కవిత 2018 :వివేచన, దిద్దుబాటు, వడపోత

ఒక సున్నితమైన విషయాన్ని చెప్పడానికి ఏ భాష కావాలి? ఒక ఆగ్రహ సందర్భానికి ఏ భాష సముచితమైంది?

జీవితాన్ని అర్థవంతం చేసేది కళ. ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, సమాజ జీవితాన్ని కూడా.

కవిత్వం ఒకానొక కళ. అది మనిషి జీవితాన్ని ఉద్వేగపూరితంగా ప్రభావితం చేసే కళ. అది ఏ ఆకాశం నుంచో ఊడిపడదు. జీవితం నుంచే ఉద్భవిస్తుంది. వాస్తవం నుంచి కావొచ్చు. వూహ నుంచి కావొచ్చు. లేక వూహను మిళితం చేసుకున్న వాస్తవం నుంచైనా కావొచ్చు.

కవిత్వానికి ముఖ్యమూలకం శబ్దం. కవి నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమైంది శబ్దాల ఎంపిక. తను అందించదల్చిన భావనకు, ఆలోచనకు, ఉద్వేగానికి అనువైన భాషను కవి ఎంచుకుంటాడు. భాష ఒక వాహిక. కవి తనకు తెలియని శబ్దాన్ని ఎంచుకోలేడు. అంటే తన పదసంపద మీదే అతను ఆధారపడతాడు. నిత్యకృషీవలుడైన కవి తన పద సంపదను పెంచుకుంటూ పోతాడు, జీవితావగాహనతో పాటు. అది పుస్తకాల నుంచే రానక్కర్లేదు. ప్రజల పలుకుబడి నుంచి కూడా స్వీకరిస్తాడు. ప్రేమలేని చోట స్వీకరణ లేదు. ప్రజల పలుకుబడిని ప్రేమించలేనివాడు దాన్నుంచి ఏమి స్వీకరించగలడు? అర్థవంతమైన భావప్రసారాన్ని కోరుకునే కవి తన వస్తువు పట్ల ఎంత స్పష్టతతో వుంటాడో, భాష పట్లా అంతే అప్రమత్తంగా వుంటాడు. ఔచిత్యవంతమైన మాటల కూర్పుకై సాధన చేస్తాడు.

ఔచిత్యం కేవలం పదాన్వయానికి సంబంధించిందే కాదు, పద బాహుళ్యానికి సంబంధించింది కూడా. ఓ వంద మాటల్లో చెబుతున్నదాన్ని, బహుశా ఓ ఇరవై శక్తివంతమైన మాటల్లోనే కుదించి చెప్పే వీలుండొచ్చు. లేదా, ఓ ఇరవై మాటల్లో చెబుతున్న దాన్ని, మరొక ఐదో ఆరో అన్వయపూర్వకమైన మాటల జోడింపుతో మరింత మంచి కవితగా మలచొచ్చు. ఈ శబ్ద ధ్యాస కవిత్వ కళానిర్మాణంలో చాలా కీలకమైంది.

ఒక సున్నితమైన విషయాన్ని చెప్పడానికి ఏ భాష కావాలి? ఒక ఆగ్రహ సందర్భానికి ఏ భాష సముచితమైంది? ఒక దుఃఖమయ వాతావరణాన్ని రూపుకట్టడానికి ఏ భాష తడిని సమకూరుస్తుంది? ఈ వివేచన కవిని ఒక అన్వేషణకు పురిగొల్పుతుంది. అంటే వస్తువుకవసరమైన భాషకోసం కవి అన్వేషిస్తాడు. ఈ అన్వేషణ తానింతకు మునుపే కూర్చుకున్న పదసంపదలోకి కావచ్చు, లేక బయట అనంతంగా పరుచుకున్న పదసంపదలోకి కావచ్చు. విస్తారంగా సాహిత్యాధ్యయనం చేసే కవికి, విస్తారంగా ప్రజా జీవితంతో సంబంధాలు పెట్టుకునే కవికి ఈ అన్వేషణ కష్టమైందేమీ కాదు, పైగా ఇష్టమైంది అవుతుంది. అట్లాంటి అన్వేషణ ద్వారా సాధనతో తనకు కావాల్సిన భాషా సామాగ్రిని సమకూర్చుకోగలడు.

భాషలో వాడే అలంకారాలు గానీ, భాష ద్వారా రూపొందించే పదచిత్రాలు గానీ కవి తలపెట్టిన భావ ప్రసారాన్ని సులభతరం చేసేవిగా వుంటే ప్రయోజనకరం. బహుళాలంకార ప్రయోగం ఒక్కో కవితకు ఒప్పక పోవచ్చు. అట్లాగే, కిక్కిరిసిన పదచిత్రాలు ఒక్కోసారి కవితను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. ఏ ప్రయోగానికైనా అన్వయమే ప్రధానం. వస్తువు గుణానికి పొసగని అలంకారాలు పైపైకి మెరిసినట్లు వుండొచ్చు, కాని అవి కవిత్వ సహజకాంతిని నిజానికి మసక బార్చొచ్చు. ఒక్కోసారి నిరలంకారంగా సాగే కవిత అద్భుతంగా వుండొచ్చు, భావప్రసారంలో. కవితకు క్లుప్తతాగుణం బిగినిస్తుంది కనుక, దానికవసరమైన అలంకార సరంజామాను కవి వెతికి వెతికి తెచ్చుకోవాలి. ఒక ప్రత్యేకమైన అలంకారం పట్ల గానీ, ఒక ప్రత్యేకమైన శబ్దజాలం పట్ల గానీ కవికి చెప్పలేనంత మమకారం ఉండొచ్చు కానీ అదే అతనికి సంకెల కాకూడదు. ఒక నిర్దిష్టమైన కవితను నిర్మించేటప్పుడు, కవికి తనకున్న భాషా మమకారం కన్నా, ఆ కవిత కవసరమైన భాషా వాతావరణమేమిటన్న ధ్యాస ఎక్కువ అవసరమనుకుంటాను.

ఒకానొక మానసిక స్థితిలో, ఒకానొక కాలవేళలో ఒక కవితను కవి నిర్మిస్తాడు. దాన్నే మరొక స్థితిలో మరొక కాలవేళలో మళ్లీ పరిశీలించుకుంటే మంచిది. అపుడు దాన్లోంచి కొన్ని మాటలు తీసేయాలన్పించొచ్చు. లేదా, కొన్నిటిని చేర్చాలనిపించొచ్చు. మరికొన్ని సార్లు అదే కవితను దర్శించినపుడు మరికొన్ని మార్పులు అవసరమన్పించొచ్చు. కవి ఏకకాలంలో కవిగానూ, చదువరిగానూ వ్యవహరించగలిగినపుడే ఈ పునర్దర్శనాలు సాధ్యమవుతాయి. ఐతే ఏ సవరణలైనా అంతిమంగా కవితలోని జీవగుణాన్ని మెరుగు పరిచేవిగా వుంటేనే కదా ప్రయోజనం!

లయ లేకుండా ఏ కవిత్వమూ లేదు. ఈ లయను సాధించడానికి ఒక్కోసారి భావనా పటిమ వనరుగా పనికొస్తే, చాలా సందర్భాల్లో ఔచిత్యవంతమైన భాష మంచి ఉపకరణమవుతుంది. ఈ లయ కళా ప్రయోజనాన్ని ఇనుమడింపజేస్తుంది కనుక, తన కవితల్లో అది వినపడుతుందో లేదో చూసుకోవాల్సింది కవే. లయను భగ్నపరిచే పదబంధాల్నీ, దుష్ట సమాసాల్నీ, అనవసర వ్యక్తీకరణల్ని పరిహరించు కోవడానికి అతను సంసిద్ధంగా వుంటే మంచిది. కవితా శీర్షికలోనూ గొప్ప లయను పలికించే కవులున్నారు. శీర్షిక నుంచి ముగింపు శబ్దం దాకా సాగే నిర్మాణ ప్రయాణంలో కవి ఏకాగ్రతను పాటిస్తేనే లయ సాధ్యమవుతుంది. ఎంత అనుభవమున్న కవికైనా ఈ ఏకాగ్రత అవసరమే. అలక్ష్యం వహిస్తే కవితలో అది స్ఫుటంగా అగుపడుతుంది. ఏ కళైనా నిర్లక్ష్యాన్ని సహించదు.

ఈ సంకలనం కోసం 2018వ సంవత్సరంలో వివిధ పత్రికల్లో (వెబ్‌ సంచికల్తో సహా) అచ్చయిన వందల కవితల్ని పరిశీలిస్తున్నప్పుడు, వాటి నిర్మాణ గతుల్ని చూసినపుడూ, నాలో లేచిన ఆలోచనల్నే పై పేరాల్లో రాశాను. అభివ్యక్తి విషయంలో చాలా కవితలు పలుచగా కన్పించాయి, 2018లో అచ్చయిన వాటిలో. వస్తువైవిధ్యం విషయంలో మన కవిత్వం బహుముఖీయంగా వుంది. ఇదొక సుగుణం. కవి తన అంతర్లోకాల ఉద్వేగాల్తో పాటు చుట్టూ వున్న ప్రపంచంలోని చలనాల్నీ, దుర్మార్గాల్నీ, ఆధిపత్యాల్నీ, అహంభావాల్నీ, పాలక స్వభావాల్నీ, సామాన్య జీవితంలోని దుఃఖాల్నీ అక్షరీకరిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. సున్నిత విషయాలకు ఆకులా కదలిపోతున్నాడు. ఐతే అనువైన అభివ్యక్తి గాఢతలేని కవిత్వం ఎక్కువకాలం నిలువదు. చదువరులతో ప్రగాఢ సంబంధాన్ని అది ఏర్పరచుకోలేదు. మననయోగ్యం కాదు.

ఈ ‘కవిత్వం 2018’ సంకలనం కోసం కవితల్ని ఎంచుకునే క్రమంలో నేను వస్తు విశిష్టతనే కాక, అభివ్యక్తినీ పట్టించుకున్నాను. ఐతే నేను ఎంచుకున్న ఈ అరవై కవితల్లో ఈ రెండంశాలు సమాన దార్డ్యతతో వున్నాయని అనలేను. కొన్నిట్లో భావనాశక్తి బలంగా వుంటే, మరికొన్నిట్లో అభివ్యక్తిధార నైపుణ్యంతో వుంది. ఐతే కవితలో కవిత్వ కళాగుణం వుండి తీరాలనే ప్రమాణాన్ని పాటించే ప్రయత్నం చేశాను. దీర్ఘకాలంగా కవితా వ్యాసంగంలో వున్నవాళ్ల కవితల్తో పాటు, కొత్త యువ కవుల కవతల్ని కూడా ఈ సంకలనంలో చేర్చాను. యువకవుల స్వరాల్లోని భిన్నత్వాన్ని వాళ్ల కవితల్లో చూడొచ్చు. ప్రతి కవితా నిండైన కవితాత్మకతతో అత్యద్భుతంగా వుండాలని ఎవరైనా కోరుకోవడం తప్పుకాదు కానీ, వాస్తవంలో ఏ కాలంలోనూ అది సాధ్యపడలేదన్నది ఒక సత్యం. మంచి సమాజంకోసం కవిత్వం తనదైన ఒక పదునైన మాటను ఆలోచనగానో, వూహగానో, ఔషధంగానో, ఆయుధంగానో అందిస్తున్నదా అన్నదే ప్రశ్న. ఈ విషయంలో నేను దిగులు పడట్లేదు. వర్తమాన తెలుగు కవిత్వం స్థూలంగా సమాజహితంగానే వుందని భావిస్తున్నాను. ఐతే సూక్ష్మస్థాయిలో ప్రతికవీ తన ప్రయాణంలో ఎంతో వివేచన, దిద్దుబాటు, వడపోత తర్వాతనే తన కవిత్వాన్ని ప్రపంచానికి అందించే కళాక్రమశిక్షణను అలవాటు చేసుకోవడం మంచిదనీ, అది ఒక బాధ్యత అనీ నేను భావిస్తున్నాను.

నా దృష్టిలో విశిష్టమనిపించిన అరవై కవితల్ని ఇందులో చేర్చాను. ఇదే సర్వసమగ్ర సంకలనమని నేను భావించడంలేదు. ఇతరుల దృష్టిలో అనేక ఇతర కవితలు విశిష్టంగా వుండొచ్చు. కవిత్వం పట్ల ఇష్టమున్న ఒక కళాపిపాసిగా నేను చేసిన ప్రయత్నమే ఈ సంకలనం.

*

దర్భశయనం శ్రీనివాసాచార్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు