అనంత శూన్య అంతరిక్షంలో
ఆకాశానికి అన్నీ కళ్లే
చెల్లా చెదురై ఘనీభవించిన
వాటి కన్నీటి బొట్లేమో
అన్నన్ని గ్రహాలు
అవి
దుఃఖాశ్రువులో
ఆనందభాష్పాలో
అవి ఎన్నెన్నో
ఏ గణితాలూ చెప్పవు
మిలమిలమెరిసే నక్షత్రాలన్నీ
ఆనందాశ్రువులేమో
మెరవని రాలిపడే కన్నీళ్లన్నీ
రాళ్లూ రప్పలేనేమో
తెలియని తెలుసుకోలేని వాటి
ఎన్నెన్ని కథలో
ఒకదానికొకటి
కలుసుకోకుండా తెలుసుకోకుండా
ఏమీ చేయలేని
కన్నీటిబొట్లుగా జారిపడటం
ఎలానో ఎందుకో
దేనిని గుర్తుచేస్తూనో
ఆరిపోని తుడిచేయలేని
కన్నీటిబొట్లు
దేనిలో జీవం ఉందో
ఏ రకం జీవితమో
పరిశోధనలూ తవ్వకాల్లో
ఎన్నెన్ని లాభాలున్నాయో
ఎవరికి ఎరుక
కన్నీళ్లకైనా
వేటికైనా
*
Add comment