కొండ చిలువ మెళ్ళో వేసుకొని పాములోడు బర్మా క్యాంపు ఇళ్లముందు బూర ఊదుకుంటా ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్నాడు. పిల్లలంతా ఆ కొండ చిలువ పాములోడి వెనుక పరిగెడుతుంటే ఈ గోల భరించలేక వాడు ఒక్క సారి వెనక్కి తిరిగి చూసి … ‘పామును మీదకు వొదులుతాను పొండి అవతలకు’ అని భయపెడుతూ కొండ చిలువను ఇటు తిప్పాక “కొండ చిలువ నా వంక చూసేసిందిరోయ్ ” అని పిల్లలంతా ఒకటే పరుగు.
శ్రీహరిపురం బర్మా కాలనీ నుంచి వొచ్చిన నరాల అప్పలరాజు, నేను నూకాలమ్మ గుడి ముందు చింతపండు ముద్దలు అమ్ముతున్న బర్మా కాందిశీకురాలైన ముసిల్దాని దగ్గర పావలా పెట్టి ఒక చింతపండు ఉండ కొనుక్కొని, దానికి కారం ఉప్పు తగిలించి,రెండు ఈనుపు పుల్లలు గుచ్చి లాలీ పాప్ లా చేసుకొని తన్మయత్వంతో తింటూంటే.
జనం అంతా…. ” కొండ మీద విమానం పడిపోనాది…. అల్యూమినియం ముక్కలు ఏరుకు వొద్దాం పదండ్రోయ్ “అని ఒకటే పరుగు.
* * *
ఆ రోజు పొద్దున్న లేదా ప్రతిరోజు పొద్దున్న ఇంటి దడి కి కట్టగా మిగిలిన జీ ఐ వయిరు, కిటికీలకు రంగులు వేసాక అయిపోయిన పెయింట్ డబ్బాలు, ఇనప ముక్కలు అన్నీ పోగేసి వుంచాను
” ఇనుప ముక్కలకు బఠానీ …
ఇనుప ముక్కలకు బఠానీ … ” అని అరుసుకుంటూ ఒక ముసిలాడు ఒక కావిడి బద్ద రెండు తట్టలు వేసుకోని దిగబడ్డాడు.
మొదట తట్టలో పాత ఇనప సామాను వుంది రెండో పక్క ఒక పెద్ద డబ్బాలో వేడి వేడి బఠాణీ వుంది.
నా ఇనప సామానుకు ముసలాడు ఇచ్చిన బఠాణి తో వస్తు మార్పిడి అయిపొయింది.
నా నిక్కరు రెండు జేబుల్లో, చొక్కా జేబులో బఠాణీలు నిండిపోయాయి. అవి తినుకుంటూ అక్కయ్య ఇంటి దగ్గర కాసేపు, గుడి ముందు బాదం చెట్టు దగ్గర కాసేపు, అగ్ని గుండాలు తొక్కే దగ్గర క్రికెట్ ఆడి కాసేపు, అల్లూరి సీతారామరాజు నగర్లో పాకల దగ్గర కాసేపు, మాధవధార కొండల దగ్గర కాసేపు తింటూ గడిపేక అప్పటికి అయ్యేవి అవ్వగా మిగిలినవి సాయంత్రం చిత్రహార్ కో, చిత్రలహరికో పనికొచ్చేవి.
ఇంటిచుట్టుపక్కల, కప్పరాడ బడి నుంచి వొచ్చే దారిలోనూ దొరికే ఇనప ముక్కలు, జీ ఐ వైర్ లు ఏరుకొని రావడం వాటిని పాత ఇనుప సామాన్లు కొనే వాడి కోసం అట్టి పెట్టడం వాడు ఇచ్చే బఠానీ గింజలు, పీచు మిఠాయి, పప్పు చెక్కలు, కొబ్బరి బెల్లం ఇవన్నీ తీసుకొని వస్తు మార్పిడి చేసుకోగా రోజులు అనందంగా గడిచిపోతున్నాయి.
పాలిటెక్నిక్ కాలేజీ దాటుకొని, మంచు కొండ వారి గార్డెన్స్ దాటుకొని దారంతా వెతుక్కొని వొచ్చామా ఏదో ఒకటి దొరకక మానదు.
అదృష్టం బాగుంటే పాత రేడియోలో మాగ్నెట్ కూడా దొరకవొచ్చు.
కప్పరాడ బడి అవతల వున్న ఇండస్ట్రియల్ ఎస్టేటులో సిల్వర్ సామాన్లు చేసే కంపెనీ లో అల్యూమినియం ముక్కలకు బోలెడు డబ్బులు ఇస్తారట అన్నాడు మా బర్మా క్యాంపు ఫ్రెండు ” తేలు ” గాడు , తేలు వాడి ఇంటి పేరు ఆది పూర్తి పేరు నాకు గుర్తు లేదు.
అల్యూమినియం ముక్కలు మనకు ఎక్కడ దొరుకుతాయి ?, ఎక్కడ దొరుకుతాయి ? అని ఒక విధమైన యాతనలో వున్నపుడు జరిగిందిది.
బర్మా క్యాంపు వెనకాల సి ఐ ఎస్ ఎఫ్ క్యాంపు కొండ వెనకాతల పెద్ద కొండ మీద , జారుడు కొండ మీద, పిల్లలు ఎక్కలేని కొండ మీద, ఆకాశాన్ని తాకినట్లు వున్న కొండ మీద విమానం పడిపోయింది.
విమానం పడిపోతే “వొలమ్మోలమ్మ ఏ తల్లి కన్న బిడ్డడు సచ్చిపోనాడో “ అని ఏ అమ్మ ఏడిసిందో గుంటలకు అవసరం పడ లేదు, పడి పోయింది నావీ వాళ్ళ విమానం అని కూడా గుంట నా కొడుకులకు అవసరం లేదు, అసలక్కడ ఎవరైనా సచ్చి పోయారో, బతికున్నారో కూడా వాళ్లకి అవసరం లేదు.
” కొండమీద విమానం పడి పోయింది అల్యూమినియం ముక్కలు తెచ్చుకోడానికి పరిగెత్తాము ” అంతే .
పిక్క బలమున్న కుర్రాళ్ళు తెచ్చేసుకున్నారట అల్యూమినియం ముక్కలు.
కొండ ఎలా ఎక్కాలో, ఎక్కితే ఎలా దిగాలో, అల్యూమినియం ముక్కలు ఎలా దొబ్బుకొచ్చేయాలో మా గుంటలంతా నూకాలమ్మ గుడికాడ ఆలోచిస్తూ కిందా మీద అవుతుంటే తెచుకున్నోళ్ళు తెచ్చేసుకున్నారని ఒక పుకారు. నేను కానీ ,మా అల్లీ కాయల గుంటలు కానీ ఒక్కటంటే ఒక్క అల్యూమినియం ముక్క చూడలేదు.
ఆ తరువాత ఆ పెద్ద కొండ మీద రాత్రుళ్ళు దారిచూపించే ఒక పెద్ద ‘యెర్ర లయిటు’ పెట్టారని … ఆ రాత్రి… ఆ కాపలా విమానం పడిపోవడం వల్లే అక్కడ ‘లయిటు’ పెట్టారని అంటుంటారు. నిజమెంతో కంచరపాలెం మెట్టుమీద వున్న ముత్యాలమ్మకి, రాంమూర్తి పంతులు పేట కాడ వున్నపైడితల్లమ్మకి, బర్మాక్యాంప్లో వున్న నూకాలమ్మకి తెలియాలి.
ఈ నిజాల సంగతెలాగ వున్న ఆ తరువాత్తరువాత పాత ఇనుపసామాను వ్యాపారం కోట్లకు పడగలెత్తిందని, మా ఊరిని ఏలిన మేయర్ ఒకాయన పాత ఇనుపసామాను వ్యాపారంతోనే తన జీవితాన్ని ప్రారంభించాడని అంటారు. ఆ నిజాలు కూడా అమ్మవార్లకు తెలియాలి నాకైతే తెల్దు.
* * *
ఇప్పటికి క్యాంపు వొదిలి పెట్టి చాలా కాలమైనా చాలా పనులు , ఉద్యోగాలు, ఊర్లు మారినా ఎప్పుడైనా జీవితంలో కిందకు పడుతున్నాను అనే అనుమానం వొస్తున్నపుడు ఒక రాత్రి కలలో బర్మా క్యాంపు కొండ మీద నుంచి ఒక పాసెంజర్ విమానం కిందకు జారిపోతుంటుంది,
అందులో నేనుంటాను. స్పృహతో మేల్కొంటాను. బతకాలని పోరాటం చేస్తుంటాను, ఈలోగా కల చెదిరిపోతుంది. వాస్తవం కళ్లముందుంటుంది.
“కల”తో కూడా నన్ను వెంటాడే కొండ మీద విమానం నాకు ఇష్టం. ములక్కాడల చెట్లతో, బాదం చెట్లతో చల్లగా వుండే పాత బర్మా క్యాంపు అంటే ఇంకా ఇష్టం.
*
కొండ మీద విమానం కధ చాలా బాగుంది. విమానం పడిపోయినప్పటి హడావిడి,పరిస్థితులను కధలో చక్కగా వివరించారు. రచయిత హరివెంకతరమన అభినందనీయులు.
ధన్యవాదాలు కోరాడ రాంబాబు గారు.
Dear Writer, simply enjoyed your writing based on your previous living area of Visakhapatnam.
while reading I literally felt that you were maximum enjoyed your life during your stay at Kapparada and Barma Camp areas.
i truly enjoyed your writing. once again you had taken me back to 90’s early
good luck for your next article based on true living..
Dear Sri Uppuleti Ratnam garu thank you for your review on story
Very good hari garu your childhood memories
.
Thank you so much dear D Y Naidu garu
ఎప్పటి బర్మా కేంపు. ఏనాటి విశాఖపట్నం. డెబ్బయ్యవ దశకంనాటిదా? మాధవధార, రామ్మూర్తిపంతులు పేట. కంచరపాలెం? ఈ పేర్లింకా వాడుకలో ఉన్నాయా లేకపోతే ఎల్లమ్మతోట జగదాంబ జంక్షన్ అయినట్టూ, చావులమదుం కాన్వెంట్ జంక్షన్ అయినట్టూ పేర్లు మార్చేసుకున్నాయా? చూస్తుండగానే, కళ్ళముందు కరిగిపోయిన విశాఖపట్నం. కథమాట ఎలా ఉన్నా, విశాఖపట్నం జ్ఞాపకాల్ని మరొకమారు రేపి వదిలిపెట్టింది. అందుకు కృతజ్ఞతలు రచయితకి.
ఈ కథలన్నీ 1984 – 87 ప్రాంతంలో జరిగినవి, ఆ అయిదు సంవత్సరాలు మాత్రమే మేము బర్మా క్యాంపులో వున్నాము.
కంచరపాలెం, రామూర్తి పంతులు పేట పేర్లు మారలేదు.
పరమేశ్వరీ థియేటర్ మరిచి పోయారు అది కాస్త ఊర్వశీ జంక్షన్ అయ్యిపోయింది.
ఈ మధ్యనే మూలవాసులు వెడల్పు చేసిన చెట్టు నీడ లేని రోడ్లమీద, అపార్టుమెంట్ల పక్కన తమ గ్రామ దేవతల పండగలు చేసుకున్నారు.
బహుశా ఇంకా కొన్ని తరాలు కొనసాగిస్తారేమో కూడా..
అయితే బర్మా కాందిశీకుల ఇళ్ళు మాత్రం ఎక్కడా కానరావు, నూకాలమ్మ గుడి ఎదురుగా ఒక బుద్ధిని విగ్రహం తప్ప.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు .
Excellent hari Garu hearty Congratulations
బర్మాకేంపు కథలు / నేపధ్యం
బర్మాకేంపు ఒక చిత్రమైన ప్రాంతం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినపుడు 1939నుంచి 1945 మయన్మార్ లో తెలుగువాళ్లు ఇండియా వొచ్చేసారు. భారతదేశం నుండి ఉపాధి, వ్యాపార నిమిత్తం మయన్మార్ వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి ఓడల్లో వచ్చేసారు,రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నం తుమ్మడ పాలెంలో, నవాబుపేటలో ఒక మిలటరీ కేంపు, తాటిచెట్ల పాలెం దగ్గర మిలటరీ కేంపు పెట్టారని అంటారు, యుద్ధం అయిపోయాక తెలుగువాళ్లు తిరిగి బర్మా వెళ్లిపోయారు.
1962 సంవత్సరo బర్మాలో మిలటరీ అధికారంలోకి వొచ్చింది , తెలుగువాళ్లను భారతదేశం వెళ్లిపోమంది. ఓపిక తో ఓడల్లో చేరినవారు చాలామంది, శక్తి ఉండి అక్కడనుంచి విమానాల్లో కలకత్తా వొచ్చి రైళ్లో విశాఖపట్నం చేరినవాళ్లు మరికొంతమంది.
ఇండియా చేరిన కాందిశీకులకోసం అప్పటి ప్రభుత్వాలు దేశంలో ఆశ్రయం కల్పించాయి ,విశాఖపట్నంలో కూడా వారికి ఆశ్రయం కల్పించాయి. ప్రధానమైనది కంచరపాలెం దగ్గర బర్మాకేంపు మిగతావి ఐ టి ఐ జంక్షన్ దగ్గర సిధార్థ నగర్, గంట్యాడ, శ్రీహరిపురం ,అనకాపల్లి, యలమంచిలి దగ్గర ఉన్నాయి.
కాందిశీకుల కోసమే ఉన్న ఈ కంచరపాలెం బర్మాకేంపు చుట్టూ తరువాత మిగతా కుటుంబాలు కూడా చేరాయి. ఈ కాందిశీకులలో ఎక్కువ మంది విశాఖ జిల్లా నుంచి వెళ్లిన వాళ్లే మరికొంత మంది ఇతర జిల్లాల వాళ్లు. శెట్టిబలిజలు, వెలమలు, వాడ బలిజలు, కాపులు, గవరలు ,రెల్లీలు ,దళితులు ఇలా అన్ని కులాల వాళ్ళు వున్నారు.
కాందిశీకులుగా ఇక్కడకు వచ్చినా బర్మా వాళ్లలాగా ప్రత్యేకమైన వారిగా భావిస్తూ గొప్పలు పోవడం, అక్కడి కట్టూ బొట్టూ పూర్తిగా మారకపోవడం, అక్కడ బాగా బతికి ఇక్కడ ఇమడలేక ఇబ్బందులు పడటం, మోసపోవటం,మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకోవటం, ఆత్మగౌరవం అదంతా బర్మా కాందిశీకులు జీవితం .
బర్మా సేమ్యాలు, నాను రోటీలు, నూడుల్సు , మోయింగా ,బర్మా లుంగీలు, పెద్దవారికి బర్మా భాష రావడం, సాయంత్రం అయితే చాలు నీసు కూరలు, ఇళ్ల చుట్టూ ములక్కాడ చెట్లూ, బాదంచెట్లూ, బౌద్ధం ఆచరించడం,ఇక్కడ దుర్గాదేవికి, సంతోషిమాతకు,నూకాలమ్మ దేవతలకు పూజలు, వినాయక చవితికి పందిర్లు, పండగలన్నీ ఒక సంబరంలాగా చేయడం. ఇంకా రోడ్ల మీద కొట్లాటలు, రౌడీయిజం ,ఆడాళ్ల బూతులు, బోరింగ్ దగ్గర గొడవలు, ఆప్యాయతలు అదో ప్రత్యేకమైన ప్రపంచం.
‘కేంప్’ చుట్టూ వున్న ప్రజల జీవితాలు, వైవిధ్యమైన జీవితం, ఉత్తరాంధ్ర అలవాట్లు ఈ కథల్లో పంచుకుందామని నా ప్రయత్నం. ఈ కథలన్నీ ఎనభైయ్యో దశకం చివరి ప్రాంతానికి చెందినవి, అప్పటి మనుషులవి.
చక్కని వివరణ తో అందంగా రాశారు హరిగారు
చాలా థ్రిల్లింగ్ గా వ్రాసారు హరి గారు. చిన్నప్పుడు మన జీవితాల్లో జరిగిన మరచిపోలేని సంఘటనలు జీవితంలో తర్వాత రోజుల్లో కలల రూపంలో గుర్తుకొస్తూనే ఉంటాయి. నావరకు కలల్లో ఒక ఇల్లు అంటూ వస్తే..అది నేను చిన్నప్పుడు పుట్టి పెరిగి, SSLC వరకు చదువుకున్న మా పాతకాలపు ఇల్లే వస్తుంది తప్ప, తర్వాత కాలంలో కట్టుకున్న, అమ్మేసిన, మళ్లీ కొనుక్కున్న ఇళ్ళు రానేరావు. కొండమీద విమానం, జీవితంలో ఒడిదుడుకులకు symbalic గా చెప్పడం చాలా బాగుంది.
మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు రామశర్మ గారు,
చాలా బాగుంది సార్ హరి గారికీ హృదయ పూర్వక అభినందనలు బర్మా క్యంపు కథలు చాలా బాగున్నాయ్ చిన్న నాటి జ్ఞాపకాలు ఈ కధలో చాలా చక్కగా రాశారు ప్రతి విషయం స్పష్టంగా రాసారు చాలా బాగుంది సార్ మిత్రులు శ్రీ హరి గారికీ హృదయ పూర్వక అభినందనలు 🙂👌👌👌🤝🙏👏👏👏💕💕🎉🎉🎉
ధన్యవాదాలు మిత్రమా
ద్వారపూడి శ్రీనివాస్
Vedi vedi batanilu,vimanam padipothe avarina chanipoyara anedhe lekunda atuvante alochana anedhe rani okka amayakathavam ani ana vachhu story mothsm kuda appudu doriki tene items gurinchi chala baga chepparu.
ధన్యవాదాలు కృష్ణ కుమారి గారు.