ఇది చెప్పాలనే

ప్పటికే కొన్ని లక్షల ముక్కలైన ఓ బిందువు

కిటికీ చువ్వపై చింది మరిన్ని చినుకులైంది

అప్పటికే నిద్రపోవాల్సిన

ఓ ఒంటరి చెంపపై తుప్పరగా వాలింది

దుప్పట్లోకి చేరాక దూరాల్సిన జ్ఞాపకాలేవో

దుప్పటిలా కప్పేశాయి

ఎప్పటి నుండో గుండెలో అణిగి వున్న ఓ తుఫాను

కాగితం మీదా, చెంపల మీదా

తుప్పరతో పాటగా కురిసింది

***

ఎప్పట్లా వుండే దూరాలేవో

ఇప్పుడూ వుంటాయనుకున్న రెండు మనసులు

చెరొక బాల్కనీలో

కురిసే వానకి చాడీలు చెప్తున్నాయి

 

ఆ బాల్కనీ వాకిట్లో పారే నది

ఈ బాల్కనీ ముంగిట్లో నదైన వీధి

ముప్పైఐదు మెట్లకింద నదిలా పారే ఓ కాగితం

ఎవరేం చెప్పారో ఏంటో

చాడీలు చిన్నగా చెక్కిళ్ళపై చెరువులయ్యాయి

చెమట నదులయ్యాయి

సిగ్గుతో వీధి దీపం కళ్ళు మూసుకుంది.

***

అసలేమవుతుందో తెలీదు

ఎక్కడుండాలో తెలీదు

ఎటు చూసినా మూసిన తలుపులు

అచ్చం మనుషుల గుండెల్లా వున్నాయి.

నాలుగు కాళ్ల కింద నాలుగు బిడ్డలు

నాలుగు వైపులా నదులైన దారులు

అప్పటిదాకా వెలిగిన ఓ దీపమాగి చీకటికి ఆజ్యం పోసింది

పొదుగుల కింద వుండాల్సిన బిడ్డలు మూడయ్యాయి

అప్పటికే గొంతు చిరిగిన ఆ హృదయం

మళ్లీ గొంతు పగిలేలా అరిచింది

అప్పటి నుండి పడే ప్రతి చినుకు చుక్కా కన్నీరైంది

ఓ ఇంటి తలుపులేవో హృదయంలా తెరుచుకున్నాయ్.

మరో ఇంట్లో కిటికీ మూతబడుతూ

“ఛీ.. అర్థరాత్రి కుక్క గోల” అంటూ నసుక్కుంది

***

ఆప్పటిదాకా నిద్రపోయిన ఓ చేతికర్ర

ఏ ఉరుములకో, ఏ అరుపులకో మేల్కొంది

లేదా

ఎప్పటిలా పక్కనుండే మరో కర్ర

ఇప్పడు అలమరలో పడుకోటం నిద్ర పోనివ్వలేదేమో

అప్పుడప్పుడన్నా రావాల్సిన మనుషులు

ఎప్పుడో గాని అందని దూరంలో వున్నారు

ఎప్పుడూ పక్కనే వుండే మనసేమో

ఇక్కడే గోడకి వేలాడుతోంది.

కాసేపు గోడతో కబుర్లు కన్నీరయ్యాక

వీధినీ ఇంటినీ కలపాలని గొళ్ళెం తెరుచుకుంది

ఓ కొత్త కుటుంబం పుట్టింది

ఓ పాత ఒంటరితనం గోడకెక్కింది

***

ఎప్పటి నుండో పాతుకున్న జీవితం

భుజాల కొమ్మలపై రెక్కల కలలు,

పొగల్లా తిరిగే మనుషుల బతుకు వాసనలు.

ఇప్పుడెటు చూసినా నేల చేరిన మబ్బులే

ఇందాకటి దాకా ఆకుల చేతులతో ఆడుకున్న దీపమూ నిద్రపోతోంది

చెట్టు మనసంతా గదుల్లో దాక్కున్న మనుషుల గురించి కాదు

గుండెలో పెట్టుకున్న రెక్కల మిత్రుడి కోసం

కాలానికోసారి కొమ్మలు తెగినా

బతుక్కి జీవాన్నద్దిన చిన్ని పిట్ట కోసం

తెరిపిస్తే వాలుతుందేమోనని

వూపిరి కాసేపు ఆపుకున్నట్లుంది మేఘం.

ఓ ఇంటి నీడ నుండి రెక్క విప్పింది పిట్ట

***

నిజానికి

ఈ రాతిరిలో ఆ గది కొన్ని పేజీలు తిప్పాలి

కానీ ఈ వాన ఓ సిగరెట్ ని ముట్టించింది

ఈ చీకట్లో ఆ నిప్పు కొన్ని పొగల్ని వెలిగించింది

నేల రాలే నీళ్లకు ఎదురెల్తూ నింగికేగిన పొగ

మేఘ సందేశం విందేమో..

పుస్తకం లోని మిగతా పేజీలను పూరిస్తోంది

ఎందుకో చినుకుల వేగం తగ్గింది

ఎప్పుడో ఆగిపోయిన ఆ దీపం మళ్ళీ వెలిగింది

నలిగిన సిగరెట్ మరిన్ని పేజీలను తిప్పించింది

***

వెలుతురిస్తుంది అంటారు గాని

వీధి దీపం,

వెల్తురుకి దారి చూపిస్తుందంతే..

వెలిగీ వెలిగీ చూపిస్తుంది, వెలుతురు ఆపీ చూపిస్తుంది

వెల్తుర్లో మనుషుల్ని చూపిస్తుంది

అప్పుడప్పుడూ ఇలా వానొస్తే

మనుషుల్లో చీకట్లనూ చూపిస్తుంది

చూడటం నేర్చుకోవాలంతే

***

అప్పటికీ లక్షల ముక్కలైన ఓ బిందువు

చువ్వ పైనా రాలుతుంది

బాల్కనీలోనూ వాలుతుంది

గుండెపైనా కురుస్తుంది

చెట్టునూ చేరుతుంది..

కానీ మళ్ళీ ఒక్కటై ప్రవహిస్తుంది.

 

బహుశా

ఇది చెప్పాలనే ఏడ్చీ ఏడ్చీ

అలిగి వెళ్లిపోతున్నట్లుంది ఆ మబ్బు.

*

చిత్రం: పఠాన్ మస్తాన్ ఖాన్

శ్రీ వశిష్ఠ సోమేపల్లి

స్వస్థలం గుంటూరు. ఇప్పుడుండేది హైదరాబాద్లో. ఇప్పుడిప్పుడే కవితలు చదువుతున్నాను, అప్పుడప్పుడూ రాస్తున్నాను.

2 comments

Leave a Reply to Ruparukmini. K Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత్వం కొత్త ప్రవాహమై ప్రవహిస్తోంది. అభినందనలు.

  • ప్రతీ అక్షరం కవిత్వంగా బాగా మలిచారు 👏👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు