అత్యంత సంతోషపు దినాన కూడా, ముంజేతులకి సంకెళ్లు విడలేదు. ఇనప గొలుసులకి బంగారు పూత అద్దమని, వాడిపోయిన పూలమాలని వజ్రాల హారం కమ్మని మంత్రించారెవరో! నాకు ఏ బరువులూ వద్దనే ప్రార్ధన మాత్రం చేరాల్సిన చోటికి ఈనాటికీ చేరలేదు.
అలజడి,
నిశ్శబ్దం,అలజడి,తిరిగి నిశ్శబ్దం.
చివరికి శాంతి- అసంఖ్యాక చక్రభ్రమణాల ఆవల ఎక్కడో…
***
అటువైపుగా వెళ్తే నగరం, ఇటుపక్కకి తిరిగితే ఊరు. మధ్యలో ఎన్ని మైళ్ళకీ అంతం కాకుండా అడవి. తెలిసిన చోట్లన్నీ వెతుక్కున్నాను. తెలియని చోట్ల ఆరా తీసుకున్నాను. నిన్ను పోలిన మనుషులెందరినో చూశాను. డస్సిపోయేదాక నడిచి కోపంతో, నా ప్రయత్నమంతా ప్రలోభమేనా అని గట్టిగా అరిచాను. నా పొలికేక వెనక్కి తిరిగిరాకుండా అనంతంలో కలిసిపోయాక, దిక్కులకి అంతం ఉందనే భ్రమ తొలగిపోయింది. కళ్ళెదురుగానే పొర వెనక పొర జారిపోయింది.
ఆకురాలు కాలం. తృణపత్రాల మీద నీ గుర్తులు రాసి ఉన్నాయి. అవే అక్షరాలు, పదాలూ పాతవే, కానీ వాక్యం మాత్రం వెనకటిది కాదు. వింటినుండి దూసుకొచ్చే బాణమో, ఊపేసే ఉన్మత్త వచనమో కాదు. బాధ మాత్రమే ఉండి భాష చాలని రోజుల నిస్సహాయపు మూలుగు కాదు. ఎండుటాకులన్నిటినీ పోగు చేసుకుని మిణుగురుల వెలుగులో రాత్రంతా చదువుకున్నాను. ప్రభాత కూజితాలతో పాటు తోచిన దారిలో తిరిగి ప్రయాణమయ్యాను. ఏ చోటులోనూ ఒక్కరాత్రికన్నా ఆగకూడదని నియమం. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ కలిగిందా, నాదంటూ ఏదైనా ఉందనిపించిందా, మరొక్కరోజు ఆగిపోదామనిపించిందా… ఇక దారి తప్పినట్టే, ఎరకి చిక్కినట్టే.
***
వెదురుపొదల్ని, గోరింట గుబుర్లని దాటుకుని, అపరాహ్ణపు వేసటని తట్టుకుని సాగిపోతూనే ఉన్నాను. భయంలో దాగిన లాలస, సౌందర్యం చాటున పొంచిన ప్రమాదమూ స్పష్టమయ్యేవేళకి, దూరపు ఇళ్లలో దీపాల సంకేతం కనబడింది. బహుశా నగరానికే చేరుకుని ఉంటాను. ఉన్నట్టుండి దూరదేశంలోని నా ఇల్లు గుర్తొచింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఈ నగరంలోనైనా కనబడతావా?
లేక…
నేను తిరిగి వెళ్ళేసరికి నా ఇంటిగుమ్మంలో, మనిషి అలికిడి లేని, సందె దీపం వెలగని ఆ నిశ్శబ్ధ ఏకాంత కుటీరపు ద్వారానికి ఆనుకుని… నాకోసమే ఎదురుచూస్తూ నువ్విన్నాళ్ళూ అక్కడే ఉన్నావా?
అవును, ఆ అడవిలో రాత్రిపూట మిణుగురుల వెలుగులో చదువుకున్న సంకేతానికి అర్థం అదే కదూ? నీ నిఘంటువులో దండన అనే మాటకు దయ అని అనువాదం కదూ? నిన్ను చేరుకోవడానికి నాకు మిగిలిపోయిన ఒకే ఒక అడ్డు నేనే కదూ?
*
Add comment