కనులకుఁ దోచీ ఊహ కందనీ

“తామిద్దరూ ఒకరికొకరుగా మిగిలిపోవా లనుకోవడం స్త్రీవాద మెలా అవుతుందంకుల్?” అన్నారు పద్మజ ఆశ్చర్యంగా.

“రతి కనిపించింది,” అన్నారు కేశవ్.

ఆ రెండు మాటలనీ ఆయన అంత పెద్దగా అనలేదు. అయినా అవి అక్కడున్న మిగతా అయిదుగురి చెవులలో పడడంవల్ల కావచ్చు వాళ్ల మధ్య సంభాషణ ఆగిపోయింది.

” ‘శూన్యం లోంచి వెలువడిన సంగీతం అతణ్ణి తాకింది’ అని ఈమధ్య పద్మజ ఎక్కడో చదివిందట! అంత పొంతన లేకుండా వుంది మీరన్న వాక్యం,” అన్నారు హరి.

“మీకు రతి గుర్తులేదా?” అన్నారు కృష్ణ ఆశ్చర్యంగా.

“పెళ్లయి ఆరేళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు!” సన్నటి నవ్వుతో నసిగారు హరి.

“ఏమో, అది గుర్తుగా మాత్రమే మిగిలిపోయి ఎన్నాళ్లయిందో మాకేం తెలుసు?” అన్నారు చక్రపాణి. హరి తప్ప అందరూ గొల్లున నవ్వారు.

“ఒకవేళ నువ్వన్నదే నిజమయితే, నువ్వే మయినా ఆర్చేవాడివా లేక తీర్చేవాడివా బాబాయ్?” హరి అడిగారు.

“అయ్యా చక్రపాణి గారు, ఆ విషయంలో మాత్రం మీరు చేతు లెత్తక తప్పదు!” అన్నారు మాధవ్.

“అతను ఈ ఊరొచ్చింది అయిదేళ్ల క్రితం అనుకుంటా కదా, అందుకనే తెలిసే అవకాశం లేదనుకుంటా,” అన్నారు ముకుంద్.

“రతి, పతి మీకు నిజంగా తెలియదా?” అపనమ్మకంగా అడిగారు కృష్ణ.

“రతిపతి అంటే మన్మథుడు అని మాత్రం తెలుసు,” జవాబిచ్చారు హరి.

“ఈ రతి హారతిలో రెండొంతులు. అలాగే, పతి శ్రీపతిలో – అర్థమయిందా?” అడిగారు చక్రపాణి. అయిందన్నట్లు హరి తలాడించారు.

“ఆమె ఒక్కదాన్నే చూశారా లేక ఆమె ఒక్కర్తే కనిపించిందా?” అడిగారు ముకుంద్.

“శ్రీదేవీ, బోనీ కపూరూ ఒకేసారి కనిపించినప్పుడు మీ చూపు ఎవరిపైన ఉంటుందో చెప్పండి. అది మీ ప్రశ్నకి సమాధాన మవుతుంది,” అని కేశవ్ వైపు తిరిగి, “అంతే నంటారా లేక అసలు అక్కడ బోనీయే లేడంటారా?” ప్రశ్నించారు మాధవ్.

“అదొక ట్రాజెడీ కేస్!” గంభీరంగా అన్నారు కృష్ణ.

“పతి పోయాడు,” అన్నారు ముకుంద్.

“పతి వున్న ట్రాజెడీ కేసులు లక్షల్లో ఉన్నయ్యంటుంది పద్మజ!” అన్నారు హరి.

“స్త్రీవాద కథలు మరీ ఎక్కువ చదవడంవల్ల ననుకోండి,” అన్నారు చక్రపాణి.

“ఇదికూడా అలాంటి కేసేనని ప్రత్యక్ష సాక్షుల కథనం,” అన్నారు మాధవ్.

“ముకుంద్ అడిగిన ప్రశ్న అసంగతం కాదు,” అన్నారు అప్పటిదాకా మౌనంగా వున్న కేశవ్.

“అయ్యా, టీవీ భాషలో కాకుండా కాస్తంత తెలుగులో మాట్లాడండి,” ఆదేశించారు ముకుంద్.

“రతినీ, ఆమె పతినీ చూశాను,” అన్నారు కేశవ్.

“శ్రీపతి కాని పతిని,” అన్నారు చక్రపాణి.

“ఎంత అమెరికా అయినా గానీ ఇండియన్ ఆడవాళ్లకి రెండవ పెళ్లి అంత తేలిక కాదు,” అన్నారు కృష్ణ.

“అతను భర్తే కావాల నేమున్నది?” హరి పాయింట్ లేవదీశారు.

“ఆమె ప్రెగ్నెంట్!” అన్నారు కేశవ్.

“నా ప్రశ్న జవాబు కొరకు వెయిట్ చేస్తోంది,” అన్నారు హరి సన్నగా నవ్వి.

“వాళ్లని కలిసింది మా అక్కయ్య కూతురి ఇంట్లో సత్యనారాయణ వ్రతమప్పుడు,” అన్నారు కేశవ్.

“ఎడిసన్లో వుంటారు, వాళ్లేనా?” అన్నారు మాధవ్.

“దట్ స్టిల్ డజన్ట్ ఆన్సర్ ది క్వశ్చన్,” హరి రెట్టించారు.

“ఎంత అమెరికా అయినా, పెళ్లి కాని గర్భవతులని సత్యనారాయణ వ్రతానికి ఎవరయినా పిలుస్తారా? కొంచెం ఆలోచించండి సార్!” అన్నారు ముకుంద్.

“శ్రీనిధి గూర్చేనా మాట్లాడుతోంది? రెస్టన్లో వుండేవాళ్లు, వాళ్లేనా?” అన్నారు చక్రపాణి.

“శ్రీనిధి కొలీగేగా రతి – అదే హారతి?” అన్నారు ముకుంద్.

“ఆ అమ్మాయి వల్లేగా మనకి రతిపతుల విశేషాలు తెలిసిందీ తరువాత వాళ్లని కలిసిందీ కూడా!” అన్నారు కృష్ణ.

“నేను కాచప్ చెయ్యాల్సింది చాలా ఉన్నదన్నమాట!” అన్నారు హరి.

“ఆగండాగండి. అందరి గ్లాసులూ, బీర్లూ ఓకేనా లేక రీఫిల్ కావాలా? ఆయన మొదలుపెడితే బ్రేక్ వచ్చేటప్పటికి ఎంతసే పవుతుందో తెలియదు,” కేశవ్ నోరు విప్పబోతుంటే కృష్ణ అడ్డం తగిలారు.

“ఈసారి మీ ఇంట్లో పార్టీ మెమొరబుల్‌గా ఉండేట్లుంది. ఎవరికి కావలసినవి వాళ్లు తెచ్చుకుంటారు గానీ, మీరు రిలాక్సవండి. మీరు మొదలుపెట్టండి కేశవ్ గారు,” అన్నారు చక్రపాణి.

“ఇంతకీ ముందిది చెప్పండి, రతి సంతోషంగా ఉన్నదా?” అన్నారు మాధవ్.

“అయ్యా, ఒక విన్నపం. నేను మధ్యమధ్యలో రతి సంతోషంగా ఉండక దుఃఖపూరితంగానో, లేక వ్యధాభరితంగానో ఉంటుందా అని ప్రశ్నలు వెయ్యకుండా ఉండాలంటే ఆమె పూర్తిపేరుని వాడండి, ప్లీజ్!” చేతులెత్తి దణ్ణం పెడుతూ అన్నారు హరి.

“ఎందుకుండదూ, వెన్ వాటీజ్ గుడ్ ఫర్ ది గాండర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది గూస్?” అన్నారు చక్రపాణి.

“మొదటిసారి వాళ్లు మాకు మా ఇంట్లో కనిపించగానే వాళ్లకి ఆ నామకరణం చేసింది ఈ ముకుంద్ గారే, అప్పటినించీ అలా అలవాటయిపోయింది,” అన్నారు కేశవ్.

“సదా మీ సేవలో. ఇప్పుడు, కృష్ణగారు సతీమణితో కలిసి ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు రాధాకృష్ణులు వచ్చారు అని అంటామా లేదా? అలాగే రతిపతులు అని ప్రపోజ్ చేశాను, మిత్రుల కది నచ్చి వాడుకలో పెట్టారు,” అన్నారు ముకుంద్.

“ఇక్కడున్నప్పుడు ఆమె సంతోషంగా ఉండేదని మనకు ఋజువు లున్నయ్యా?” ప్రశ్నించారు కేశవ్.

“ఈ తెలుగువాళ్లల్లో ఇదే జబ్బండీ, ప్రతి ఒక్కళ్లూ లాయరే, కోడిగుడ్డుకు ఈకలు పీకేవాళ్లే! రతి అనేది మనిషి పేరయ్యా బాబూ అంటుంటే దాన్నక్కడ వదిలెయ్యకుండా సాగదీసేవా ళ్లొకరు, ఋజువులు కావాలనేవా ళ్లింకొకరు” కొద్దిగా చికాకుగా అన్నారు కృష్ణ.

“హోస్టుకు కోపం తెప్పించకండి, మీరు కానివ్వండి సార్!” అన్నారు ముకుంద్.

“అది కాదు కృష్ణగారూ, ఇప్పుడు, మీరూ, రాధగారూ సంతోషంగా ఉండేవాళ్లా అనెవరయినా ఇక్కడున్న మిగతా అయిదుగురిలో ఒకళ్లని అడిగారనుకోండి, మీరిద్దరూ మాట్లాడుకోవడం చూశాం గనుక అవును, అని ఖచ్చితంగా చెప్పగలం కదా? ఆ రతిపతు లిద్దరూ మాట్లాడుకోవడం మనలో ఎవరం చూశామో చెప్పండి?” కేశవ్ కొంచెం గట్టిగానే జవాబిచ్చారు.

“వాళ్ల మధ్య సైలెన్స్‌ని మన ముకుంద్ గారే మొదట అబ్సర్వ్ చేసింది,” అన్నారు చక్రపాణి.

“అంతకు ముందు ఎన్నిసార్లలా జరిగిందో తెలీదు గానీ, మొదటిసారి గమనించిన తరువాత రెండుమూడు సార్లు ఖచ్చితంగా ప్రూఫ్ దొరికిన తరువాతే మీతో ఆ విషయాన్ని షేర్ చేసింది,” అన్నారు ముకుంద్.

“ఈయన అబ్సర్వేషన్నించీ ఏదీ తప్పించుకోలేదండోయ్!” అన్నారు మాధవ్.

“తర్వాతి నించీ, వాళ్లు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడూ, వెళ్లడానికి బయలుదేరినప్పుడూ మేం అందరం మా కళ్లతో ఋజువు చేసుకునేవాళ్లం,” అన్నారు కృష్ణ.

“నాక్కొంచెం అర్థ మయేలా చెప్పండి బాబూ,” అన్నారు హరి.

“అది కాదండీ, ఇందాక మీరూ, పద్మజగారూ లోపలకి అడుగు పెడుతున్నప్పుడు, ‘కోటు తొందరగా విప్పి దీన్నెత్తుకోండి. మొయ్యలేకపోతున్నాను. అయినా, మీరు ఎత్తుకోకుండా నా చేత మోయించారు!’ అని పద్మజగారు అన్నారు గదా? మా చెవిన పడిందిలెండి,” అన్నారు ముకుంద్ నవ్వుతూ.

“అలాగే, ‘ఇక వెడదామా?’ అని మీరో లేక ఆవిడో చివరకి అడుగుతారు గదా? దానికి రెండవవారు ‘కాసేపు కూర్చుందా’మనో లేక ‘సరే!’ అనో జవాబు చెబుతారు గదా! వీళ్లలా కాదు. శ్రీపతి లేచి నిల్చోగానే హారతి ఎలాంటి సంభాషణ లేదా చర్చలో ఉన్నాగానీ చటుక్కున లేచి నిలబడేది. లేదా, ఆవిడ లేవగానే ఇతనూ బయల్దేరేవాడు. అప్పటినించీ ఇంటి బయటకు అడుగుపెట్టేదాకా వాళ్ల మధ్యలో ఒక్కమాట కూడా నడిచేది గాదు,” అన్నారు మాధవ్.

“ఎవరయినా అడిగే ప్రశ్నలకి ముక్తసరిగా జవాబిచ్చేవాళ్లు తప్ప వాళ్లంతట వాళ్లు ముకుంద్ గారి లాగా లొడలొడమంటూ మాట్లాడింది లేదు,” అన్నారు కేశవ్.

“పార్టీకి లైఫంటూ ఒకళ్లు ఉండాలి గద సార్?” అన్నారు ముకుంద్.

“కానీ వాళ్లు ఒకళ్ల కొకళ్లు పరిచయ మయేదాకా మిగతావాళ్లతో అంత ముక్తసరిగా ఉండేవాళ్లు కారని శ్రీనిధి చెప్పింది,” అన్నారు చక్రపాణి.

“పెద్దలు కుదిర్చిన పెళ్లా? అంటే, ఇండియాలో పెద్దవాళ్లు జాతకాలూ అవీ చూసి వీళ్లని కలవమని చెబితే కలిసిన కేసా అని,” హరి అడిగారు.

“కాదు. ఇద్దరినీ కలిపింది తనే నన్నది శ్రీనిధి. ముగ్గురూ రెస్టన్లో ఫానీ మేలో పనిచేసే రోజుల్లో,” అన్నారు మాధవ్.

“తమాషా ఏమిటంటే, వాళ్ల పరిచయానికి వయసు పెరిగే కొద్దీ వాళ్ల మధ్య మాటలు తగ్గాయని శ్రీనిధే అబ్సర్వ్ చేసిందట. అది కూడా పెళ్లి కాకముందరే,” అన్నారు చక్రపాణి.

“అది ఆమెకి అనుమానాన్ని కలుగజేసి, ‘అతను నిన్నే మయినా కంట్రోల్ చేస్తున్నాడా?’ అని డైరెక్టుగా అడిగేసిందట కూడానూ!” అన్నారు కృష్ణ.

“ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచెయ్యడం వల్ల ఒకే కార్లో రావడం, తిరిగివెళ్లడం సహజమే. కానీ, అతను పని కట్టేసి హారతి క్యూబికిల్ దగ్గరకి వెళ్లగానే ఆమె పనిని మధ్యలో ఆపేసి లాప్‌టాప్‌ని ఠక్కున మూసెయ్యడం – అది అతను కంట్రోల్ ఫ్రీక్ అయివుండడంవల్ల, లేదా ఆ పిల్ల బయటకు చెప్పని అబ్యూజ్‌వల్ల అని మా అందరి కంక్లూషన్,” అన్నారు కేశవ్.

“పెళ్లయిన తరువాత, ‘అతను నిన్నే మయినా అబ్యూజ్ చేస్తుంటే చెప్పడానికి మొహమాటపడుతూ కూర్చోకు. ఇదేం ఇండియా కాదు. నువ్వు నీ కాళ్లమీద నిలబడగలవు!’ అని శ్రీనిధి ఆ అమ్మాయికి చెప్పిందట కూడా,” అన్నారు మాధవ్.

“కానీ, ఏమాట కా మాటే చెప్పుకోవాలి. ఇద్దరి మొహాలూ ప్రశాంతంగా ఉండేవి,” అన్నారు ముకుంద్.

“వాళ్ల నలా ఎన్నాళ్లు అబ్సర్వ్ చేశారు?” హరి కుతూహలంతో ప్రశ్నించారు.

“నాలుగయిదేళ్లు గదూ?” కృష్ణ అడిగారు. అందరూ అవునన్నారు.

“వాళ్ల మధ్య సంభాషణ జరగలే దనడానికి ప్రత్యక్ష సాక్షి మా ఆవిడ,” అన్నారు ముకుంద్.

“ఈయనకి మా ఇంట్లో పార్టీకి రావడం కుదరకపోతే – వీళ్లూ రెస్టన్లోనే గదా ఉండేది – జలజగారు రతిపతులతో కలిసొచ్చారు. సారీ హరిగారు, అదే, హారతి, శ్రీపతుల కార్లో వచ్చారు. గంట ప్రయాణం గదా! దాన్లో, జలజగారు ప్రశ్న లేస్తే వాటికి మాత్రం ఆ అమ్మాయి గానీ అతను గానీ జవాబిచ్చార్ట తప్ప, వాళ్లు ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడింది మాత్రం లేదట,” అన్నారు కృష్ణ.

“ఆ నిశ్శబ్దంవల్ల, తనకి భూత్‌బంగ్లాలో ఉన్నట్టనిపించింది అన్నారు జలజగారు,” అన్నారు మాధవ్.

“వాళ్లు మీ ఇంట్లో పార్టీలకి కూడా వచ్చేవాళ్లా?” హరి అడిగారు.

“ఇప్పుడూ, నువ్వు మాకెలా పరిచయం? చక్రపాణి గారి అన్నయ్య కొడుకు గానే కదా? నువ్వు అంటున్నానని ఏం అనుకోకు. మా అందరికంటే బాగా చిన్నవాడివి కదా, అందుకు,” అన్నారు కృష్ణ.

“ఇంతకు ముందరి జవాబే ఇప్పుడూ ఇస్తాను. నేనే మనుకోను. నాకు మా బాబాయెంతో మీరూ అంతే,” అన్నారు హరి.

“ఏం చెబుతున్నాను? … ఆఁ. పార్టీకి పిలవడం గూర్చి. అలాగే, కేశవ్ గారింట్లో పార్టీలకి ఆయన  శ్రీనిధితో బాటు వాళ్లనీ పిలిచేవారు. తరువాత్తరువాత మా అందరిళ్లకీ పిలిచాం. శ్రీనిధి పెళ్లయి న్యూ జెర్సీ మూవ్ అయిన తరువాత కూడా,” అన్నారు కృష్ణ.

“ఇంకాసే పాగుతారా, డిన్నర్ మొదలెడతారా?” అంటూ ఆ గదిలోకి వచ్చారు రాధ.

“హారతిని కలిశార్ట కేశవ్‌గారు,” అన్నారు కృష్ణ ఆమెతో.

“సరిపోయింది. ఇక్కడా ఆ చర్చేనా? అక్కడ రమగారు కూడా అదే చెప్పారు,” అన్నా రామె.

“అందరం కలిసే చర్చిద్దాం రండి. ఈయనకి తెలియని విశేషాలు ఆమె చెబుతారు,” అన్నారు ముకుంద్. అంతటితో ఆగక ఫామిలీ రూంలో కెడుతూ, ‘రమ గారూ, పద్మజ గారూ, లక్ష్మి గారూ, ఇందిర గారూ, జలజా, నువ్వు కూడా, అందరూ లివింగ్‌రూంలోకి రండి,’ అని కేకేసి అందరినీ లివింగ్ రూంలోకి రప్పించారు. పద్మజగారు ఒక రెండేళ్ల పిల్లని ఎత్తుకుని రాగా నాలుగేళ్ల పిల్ల వచ్చి హరి వళ్లో కూర్చుంది.

అందరూ అక్కడికి చేరిన తరువాత, “చెప్పండి రమగారూ, హారతి గారితో మాట్లాడారా?” మాధవ్ గారు ఆమెని అడిగారు.

“ఆరేళ్లయింది ఆమె గూర్చి మంచి వార్త విని! ఇక్కణ్ణించీ వెళ్లిన తరువాత ఇదే మొదటి ఊసు,” అన్నారు రాధ.

“ఆ అమ్మాయికి మళ్లీ పెళ్లయిందిట. అది సంతోషకరం,” అన్నారు జలజ.

“ప్రెగ్నెంట్. ఐదో నెల!” అన్నారు రమ.

“పెళ్లయి ఆర్నెల్లు,” అన్నారు కేశవ్.

“ఆ నంబర్లు తారుమారయితే సమస్య లొచ్చేవి. ఏమంటారు?” అన్నారు ముకుంద్. మగవాళ్లు నవ్వారు.

“ఆమె సంతోషంగా ఉన్నట్లు కనిపించిందా?” కృష్ణగారు అడిగారు.

“ఏమిటా తిక్క ప్రశ్న? మళ్లీ పెళ్లయింది, గర్భవతి కూడాను. రెండు సంతోష కారణాలు,” అన్నారు రాధ.

“ఆ లెక్కన శ్రీపతితో హారతి సంతోషంగా ఉన్నట్లు కాదా?” హరి ప్రశ్నించారు.

“ప్రెగ్నెన్సీ ప్రూఫనుకునే ట్లయితే మాత్రం కాదు,” అన్నారు చక్రపాణి.

“మీరు మరీ మితిమీరిపోతున్నారు. కాస్త నోరు కట్టేసుకోండి,” అన్నారు ఇందిర.

“పాతికేళ్ల సాన్నిహిత్యం ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని పిన్ని బాగానే ఉపయోగించింది బాబాయ్!” అన్నారు హరి.

“మీ ఆవిడ అయిదేళ్లు తీసుకున్నదానికి నేను పాతికేళ్లు తీసుకున్నాను!” అన్నారు ఇందిర అతనివైపు గుర్రుగా చూసి.

పద్మజ హరివైపు గుర్రుగా చూసిన రెండవ వ్యక్తయారు.

“అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే, హారతికీ, ఆ రెండో మొగుడికీ మధ్య సంభాషణని వాళ్లని తరచుగా కలిసే శ్రీనిధే గాక కేశవ్ గారు, రమ గారు కూడా విన్నార్ట,” అన్నారు రాధ.

“‘హారతీ, హారతీ’ అంటూ అతను పిలవని క్షణం అరుదట. ప్రతి క్షణమూ ఆమెని అంటిపెట్టుకునే వుంటాట్ట,” అన్నారు లక్ష్మి.

“అనుమానం రోగమేమో? అసలే రెండో పెళ్లి కదా,” అన్నారు కృష్ణ.

“పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించిందట,” అన్నారు రాధ.

“నాకా రోగమే వుండుంటే పాతికేళ్ల క్రితమే ఉద్యోగం మానేసి ఇంట్లో నీ పక్కనే కూర్చునేవాణ్ణి,” అన్నారు కృష్ణ.

“నేను ఉద్యోగం చెయ్యట్లేదని నన్నేమీ దెప్పక్ఖర్లేదు,” అన్నారు రాధ.

“సంభాషణ పక్కదారి పట్టుచున్నది,” అని సాగదీస్తూ అన్నారు చక్రపాణి.

“భార్యాభర్తల మధ్య సంభాషణ అనేది అసలుండడం సంతోషదాయకమా, కాదా?” నిలదీశారు జలజ.

“అదే గనుక మా మధ్య లేకపోయుంటే నేనెప్పుడో పారిపోయేదాన్ని,” అన్నారు లక్ష్మి.

“రతిపతుల మధ్య మాటలు ఉండేవి కాదనడానికి నిదర్శనంగా ఇందాక వాళ్లతో జలజ గారి కార్ రైడ్ గూర్చి మాకు చెప్పారు. అలాగే మీ ఇళ్లల్లో పార్టీలకి వచ్చినప్పుడు కూడా దాన్ని గమనించాం అని అన్నారు కూడా. అయితే, వాళ్లు తమ ఇంట్లో ఉన్నప్పుడు గానీ లేక వేరే చోట్ల బయట ఉన్నప్పుడూనూ మాట్లాడుకోలే దని ఋజువుల్లేకుండా ఎలా అనగలరు?” హరి ప్రశ్నించాడు.

“ఋజువులు దొరికిన తరువాతే ఆ నిర్ధారణకి వచ్చాం నాయనా!” అన్నారు ఇందిర.

“పెళ్లి కాకముందే, వీళ్లతో కలిసి సినిమాలకీ, పిక్నిక్కులకీ, ఫ్లారిడా వెకేషన్లకీ వెళ్లినవాళ్లందరూ ఈ మాటల్లేని జంటగూర్చే చెవులు కొరుక్కున్నార్ట అని శ్రీనిధే మాకు చెప్పింది!” అన్నారు చక్రపాణి.

“షాపింగ్ మాల్స్‌లో వీళ్లని కలిసినవాళ్లు చెప్పింది కూడా అదే!” అన్నారు రాధ.

“బిజినెస్ ట్రిప్పుకని మాధవ్ గారి మేనకోడలు ఇండియానుంచీ వచ్చి వర్కుకి దగ్గరగా ఉంటుందని వీళ్లింట్లో ఉన్నదిలే. వాళ్లే డ్రాపులూ, పికప్పులూనూ. ఆ పిల్ల చెప్పింది. ఇంట్లో కూడా వాళ్లిద్దరి మధ్యా నిశ్శబ్దమేనుట. ఆఖరుకి టీవీ చానెల్ కూడా ఒకళ్లు పెట్టింది ఇంకొకళ్లు మార్చలేదుట!” అన్నారు జలజ.

“ఇద్దరూ ఒకళ్లని మించి ఇంకొకళ్లు బధ్ధకస్తు లేమో?” అన్నారు పద్మజ.

“ఆ బధ్ధకం అన్ని విషయాల్లో కనిపించాలిగా? అలాంటిదేదీ మేం గమనించలేదు. అంత బధ్ధకస్తు లయితే ఇల్లు నీటుగా పెట్టుకునే అవకాశమే లేదు!” అన్నారు ఇందిర.

“ఎనీ వే, ఆ ఇంట్లో నిశ్శబ్దంగా అడవి మధ్యలో ఉన్నట్లుం దనలేదూ ఆ పిల్ల వెనక్కి వెళ్లిన తరువాత మీతో ఫోన్లో?” లక్ష్మిగారిని ప్రశ్నించారు రాధ.

“ఇంతకీ రతిపతులు పిల్ల లొద్దనుకున్నట్లా లేక ఆగుదామనుకున్నట్లా?” ఆడవాళ్లందరికీ ఆ ప్రశ్నని సంధించారు కృష్ణ.

“అది వాళ్లిద్దరికీ, ఆ భగవంతుడికీ మాత్రమే తెలియాలి!” అన్నారు రమ.

“పిల్లలు అడ్డం అనుకున్నారేమో?” అన్నారు పద్మజ.

“పిల్లలు వద్దు అనుకునేవా ళ్లున్నారేమో గానీ, అడ్డం అనుకునేవా ళ్లుంటారా?” ఆశ్చర్యంగా అన్నారు రాధ.

“నువ్వు స్త్రీవాది వని హరి చెబితే విన్నా గానీ అందులో వీరతాడు వేసుకున్నావని ఇప్పుడే తెలిసింది,” అన్నారు చక్రపాణి.

“అయితే, చలానికి వీరాభిమాని అయ్యుంటారు,” అన్నారు మాధవ్.

“తామిద్దరూ ఒకరికొకరుగా మిగిలిపోవా లనుకోవడం స్త్రీవాద మెలా అవుతుందంకుల్?” అన్నారు పద్మజ ఆశ్చర్యంగా. పైగా, “రోమియో-జులియెట్, సలీం-అనార్కలి, లైలా-మజ్నూ- వీళ్లంతా అమరప్రేమికులుగా కాక యాభయ్యేళ్లదాకా జీవితాలని గడిపివుంటే వాళ్లు పిల్లలని ఆనందించేవాళ్లా లేక అడ్డం అనుకునేవాళ్లా?” అని ఎదురు ప్రశ్న వేశారు.

“పోన్లే, నువ్వూ, హరీ పిల్లలు వద్దనుకోలేదు,” అన్నారు రమ.

“మా మధ్య అంత ప్రేమ లేదులెండి,” పద్మజ జవాబిచ్చారు.

“చూడవే మనవరాలా, మీ అమ్మ ఎంత మాటందో!” ఆమె చేతుల్లోంచి పిల్లని తీసుకుంటూ అన్నారు ఇందిర.

“స్త్రీవాదులకు అంతటి ప్రేమికులు భర్తగా దొరకరు,” అన్నారు హరి.

“అందుకే, పిల్లలు అడ్డం అనుకునే ప్రేమలు ప్రేమలుగానే మిగిలిపోతాయి గానీ, పెళ్లికి దారితీసే సంఘటనలు చాలా తక్కువ,” అన్నారు చక్రపాణి.

“కలిసి తిరుగుతారు, ప్రెగ్నెంట్ అనగానే మగాడు చేతులు దులుపుకుంటాడు, ప్రపంచ మంతా ఉన్నదే,” అన్నారు జలజ.

“శ్రీపతి నాలుగేళ్లల్లో చెయ్యలేని పని ఇతనెవరో నెలరోజుల్లో చేశాడు,” అన్నారు ముకుంద్.

“కరెక్షన్. శ్రీపతితో నాలుగేళ్లల్లో చెయ్యా లనుకోని పని హారతి నెలరోజుల్లో ఇతనితో చేసింది,” అన్నారు పద్మజ. రమవైపు తిరిగి ఆమె నడిగారు కూడా: “ఇందాక అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు మీరేం చెప్పారు ఆంటీ? హారతితో పెళ్లయిన రెండ్రోజులకే వాళ్లని శ్రీనిధి వాళ్లింటికి గెట్ టుగెదర్‌కి పిలిస్తే అక్కడ అతను, ‘హారతి నాతో ముక్తసరిగా ఉంటుంటే, ఇంత మౌనంగా ఉంటున్నావ్, ముందతనితో ఏమీ మాట్లాడలేదా? అనడిగాను, లేదని చెప్పింది. భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఎలా ఉంటా రసలు?’ అని అందరితో ఆమె మౌనాన్ని చర్చించాట్ట అని చెప్పలేదూ? అంతటితో ఆగకుండా, నలుగురితో కలిసినప్పుడల్లా ఈమె తనతో మాట్లాడదో అని గోలపెడతాట్ట. అలాంటి మొగుడితో చెయ్యడానికి సంసారం తప్ప భార్యకి మిగిలేదేమిటి?”

“శ్రీపతి పోవడం ట్రాజెడీ. ఇప్పుడు మళ్లీ పెళ్లిచేసుకోవడం, ప్రెగ్నెంటవడం రెండు సంతోషకరమయిన విషయాలు,” అన్నారు రమ.

“అని నే ననుకోను. ఇది ఆ ట్రాజెడీకి కంటిన్యుయేషన్ అనే అంటాను,” అన్నారు పద్మజ.

“ఊరందరిదీ ఒక దారీ -” అని హరి మధ్యలో ఆపేశారు.

“ఇందాక ఇంకొకటి కూడా చెప్పారు లక్ష్మి ఆంటీ. ఒక అమ్మాయి – అదే, మీ మేనకోడలు. ఆ అమ్మాయి శ్రీపతి, హారతి వాళ్లింట్లో నెలరోజులు గడిపినప్పుడు ఆమె ఏం అబ్సర్వ్ చేసిందని చెప్పారు? వాళ్లిద్దరూ ఒకరినొకరు అతుక్కుని తిరుగుతార్ట. హారతి వంట చేస్తుంటే అతను ఆమె వెనకే ఉండి నడుముని చుట్టేస్తూనూ, అతను గిన్నెలు కడుగుతుంటే ఆమె అతని వెనక చేరి అతని నడుముని చుట్టేస్తూనూ – అబ్బా, పెళ్లికాని పిల్లని ఇంట్లో పెట్టుకుని అలా ఎలా చేశారో నని అనలేదూ?” పద్మజ లక్ష్మిగారిని నిలదీశారు.

“ఇది నాకు చెప్పలేదే?” ఆశ్చర్యపోవడం మాధవ్ గారి వంతయింది.

“వీళ్లకి అప్పుడే చెప్పాను గానీ, ఇందాక మాటవరసలో మళ్లీ బయట కొచ్చింది. మీకూ చెప్పే వుంటాను. అయినా, అన్ని విషయాలూ మీతో చెప్పాలని ఎక్కడయినా రాసుందేమిటి?” ఎదురు ప్రశ్న వేశారు లక్ష్మి.

“నా మేనకోడలు నీతో చెప్పిందా – ఆశ్చర్యంగా ఉన్నదే!” అన్నారు మాధవ్.

“నాతో చెప్పలా. పెద్దాడి భార్య మీనాతో చెప్పిందట. అక్క వరసవుతుంది గదా మరి. తరువా తెప్పుడో అది వాడితో అంటుంటే విన్నా,” అన్నారు లక్ష్మి.

“ఈవ్స్ డ్రాపింగ్!” అన్నారు ముకుంద్.

“నేనేం కావాలని వెళ్లి వినలా. వాళ్ల మాటలు నా చెవినపడ్డా యంతే!” అన్నారు లక్ష్మి.

“ఇందాక లక్ష్మిగా రంటుంటే గుర్తొచ్చింది. నేను కారులో వెళ్లినప్పుడు ఆ గంటసేపూ వాళ్ల చేతులు కలిసే వున్నాయని,” అన్నారు జలజ.

“అతను ఒకచేత్తోనే డ్రైవ్ చేశాడని భయపడ్డావని చెప్పడం గుర్తుంది గానీ, ఇది మాత్రం ఇప్పుడే వింటున్నాను,” అన్నారు ముకుంద్.

“నేను హారతి వెనక సీట్లో కదా కూర్చున్నది? అక్కణ్ణుంచీ చూస్తే శ్రీపతి కుడిచెయ్యి స్టీరింగ్ వీల్ మీద లేదని స్పష్టంగా కనిపించింది మరి. అదే గాభరా పడ్డానికి కారణం. తరువాత ఒకసారి పక్కకు వంగినప్పుడు వాళ్లు చేతులు పట్టుకున్నట్లు కనిపించింది గానీ, అది ఆ క్షణంలోనే అనుకున్నా. ఇప్పుడాలోచిస్తే ఆ ప్రయాణం మొత్తంలోనూ అలాగే ఉండివుంటా రనిపిస్తోంది,” అన్నారు జలజ.

“నిశ్శబ్దానికీ, ప్రశాంతతకీ, మనసుతోనే సంభాషించడాన్ని ప్రేమించడానికీ అలవాటుపడ్డ హారతికి ఈ రెండో మొగుడు ఒక విస్ఫోటం. ప్రెగ్నెన్సీ తను కావాలని ఏర్పరచుకున్న డైవర్షన్,” అన్నారు పద్మజ.

“ముఫ్ఫయి అయిదేళ్లకి కాకపోతే ఇంకెప్పుడు కంటార్ట పిల్లలని?” అన్నారు రాధ.

“పిల్లలు ప్రేమకి ప్రతిరూపాలని విన్నాం గానీ, అడ్డంకులని …” అని తల నడ్డంగా ఊపుతూ, “డిన్నర్ చేద్దాం పదండి,” అని కృష్ణ గారు కుర్చీలోంచి లేచారు.

*

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు