ఒకానొక వేట

వేట మొదలైంది

సున్నం పోత పోసినట్లున్న రాత్రి

నాయన నేను మరో ముగ్గురు

మమ్మల్ని మోస్తూ కదులుతున్న భూమి

అలా చూస్తూ నిశ్చలం గా ఆకాశం

విరామం లేకుండా కదులుతున్న కాలసర్పం

మా చుట్టూ తిరిగి తిరిగి అలసి తోక ముడిచిన నిద్ర

 

దారిలో

నాన్నేదో తాళం పాడుతున్నాడు

మెల్లగా పాకిన తాళం

రగులుతున్న దేహపు కొలిమి

లోకం చిక్కటి కునుకు తీసిన గడియ

బతుకు గుంజాటన యాత్ర

 

ఏకాంతంగా ఉన్న చెట్టు పై

రేపటిని కలగంటున్న

గిజిగాడి జంట

ఏరులా సాగుతున్న పాట

కాయితపు పడవలా తేలుతున్న గుండె

లోపలేవరో పొయ్యి రాజేశారు

గుక్కపట్టి ఏడుస్తూ పద్యం

 

విలవిలలాడుతూ వలలో పడ్డ జీవి

వేట ముగిసింది

ఎసరు పెట్టి ఎదురుచూసే

అమ్మ గుర్తుకొచ్చింది

పొంగు రావడమే తరువాయి

ఆకలి తీరుతుంది

*

 

సుంకరి గోపాలయ్య

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గుక్కపట్టి ఏడుస్తున్న పద్యం …..👌
    సూపర్ సర్…..చాలా బాగుంది…

  • దృశ్య ప్రధానంగా ఉండి, బాగుంది. అభినందనలు 💐

  • గుక్క పట్టి ఏడుస్తూ పద్యం.. పొంగురావడమే తరువాయిఆకలి తీరుతుంది… వజ్రం లాంటి కవిత..💐💐సర్.అభివందనము!

  • వేట ముగిసి, ఆకలి తీరడానికి ‘విలవిలలాడుతూ వలలో పడ్డ జీవి’ కూడా గిజిగాడి జంటలాగే రేపటి గురించి కలలు కంటుండవచ్చు. ఆ కల రేపటి తన కబళం గురించీ అయ్యుండొచ్చు. ఏం చేస్తాం.. ప్రకృతి లోని ‘వేటవిక’ న్యాయం అలాంటిది. ఆకలిని రుచికరంగా తీర్చుకోవడానికి సాగిన వేటలో కవిత్వం మాంసం కూరలో నాణ్యమైన మసాలా దినుసుల్లా చక్కగా కుదిరింది గోపాలయ్య గారూ!

  • విలవిలలాడుతూ వలలో పడ్డ జీవి

    వేట ముగిసింది

    ఎసరు పెట్టి ఎదురుచూసే

    అమ్మ గుర్తుకొచ్చింది

    పొంగు రావడమే తరువాయి

    ఆకలి తీరుతుంది

    చాలా బాగుంది……. మీ కవిత

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు