కొన్ని  భ్రమలతో… 

వారంతా దోసిళ్ళు చాచి
మైదానాల బాట పట్టారు
వాన వాసనల  పచ్చిదనం  ఆవిరికాకమునుపే
చివరి  చినుకును వొడిసిపట్టుకుని
తడిపొడిగా మేనుకు రాసుకోడానికి
***
ఏదో ఏరు ఊరవుతుంది
ఇప్పుడది మరలా ఏరవుతుంది
నమ్మకాలు కాగితపు పడవలవుతాయి
వారంతా ఊరేగడానికి
***
ఎప్పటినుండో వారందరూ
రసాయనాలు త్రాగి బ్రతుకుతున్నారు
అస్తవ్యస్తంగా గుటకలేస్తున్నారు
అవి వారి కన్నీళ్లే కాబోలు
గొంతులో గాఢతలు కరిగించుకోడానికి
***
అప్పుడెప్పుడో ఆకులు రాలిపోతాయి
మరలా చిగుర్చుతాయి
ఋతువుల దొంతరలు అట్టిపెట్టుకొని  వారందరూ విరిగిన దేహాలతో  బయలుదేరుతారు
తమను తాము
తుది పేటికలో భద్రపరుచుకోడానికి.
2
వీడ్కోలు 
వీడ్కోలును తేలిగ్గా మోయాలని
ఈ రాత్రికి నన్ను నేను  నిలువరించుకోవాలని
శతసహస్త్రాలుగా నూరి పోసుకుంటాను.
స్పర్శ నిప్పులా అంటుకుంటుంది
వేలికొసలు వీడకుండానే
అలజడులు జడత్వాలవుతాయి
కన్నీళ్లు సుడులవకుండానే
పావురం రెక్కలు విదిల్చుకుపోతుంది
ఈకలు రాల్చకుండానే
ఖాళీ చేతులు కదులుతాయి
రేఖలు చెదరకుండానే
ఎప్పటిలాగే..
పునరాగమనం ఎప్పుడనేప్రశ్న
వీడ్కోలు ఇతివృత్తపు
పాత ముద్రల్లో కలిసిపోతూనేఉంటుంది.
*

వేద జూపల్లె

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు