ఏ స్త్రీని కదిలించినా ఒక కథ పుడుతుంది:నల్ల యామిని

ఎంతమంది ఇలా? ఎన్ని రోజులిలా అన్న ప్రశ్నలు తొలుస్తూనే ఉన్నాయి.

తెలంగాణ నుంచి వచ్చిన కొత్తతరం మహిళా కథకురాలు నల్ల యామిని. మొదటి కథ “నాకూ భయమేస్తోంది” కథతో …పాఠకుల ప్రశంసలు అందుకున్నారు. నేటి తరం యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను కథలుగా రాస్తూ… సాహిత్యలోకంలో చర్చకు పెడుతున్నారు. నేటి హైటైక్ యుగంలో కూడా మూఢ నమ్మకాలు, పాతతరం ఆలోచనలు, ఆచారాలు ఆడపిల్లల పాలిట ఎలా యమపాశాలుగా మారుతున్నాయో కథలుగా రాస్తున్నారు. నాకూ భయమేస్తోంది కథ …సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ ల సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ కథా వార్షిక-2020 …బుగులు సంకలనానికి ఎంపికయ్యింది. మర్చిపోలేని కథానుభవం శీర్షిక కోసం సీనియర్ కథకుల అనుభవాలతో పాటూ…కొత్తతరం కథకుల భావాలను కూడా పాఠకులకు అందించనున్నాము. ఇందులో భాగంగా కొత్త తరం కథకురాలు  నల్ల యామిని తన మొదటి కథ వెనుక అనుభవాల్ని ఇలా పంచుకున్నారు.

***

నాకు చిన్నప్పటి నుండి కథలు చదవడం అంటే చాలా ఇష్టం.. నేను విన్న చదివిన కథలను నా పద్దతిలో నాకు నచ్చిన పాత్రలతో కల్పించి స్నేహితులకు చెప్పేదాన్ని. ఎవరైన ఎదైన కథ చెప్పు అంటే అప్పటికప్పుడు స్వంతగా క్రియేట్ చేసి చెప్పేదాన్ని.. రాయాలి అనే ఆలోచన అప్పుడు లేదు.. రాయాలి అనే ఆలోచన అప్పుడు లేదు.. 2016 లో MA. Telugu లో జాయిన్ అయ్యాక సాహిత్యం మీద ఇంకా ఎక్కువ మక్కువ ఏర్పడింది. అప్పటినుండి రాయాలి అనే కోరిక ఏర్పడింది.. 2020 నుండి నేను కథలు రాయడం మొదలు పెట్టాను.. “నాకు భయం వేస్తోంది”  నా మొదటి కథ ఆడపిల్ల అంటేనే భారంగా చూసే సమాజంలో మనం ఉన్నాము. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు అని అన్ని రంగాల్లో నిరూపిస్తునే ఉన్నాము… అయినా చిన్న చూపు మాత్రం పోవడం లేదు. ఎందుకంత చిన్న చూపో ఇప్పటికీ అర్థం కాదు నాకు.

నా చుట్టూ ఉండే కుటుంబాల్లో ఉండే వాళ్ళలో ఎక్కడో ఒక దగ్గర ఏవో ఏవో సమస్యల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. మన దగ్గర పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కువ ఉంటున్నాయి. అమ్మమ్మల,  నానమ్మల, అమ్మల కాలంలో చూసుకున్న ఇవే సమస్యలు.. కాలం మారుతోంది కానీ ఆడవాళ్ల జీవితాలు మాత్రం మారడం లేదు.. నువ్వు ఆడపిల్ల అణకువగా ఉండాలి అంటారు… జాబ్ చేసే మహిళ నుండి ఇంటి పని చేసే మహిళ వరకు ఇవే సమస్యలు. ఇలాంటి సందర్భాలోంచి పుట్టిందే ఈ కథ.

నా స్నేహితురాలు కుటుంబం ఉంది వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు. ఆ తండ్రి కి భారం అనిపించలేదు కానీ… అతని చుట్టూ ఉండే వాళ్ల మాటలు భారం అనిపించేలా చేశాయి.. అమ్మాయి పెళ్ళి చేస్తే బాధ్యత తీరుతుంది అని ఆయన తల్లిదండ్రుల పోరు భరించలేక పెద్ద బిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్లి చేసాడు. ఆమె పెళ్లి తరువాత మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసారు.. రెండో బిడ్డ పెళ్లి చేసారు కానీ ఇక్కడ బాధ్యత తీరలేదు. పెళ్లి అయిన సంవత్సరం లోపు కొడుకు పుట్టాడు. కడుపుతో ఉన్న బిడ్డ ఇంటికి వచ్చింది అంటే కొడుకు పుట్టిన తరువాత కూడా అత్తగారింటికి వెళ్ళలేదు.. ఎప్పుడు గానీ పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు కానీ… బాధ్యత పెరుగుతుంది అని మాత్రం ఆలోచించరు..

ఆ బిడ్డకు బరువు బాధ్యతలు పెంచుతున్నాం అని కూడా ఆలోచించరు..

నేను ఒక రోజు గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని కలిసాను తను చెప్పిన విషయాలు నా మనసును కలచి వేసాయి. తనని కలిసిన తరువాత రెండు మూడు రోజులు నాకు అస్సలు మనసున పట్టలేదు. ఏం చేస్తున్న ఆమెనే గుర్తొచ్చింది. అమ్మను అడిగాను అంత చిన్న అమ్మాయి కి అలా ఎలా పెళ్లి చేస్తారు అని. బాధ్యత తీరుతుందనీ చేసి ఉంటారు అన్నది అమ్మ…

అప్పుడు అనిపించింది దీనిని కథ ఎందుకు రాయకూడదు అని.. ఏ స్త్రీ ని కదిలించిన ఓ కథ అవుతుంది. ప్రతీ స్త్రీ ఎక్కడో ఓ చోట సమస్యను ఎదుర్కొంటూనే ఉంది.

ఈ కథ పబ్లిష్ అయ్యాక చాలా కాల్స్ వచ్చాయి… అందరూ ఒక్కటే చెప్పారు కథలో మమ్మల్ని మేము చూసుకున్నాం.. మీరు ఇలాంటి కథలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాం అని. మా ఫ్యామిలీ వాళ్ళు కథ పబ్లిష్ అయ్యాక ఆశ్చర్యంగా చూశారు.. నాకు సాహిత్యేతర వాళ్ళ నుండే మంచి స్పందన వచ్చింది. ఒక ఆయన కాల్ చేసారు వాళ్ళ చెల్లె కి చిన్న వయసులోనే  పెళ్లి, ప్రెగ్నెన్సీ హెల్త్ ప్రాబ్లెమ్ తో చనిపోయింది అని. అది విన్నాక నా మనసు కలచి వేసింది. ఏంటి ఈ సమాజం అనిపించింది.

*

                           నాకూ.. భయమేస్తోంది

                                                                                                   ‌‌– యామిని. నల్ల,

 

యమేస్తోందక్కా..!  భయమేస్తోంది..!!

హాస్పిటల్ నుండి బయలుదేరానన్న మాటేగాని ఆ మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.  బండి నడిపేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో నడపొద్దు అని అనుకుంటాను కానీ ఇలాంటి కొన్ని సంఘటనల గురించి ఆలోచించకుండా ఉండలేం కదా. అసహనం, చిరాకు, కోపం అన్ని కలగలిపి హారన్ మీద చూపాను. హారన్ సౌండ్ విని సాయి గేట్ తీసాడు.‘అమ్మా నాకేంతెచ్చావు’అంటూ ఎదురొచ్చాడునా చిన్న కొడుకు  . ‘ప్లీజ్ చిన్ను నన్ను కాసేపు వదిలేయ్ నేను ఏం తీసుకు రాలేదు..’  ఆ చిరాకులోనే చెప్పాను.  వాడు అలిగి దూరంగా వెళ్లిపోయాడు. వాడికి నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెస్తాను.. ఇవాళ తీసుకురావాలి అనే ఆలోచన కూడా లేకుండా, తను మాత్రమే నా ఆలోచనలో నిండి పోయింది…

” ఏమైందే ఇంత లేట్ అయింది, కనీసం ఫోన్ చేయలేదు, నేను చేస్తే కలవట్లేదు…”  అని కంగారుగా అడిగింది అమ్మా…

నిజమే…! ఇప్పుడు ఓ గంట ఫోన్ స్విచ్చాఫ్ ఉంటే ఏదో తెలియని భయం.  ఫోన్ లేని కాలం ఎలా గడిచిందో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు…

” నీకు తెలుసుగా హాస్పిటల్లో ఫోన్ సిగ్నల్ సరిగా ఉండదని, అయినా హాస్పిటల్ కి వెళ్తే ఎలా ఉంటుందో నీకు తెలియదా…! ఈ రోజు శనివారం… అనవసరంగా వెళ్ళాను. పేషేంట్స్ చాలా మంది ఉన్నారు.  అప్పటికీ.. సిస్టర్ సాయంత్రం రండి కాస్త ఫ్రీగా ఉంటుంది అన్నది కానీ సాయంత్రం ఊరేళ్ళేది ఉంది కదా అని అక్కడే ఉన్నాను.

సరే గాని, మేడం ఏమన్నది చెప్పు..?

అమ్మా.. తల బాగ నోస్తుంది. కొంచెం చాయ్ పెట్టివ్వవ ప్లీజ్!  టీ తాగుతూ అన్ని చెప్తాను…

‘అన్నం తినకుండా ఇప్పుడు చాయ్ ఏంటే… ముందు తిను, తిన్నాక టీ పెడతాను..’

‘ప్లీజ్ అమ్మా!  తినే ఓపిక లేదు.. తలనొప్పి ఎక్కువ ఉంది..’

‘నీక్కాదు, నీ  కొడుకుల వల్ల నాకు తలనొప్పి వస్తుంది. నిమిషం ఖాళీ ఉండరు. సరే వాళ్లది వాళ్ళు ఆడుకుంటారా… ఇందాక ఇద్దరు కొట్టుకున్నారు. తాకేది తెల్వదు తప్పేది తెల్వదు. ఎంతైనా ఒక.ఆడపిల్ల ఉంటే బాగుండేది. ఆడపిల్ల ఉన్న కళనే వేరు కదా…! ఈ చిన్న పిల్లగాడు ఆడపిల్ల అయితే మంచిగ ఉండేది.’

“ఏమో అమ్మా!  ప్రతి రోజు జరిగేవి చూస్తుంటే ఆడపిల్ల అంటే భయం అవుతుంది. పుట్టినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకోవాలి, చివరికి పెళ్లి చేసి ఎవరికో ఒకరికి కట్టబెట్టాలి. చేసుకున్నవాడు మంచివాడు అయితే మంచిదే, కానీ నా లాంటి పరిస్థితితో, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే…!’  బాధతో కూడిన నిర్లిప్తత

‘అంతే లే  ఈ మధ్య టీవీలలో, పేపర్లలో దిశ లాంటి వార్తలు చూస్తుంటే నువ్వు అన్నదే కరెక్ట్ అనిపిస్తోంది…’ అని టీ పెట్టడానికి వెళ్ళింది.

**                     ***                                   **                             **

అలాగే కుర్చీలో వెనక్కి వాలి కూచున్నా.. ఎంత వద్దనుకున్నా మళ్లీ మళ్లీ హాస్పిటల్‌లో చూసిన పిల్లనే గుర్తొస్తుంది. నన్ను నేను చూసుకున్నట్టుంది తనని చూస్తుంటే.. పది సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానో..! తను అలాగే కనిపిస్తుంది. అందుకేనేమో నాకు తను అంతలా కనెక్ట్ అయింది.

“మేము ముగ్గురం అడపిల్లలము.  నేను ఇంట్లో పెద్దదాన్ని. నా పదవ తరగతి నుండి నాకు పెళ్లి చేయమని మా నాన్న మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు… ముగ్గురు బిడ్డలు ఒక్కొక్కరికి పెళ్లి చేస్తే నీ భారం దిగిపోతుంది కదా, సదివిపిస్తే వీళ్ళు ఏమైనా నౌకరి చేసేది ఉందా ?  అనే మాటలే వినిపించేవి. నాకేమో ఏమి అర్థం కాకపోయేది… అలా  ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కాకముందే నా పెళ్లి జరిగిపోయింది..” అబ్బాయి వాళ్లకు ఆస్తులు ఉన్నాయి అతనికి మంచి బిజినెస్ ఉంది” అని చేసారు..

‘అత్తగారింట్లో పెద్దకొడలిని… నాకు ఇద్దరు అడబిడ్డలు ఇద్దరు మరుదులు పెద్ద కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. రెండు సంవత్సరాల పాటు వాళ్ళతో పాటు ఊర్లోనే ఉన్నాము.. మా ఆయనకి రాత్రి తప్ప, నేను ఎప్పుడు గుర్తుకు రాను. ఆయన నా కంటే పదకొండు సంవత్సరాలు పెద్ద. మా ఇద్దరికి ఏడు సంవత్సరాల తేడా అని చెప్పి చేశారు… ఒక రోజు ‘పాన్ కార్డ్’ చూస్తే తెలిసింది అతని వయసు.. ఇప్పుడు తెలుసుకొని కూడా చేసేది ఏం లేదు అని గమ్మున ఉండి పోయాను. ఇక అత్త కి నేనో పనిమనిషి లాగా కనిపించే దాన్ని.. కొత్తగా పెళ్లి అయింది చిన్న పిల్ల అనే కనికరం కూడా లేకుండే.. అప్పుడప్పుడు అనిపించేది ఈ కాలంలో కూడా ఇలాగ ఉంటారా మనుషులు అని.

పెళ్లి అయిన ఆరునెలల నుండి మొదలైంది అసలు టార్చర్ ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదేంటి?  అని స్టార్ట్ చేశారు. సంవత్సరం తరువాత హాస్పిటల్ కి వెళ్తే నాలో ఏం ప్రాబ్లమ్ లేదు…అతనికే సెమెన్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు డాక్టర్. అప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది.. లేకపోతే నాకు చిన్న ప్రాబ్లమ్  ఉన్నా నన్ను పీక్కు తినేవాళ్ళు వీళ్లు. ఒక నెల మెడిసిన్ వాడక ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో  కాస్త కూడా రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు… నడుము నోస్తుంది అంటే లోకం మీద కడుపు ఎవ్వరికి రాలేదు నీ ఒక్కదానికే వచ్చిందా అనేవాళ్ళు. అమ్మ వాళ్ళింటికి పంపించే వాళ్ళు కాదు. నెలలు నిండుతున్న కొద్ది అబ్బాయి పుట్టకుంటే అంటూ మొదలు పెట్టారు.. ఏడో నెలలో అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. భర్త అనేవాడు ఏ ఒక రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడగలేదు.. నా అదృష్టం కొద్ది అబ్బాయి పుట్టాడు. వాళ్ళ వారసుడు వచ్చాడని ఎక్కడలేని ప్రేమ చూపించారు..

వాడు పుట్టాక వేరే ఊరికి వచ్చేసాం మేము.. ఇక్కడికి వచ్చాక కూడా మా ఆయన లో ఎటువంటి మార్పు లేదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడికి వేళ్తాడో తెలియదు అతని లోకం అతనే.. అతనికి నే ఒక మనిషిని అనే విషయమే గుర్తుండదు. రెండో ప్రెగ్నెంన్సీ అబార్షన్ అయి చాలా వీక్ అయ్యాను..అప్పుడు కొన్ని రోజులు అమ్మ వాళ్ళింట్లో ఉన్నాను… ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్లు అయిపోయాయి.. వాళ్ల జీవితాలు బెటర్ గానే ఉన్నాయి. నా విషయంలో చేసిన పొరపాటు వాళ్ళ విషయంలో చేయలేదు. నాకు ఇంట్లో గొడవలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు నాకు ఇబ్బంది అని అమ్మ నాతోనే ఉంటుంది..

అదే పరధ్యానంలో  ఉన్నాను….

” ఏమైందే అట్లనే కూర్చున్నావు మోహం కడుక్కుంటా అన్నావు. చాయి తీసుకొచ్చి” వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఆ మాటలు నా మెదడుకు ఎక్కట్లేదు…

మళ్ళీ పిలిచింది… “ఏమైంది?? ఏం ఆలోచిస్తున్నావు అంతలా??”

“ఏం లేదమ్మా ఇందాక హాస్పిటల్ వలో ఒక అమ్మాయి కలిసింది ఆమెనే గుర్తొచ్చింది పాపం తను…”

“ఎవరే??”

“చెకప్ కి వచ్చింది ఓ పిల్ల”

“ఏమైంది ఆమెకు..”

**                        **                **                    **

ఒక్కసారి మళ్లీ హాస్పిటల్‌లో జరిగిన విషయాలే కళ్లముందుకొచ్చాయి..

ఓపి ఫీ కట్టి నంబర్ తీసుకున్న 38నంబర్ వచ్చింది. సిస్టర్ కి ఫైల్ ఇస్తే బీపీ, బరువు చెక్ చేసి, ఇంకో గంట పడుతుంది మేడం. మీరు ఉండేది ఇక్కడే కదా, సాయంత్రం వస్తే బాగుండేది అంది.

‘‘హా! కానీ సాయంత్రం ఊరెళ్తున్నం. అర్జెంట్’’…సంజాయిషీ ఇచ్చుకున్నాను.

‘‘సరే మేడం వెయిట్ చేయండి,  ఒక వేళ ఎవరైనా లేకుంటే అప్పుడు పిలుస్తాను ఉండండి’’ అని ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏమీ తోచక  ఫోన్‌తో టైంపాస్ చేస్తున్నా. ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది ప్రక్కనే. తలెత్తితే,  నన్నే చూస్తూ చూసి నవ్వింది. నేను నవ్వాను..

‘ఏ ఊరు?’ అంది

‘ఇక్కడే లోకల్.. మీరు?’

‘గోదావరిఖని’ అని చెప్పింది. నేను సైలెంట్‌గా ఉంటే తనే అడిగింది.  ‘ప్రెగ్నెన్సీ నా..?’

‘లేదు, నార్మల్ చెకప్. ఇద్దరు పిల్లలు ఉన్నారు’ అని చెప్పాను.ఇంటర్ చదివే పిల్లలా ఉంది. మొహం లో ఇంకా పసిదనం పోలేదు. అమాయకమైన నవ్వు. ముద్దొచ్చే మొహం. బెదురు బెదురుగా చూస్తోంది. కాసేపు మాట్లాడించాలనిపించింది.

‘నువ్వు ఎవరికోసం వచ్చావు?’ అని అడిగాను.. .

‘నాకోసమే..నాకు ఇప్పుడు మూడు నెలలు అంది.

నేను షాక్ అయ్యాను..   ‘నీ వయస్సు ఎంత?’ అని అడిగాను.

‘పద్దెనిమిది సంవత్సరాలు…’ ఇంకా ఈ సమాజంలో మార్పులు రావడం కష్టమే అనిపించింది.. ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రుల కోపం వచ్చింది.

‘కొత్తగా పెళ్ళి అయిందా..?’

‘సంవత్సరంన్నర అవుతుంది.’

ఇంత చిన్న వయస్సులో పెళ్లి ఎందుకు? లవ్ మ్యారేజా?

‘అరేంజ్డ్ మ్యారేజ్’ అంది.. తన మాటల్లో ఎదో నీరసం ఉన్నా తన మాట వినడానికి ఓ మనిషి దొరికింది అనే భావం కళ్ళలో కనిపించింది.

‘మేనరికమా??’ అడిగాను

‘కాదు, సింగరేణి జాబ్ అని చేసారు’. అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది.

అప్పుడే సిస్టర్ వచ్చి బ్లడ్ సాంపుల్ ఇచ్చి రమ్మంది.. వెయిట్ మళ్ళీ వస్తాను అని లాబ్ దగ్గరకు వెళ్ళాను. ఆమె కళ్ళే గుర్తొస్తున్నాయి చాలా బాధలో ఉంది అని తెలుస్తుంది.. తనతో మాట్లాడాలి, తన గురించి తెలుసుకోవాలి మనసులో ఉంది.. తనని చూస్తుంటే నన్ను నేను చేసుకున్నట్టు ఉంది.. సాంపుల్ ఇచ్చి వస్తున్న… తన పక్కన ఎవరో ఒక అతను కూర్చున్నాడు..  ఆరడగుల పొడవు, పొడవుకు తగ్గట్టు శరీర సౌష్టవం, నల్లని ఛాయ, మోహం మీద చిన్న చిన్న గుంతలు పడినట్లుంది. నేను తన దగ్గరకు వెళ్లడంతో లేచి వెళ్ళిపోయాడు..

మీ ఆయనా..?

అవును అక్కా..

ఏమైంది డల్ గా ఉన్నావు, హెల్త్ ప్రాబ్లమా? అడిగాను. దేవుడు అనుకోకుండా ఎదురుపడేట్టు చేసే మనుషుల మధ్య కూడా ఇలాంటి పరస్పర సహకార భావం పుట్టిస్తాడో లేక మనిషిలో అంతర్లీనంగా దాగిన మానవత్వం అనే పోర ఇలాంటి సమయంలో దాటుకుని నిద్రలేస్తుందో మరి.

‘అదేం లేదక్క, నాకు ఈ ప్రెగ్నెంట్ ఇష్టం లేదు’ గాల్లోకి చూస్తూ చెప్పింది..  ‘అదేంటి అలా అంటున్నావు?’ అడిగాను.  అభిప్రాయమంటూ ఉన్నాక కారణం ఉంటుంది కదా అని.

‘హా అక్క నేను ఇబ్బంది పడేది కాకుండా నా బిడ్డ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ఒక వేళ ఆడపిల్ల పుడితే నా పరిస్థితి ఇంకా అద్వాన్నం అవుతుంది’  అంది. ఆమాటల్లో భయం తాలూకు దిగులు కనపడింది నాకు.

‘అసలు ప్రాబ్లమ్ ఏంటి?’అడిగాను.

‘పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో పెళ్లి అయింది నాకంటే 13ఇయర్స్ పెద్ద వాడు నన్ను చూసేప్పటికే చాలా సంబంధాలు చూసాడంట కట్నం నచ్చిన దగ్గర పిల్ల నచ్చుడు లేదు పిల్ల నచ్చిన దగ్గర కట్నం నచ్చుడు లేదంట. నా దరిద్రం కొద్ది నే నచ్చిన అంది’.

ఎందుకో అది వైరాగ్యమో, వేధనో అర్థం కాలేదు… ‘ఎందుకు అలా అనుకుంటున్నావు?’ అని అడిగేసా. ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలమో లేక ఆ జీవితాన్ని కుదుపుతున్న బాధకు మందు రాయగలనేమో అనే ఆలోచనో తెలియదు మరి.

‘ఏంటో అక్క ఒక నెల నా దగ్గర ఫోన్ ఉంది అంతే అది నార్మల్ కీప్యాడ్ ఫోన్, అమ్మతో మాట్లాడేదాన్ని అంతే ఏమైందో తెలియదు ఫోన్ తీసుకున్నాడు నీకు అవసరమా ఫొన్ అని. ‘ఎందుకు?’ అంటే జవాబు లేదు.’

‘ఎందుకలా?’ అన్నాను.

‘ఏమో  అక్క!  అనుమాన పిశాచి’ అన్నది.

‘అమ్మ వాళ్ళు ఏమి అనలేదా?’

వచ్చారు అడిగారు ఒక వారం బాగున్నాడు మళ్ళీ మామూలే. అతనికి వాట్సాప్ ఫేస్బుక్ అన్ని ఉన్నాయి అన్నిటికీ పాస్వర్డ్స్ పెట్టుకున్నాడు, నిమిషం ఫోన్ వదిలి పెట్టడు అక్క. ఇప్పుడు నా పెళ్లి అయి సంవత్సరం అవుతుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా అలాగే ఉన్నాడు. మా అత్త మామ కూడా పట్టించుకోరు. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళింటికి పంపివ్వట్లేదు. అక్కడ డాక్టర్ కరీంనగర్‌‌కి వెళ్లి చూపించండి వీక్‌గా ఉంది అంటే అమ్మ వాళ్లకు చెప్తే వచ్చి ఇక్కడికి తీసుకు వచ్చారు.

‘ఎందుకు రా భరిస్తున్నావు?’ అన్నాను విలువ లేని బంధాలు భరించడం కంటే వాటిని వదిలి స్వేచ్ఛగా ఉంటడం మంచిదనే ఆలోచనలో.

‘నా తరువాత ఇంకా ఇద్దరు చెల్లెల్లు ఉన్నారక్కా.  అందుకే ఇలా. ఇంకా  ఓపిక ఉన్నన్ని రోజులు భరిస్థ.  లేకపోతే నా దారి నే చూసుకుంటా. ఇప్పుడు నాకు ఈ ప్రెగ్నెన్సీ కూడా ఇష్టం లేదు. నా లాగా ఇంకొకరు బలి కావాలా? తప్పిదారి ఆడపిల్ల పుడితే నా రాతే దానికి వస్తుంది. చూస్తాను ఏం జరుగుతుందో’ అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది…

‘భయమేస్తోంది అక్కా…!’  అంటూంటే తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎంతమంది ఇలా? ఎన్ని రోజులిలా అన్న ప్రశ్నలు తొలుస్తూనే ఉన్నాయి. బండి ఎలా స్టార్ట్ చేశానో, ఇంటికి ఎలా వచ్చానో కూడా అర్థం కానన్ని ఆలోచనలు…

**                                            ***                                       ***

‘పాపం అమ్మా!  చిన్న పిల్లలాగా క్యూట్ గా ఉంది.  స్కూల్ డ్రెస్ వేస్తే స్కూల్ కి వెళ్లే పిల్లలాగా ఉంది. అతనేమో చాలా ఎత్తు లావు ఉన్నాడు తండ్రి బిడ్డల్లా కనిపిస్తున్నారు.అవునమ్మా ఒకటి చెప్పు!  బిడ్డకి పెళ్లి చేస్తే బాధ్యత తిరిపోతుంది అనుకుంటారు.. గాని, బాధ్యత పెరుగుతుంది అని అనుకుంటారా ఎప్పుడైనా?’

ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయింది… మేబీ, నా పెళ్ళి నాటి విషయాల గురించి ఆలోచిస్తోందా?! నేను చెప్పటం కంటిన్యూ చేశాను..

‘ ముందు పెళ్లితర్వాత చదువుకోవచ్చు అని చెప్పినా, పెళ్లి తర్వాత బయటికి వెళ్లటానికి కూడా ఒప్పుకోలేదట. చిన్నప్పటినుంచీ కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఆడపిల్లని పంపొద్దూ అని మంచి కాలేజ్ లో సీట్ వచ్చినా అక్కడ వద్దని ఊరూపేరులేని కాలేజ్‌లో వేశారట… పుట్టిల్లూ అత్తిల్లూ అని తేడా లేదమ్మా..! ఎక్కడైనా అవే రూల్స్, అదే కట్టడి. పాపం పిచ్చి తల్లి..!’ చెప్తూంటేనే ఏడుపొచ్చేసింది.  ఎందుకో నిస్సత్తువగా అనిపించింది..

‘ఇంతకీ నువ్వేం చెప్పావ్ ఆ పిల్లకి?’  కిచెన్‌లోకి వెళ్లబోతూ అడిగింది అమ్మ.

‘అతను మారతాడు అనుకుంటే ఉండు, లేదంటే ఇక నీకు భరించే ఓపిక లేకపోతే విడాకులు తీసుకో.  కానీ, ఇంకా వేరే నిర్ణయం తీసుకోకూ అని చెప్పాను. అప్పుడే డాక్టర్ పిలిస్తే వెళ్లి పోయింది. నన్ను సిస్టర్ పిలిస్తే నేను వెళ్ళాను చెకప్ అయిపోయి బయటకు వచ్చి చూస్తే అప్పటికే వెళ్లిపోయారట’  చెప్పగానే ఏదో నిరాశ పడ్డట్టు నిట్టూరుస్తూ లోపలికి వెళ్లిపోయింది అమ్మ. మళ్లీ ఆ అమ్మాయే బుర్రలో నిండి పోయింది.

మనిషిని భరించడం ప్రేమ కాదు బాధ్యతగా ఓపికగా సర్దుబాటు చేసుకోవడం ప్రేమ అది దక్కనపుడు ఆ బంధం అవసరమా!? ఏమో! ఆ పిల్ల ఏమనుకుంటుందో…….!!??

‘అమ్మా…! అన్నయ్య చూడు మేం ఆడుకుంటుంటే…’ ఏదో చెప్తున్నాడు నా చిన్న కొడుకు, వీడు ఆడపిల్ల అయుంటే..? అమ్మ మాటలు గుర్తొచ్చి ఎందుకో నాకూ భయమేసింది.

*

నల్లా యామిని

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • స్ర్తీల సమస్యల గురించి కళ్ళకి కట్టినట్టు చెప్పావ్..
    మనిషిని భరించడం ప్రేమ కాదు బాధ్యతగా ఓపికగా సర్దుబాటు చేసుకోవడం ప్రేమ అది దక్కనపుడు ఆ బంధం అవసరమా!? ఏమో! 👌👌👌

  • రాశి కన్నా వాసి మిన్న అని మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అక్క. అద్భుతమైన రచయిత్రి మీరు. మున్ముందు మరిన్ని మంచి రచనలు చేస్తారని ఆశిస్తున్నాను ❤️

  • కథ చాలా బాగుంది యామిని.హృదయపూర్వక అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు