాటల్లోని జీవితాలకి ప్యాంటు, షర్టులకి పొంతన కుదరటం లేదు. మనం పాడుతున్న పాటకి, ఆడుతున్న ఆటకి, కట్టుకున్న బట్టకీ మధ్య ఎడం కూడదు. అందుకనే నేను ఈ డ్రెస్సుని ఎన్నుకున్నాను. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఇదే డ్రస్సుతో ఉందామని కూడా అనుకున్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, రైల్లో వెళుతున్నప్పుడు, ఎల్లప్పుడు ఇదే డ్రెస్సుతో ఉండాలి. రోడ్డుమీద నడిచి వెళుతున్నప్పుడు కొంతమంది రిక్షా కార్మికులు కనిపించారనుకోండి. “నా రక్తంతో నడుపుతాను రిక్షాను” అని అక్కడ పాడాలి. వాళ్ళను కలుపుకోవాలి. మన పాటల్ని ఆ విధంగా ప్రచారం చేయాలని ఉంది.

గద్దర్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆయన కంఠం మీద రక్తం చెమటలా పడుతున్నది. క్రమం తప్పకుండా వరుసగా అనేక ప్రదర్శనలిస్తూ పూర్తిగా అలిసిపోయి ఉన్నారాయన. గొంతు నొప్పి. అయినా, మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపిగ్గా, వివరంగా ఆయా సందర్భాల్లో రాసిన పాటల్ని పాడుతూ మాకు సమాధానాలు ఇచ్చారు. గద్దర్ పాటలు ఆధునిక కవితా నియమాలను సవాల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మాకు వినిపించిన “అన్నా! ఓ గంగనా” అన్న పాట శ్రామిక జన కవిత శిఖరాగ్రం మీద ఎగరేసిన తిరుగులేని జండాలా రెపరెపలాడుతుంది.

నువ్వు మొలుస్తున్న మొక్కవో
అన్నా! ఓ గంగనా!
నువ్వు పూస్తున్న పువ్వువో
అన్నా! ఓ గంగనా!
నువ్వు కాస్తున్న కాయవో
అన్నా! ఓ గంగనా!
నువ్వు పండుతున్న పండువో
అన్నా! ఓ గంగనా!

నువ్వు కుమ్మరోళ్ల కుండవో
అన్నా! ఓ గంగనా!
నువ్వు చాకలోళ్ళ బండవో
అన్నా! ఓ గంగనా!
నువ్వు మంగలోళ్ళ కత్తివో
అన్నా! ఓ గంగనా!
ఓ నువ్వు మాదిగోళ్ళ డప్పువో
అన్నా! ఓ గంగనా!

నువ్వు రగల్ జండ ఎరుపువో
అన్నా! ఓ గంగనా!
నువ్వు మట్టిలోని బొగ్గువో
నువ్వు బొగ్గులోని అగ్గివో
అన్నా! ఓ గంగనా!
నువ్వు అగ్గిలోన వేడివో
అన్నా! ఓ గంగనా!
నువ్వు వేడిలోని వెలుగువో
అన్నా! ఓ గంగనా!

గద్దర్ పాట మనల్ని వదిలిపెట్టదు. అది మనల్ని వెంటాడుతుంది గాలిలా. మనలో కలిసిపోతుంది. మనలో ప్రవహిస్తుంది ఎర్రని వెచ్చని రక్తంలా ! పదునైన ప్రశ్నల కొడవళ్ళని మన కళ్ళముందు తళతళా మెరిపిస్తుంది.

ప్రచురణ:
ఆంధ్రజ్యోతి వారపత్రిక, 23 – 7 – 1982

చిత్రం: అన్నవరం శ్రీనివాస్ 

ఖాదర్ మొహియొద్దీన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గద్దర్ ఒక యుద్దనౌక అజరామరంగా నిలిచిపోతుంది. ఖాదర్ పేరుకు
    తగ్గట్లే అత్యంత శక్తివంతమైన రచన !

  • గద్దర్ ఒక యుద్దనౌక అజరామరంగా నిలిచిపోతుంది. ఖాదర్ పేరుకు
    తగ్గట్లే అత్యంత శక్తివంతమైన రచన !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు