ప్రతి సంక్షోభంలోనూ కలవరపడి
కలలను కాపాడుకొని
కాలం వెంట నడిచింది నేనే
ప్రతి సమరంలోనూ విజయాన్ని కాంక్షించి
ముందుగా విజయదరహాసమైంది నేనే
ఓటమికి కృంగిపోకుండా వెన్నెముకకు బలాన్నిచ్చి
ఆశల జెండాలు ఎగురవేసింది నేనే
గమ్యం చేరని గమనాలన్నింటికీ ఊతకర్రనైందీ నేనే
నేను పీడితున్ని
నేను అణచబడ్డవాన్ని
నేను సామాన్యున్ని
మరో మాటలో
నేను అసామాన్యున్ని
నా ఆలోచనలన్నీ ఎప్పుడూ అరణ్యాల చుట్టే
నా ఆశలన్నీ ఎప్పుడూ అఙ్ఞాత కవాతుల చుట్టే
పుట్టి బుద్దెరిగిన తర్వాత
తొట్ట తొలుత రాసిన వాక్యం మీగురించే
మొట్ట మొదట గళమెత్తిందీ మీగురించే
నా పసి హృదయానికి ఆడుగులు నేర్పి
గుండెలయల సంగీతమైందీ మీరే
నా కళ్ళకు నూతన ఉదయపు కిరణాల నిచ్చి
నా నడకకు ఒక గమ్యాన్ని చూపించింది మీరే
ఇప్పుడు మీరు సంక్షోభంలో ఉన్నరని
మీరు కన్న కలలు చిదిమేయబడుతున్నాయని
నడిచే దారిలో ఒకడుగు వెనుకకు వేశారని
విద్రోహాలకు గురై విలవిలలాడుతున్నారని
ఇవ్వాల మీ చేతిని విడిచి మిమ్ములను ఒంటరిని చేయను
ఇంటా బయట వెన్నుపోట్లు తగులుతున్నాయని
నిలబడిన చోటు నుండి అడుగు ముందుకు వేయడం
అసాధ్యమైతుందని అధైర్యపడను
ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఈ దశకు చేరుకున్న తర్వాత
ఊహించని విధంగా చుట్టుముట్టిన సుడిగుండాల నుండి
బయటపడి నిలదొక్కుకోవడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం
ఇవ్వాల కాకపోయినా రేపైనా ఫలవంతమవుతుంది
మాటల కత్తులతో గాయపరిచే వాళ్ళు
అన్ని కాలాలలో ఉంటారు
గుండె జారి భవిష్యత్ పై నమ్మకం లేక
దిగజారిన మాటలతో తూట్లు పొడిచే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు
శత్రువు దాడులకు భయపడి ఆశయాలను తుంగలో తొక్కి
ప్రాణాలపై తీపితో శత్రువు శరణుజొచ్చే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు
మారిన కాలాన్ని బట్టి
మనల్ని మనం మలుచుకోకపోతే
గరికపోచ కూడా గాయం చేస్తుంది.
గులకరాయి కూడా దాటలేని కొండై నిలుస్తుంది
ఎడతెగని దుఃఖంలో ఉన్నాం నిజమే
కానీ ఆ తల్లుల కళ్ళల్లో కన్నీళ్ళే కాదు
ఆ కన్నీళ్ళ వెనుకాల మండే సూర్యగోళాలున్నాయి
ఆ తల్లుల గుండెల్లో తీరని కడుపుకోత మాత్రమే కాదు
ఆ కడుపుకోత వెనుకాల పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలున్నాయి
ఆ తల్లుల నడకలో ఆఖరిసారిగా
కొడుకులను చూడాలన్న తపన ఉంది
ఆ తల్లుల మనసుల్లో పోరాటంపై
అంతరించని విశ్వాసం ఉంది
ఆ తల్లుల చూపుల్లో ఏదేమైనా
అడుగు ముందుకే వేయాలన్న తెగింపు ఉంది
అసమాన త్యాగాలతో అవనతమౌతున్న జెండాని
రెండు చేతులతో ఎత్తిపట్టాలన్న పట్టుదలా ఉంది
అనంతమైన అభిమానం ఉన్న
ప్రతిగుండెను తట్టి లేపాలి
కన్నీళ్ళు తుడిచి కాస్తంత ధైర్యాన్ని నూరి పోయాలి
లేచి నిలబడి మళ్ళీ నడక మొదలుపెట్టడానికి
ఇంక చాలా సమయం పడుతుండొచ్చు
కానీ ఎంతటి అనుభవాన్ని మూటగట్టుకున్నామని
ఎన్నెన్ని పాయల చీలికల విద్రోహాలను చూసామని
ఇంకా ఇంతకన్నా క్రూరమైన పరిస్థితులు రావచ్చు
బహుశా,ఎక్కడో ఒక దగ్గర ఒంటరిగా మిగిలిపోనూవచ్చు కాదనను
కానీ ఎంత గొప్ప ప్రయాణమైనా
ఒక్క ముందడుగుతోనే మొదలవుతుంది
ఎంత పెద్ద దావానలమైనా
అణువంత నిప్పురవ్వతోనే రగులుకొంటుంది
ఎంతపెద్ద సమూహమైనా
ఒక్కొక్క మనిషి చేరికతోనే సంద్రమవుతుంది
ఇప్పుడు తగిలిన దెబ్బలన్నీ భవిష్యత్ కాలంలో మనం
ఇంకా ఎలా ఎదగాలో చెప్తాయి
ఇప్పుడు తగిలిన దెబ్బలన్నీ
ఇంకా మనం ఎంతగా అంకితమవ్వాలో చెప్తాయి
ఇప్పుడు తగిలిన దెబ్బలన్నీ భవిష్యత్ లో
ప్రజాసైనికులను ఇంకా ఎంతగా తీర్చిదిద్దాలో చెప్తుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు తగిలిన దెబ్బలన్నీ
ఇంత వరకు మనం చేసిన పోరాటంలో
చేసిన తప్పులనూ లోపాలనూ ఎత్తి చూపుతుంది
వేసిన తప్పటడుగులనూ
సమకూర్చుకోవలసిన సాంకేతికతనూ
ఎదగవలసిన సైద్ధాంతిక అవసరాలనూ చెప్తుంది.
ఎంత నెత్తురు పారినప్పటికీ
ఎన్నెన్ని ద్రోహపు కత్తులు గుండెల్లో గుచ్చుకున్నప్పటికీ
ఎంతమంది ఎన్నెన్నో కారణాలతో
నడుస్తున్న దారిని విడిచి వెళ్ళినప్పటికినీ
ఇంకా ప్రజల గుండెల్లో ఎక్కడో మారుమూలల్లో
మనం మళ్ళీ ఫీనిక్స్ లా లేచి నిలబడతామన్న ఆశ
చిరుదీపంగానైనా సరే వెలుగుతూనే ఉంది
సామాన్యుని చూపు ఇంకా మనపై సన్నగిల్లలేదు
ఇప్పుడు ఆ చిరుదీపానికి చమురుపోసి
అంతటికీ వెలుగులు పంచాలి
ఆ చూపులకు నమ్మకపు కిరణాలను పొదిగి
ఎగిరే జెండాని చేతికందివ్వాలి
ఒక్క అడుగైనా సరే ముందుకేనన్న తెగింపునిచ్చి
సకల సరంజామాతో ఆగిన చోటునుండే
ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి
గమ్యం చేరడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో
ఎవరికీ తెలియదు కానీ
కాలంతో పాటుగా మనం ఎదిగితే ఎప్పటికైనా
గమ్యం చేరతామన్న చారిత్రక సత్యాన్ని
జనం గుండెల్లో నింపాలి
అందుకే ఇంతటి భయంకరమైన క్లిష్టసమయంలో కూడా
మీపై నేను నమ్మకాన్ని కోల్పోలేదు
మీరు ముందుకు అడుగు వేస్తే
మీ అడుగుల్లో అడుగు వేయడానికి
ఎన్నో ఎన్నో అడుగులు ఎదురుచూస్తున్నాయి
నేను పీడితున్ని
నేను అణచబడ్డవాన్ని
నేను సామాన్యున్ని
ఈ సామాన్యుడి గుండెల్లో
నమ్మకపు జెండాను పాతినప్పుడే
విజయం మీ దరి చేరుతుంది
*








Add comment