ఇదిగో ఇదే ఇదే మా బడి!

సాహిత్యమంటే కథలు, కవితలని కాక- సమాజం, రాజకీయం, దృశ్యం, ముఖ్యంగా రచయితలూ, కవులకు ప్రోత్సాహం అని అర్థం చేసుకున్న సంపాదక వర్గం ఉండడం వలెనే సాధ్యపడింది.

సారంగ పుట్టినరోజట. ఇదైతే ప్రత్యేకమే. ఎందుకంటే సారంగ తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టే వారెందరికో ప్రత్యేకమైన జాగాని సమకూర్చడంలో  పనిచేసింది, చేస్తూ ఉంది, చేస్తూనే ఉంది.

వ్యక్తిగతం కాకుండా నేను సారంగ గురించి చెప్పలేను. పెద్దయ్యాక నా బడి జ్ఞాపకాలు లాగానే, నాకు సారంగ కూడా. చిన్నప్పుడు రోజు బడికి వెళుతూ పెద్దయ్యాక ‘ఇదే మా బడి’ అని చూపించే బడాయి అనుకోండి. ఎదురుగా టీచర్ కనపడితే ఉన్నట్టుండి బాల్యం తళుక్కుమంటుంది- ‘సర్/మేడం నేను.. ‘అని గుర్తుచేయగానే, ‘ఓహో నువ్వా’ అని ఆ బట్టతల ఉన్న నలభయిదేళ్ళ మధ్యవయస్కుడిని వెంటనే ఎనిమిదేళ్ల పిల్లాడిగా ఊహించుకుని పలకరిస్తారు. అటువంటిదే సారంగ నాకు. అఫ్సర్ అందుకేనేమో చీటికీ మాటికీ అలుగుతూనే నేనేం రాస్తున్నానో ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటారు.

2012లో బుర్ర తుప్పుపట్టిపోయే సమయంలో సారంగతో పాటుగా చాలా బ్లాగులు పరిచయం చేసాడు మహేష్ కత్తి. కల్పనా రెంటాల గారు రాసిన ‘తన్హాయి’ గురించి కూడా రాయించారు. ఇప్పటికీ గర్వంగా అనిపిస్తుంది. జీవితం మసకబారిన సమయాల్లో సమాజం పట్ల, ముఖ్యంగా జెండర్ పట్ల ఆ మాత్రం స్పష్టత ఎలా ఉన్నదో తెలీదు. అది చదివారేమో అఫ్సర్.

తరవాత వి.  చంద్రశేఖర్ గారి ‘లెనిన్ ప్లేస్’ చదువుతూ ఊగిపోయాను. అది నాలో కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో కథ గ్రూప్ అని ఒక గ్రూప్ నడిపేవారు – వేంపల్లె షరీఫ్, మహి బెజవాడ. ఆ గ్రూపో కాదో తెలీదు కానీ సరిగ్గా రెండు వాక్యాలు రాశాను నేను- ‘లెనిన్ ప్లేస్ చదివారా, తప్పకుండా చదవాల్సిన పుస్తకమది. చదివి గింజుకులాడిపోతున్నాను’ అని అర్థమొచ్చే ఒక మొహమాటపు పోస్టు. మొహమాటం ఎందుకంటే ఆ పుస్తకం గురించి ఏమి రాయాలన్నా భయమే ఉండింది. (ఇప్పటికీ ఆ awe లోనే ఉన్నాను.)

అప్పుడొచ్చారండి మన అఫ్సర్ హీరో! ఇన్బాక్స్ లో పలకరించి, ఆ పుస్తకం గురించి ఒక ఆర్టికల్ రాయమన్నారు. రాసేశాను. పద్నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో నా ఫోటోల వలన, కాస్త కొత్త వాక్య ప్రకటనల వలన బాగానే గుర్తించారు. లేదా నేను అలా అనుకున్నాను. ఆ తరవాత ఒక చిన్న కథ! ఏ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టినా, ఇదో ఆర్టికల్ అయేది, లేదా కథ అయేది, ఎందుకు పంపలేదు అని అఫ్సర్ గారి హుంకారాలు. మధ్య మధ్యలో కల్పనా గారి పాజిటివ్ స్ట్రోక్స్ అండ్ ప్రోత్సాహం.

సాధారణంగా జరిగినట్లే ఇలా పిలిచి మర్యాదిస్తే కాస్త కళ్ళు నెత్తికెక్కుతాయి కదా- అప్పుడు సారంగని కాస్త ఉపేక్షించామన్నమాట. నేనే కాదు, అందరూ. పైగా మ్యాగజైన్ పనిభారం చాలా ఉంటుంది. కల్పన, అఫ్సర్, రాజ్ కారంచేడు గారితో పాటు వేంపల్లె షరీఫ్ వంటి మరికొందరు పని చేసినా పని పెరిగో విసుగొచ్చో అలసిపోయో సారంగకి సెలవు అని ఆపేసి కూర్చున్నారు.

అప్పటికి అంతర్జాల పత్రికలూ బానే ఉన్నాయి. స్పష్టంగా సమయాలు చెప్పలేకపోయినా మెహెర్ ఆధ్వర్యం లో కినిగె, మాధవ్ మాచవరం-సురేష్ కొలిచాల గారి ఈ మాట, స్వాతికుమారి- రవి వీరెల్లి గారి వాకిలి, జ్యోతి వలబోజుగారి మాలిక – ఇలా ఎన్నెన్నో పత్రికలూ వస్తున్నాయి. అన్ని మంచివే. భలే భలే కథలు ఉండేవి. ప్రతి పత్రికకి ఒక ఫ్లేవర్ ఉండేది.

కానీ సారంగ ప్రత్యేకమే. సారంగ personalityని ఎంతో కొంత నాతో పోల్చుకుంటాను. చాలా టైపోలు ఉండేవి సారంగలో. రచయితలు జాగ్రత్త పడకపోవడం, అప్పుడప్పుడే కొత్తగా లాప్టాప్ లేదా మొబైల్ నుండి ఇంగ్లీష్ అక్షరాల ద్వారా తెలుగుని టైపు చేయడం నేర్చుకుంటున్న రచయితలూ, ప్రతి వారం వచ్చే కంటెంట్ని ఫిల్టర్ చేయడమే కాక, అంతర్జాలంలోని సాంకేతిక సవాళ్ళను ఎదుర్కోవలసి రావడం, పైగా అమెరికాలో రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ, ఇవన్నీ నిర్వహించడం- ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. నేరుగా కొందరు, వేరేవారి వద్ద కొందరు ఈ కామెంట్లు చేసేవారు. నేనెటూ టైపోరాణి అని నాకు నేనే పేరు పెట్టేసుకుని లైట్ తీసుకున్నాను. కానీ భాషా పండితులకు నచ్చదు కదా. అప్పటికి సారంగ టీమ్ మొత్తుకుంటూ ఉండేవారు, అక్షరదోషాలను సరిచేసుకునే పంపండి- ఇక్కడ ప్రూఫ్ రీడింగ్ చేసే పరిస్థితి లేదు అని.

సరే, టక్కున సారంగ ఆగిపోయింది కదా. కొన్నాళ్ల మౌనం తరవాత, దేశంలో రాజకీయ పరిస్థితులు మారాయి. వాటిని వ్యాఖ్యానించేవారికి సరైన స్పేస్ లేకపోయింది. ఇది సారంగ ఆపిన కొంతకాలానికి చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే, వాకిలి, ఈ మాట, కినిగె పూర్తి సాహిత్య మ్యాగజైన్లు. వారు సాహిత్యానికి సంబంధించినవే ప్రచురించేవారు. కానీ సారంగ అలా కాదు. కథలు, కవితలు, పుస్తక పరిచయాలు, విమర్శలతో పాటే, రచయితలూ, కవుల పరిచయాలు, మాటామంతి, ప్రత్యేక కాలములు(ఇక్కడ కందుకూరి రమేష్ బాబు ఫోటోస్టోరీల గురించి తప్పకుండా చెప్పాలి), రాజకీయ వ్యాఖ్యానాలు, రాజకీయ పరిస్థితుల గురించి కథలు- కొన్నిసార్లు కథను నేర్పుగా రాయలేకపోయినా ఆ విషయాన్నీ చర్చకు పెట్టవలసిన అవసరం గుర్తించి కథను తిప్పి కొట్టక కచ్చితంగా ప్రచురించడం- ఇవన్నీ చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ, సాహిత్యమంటే కథలు, కవితలని కాక- సమాజం, రాజకీయం, దృశ్యం, ముఖ్యంగా రచయితలూ, కవులకు ప్రోత్సాహం అని అర్థం చేసుకున్న సంపాదక వర్గం ఉండడం వలెనే సాధ్యపడింది.

ఎన్నెనో స్నేహాలు బలపడ్డాయిక్కడ. స్వాతికుమారి, చైతన్య పింగళి, మహి బెజవాడ, సామాన్య, అరిపిరాల సత్యప్రసాద్ – ఇలా ఎందరెందరో గొప్ప రచయితలు (అప్పట్లో సామాన్య, స్వాతి తప్ప అందరం పిల్ల రచయితలమే) వారితో స్నేహం, దాని ద్వారా మరికొన్ని రాతలు రాసే ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా చైతన్య పింగళి ‘తనదే ఆకాశం’ చదివాక ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ అవుతుందని కచ్చితంగా తెలిసిపోయింది. పద్నాలుగేళ్ల తరవాత తాను ఇప్పటికే నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండక తప్పలేదు. స్వాతి కుమారి కూడా అంతే.

వాకిలిలో నా మూడో కథ – పునీత రాశాక చాలా దుమారం రేగింది. నేను పాపులారిటీ కోసం రాశాను అన్నారు కొందరు. నాకు అసలు అర్థం కాలేదు. నేను కొకు, చలం తో పాటే మా అమ్మ దాసరి శిరీష, వోల్గా, కుప్పిలి పద్మ కథలు చదువుతూ పెరిగాను. వారితో పోలిస్తే అసలు నేనెంత! దానికి ఇంత హడావిడి ఏమిటి అని. అదృష్టవశాత్తు ఇప్పుడున్నంత అవేర్నెస్ అప్పుడు లేకపోవడం వలన, సహచరులు, ఎడిటర్లు(స్వాతి- రవి) నావైపే ఉండడం వలన, నేను అభిమానించే రచయితలు – అజయ్ ప్రసాద్, అనిల్ బత్తుల, అన్వర్, ఆరి సీతారామయ్య, కొండవీటి సత్యవతి, సామాన్య) ఇలా ఎంతమందో మెచ్చుకోవడం లేదా ధైర్యం చెప్పడం వలన పట్టించుకోలేదు.

కానీ నేను రాయడం తగ్గిపోయింది.

ఆ సమయంలోనే కె బి గోపాలన్ గారు ఇస్మత్ చుగ్తాయ్ గురించి సారంగలో రెండు మూడు దఫాలుగా వ్యాసాలు రాశారు. ఆ రోజుల్లో ఒక ముస్లిం మహిళ ఇంత ధైర్యంగా రాజ్యాన్నే ఎదుర్కొన్నప్పుడు నేను రాసే ఛుట్కు కథలకు ఇంతగా వెరవనవసరం లేదని ముందుకు సాగిపోయాను. ఇందాక చెప్పినట్లే సాహిత్యం అనేది ఒక Multi-Disciplinary Approachతో సాగాలి. ఒక గురిలో రాస్తే ఎస్తెటిక్స్ మెరుగవుతాయేమో కానీ అది సమాజాన్ని ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంచుతుంది. చదువరులకు బోర్ కొడుతోంది.

అందుకేనేమో ఎన్నో genres లో కంటెంట్ ని తెచ్చారు సారంగలో. మినీ కథలు, మైక్రో కథలు, కవిత సమీక్షలు, పుస్తకావిష్కరణలు, విమర్శలు, విసుర్లు, ఇలా ఎన్నో. ప్రస్తుత కాలంలో రాజకీయాల మీద కథలు ఎక్కువగా రావడం లేదు గాని- కల్బుర్గి చనిపోయినప్పుడు రాసిన కథ, సామాన్య స్నేహితురాలైనా సరే, ఆమె కథతో తనకున్న విభేదాలని తెలిపే కాలయాపన వ్యాసం, ముఖ్యంగా demonitisation సమయంలో జి ఎస్ రామ్మోహన్ గారి వ్యాసం – ఇలా ఎన్నెన్నో. తెలంగాణ ఉద్యమం సమయంలో అయితే సారంగ మోగిపోయింది.

మొన్నటికి మొన్న వచ్చిన ‘ అదే ప్రేమ’ 1922-2025 క్వియర్ కథల సంకలనంలో ఎక్కువ కథలు సారంగలో ప్రచురితమైనవే! దీనిని బట్టి సారంగ తన ఆలోచనలలో ఎంత ముందు ఉందో తెలుస్తోందిగా.

అఫ్సర్ గారు ఇష్టంగా షేర్ చేసుకునే ఫొటోలో నేను ఆయన ఒక ఇరానీ హోటల్లో మాట్లాడుకునే ఫోటో ఉంది. ఆ ఫోటోకి కూడా ఒక కథ ఉంది. అప్పుడు సారంగని మూసేశారు. అది తాత్కాలికం అని ఇప్పుడు అనొచ్చుగాని, అప్పుడు ఇక ఆ స్పేస్ పోయిందనే అనుకున్నాం. ఆ సమయంలో చాలా సంక్షోభాల మధ్య, దినపత్రికలన్ని రాజకీయ కరపత్రాలైన వేళల్లో, గట్టిగా గొంతుక పెగల్చడానికి సోషల్ మీడియా తప్ప మరో స్థలం లేకపోయింది. నాకు చైతన్యకి కష్టం వేసి చెప్పుకున్నాం కూడా. అప్పుడే అఫ్సర్ తన అమ్మ ఆసుపత్రిలో ఉన్నారని వచ్చారు. ఆ సమయంలో ఆయన్ని కలిసినప్పుడు ఇద్దరం గట్టిగానే చెప్పాం, మొదలుపెట్టాలని. మా మొహాలకంత సీన్ ఉంటుందని ఇప్పటికి అనుకోనుగాని, ఆయన మాత్రం ‘మీరు నన్ను రెచ్చగొట్టి సారంగని మళ్ళీ మొదలుపెట్టించి, ఇప్పుడేమి రాయకుంటే ఎలా’, అని నిలదీస్తూ ఉంటారు.

చివరగా నేను రాయడం మొదలుబెట్టిన సమయంలో ఒకరిద్దరు తప్ప నాకన్నా చిన్నవారు కనబడలేదు. కాని ఇప్పుడు! ఖదీర్ బాబు పనికట్టుకుని రైటర్స్ మీట్ పెట్టడం. ఒక్క కథ రాసినా కలుపుకుపోవడం ఒక కారణమైతే, ఆ ఒక్క కథను మొదటగా అచ్చేసినవారిలో సారంగకి చప్పట్లు కొట్టి కిరీటం పెట్టొచ్చు. ప్రతి రచయితకు సాహితీ విలువలు, లేదా శిల్పం, వస్తువు వగైరా క్లాసులు పీకకుండా వారి స్వేచ్ఛను, వ్యక్తీకరణను గౌరవించి భుజం తట్టే సారంగ ఇప్పుడు teens లోకి వచ్చేసింది.

మరిన్ని పుట్టినరోజులు ఇలాగే కాక, ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ –

Happy 14th సారంగ!

*

Image: Rafi Haque

అపర్ణ తోట

5 comments

Leave a Reply to Srinivas Kudupudi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కని జ్ఞాపకాలతోరణం..అపర్ణకు సారంగకు అభినందనలు

  • బాగుంది అపర్ణా!
    సారంగను యంగ్ రైటర్స్ కి అడ్డాగా చక్కగా ప్రజెంట్ చేశావు. తమ మొదట రచనలను సారంగలో చూసుకొని మురిసిపోయిన కొత్త తరం రచయితలెందరో! ఆన్లైన్ వెబ్ మ్యాగజైన్స్ కి నన్ను దగ్గర చేసింది కూడా సారంగనే అని ఘట్టిగా చెబుతాను

  • Nice ఆర్టికల్ అపర్ణ… సారంగకి పుట్టినరోజు శుభాకాంక్షలు…

  • భలే రాసావు అపర్ణ. సారంగ వెనక ఇంత ఉందని నాకు తెలియదు. నువ్వెంత రాశావో కూడా ఇప్పుడే తెలిసింది 🩷🩷

    అఫ్సర్ గారు ఏంటి మీరు రాయరా?? అని అడిగితే కల్పన మరింత ప్రేమగా మీరు రాయరూ!! అంటారు. భలే ఇష్టం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు