ఆ సాయంత్రం

నీ అరచేతిని పుచ్చుకుని కూర్చున్నాను

ఆ సాయంత్రం –

చల్లగా నీ చేతివేళ్ళు, తడిచిన వేర్లలా –

 

ఆ లేత ఎండలో గాలిలో ఊగే తూనీగలు,

పచ్చిక వాసనా,

నీళ్లు ప్రవహించే శబ్దం నీలో; నాలోనూ

‘వెళ్ళనా?’ అన్నావు నువ్వు. తల ఊపాను

నేను, ఎటువైపో

ఇప్పుడు గుర్తులేదు. రెక్కలు తెగుతూ

 

ఊపిరి ఆగిన, ఆ క్షణం మాత్రమే గుర్తు –

***

నీ అరచేతిని వదిలివేసి లేచి నిలబడ్డాను

నేను ఆ దినం,

మరి పూర్తిగా ఖాళీయై, తెగిన చేతినై

 

రాత్రిని తెచ్చే, ఒక సాయంత్రాన్నయ్యీ!

 

చేతివేళ్ళని, వేళ్ళతో

 

చేతివేళ్ళని, వేళ్ళతో పెనవేసుకుని

నువ్వు కూర్చున్నపుడు

ఏం జరుగుతుందంటే, తెరిచిన

 

కిటికీ స్థానంలో, ఒక ముఖం మెల్లిగా

రూపొందుతుంది. చూడు

అది ఎలా ఉందో! హృదయాన్ని

 

త్రవ్వి, ఆ రక్తంతో, మాంసంతో మరి

ఒక పెయింటింగ్ ని

వేసినట్టు! మరి, ఆ చిత్రకారుని

 

పెదాలపై నవ్వు ఉండినదా, నీలోని

రక్తాన్ని తోడి, నిన్నే మరి

చిత్రించి నీకే చూపుతున్నప్పుడు?

***

చేతివేళ్ళని, వేళ్ళతో పెనవేసుకుని

నువ్వు కూర్చున్నప్పుడు

ఎన్నో జరుగుతాయి, ఎలా అంటే

ప్రేమతో నీళ్లు తాపించి, ఇక ఎంతో

కుదురుగా, మెడను

తిప్పి, కోడి కుత్తుకను కోసినట్టు!

 

3

 

నీలోనే ఒరిగిపోయి …

 

శవం మీద కప్పిన వస్త్రంలాంటి చీకటి –

శ్వాసించదు, చీకటి కింద

ఆగిపోయిన శరీరం, వాసనా వేయదు

 

మాట్లాడదు అది, పోనీ విననైనా వినదు –

చెక్కలాంటి చేతులు

కవిత్వం రాసిన ఆ లిల్లీపూల వేళ్ళూ –

 

నీలోకి, పొగమంచులా వ్యాపించే రాత్రి –

ఎంతయ్యింది సమయం?

ఎముకలు పిగులుతోన్న, ఈ క్షణం?

***

వస్త్రాన్ని తొలగించి, మృతి చెందిన నీ

ప్రియురాలి ముఖాన్ని

చూసినప్పటి, లోతైన తెల్లని చీకటి!

 

చూడు! చీకట్లో, ఎవరి కోసమో మరి ఇక

ఎదురుచూసి, కుర్చీకి

ఇరువైపులా, కోమాలోనే ఒరిగిపోయి

 

నీకోసం చచ్చిపోయిన రెండు చేతుల్ని!

***

శ్రీకాంత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు