ఇంతకీ నువ్వు కనబడతావా?

త్యంత సంతోషపు దినాన కూడా, ముంజేతులకి సంకెళ్లు విడలేదు. ఇనప గొలుసులకి బంగారు పూత అద్దమని, వాడిపోయిన పూలమాలని వజ్రాల హారం కమ్మని మంత్రించారెవరో! నాకు ఏ బరువులూ వద్దనే ప్రార్ధన మాత్రం చేరాల్సిన చోటికి ఈనాటికీ చేరలేదు.

అలజడి,

నిశ్శబ్దం,అలజడి,తిరిగి నిశ్శబ్దం.

చివరికి శాంతి- అసంఖ్యాక చక్రభ్రమణాల ఆవల ఎక్కడో…

***

టువైపుగా వెళ్తే నగరం, ఇటుపక్కకి తిరిగితే ఊరు. మధ్యలో ఎన్ని మైళ్ళకీ అంతం కాకుండా అడవి. తెలిసిన చోట్లన్నీ వెతుక్కున్నాను. తెలియని చోట్ల ఆరా తీసుకున్నాను. నిన్ను పోలిన మనుషులెందరినో చూశాను. డస్సిపోయేదాక నడిచి కోపంతో, నా ప్రయత్నమంతా  ప్రలోభమేనా అని గట్టిగా అరిచాను. నా పొలికేక వెనక్కి తిరిగిరాకుండా అనంతంలో కలిసిపోయాక, దిక్కులకి అంతం ఉందనే భ్రమ తొలగిపోయింది. కళ్ళెదురుగానే పొర వెనక పొర జారిపోయింది.

ఆకురాలు కాలం. తృణపత్రాల మీద నీ గుర్తులు రాసి ఉన్నాయి. అవే అక్షరాలు, పదాలూ పాతవే, కానీ వాక్యం మాత్రం వెనకటిది కాదు. వింటినుండి దూసుకొచ్చే బాణమో, ఊపేసే ఉన్మత్త వచనమో కాదు. బాధ మాత్రమే ఉండి భాష చాలని రోజుల నిస్సహాయపు మూలుగు కాదు. ఎండుటాకులన్నిటినీ పోగు చేసుకుని మిణుగురుల వెలుగులో రాత్రంతా చదువుకున్నాను. ప్రభాత కూజితాలతో  పాటు తోచిన దారిలో తిరిగి ప్రయాణమయ్యాను. ఏ చోటులోనూ ఒక్కరాత్రికన్నా ఆగకూడదని నియమం. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ కలిగిందా, నాదంటూ ఏదైనా ఉందనిపించిందా, మరొక్కరోజు ఆగిపోదామనిపించిందా… ఇక దారి తప్పినట్టే, ఎరకి చిక్కినట్టే.

***

వెదురుపొదల్ని, గోరింట గుబుర్లని దాటుకుని, అపరాహ్ణపు వేసటని తట్టుకుని సాగిపోతూనే ఉన్నాను. భయంలో దాగిన లాలస, సౌందర్యం చాటున పొంచిన ప్రమాదమూ స్పష్టమయ్యేవేళకి, దూరపు ఇళ్లలో దీపాల సంకేతం కనబడింది. బహుశా నగరానికే చేరుకుని ఉంటాను. ఉన్నట్టుండి దూరదేశంలోని నా ఇల్లు గుర్తొచింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఈ నగరంలోనైనా కనబడతావా?

లేక…

నేను తిరిగి వెళ్ళేసరికి నా ఇంటిగుమ్మంలో, మనిషి అలికిడి లేని, సందె దీపం వెలగని ఆ నిశ్శబ్ధ ఏకాంత కుటీరపు ద్వారానికి ఆనుకుని… నాకోసమే ఎదురుచూస్తూ నువ్విన్నాళ్ళూ అక్కడే ఉన్నావా?

అవును, ఆ అడవిలో రాత్రిపూట మిణుగురుల వెలుగులో చదువుకున్న సంకేతానికి అర్థం అదే కదూ? నీ నిఘంటువులో దండన అనే మాటకు దయ అని అనువాదం కదూ? నిన్ను చేరుకోవడానికి నాకు మిగిలిపోయిన ఒకే ఒక అడ్డు నేనే కదూ?

*

స్వాతి కుమారి

6 comments

Leave a Reply to BVV Prasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంది spiritual seekers journey ఇది. అనుభవం అయితే అర్ధం అవుతుంది. Words చాలా లోతుగా ఉన్నాయి. 👍

  • స్వాతీ!

    మీ వాక్యాలు నన్ను భయపెడతాయి ఒక్కోసారి.
    మూసేసిన తలుపుల్ని, తలపుల్ని, హృదయపు లోతుల్ని తడతాయి.
    ఈ అమ్మాయి నేను మాట్లాడాలని అనుకున్నా,
    మాట్లాడలేకపోయిన మాటలను మాట్లాడుతుంది కదా , అని కళ్ళు చెమ్మగిల్లుతాయి.

    మీకు హృదయపు భాష తెలుసు.
    మనుషుల హృదయాల్లోకి, కంటితడిలోకి ప్రవేశించటం కన్నా మన రాతకి అర్థం ఏమి ఉంటుంది?

    మీ వాక్యం నాకు ఇష్టం.
    విమల

  • అస్పష్టంగా కూడా వినపడలేని ఓ నిస్సహాయపు మందహాస శబ్దాన్ని స్పర్శించి నువ్వు చూడగలిగితే..
    ఏమో నాకు నేను కనపడగలనేమో!

  • నాకు నేనే అడ్డేమో!
    నేనెవరు అని అన్వేషించే మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎంత చక్కగా చెప్పారు అసలు!
    గుండె లోతుల్లో ఎన్నో భావాలను – చేసే పూజ ఆగిపోయి, పఠించే పెదవులు ఆగిపోయి -అమ్మ వారి పాదాల దగ్గర ఓ కన్నీటి బొట్టుగా రాలినపుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది స్వాతి మీ రచన చదివితే.

  • మనసుకి మాటొచ్చి చెప్పినట్టు ఉంది.నీ నిఘంటువులో దండన అనే మాటకు దయ అని అనువాదం కదూ? నిన్ను చేరుకోవడానికి నాకు మిగిలిపోయిన ఒకే ఒక అడ్డు నేనే కదూ? ఈ వాక్యాలు చాలా గొప్పగా అనిపించాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు