ఈ ఆసుపత్రి

రష్యన్ మూలం: మిఖాయిల్ లుకొనిన్ 

 

యీ ఆసుపత్రి

అంతా తెల్లగా…దారుణమైన తెల్లదనం…

రగ్గుల్లో ఒదిగొదిగి మేం-హుషారైన పరాచికాల మధ్య –

ఉదాసీనత నింపుకున్న

మా కళ్లలోకి గోడ మీది చిత్ర పటాలు తదేకంగా చూస్తున్నాయి.

 

యివాళ యే వారం?’ పక్క మంచం మీది వ్యక్తి.

శనివారం, యేం?’,

ఓహో! అలాగయితే వారం అయిందన్నమాట

నేను గుడ్డివాడిగా మారి !… సరే అయితే విను. ఆమె గురించి చెబుతాను…

యింతలో మాకు భోజనాలు తెచ్చి తినిపించి వెళ్లారు.

నేను దిండుని వొళ్లోకి లాక్కుని సర్దుకుని కూర్చున్నాను .

అతను, వారం క్రితం పోయిన తన చూపు గురించి,

ఆమె గురించి ధారాళంగా మాట్లాడుతూనే వున్నాడు.

 

నేను మధ్యలో కల్పించుకుని ‘చూడండి. యీ నర్సు

మీ ఉత్తరం భేషుగ్గా రాయగలదు, మరేం! ‘ అన్నాను.

‘అట్లాకాదు. నన్ను అర్థం చేసుకో మిత్రమా. చిన్న సమస్య ! ‘ ,

‘సమస్యా?! మీరదేం పట్టించుకోకండి.యింతకంటే యేదీ బావుండదు ‘

 

‘వొక్క మీరే ‘ ,

‘నేనా?’,

‘యేం! మీకు భేషుగ్గా కళ్లున్నాయి కదా!’ ,

‘కాని, అయ్యో !?’,

‘మీరింక అభ్యంతరం పెట్టకండి’,

‘పదాలు సరిగ్గా కుదరవు నాకు ‘,

‘నేను చెపుతాను ‘,

ఓరి దేవుడా! నేను మునుపెన్నడు ప్రేమించనేలేదు కదా  ,

‘అయితే యిపుడే సమయం…నేను చెపుతా రాయండి.’ .

నేను పెన్ను తీసుకున్నాను. అతను చెప్పడం మొదలుపెట్టాడు.

 

‘నా ప్రియమైన ‘, నేను రాశాను.

‘నేనింక చచ్చిపోయాననుకో’,

‘నేను జీవించే వున్నాను ‘ రాశాన్నేను.

‘నాకోసం యింకేమాత్రం ఎదుర్చూడకు’,

‘నా ప్రాణమా! నాకోసం వేయికళ్లతో ఎదురుచూడు ‘ ,

‘నేనింక తిరిగి రాలేను ‘,

‘నేస్తం! నేను అతి త్వరలోనే మన వూరు వస్తున్నాను ‘ .

ఆమె ఉత్తరాలన్నిటికి జవాబులు రాశాను .

 

అతను యేదో పాటందుకుని

గట్టిగా యేడ్చాడు ఉత్తరాన్ని తన గాజు కళ్లకద్దుకుని…

యింక ఆ తరువాత యీ వార్డు మొత్తం ఒకటే గోల

‘మాకూ వ్రాయండి ‘

వొక విచారకరమైన తిరస్కారం.

‘మీ చేతుల్తో మీరే రాసుకోవచ్చు కదా,

అరెరె, మీరందరూ భేషుగ్గా చూడనూగలరు,

యెందుకు చేసుకోలేరీ పని ‘

*

యీ ఆసుపత్రి అంతా తెల్లగా…దారుణమైన తెల్లదనం

మిత్రులారా! మీరిప్పుడెక్కడున్నారు?’,

నీ కబురే లేదు ‘,

ఆమె వెళ్లిపోయిందా ‘,

నేనింక చచ్చిపోయానని జమీల్యాకు రాయి ‘,

ఉషోదయం విచ్చుకుంటోనపుడు నా కోసం ఎదురుచూడు ‘,

నా చిన్నారి నాస్తెంకా అడుగులేస్తోందా ‘,

నా ముసలి తల్లి కోలుకుంటోందా?’,

లీజా పెళ్లి తరువాత కుశలమేనన్న సంగతి కనుక్కో…‘,

మీ కబురే లేదు ‘,

యింక నేను…

 

నాకు తెలుసు నా మౌనం తప్పని.

‘మాకూ రాయండి’. వాళ్లు చెబుతున్నారు.

రాయవలసింది నా మస్తిష్కంలో సందిగ్దంతో అటూ ఇటూ వూగులాడుతోంది.

‘మాకూ రాయండి!’,

‘నా వల్ల కాదు ‘,

‘మీరు నిక్షేపంగా రాయగలరు ‘,

‘నాకు ప్రేమించటం చాతనవదు.’ నేను గట్టిగా అరిచాను.

‘మేం చెబుతాం…జీవితాన్ని ప్రేమించు. యింక అంతకంటే నీక్కావలసింది యేం లేదు ‘ .

*

శ్రీధర్ చందుపట్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు