ప్రసిద్ధ కవి, గీతకారుడు, భావుకుడు సిద్ధార్థ సంకలనం చేసిన ‘కవులు రాసిన కథలు'(అజూ పబ్లికేషన్స్ , 2025) పుస్తకాన్ని నిన్న ఆదివారం పొద్దున్న లా-మకాన్ లో ఆవిష్కరించాను. పసునూరు శ్రీధర్ బాబు నిర్వహణలో జరిగిన సభలో కొర్రపాటి ఆదిత్య, అజయ్ ప్రసాద్ కూడా ఆ పుస్తకం గురించి మాట్లాడేరు.
మొన్న హైదరాబాదు బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకం వెలువడినప్పుడే అనిల్ బత్తుల నాకు తీసుకొచ్చి చూపించాడు. సహజంగా ఉండే కుతూహలంతో, ఆ పుస్తకంలో ప్రాతినిధ్యం దొరికిన కవులేవరూ, వారు రాసిన ఏ కథలూ అని వెంటనే చూసాను. ఇప్పుడు ఈ పుస్తకం ఆవిష్కరించి, ఈ సంకలనం మీద మాట్లాడమని సిద్ధార్థ అడగడంతో, ఇందులో కథలన్నీ శ్రద్ధగా చదివేను. మొత్తం 30 కథల్లోనూ, నేను ఇంతకు ముందు చదివినవి, త్రిపుర ‘వలసపక్షుల గానం ‘, చలం ‘ఓ పువ్వు పూసింది’, విశ్వనాథ ‘ఏమి సంబంధం’, తిలక్ ‘అతని కోరిక’, శేషేంద్ర ‘శబ్దాలు-శతాబ్దాలు’, కృష్ణశాస్త్రి ‘మా ఊళ్ళో వీథి అరుగు’, శ్రీ శ్రీ ‘చరమరాత్రి’, ఉషాజ్యోతి బంధం ‘మోహ ఋతువు’, స్కైబాబ ‘అనమోల్ రిష్తే’, భగవంతం ‘లోయ చివరి రహస్యం’ మాత్రమే. అంటే మొత్తం కథల్లో మూడింట రెండువంతులు ఇప్పుడు ఈ సంపుటంలోనే మొదటిసారి చదివాను.
‘కవులు రాసిన కథలు’ అనే శీర్షిక చూడగానే కవులు రాసిన కవితాత్మకమైన కథలు లేదా కవితల్లాగా ఉండే కథలు అనే అనిపిస్తుంది కాబట్టి, ఈ పుస్తకం గురించి మాట్లాడటం ఏమంత కష్టం కాదనుకున్నాను, మొదట్లో. కాని సిద్ధార్థ ఈ పుస్తకాన్ని ‘కవులు రాసిన కథలు ‘అని అన్నాడే తప్ప, కవితల్లాంటి కథలనో, ఖండకావ్యాల్లాంటి కథలనో అనలేదనీ, అకస్మాత్తుగా, తట్టింది. నేను అయోమయంలో పడ్డాను. కవులు రాసిన కథలు అంటే, కథకులు రాసిన కథలకన్నా ఏ విధంగా ప్రత్యేకం అని ఆలోచనలో పడ్డాను. అసలు మన ప్రాచీన కావ్యాలూ, ఇతిహాసాలూ,- రామాయణం, ఇలియడ్, షానామా- ప్రతి ఒక్కటీ కవులు రాసిన కథలే కదా. చివరికి గురజాడ రాసిన ‘కన్యక’, ‘లవణరాజు కల’, ‘డమన్-పితియస్’ వంటివి కూడా ఒక కవి రాసిన కథలే కదా. పోనీ కథాకావ్యాలకన్నా ఆధునిక కథాశిల్పం ప్రత్యేకం అని అందామా అనుకుంటే, ఆధునిక కథకి ఆద్యుడు అని చెప్పదగ్గ ఎడ్గార్ అలన్ పో, స్వయంగా కవి కూడా కదా! చెకోవ్ కవిత్వం రాయలేదు, నిజమే, కాని, ఆయన కథలు, మలార్మే, వెర్లేన్ లాంటి ఇంప్రెషనిస్టు కవుల కవిత్వంలాగా impressionistic గా ఉంటాయని టాల్ స్టాయి వంటి వాడే అన్నాడు కదా!
మరి కవులు రాసిన కథల్ని, కథకులు రాసిన కథల్నుంచి ఏ విధంగా వేరుచేయగలం? అందుకేమన్నా ప్రమాణాలు ఉన్నాయా? ఈ కథల్ని సిద్ధార్థ ఎంచుకున్నప్పుడు, ఆయన వాటిలో గమనించిన ఏకరూపత ఏమై ఉండవచ్చు? నేను మరింత ఆలోచనలో పడ్డాను. అందుకేమైనా ఒక సూచన లాంటిది ఈ కథల్లో దొరకవచ్చునా అని చూసాను. అన్ని కథలూ కథల్లానే ఉన్నాయి. అయితే, అవి కవులు రాసిన కథలు. మరోసారి పరిశీలించి చూస్తే, శేషేంద్ర తన కథలో ఒకచోట ఇలా అంటున్నాడు:
రాజకీయవాది అయితే తప్ప కవి అయినవాడు తనని తాను అర్థం చేసుకునే పాఠకుల సంఖ్యమీదనే ఆధారపడాలి తన భాష, గొంతుక! పోల్చుకోగలిగిన కాళ్ళు, తన భాష అంతరాత్మను పసిగట్టగలిగినవాళ్ళు తన పాఠకులు. ఎక్కువ మంది పాఠకుల కోసం ఆశించడం కవి లక్షణం కాదు.
అంటే అసంఖ్యాక పాఠకులు తనని చదివి, తన సాహిత్యాన్ని ఆదరిస్తారనే ఆశ ఏమీ లేకుండా, తనని పోల్చుకోగలిగినవాళ్ళు కొద్దిమంది పాఠకులున్నా చాలని అనుకోవడం కవి లక్షణమని అనుకోవచ్చునా? తనకీ, సాధారణ పాఠకులు కోరుకునే సాహిత్యసంతోషానికీ మధ్య ఒక అంతరం ఉందనే నిస్పృహలో శేషేంద్ర ఆ మాట రాసి ఉండవచ్చునుగాని, తన కవిత్వమూ, కథలూ ఎంతమంది పాఠకులకు వీలైతే అంతమందికి చేరాలనే ప్రతి ఒక్క కవీ, కథకుడూ కోరుకుంటాడు కదా. కాబట్టి దీన్ని బట్టి కవులు రాసిన కథల్ని గుర్తుపట్టలేం.
అసలు ఇటువంటి ప్రయత్నమేదన్నా ఇంగ్లిషులో వచ్చి ఉండవచ్చునా అని కొంత శోధించాను. ఆశ్చర్యంగా Ra Page అనే ఆయన సంకలనం చేసిన Hyphen (2003) అనే ఒక సంకలనం కనిపించింది. కాని అది కొందరు సమకాలిక బ్రిటిష్ కవులతో మొదటిసారిగా కథలు రాయించి Comma Press వారు తీసుకొచ్చిన సంకలనం తప్ప, ఇలా తన ముందు ఒక శతాబ్దకాలంలో, పూర్వ, సమకాలిక రచయితలు రాసిన కథలనుంచి ఎంపికచేసిన సంకలనం కాదు. అంటే, నాకు తెలిసి, సిద్ధార్థ తీసుకొచ్చిన ఈ సంకలనం వంటిది, ఇంగ్లిషులో కూడా ఇప్పటిదాకా రాలేదు. భారతీయ దేశభాషల్లో ఏదైనా వచ్చిందేమో నాకు తెలియదు.
Hyphen సంకలనానికి సంకలనకర్త చాలా విలువైన ముందుమాట రాసాడు. అందులో కొన్ని ఆలోచనలు నాకు కొంత ఊతమిచ్చేవిగా కనిపించేయి. ముఖ్యంగా Flannery O’Connor రెండు భావనలను ప్రతిపాదించారట. మంచి సాహిత్యాన్ని మనం ఇదీ అని ఒక పిండితార్ధానికి కట్టిపడేయలేం అని అంటూ, ఆమె abstract meaning, experienced meaning అనే రెండు భావనల్ని ప్రతిపాదించారు. ఆమె దృష్టిలో experienced meaning ని మనం తిరిగిమాటల్లో పెట్టలేం. అలా మాటల్లో తిరిగి చెప్పగలిగేది abstract meaning మాత్రమే. కథల గురించి ఆమె చేసిన ఈ సూత్రీకరణ ఆధారంగా, మామూలుగా కథకులు రాసే కథలకీ, కవులు రాసే కథకులకీ మధ్య ఉండే తేడా నాకు కొంత బోధపడింది.
మామూలుగా, కథకి plot ఉంటుందని మనకు తెలుసు. ఒక కథలోని ఇతివృత్తం, అంటే, theme ఏమిటో చెప్పమంటే, మనం ఆ సారాంశాన్ని నాలుగైదు వాక్యాల్లో తిరిగి చెప్పగలం. ఏ కథ గురించైనా ఇలా చెప్పగల. చెప్పగలం, చెప్పగలగాలి కూడా. ఉదాహరణకి, కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘కొత్త జీవితం’కథని సంగ్రహంగా నాలుగైదు వాక్యాల్లో చెప్పమంటే, పాతకాలపు ఫ్యూడల్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మధ్యతరగతి కుటుంబాల్లో, కుటుంబసభ్యుల మధ్య కూడా సాధ్యం కాని ఒక సౌభ్రాతృత్వం కొత్తగా పట్టణాల్లో, రూపొందున్న కార్మికుల్లో, వారిమధ్య ఒకరికొకరికి ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా కూడా, సాధ్యపడుతుండటం గురించిన కథ అది అని చెప్పగలం. కానీ, చలం రాసిన ‘ఓ పువ్వు పూసింది’కథలోని సారాంశం చెప్పమంటే, ఇలా నాలుగైదు వాక్యాలకు కుదించి చెప్పలేం. అలా చెప్పాలని ప్రయత్నించి, విఫలురమై, ‘చెప్పడం కష్టం, ఆ మొత్తం కథ ఎవరికి వారే చదివి, ఆ సారాంశాన్ని అనుభవంలోకి తెచ్చుకోవలసిందే ‘ అనేస్తాం. అంటే, మామూలుగా ఏ కథకుడేనా రాసిన కథని summarise చేయగలంగాని, కవి రాసిన కథని, అలా సంగ్రహరూపంగా చెప్పలేమని తట్టింది నాకు.
దీన్ని బట్టి, సాధారణ కథకీ, కవి రాసే కథకీ మధ్య ప్రధానమైన భేదాన్ని ఇలా వివరించవచ్చనిపించింది. అదేమంటే, సాధారణంగా, కథలో, కథకుడు, ఒక epiphany వైపు పాఠకుణ్ణి నడిపిస్తాడు. ఆ అత్యంత కీలక క్షణం, సాక్షాత్కార క్షణం అనవచ్చు దాన్ని, ఆ క్షణానికి నడిపించడానికే అతడు తన మొత్తం కథని నిర్మించుకుంటూ వస్తాడు. మరీ బిగువైన శిల్పం కాకపోతే, చాలా కథల్లో, ఆ epiphanous moment కన్నా ముందు, కథకుడు ఇచ్చే వర్ణనల్లో, సంభాషణల్లో, లేదా వివరాల్లో, చాలా వివరాలు మనం తీసేసినా కూడా, స్థూలంగా చదువుకుపోయినా కూడా, ఆ కథకి లోటురాదు. కాని కవి రాసిన కథలో, అలా ఆ కథాదేహాన్ని మనం ఏ విధంగానూ కుదించలేం. ఉదాహరణకి, ‘ఓ పువ్వు పూసింది’ కథలో, ఏ వర్ణననైనా లేదా, లేదా, ఏ కదలికనైనా తీసేసి చూడండి. ఆ కథాదేహంలో వెలితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏమిటి? కవి రాసే కథలో, కావ్యానందం కేవలం epiphanous moment కి మాత్రమే పరిమితం కాదు. గొప్ప పద్యంలోనో, కవితలోనో, ఎలా అయితే, ఆ సౌందర్యమంతా, ఆ పద్యదేహం మొత్తం పరుచుకుని ఉంటుందో, కవి రాసిన కథలో కూడా, ఆ కథా సౌందర్యం కథ పొడుగునా పరుచుకునే ఉంటుంది.
అలా చూసినప్పుడు, ఈ సంకలనంలో, నాకు మూడు రకాల కథలు కనిపించాయి. మొదటి తరహా కథలు మామూలు కథలే. వాటిని సంకలనకర్త ఏ ఉద్దేశంతో, ఏ ప్రమాణాల ప్రకారం ఇందులో చేర్చాడో నేను గ్రహించలేకపోయాను. రెండో తరహా కథలు, కవితల్లాంటి కథలు. సిద్ధార్థ మాటల్లో, condensed long poems లాంటి కథలు. చలంగారి ‘ఓ పువ్వు పూసింది’ , త్రిపుర ‘ వలసపక్షుల గానం’, నరేష్ నున్నా ‘నీవు మొదలి జాణవు’, అజంతా ‘చతురస్రం’, శేషేంద్ర ‘శబ్దాలు- శతాబ్దాల ‘ లాంటి కథలు. వాటిని చదవగానే వెంటనే మనకు కవిత్వం చదివినట్టే అనిపిస్తుంది. ఇందులో సంకలనకర్త చేర్చకపోయినా రావిశాస్త్రి ‘వెన్నెల’, ముళ్ళపూడి వెంకటరమణ ‘కానుక ‘వంటివి కూడా ఇటువంటి తరహా కథలే. వీటిని కవులు రాసిన కథలు అని మనం సులభంగానే గుర్తుపట్టేయవచ్చు.
కాని మూడో తరహా కథలు- అంటే, అవి చూడటానికి కవితల్లాగా కనిపించవు, కథల్లానే ఉంటాయి, కాని, వాటి సారాంశాన్ని పాఠకులు ఎవరికి వారు అనుభవించి గ్రహించవలసిందే తప్ప మనం వాటిని paraphrase చెయ్యలేం. ఆ కథల్లోని రసస్ఫూర్తి మొత్తం కథాదేహమంతా పరుచుకుని ఉంటుంది. అటువంటి కథల్ని కవులు మాత్రమే రాయగలరు తప్ప, కథకులు రాయలేరు. లేదా మరోలా చెప్పాలంటే, అటువంటి కథలు రాసినప్పుడు, ఆ కథకులు కూడా కవులుగా మారిపోయేరని అనుకోవచ్చు. ఈ సంపుటిలో, కనీసం రెండు కథలు, బైరాగి ‘జేబుదొంగ’, నాగప్పగారి సుందర్రాజు ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద ‘అటువంటి స్థాయిని అందుకున్న కథలు.
‘జేబుదొంగ ‘ కథ గురించి కొంత వివరంగా చూద్దాం. ఈ కథలో plot లేదా ఇతివృత్తాన్ని మనం మాటల్లో పెట్టలేం. కాని, కథ చదవగానే, రచయిత, జీవితాస్తిత్వాన్ని అత్యంత నిర్మల రూపంలో, అత్యంత నగ్నక్షణంలో దర్శించాడనీ, ఆ విమలానుభూతి అతణ్ణి ఆ క్షణం ఒక విముక్తమానవుడిగా మార్చగలిగిందనీ గ్రహిస్తాం. అంతేకాదు, అటువంటి ఆ విముక్తానుభవాన్ని, లీలగానైనా, చూచాయగానైనా మనం కూడా పసిగట్టగలుగుతాం. బైరాగి రాసిన ‘ఆడుకొంటున్న బాలిక’కవిత కూడా పాఠకుడు చదివి ఉంటే ఈ కథలో రచయిత ఏం చెప్తున్నాడో పోల్చుకోగలుగుతాడు . ‘ఆగమగీతి’ (1981) లోని ‘ఆడుకొంటున్న బాలిక’ కవితలో, ఒక శరత్కాల ప్రభాతాన, వీథిలో ఆడుకుంటూ, తనలో తాను పిచ్చిపాటలు పాడుకుంటూ పోతున్న అతిశయచపల అయిన ఒక బాలికను, చూర్ణకుంతలను, కవి చూస్తాడు. ఆమె అతడికి ఏమీ కాదు. అసలామె ఎవరో కూడా తెలీదు. కాని ఆ క్షణాన, ఆ నిర్జన వీథిలో, గిరితరుశిఖరాలంట, శారదప్రాతః కాంతి పరుచుకున్న ఆ క్షణాన, కవి, ఆ పసిబాలిక నిర్హేతుక అస్తిత్వ ఆనందంతో తాను కూడా మమేకం కాగలుగుతాడు. ఆ క్షణం గడిచిపోయేక, ఆమె ఎవరో, తాను ఎవరో! కాని ఆ క్షణం, ఆ దృశ్యం తనమదిలో రచియించిన అస్ఫుట చిత్రమొకటి తనలో సదా నిలిచిపోతుందని చెప్తాడు. అస్తిత్వమనేది, మనం చెప్పుకునే అన్ని రకాల అంతరార్ధాలకూ, పరమార్ధాలకూ అతీతమైందనీ, అది సారాంశంకన్నా ముందే సంభవించే సంఘటన అనీ అస్తిత్వవాదులు చెప్తూ వచ్చినదానికి ఆ కవిత కన్నా గొప్ప ఉదాహరణ మనం చూడలేం. అక్కడ కవి తన self నుంచి విడివడి, తనకేమీ కాని other లోని నిర్హేతుక అస్తిత్వ ఉత్సవాన్ని అత్యంత నిర్మల, నిర్లేప క్షణంలో దర్శించాడు. దానితో తాను తాదాత్మ్యం చెందాడు. ఆ క్షణాన, జీవితమంటే ఏమిటి, జీవితం ఎందుకు, ఇదంతా దేనికోసం లాంటి ప్రశ్నలతో పనిలేని, ఒక ఆత్మవిస్మృతికి లోనయ్యాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, దాదాపు భగవత్సాక్షాత్కార క్షణం లాంటి క్షణానికి చేరుకున్నాడు.
ఆశ్చర్యంగా, జేబుదొంగ కథలో కూడా, రచయిత అటువంటి క్షణానికే లోనవుతాడు. తాను లోను కావడమే కాదు, పాఠకుణ్ణి కూడా తనతో తీసుకుపోతాడు.
స్థూలంగా కథాసందర్భం ఇది: ఒకడికి తన ఇంటిబాడుగ చెల్లించడానికి, కిరణాదుకాణంలో పోగుపడ్డ బాకీ తీర్చడానికి అత్యవసరంగా డబ్బు అవసరమవుతుంది. అతడున్న పరిస్థితిలో ఎవరినేనా అప్పు అడగడం తప్ప మరోమార్గం లేదు. చివరికతడు ఒక పెద్దమనిషిని అప్పు అడుగుతాడు. ఆ పెద్దమనిషి ఇస్తాననిగానీ, ఇవ్వనని గానీ చెప్పడు. కాని అతణ్ణే అంటిపెట్టుకుని ఉంటే, ఏదో ఒక క్షణంలో అప్పు దొరుకుతుంది అనిపిస్తుంది కథానాయకుడికి. ఈలోపు ఆ పెద్దమనిషి ఎక్కడికో రైలు ప్రయాణానికి బయల్దేరతాడు, భార్యాసమేతంగా. మన కథానాయకుడు కూడా అతడితో పాటే రైల్వే స్టేషనుకి వెళ్తాడు. చివరికి ఏ రాత్రివేళనో రైలు ఎక్కుతూ, ఆ పెద్దమనిషి తననే నమ్ముకుని అంతదాకా వచ్చిన కథానాయకుడి చేతుల్లో అయిదురూపాయలు పెడతాడు. ఆ అయిదురూపాయలు కథానాయకుడి అవసరాన్ని ఏ మాత్రమూ తీర్చగలిగేవి కావు. ఆ నోటుచూడగానే అతడు హతాశుడవుతాడు. ఆ డబ్బు తిరిగి ఆ పెద్దమనిషికి ఇచ్చేద్దామా అని కూడా అనుకుంటాడు. చివరికికి మరేమీ చెయ్యలేక, ఆ నోటు అట్లానే జేబులో పెట్టుకుని, ఆ రాత్రి నిర్జన వీథిలో తన ఇంటివైపు నడుస్తుండగా, ఆ చీకట్లో, ఎవరో తన జేబులో చెయ్యిపెట్టి, ఆ నోటు లాగేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరా అని చూస్తే, పధ్నాలుగు, పదిహేనేళ్ళ పిల్లవాడు, ఒక అనాథ అనుకోవచ్చును, అతడు తన కన్నా దీనావస్థలో ఉన్నవాడు, జేబుదొంగగా మారాడని అతడు గ్రహిస్తాడు. అప్పుడు ఏమి చేసి ఉండవచ్చును? మామూలు కథకుడు ఇటువంటి కథ రాస్తే, ఈ కథని ఇక్కడ ముగించడానికి, ఎన్నో సంభావ్యతలు ఉన్నాయి. అతణ్ణి కోపగించుకోవచ్చును. లేదా ఆ అయిదురూపాయలు తనే ఆ పిల్లవాడి చేతుల్లో పెట్టి, వట్టి చేతుల్తో ఇంటికి పోవచ్చును. (సాధారణంగా కథకులు ఇటువంటి ముగింపునే ఇస్తారని చెప్పవచ్చు.) కాని ఈ కథ చెప్తున్నది ఒక కవికాబట్టి, అది కూడా ‘ఆడుకొంటున్న బాలిక’ వంటి కవిత రాసిన కవి కాబట్టి, అతడిక్కడ ఏం రాశాడో చూడండి:
అతను ఇదంతా ఒక్క తృటిలో చూచాడు. ఈ వివరాలన్నీ అతని కళ్ళు గమనించకుండా ఉండి ఉండవు. కాని అతని చూపు వాడి కళ్ళల్లో లగ్నమయింది. క్రమంగా వాడి చూపు అతని మనసులో క్షణమాత్రం నిలచిన ఇతర వివరాలన్నిటినీ చెరిపి వేసి అతని ఇంకా వేటినీ చూడకుండా చేసింది. వాడి కళ్ళు మొఖాన్నంతా ఆక్రమించుకున్నట్టయి, అతను వాటిని తప్ప ఇంకేమీ గమనించలేకపోతున్నాడు. అతను మంత్రముగ్ధుడిలాగా అలాగ వాటిలోకి చూస్తూ నిలబడ్డాడు. ఆ కుర్రవాడు క్రమంగా అతని దృష్టిలోంచి కరిగిపోయి, ఆ మసక వెలుతురులో రెండు నల్లని, గుండ్రని పెద్ద కళ్ళలో లీనమయి, రెండు బ్యాటరీ లైట్ల కాంతిలా జాలినీ, భయాన్నీ, ఆశ్చర్యాన్నీ, చెప్పతరంగాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ అతని నిర్దాక్షిణ్యాన్నీ, క్రూరత్వాన్నీ, దూషిస్తున్నట్టూ, నిందిస్తున్నట్టూ చూస్తూ అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహలేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఎంతకాలం గడిచిందో తెలియదు. ఆ వ్యవధిలో అతను ఆ రెండు కళ్ళలోని అగాధమైన నిరాశల కారుణ్యాన్ని తప్ప అన్నిటినీ మరచిపోయాడు. ఒక్కక్షణం అతను ఆ అయిదు రూపాయలనోటు తనదేననీ, వాడు దాన్ని తన జేబులోంచి కొట్టేశాడనీ గ్రహించాడు. కాని మరుక్షణమే అతను అంతా మరచిపోయాడు. భూతవర్తమానాలు చెడిపోయి అతని కళ్ళముందు ఒక గోడ నిలబడింది. ఆ గోడ మీద రెండు మచ్చల్లా ఉన్న ఆ కళ్ళకేసి చూస్తూ నిలుచున్నాడు..
ఇంకా ఇలా రాస్తున్నాడు:
తన చేతిలో ఆ కర్రపుల్లలాంటి చెయ్యి ఎందుకున్నదో తను ఎందుకక్కడ నిలబడ్డాడో కూడా అతనికి తెలియలేదు. అతని మనస్సు ఒక్క క్షణం దిమ్మదిరిగిపోయి గాలివానల తరువాత పూలతోటలాగుంది. క్రమేపీ ద్వేషంలేని కోపం, ప్రత్యేకమైన లక్ష్యం లేని జాలి, జాలితో కూడుకున్న అసహ్యం, ఇంకా విడమర్చి చెప్పలేని అనేకమనోభావాలు దూరాన్నుంచి దగ్గిరగా వస్తున్న మహత్తర సంగీతంలా మెల్లగా పైకి పొంగుతున్న ఉత్తుంగ తరంగంలా లేచి విరుచకపడి అతని మనః స్థితిని ముంచెత్తాయి. వాటి బరువు కింద అతను అల్లల్లాడిపొయ్యాడు. వాటి బ్రహ్మాండమైన ఆకారం ముందు అతను విశ్వరూపాన్ని సందర్శించినవానిలా తన అల్పత్వాన్ని గుర్తించాడు. అతని మనసు ఒకరకమైన సంచలనంతో నిండిపోయింది. అది ఆనదం కాదు, విషాదం కాదు. నిర్లక్ష్యం కాదు. అది ఒక రకమైన మత్తుతో కూడుకొన్న ప్రశాంతి. అది విశాలమైన నిశ్శబ్దం. కాని అందులో వేలకొలది తంత్రులు జీవన్మరణాల చరమ సంఘర్షణలో అత్యతికానందంతో స్పందిస్తున్నయ్. ఒక్క క్షణం అతను దరిద్రం, సంపదలూ జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ అస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో ఒక మానవజీవి మాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు. ఒక్కక్షణం అతను తనే జేబుదొంగననీ ఆ కుర్రవాడి జేబు తనే కొట్టినట్టు అనుకొన్నాడు. ఈ భావం అతని ముఖం మీద అస్పష్టమైన చిరునవ్వు తెప్పించింది. అతని మనస్సులో ఒక అనూహ్యమైన మార్దవం, సర్వాన్నీ భక్షించి వేయగలిగిన వాత్సల్యం ప్రవేశించింది. ఈ విశాల భూతలం మీద కళ్ళు తెరిచిన మొట్టమొదటి రోజునుంచి నేటివరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. ఈ భూమి మీద తను బ్రతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు..
కథలోని ఈ భాగాన్ని ఇంత సుదీర్ఘంగా ఉల్లేఖించడానికి కారణం ఈ వాక్యాలు ఎవరికి వారు స్వయంగా చదువుకోవలసిందే తప్ప, ఈ ఘట్టంలో కవి అందుకున్న సత్యాన్ని paraphrase చెయ్యడం సాధ్యం కాదుగనక. కాబట్టి ఈ కథ చదివినప్పుడు, నాకు ఇది ఒక కవి మాత్రమే రాయగల కథ అనిపించింది. ఒక కథకుడు ఈ కథని ఇంకెలాగైనా రాసి ఉండవచ్చుగాని, ఇలా మాత్రం రాయలేడు. అసలు ఇటువంటి కథని ఎంపికచేసి, ఈ కథ ఉన్న తన సంకలనానికి, ‘కవులు రాసిన కథలు’అని పేరుపెట్టినందుకు సిద్ధార్థ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తాడని చెప్పగలను. నాగప్పగారి సుందర్రాజు రాసిన కథ కూడా ఇటువంటి దర్శనమే. అయితే, ఈ కథ మనల్ని ప్రశాంతివైపు నడిపిస్తుంది, ఆ కథ అశాంతి వైపు నడిపిస్తుంది, అంతే తేడా.
మరొక మాట కూడా చెప్పవచ్చును. మామూలుగా కథలు భూతకాల సంఘటనల నివేదికలు. కవితలు భూతకాలసంఘటనల గురించి రాసినప్పుడు కూడా వర్తమానాన్నే కొనసాగించే అనుభవాలు. కాబట్టి కవులు కథలు రాసినప్పుడు, ఆ కథలు, జరిగిపోయిన కథలుగా కాక, జరుగుతున్న అనుభవాలుగానే మనకు అనుభూతిలోకి వస్తాయని చెప్పవచ్చు. ఈ మాట సిద్ధార్థ చెప్పిన మాటనే. ‘ఈ కథల్లో ఎప్పటికీ వర్తమానమే ఉంది’ అని అన్నాడు ఆయన. ఈ సూత్రీకరణ గురించి కూడా మనం మరికొంత లోతుగా ఆలోచన చెయ్యవలసి ఉంది.
ఏదో ఒక theme ని ఎంచుకుని కథాసంకలనాలు తేవడం తెలుగులో కొత్తకాదు. కాని, ఒక సంకలనం ఇంతగా ఆలోచనలో పడేయడం మాత్రం నాకైతే ఇదే మొదటిసారి. ఈ అంశాలమీదా, ఇటువంటివే తమకి స్ఫురించిన మరిన్ని అంశాలమీదా, కవిత్వ పాఠకులూ, కథాపాఠకులూ కూడా రానున్న రోజుల్లో తమ ఆలోచనలు మరింత వివరంగా పంచుకుంటారని ఎదురుచూస్తున్నాను.
*








ఆలోచనాత్మక అభిప్రాయం.ఇందులోని లోతు ముగ్ధుణ్డి చేసింది. విస్తృతి జ్ఞానాన్ని పెంచింది.
శీర్షిక చర్చించేదిగా ఉంది.
కానుక మంచి కథ.
ధన్యవాదాలు