డయాస్పోరా సాహితీ దిగ్గజం వేలూరి వేంకటేశ్వర రావు గారి మరణ వార్త నలుగురం కలిసి నవ్వుకుంటున్న సందర్భంలో వచ్చి గట్టిగా తాకింది. ఆయన రూపు కళ్ళ ముందు కదిలింది. గట్టిగా నవ్వుతూ మాట్లాడే ఆ మాటలు, ప్రతి మాటలో ఎవరి మీదనో వేసే ఓ చురక గుర్తొచ్చాయి. మరుక్షణమే బాధ్యత గుర్తొచ్చింది. ఆయన మీద వ్యాసం కోసం ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేశా.
వేలూరితో పరిచయం నిన్నటిదో,మొన్నటిదో కాదు. దాదాపు మూడు దశాబ్దాల పరిచయం. అమెరికా వచ్చాక నేను సాహిత్యం గురించి మొదట మాట్లాడిన వ్యక్తుల్లో వేలూరి కూడా ఒకరు. అప్పటి దాకా ఆయన రచనలు మాత్రమే తెలుసు. ఆయనతో మొదటి సంభాషణలోనే ఆయనతో వాదానికి దిగాల్సి వచ్చింది. అలా ఉంటుంది ఆయనతో మాట్లాడటం. భేషజం కోసం మాట్లాడటం ఆయన నైజం కాదు. డయాస్పోరా రచనల పట్ల ఆయనకు చాలా నిక్కచ్చి అభిప్రాయాలున్నాయి. నోస్తాల్జియా కి, డయాస్పోరా కి వున్న తేడా గురించి చాలా స్పష్టత ఉంది. దాని గురించి ఎవరితోనైనా తగువు కి ఆయన చివరి వరకూ సిద్ధమే.
అమెరికాలో మా సాహిత్య చర్చలు ఎక్కువగా ఏదో ఒక మీటింగ్ లోనే జరుగుతుంటాయి. 2004 చికాగో లో జరిగిన ఆటా సమావేశం నుంచి ఇటీవలి సమావేశాల వరకు ఆయనతో ఎప్పుడూ వాదనలే. కానీ అవి స్నేహాన్ని చంపేసే చర్చలు కావు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు, ఆ విభేదాల నుంచే.
వేలూరి వారిని మెప్పించటం అంత సులభం కాదు. ఆయనతో అంగీకరించటం కూడా. స్త్రీ వాదం గురించి ఆయనకు ఎన్నో పేచీలు. అయితే అవేమీ నాకు ఆయన మీదున్న గౌరవాన్ని తగ్గించలేదు.
అమెరికా తెలుగు సాహిత్యపు ఒక శిఖరం నేలకొరిగింది. ఆయన రచనలు, ఆయన నిబద్ధత, ఆయన విమర్శ అమెరికా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేస్తున్నప్పుడల్లా గుర్తుండిపోతాయి.
అయితే ఆయన సాహిత్య కృషి గురించి సీరియస్ గా ఎవరూ మాట్లాడటం లేదన్న బాధ ఆయనను చివరి వరకూ బాధ పెట్టింది. “ నా రచనల గురించి ఎవరూ మాట్లాడటం లేదన్న” బాధ కేవలం వేలూరి వారిది ఒక్కరిదే కాదు. ఇవాల్టి అమెరికా తెలుగు రచయితలందరిదీ. ఎందుకంటే, చాలా మంది రచయితలు వాళ్ళే మొట్ట మొదటి సారి ‘ఇలాంటి’ కథ రాశామని, ‘ఇలాంటి’ నవల రాశామన్న భ్రమలో ఉన్నారు. కానీ వేలూరి గారి బాధ కేవలం అలాంటిది కాదు. నిజంగానే కొన్ని దశాబ్దాల పాటు సాహిత్య కృషి చేసినా, ఆయన రచనల మీద ఒకటి రెండు సమగ్ర వ్యాసాలు కూడా వచ్చిన గుర్తు లేదు. ( బహుశా నేను మిస్ అయ్యానేమో!) మనిషి బతికున్నంత కాలం వాళ్ళ విలువ తెలియదు. చనిపోగానే, మనం చేయని పనులు, అవతలి వాళ్ళు చేసిన పనులు గుర్తుకొస్తాయి. అలాంటి వాటిల్లో ఆయన సాహిత్య కృషి మీద మంచి వ్యాసం రాయటం. అది ఇప్పటివరకూ నేను చేయని పని. వేలూరి గారు గుర్తొచ్చినప్పుడల్లా అది నన్ను పొడుస్తూనే ఉంటుంది.
*
వేలూరి ఫోటో: కన్నెగంటి రామారావు








Ademito intavarakoo naku Veluri Venkateswara Rao gari gurinchi teliyadu . Dayaspora ante teliyadu .Meeru cheppina tarwatane telisindi . Ippudu varu raasina vyaasam chadivaanu .Intaku mundu teliya nanduku vicharamoo kaligindi .But it’s too late.
Variki
SRADDHNJLI Ghatistoo
Annapurna.
ఆయనతో నేనూ గట్టిగా గొడవపడ్డాను. ఆయన విమర్శ కటువుగా ఉంటుంది. కానీ ఎంత స్నేహ స్వరం ఆయనది. పేచీ ఆ విషయం వరకే. తర్వాతి మాటా మంతీ హాయిగా ఉండేది.
మొన్ననే కథ 24లో వారి కథ చదివాను
చాలా కాలం క్రితం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో వారిని వాసిరెడ్డి నవీన్ ఇంటర్వూ చేశారు
వారిలో తర్కం ఎక్కువ
గతి తార్కికత ఎక్కువే