ఎన్ని న్యూరెంబర్గ్ లు కావాలి!

నిషిని బానిస చేసి కొరడా చేపట్టిన యాజమాన్యాలు

రాజ్యం తమ భోజ్యానికేననుకున్న భోగలాలసలు

అనుబంధాలన్నిటినీ సరుకులుగా మార్చిన దురాశలు

దేశదేశాలను కబళించిన సామ్రాజ్య కాంక్షలు

కుల, వంశ రక్త పవిత్రతా ఆభిజాత్యాలు

నేల అడుగున దాగిన ఖనిజాల కోసం తీరని దాహాలు

మితిమీరిన అధికారాహంకారాలు

వర్గపాలన పొడవునా జరిగిన నేరాలెన్ని కోటానుకోట్లు!

 

చెమటా నెత్తురూ కలలూ కలిమీ

గౌరవమూ మందహాసమూ

మొత్తంగా మనిషినే కొల్లగొట్టి

లక్షోపలక్షల బతుకులను బుగ్గి చేసి

వేనవేల జనావాసాలను భస్మీపటలం చేసి

నేరస్తులమే కామని హుంకరిస్తాడొకడు

హింసారాధనే రాజధర్మమని కళ్లెర్రజేస్తాడొకడు

విద్వేష హంతక విధ్వంసమే తన మత విజయమంటాడొకడు

అభివృద్ధి కోసమే ఈ జనహననమంటాడొకడు

 

వాడు బోనెక్కవలసిందే

నరహంతలు బోనెక్కవలసిందే

నెత్తురంటిన చేతులకు సంకెళ్లు పడవలసిందే

ఆ చేతులు నులిమిన ప్రాణాల లెక్క తేలవలసిందే

ఊళ్లకు ఊళ్లు నిష్పూచీగా తగులబెట్టిన కర్కశ హస్తాలు

పసిమొగ్గలను చిదిమేసిన మదమృగాలు

ప్రశ్నల గొంతుల్ని నరికేసిన నిరంకుశత్వాలు

జవాబు చెప్పుకోవలసిందే

నేరాంగీకార ప్రకటన చేయవలసిందే

ఎప్పుడో ఒకప్పుడు తప్పు ఒప్పుకోవలసిందే

అధికార నేరాన్ని కూడ బోనెక్కించగలమనే విశ్వాసం

అణగారిన జనాలకు కలగవలసిందే

గద్దెల మీది నేరస్తుల్ని కూడ శిక్షించగలమనే నమ్మకం

బాధితులకు దక్కవలసిందే

 

(లక్షలాది మంది యూదుల, కమ్యూనిస్టుల, కార్మికుల, సాధారణ ప్రజల జనహననానికి కారకులైన నాజీ హంతకులను విచారణ జరిపిన న్యూరెంబర్గ్  న్యాయస్థానాన్ని చూసి…)

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

ఎన్. వేణుగోపాల్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ” అధికార నేరాన్ని కూడ బోనెక్కించగలమనే విశ్వాసం
    అణగారిన జనాలకు కలగవలసిందే ”

    ఎన్. వేణుగోపాల్ గారూ, అగ్నిపర్వత లావాలా పెల్లుబికిన మీ సంవేదనకు సలాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు