ఆగిన చోటునుంచి ముందుకు నడిపించే కవిత్వం

ఎల్లకాలం భావోద్వేగపు దుఃఖాన్ని మోయడం ఎవరికి సాధ్యం కాదు. రేఖ కూడా అందుకు మినహాయింపు కాదు.

ల్లకాలం భావోద్వేగపు దుఃఖాన్ని మోయడం ఎవరికీ సాధ్యం కాదు. రేఖ కూడా అందుకు మినహాయింపు కాదు.

బ్రతుకంతా ఏదో సడి, తడి, అలజడి –
నువ్వు గుర్తించలేనంత సున్నితంగా
ఒకప్పుడు
ఒళ్ళు జలదరిస్తుంది-
ఒకానొక అనుభవం
నీలో ఘనీభవించే
మౌక్తిక క్షణమది-
అప్పుడు నువ్వు
కాళిదాసువి
తాన్సేన్‌వి
మైకేలేంజిలోవి- అని రాసుకున్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
కవిత్వం అంటే జీవిత అనుభవంలో నుంచి  మాట్లాడ్డం కదా..! ప్రతీ జీవితంలో ఒళ్ళు జలదరించే అనుభవాలు, కాలం ఘనీభవించే క్షణాలు ఉంటాయి కదా.. అలాంటి జీవన అనుభవాల పరిచయాలు చాలా ఉన్నాయి రేఖాజ్యోతి దగ్గర. వాటిని రికార్డ్ చేయడానికి కవిత్వం కన్నా తనకి వేరే మార్గం కనబడలేదు. భావవ్యక్తీకరణ మాత్రమే కాకుండా ఆ భావాల్లో కాస్త జవజీవాలు నింపి వాటికి తన దగ్గరున్న మాటలతో  అలంకారం చేసి “ఆగినచోటు నుంచే మళ్ళీ” అనే శీర్షికతో తన మొదటి కవితా సంపుటి తీసుకువచ్చారు. ఆకుపచ్చని రంగు సింగారించుకుని వేర్వేరు మొక్కలకు పూచి విడిగా ఉన్న పువ్వుల్లాంటి భావాలన్నిటిని కలిపి ఒక చోట గుదిగుచ్చి ఈ సంపుటితో కవిత్వంగా బయటకి తెచ్చారు.
జీవితాన్ని జీవించడం వేరు, అనుభూతించడం వేరు. జీవితం ఎవరినీ ఖాళీగా ఉంచదు, ప్రతీ క్షణం జీవితాన్ని తలపోసుకోవడం వేరు, జీవించడం వేరు. ఇదంతా ఒక చక్రం లాగా కొనసాగుతూ ఉంది. అందుకే రేఖ తన కవిత్వం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజన చేశారు.. “మొదటి అడుగు”, “మలుపులు”,”కొన్ని మజిలీలు”అని మూడు భాగాలుగా చేసి మన ముందుకు తెచ్చారు. ఈ సంపుటి చదివి పుస్తకాన్ని మూసిన తర్వాత ఆగిన చోటునుంచి మళ్ళీ ముందుకు వెళ్లడం వెనక ఉండే తన సంఘర్షణ మొత్తాన్ని కుప్పగా పోసి మన చేతికి అందించిన అనుభూతి కలుగుతుంది.
మొదటి అడుగులో
ఏదైనా కొత్తగా రాయి అనే మాటతో మొదలుపెట్టి తన భావాలని మనముందుకు తెస్తారు రేఖ..
“నీ కళ్ళు ఒక గుండెనీ
ఒక గుండె నీ కళ్ళనీ చూడగలిగిన క్షణం
అంతే, ఇదే ఆనందం అంటే
ఇంకా వెతుకులాటెందుకు?
నిశ్చింత అనిపించాక ఆగిపోవాలి,
అదే అడవి, అదే సముద్రం!”
ఆమెకు కనబడిన మనుషులకు ఆమె చెప్పాలనుకున్న మాటలు లేదా ఇంకేదో సంభాషణలు మాత్రమేనా, ఇంకేం లేదా అంటే తానే ఒక చిన్న లైన్లో సమాధానం చెప్పేశారు.
“రోజులూ, సంవత్సరాలు ఏవీ సరిపోవు
ఒక పాట పూర్తి అవడానికి” కాలచక్రంలో ఏదీ ఆగదు, అందులో ఒక పాట పూర్తి అవడానికి సరిపడేవి ఏవీ లేవని …ఎటూ దాటిపోలేక జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనే కదా గట్టిగా కోరుకున్నది. అలా కోరుకున్న ముగింపు దగ్గరకి  రావడం వెనక ఉండే సంఘర్షణ, ఫీలింగ్ని కవిత్వంలో  ప్రతిక్షేపించడం అంత సులువేం కాదు. అది చాలా నేర్పుగా ఈ సంపుటిలో తీసుకు వచ్చింది రేఖ.
చాలా కవితల్లో మనకి పెయిన్ కనబడుతుందా..లేక ప్రేమ దొరకనితనం కనబడుతుందా అనే తార్కిక మీమాంశ కలుగుతుంది. జ్ఞాపకాల చలిమంట, చేతివేళ్ళతో మట్టి గాజులపై బాణీ కట్టడం, గుండెని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సాయంత్రం లాంటి పొలికల్లో ఉండే భావం సూటిగా గుండెలకు హత్తుకుపోతుంది. ఎక్కడా పై పై మెరుగుల మాటలు ఉండవు.. మన ఇంట్లో పూచిన పువ్వుల్లా ప్రతీ పదం నిష్కల్మషంగా తలలూపుతూనే ఉంటాయి. పుప్పొడి రాలుస్తూనే ఉంటాయి.
ఈ భాగపు ఆఖరులో వచ్చే కొండకింద ఇల్లు కవిత అనువాదం అని చెబితే తప్ప అది కూడా మనం రేఖ కవిత్వమే అనుకుంటాం. పరభాషా పదాలను మన నేటివిటీ లోకి మార్చిరాయడం అందులో ఉండే పదాలు మనకి నిత్యం తారసపడేవి కావడం వల్ల ఆ కవిత మనకి బాగా మాలిమి అవుతుంది.  బహుశా రేఖ చూడడానికి పెద్దగా ఉన్నా ఇంకా  బాల్యం లోనే  ఉందేమో అనిపిస్తుంది. అందుకే ‘ఇంకా గుర్తున్నానా నీకు’ అని అడుగుతుంది. అక్కడ చదువుకున్న చందమామలు, బాలమిత్రలు నీకు గుర్తున్నాయా అని అడుగుతూ ఆ మంచి రోజులను వెనక్కి తెస్తానికి వెళ్తున్నావా వెళ్ళేముందు ఒక్క మాట, నేను నీకు గుర్తున్నానా అంటుంది… ఏంటీ ఆపేక్ష.. ఎందుకీ గుండె సవ్వడి.. కళ్ళలో ఆనందం. ఆగిన చోటునుంచే మళ్ళీ బయలుదేరాలనే ఒక   పిచ్చి వ్యామోహం..
 భావుకులకి ఆరాధ్యుడైన చలం యోగ్యతాపత్రం రాయడం.. విప్లవ, అభ్యుదయ జంట రథాలలో తెలుగు కవిత్వాన్ని తీసుకువెళ్ళిన శ్రీశ్రీ “మనసున మనసై” లాంటి భావకవిత వంటి పాట రాయడం లాంటివి చూస్తుంటే, రెండింటిని ఒక్కళ్ళే రాశారా అనే అనుమానం రాకమానదు. అందుకే కవులకి, రచయితలు రాసే కొన్ని మాటలకి, ప్రక్రియలని ఆపాదిస్తే కుదరదేమో అనిపిస్తుంది. సరిగ్గా రెండో భాగం పూర్తవగానే ఇది రాసింది కూడా తనేనా అనిపిస్తుంది.
 రెండో మలుపులో కాస్త కలవరపెట్టే మాటలేవో రాస్తుంది..
“నిన్న ఏమైందో తెలుసా..!
మొన్న ఒకరోజు కూడా ఇలానే
ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
చేతిలోని ప్రేమ చేజారిన చోట సంభాషణ ఆగుతుంది.
ఒక్కసారిగా ఒకే జ్ఞాపకం
నాలుగు కళ్ళలో సుడులు తిరుగుతుంది”
ఆపేక్ష తో మాట్లాడుతుంది రేఖా అని అనుకునే సమయానికి ఇదిగో ఇలా ప్రేమని కళ్ళనిండా నింపుకుని బేలగా మాట్లాడుతుంది. “చేయగలిగింది ఏమీ లేదు తలవంచుకుని ఈ వీధి మలుపు తిరగడం తప్ప” అనే భావంలోకి హఠాత్తుగా లాక్కెళ్ళి మన గుండెకు కూడా కాస్త తడి అంటిస్తుంది..
ఎంత పూలని ప్రేమిస్తే మాత్రాన ఇంత సుకుమారంగా హృదయాలు ఉంటాయా..?
దాచుకున్న మాటలు చెప్పుకునే దారిలేక కళ్ళలోనుంచే జారిపోతాయా..?
“అన్నీ తానైన వాక్యం చివరన తొంగిచూసే ఏమీ కానితనమేమో”  అని ఆమె అనుకుంది కానీ, ఆ వాక్యం చివర ఉండే విరామచిహ్నం లాగా ఆ పూర్తి వాక్యానికి ఒక నిజమైన ముగింపునిస్తుంది తాను రాసిన ఒక్కోభావం. అదే కవిత్వ రూపంలో  ఉన్న మలుపులలో వివరిస్తుంది.
” కొత్త మాటలేవీ తోచట్లేదు
పాతవి ఎలానూ పలకమీద మిగల్లేదు” అని వంతెన మీద నిలబడి మాట్లాడే రేఖ, దుఃఖం అంతా కరిగి శాంతి ధారలాగా ప్రవహించే వరకు తపస్సు చేయాలి, తపించాలి అంటుంది.. అంటే తనకి జీవితం ని జీవించే దారి ఏదో తెల్సు. ఆ దారిలో వెళ్ళాలనే ఎక్కడో ఆగిపోయిన చోటునుంచి మళ్ళీ కొత్త ప్రయాణాన్ని కోరుకుంటుంది. ఈ క్రమంలో తాను వాడే ఒక్కో మాట ఒక్కో మేకై గుండెల్లో కసుక్కున దిగిపోతుంది. కావాలంటే ఈ వాక్యం చదవండి జీవితాంతం గుర్తుండకపోతే అడగండి.
”జీవితం కదూ
క్షమించే కొద్దీ చేదు విరిగి చెమ్మ మిగుల్తుంది”
ఏముంది మనదగ్గర చెమ్మ కలిగి ఉండడం తప్ప…
“ఒక్కోసారంతే!
పేరుకే నాటకంలో ఉంటాం, ప్రేక్షక పాత్ర వహిస్తూ” అంటూ కొన్ని మజిలీలు మొదలు పెడుతుంది. ఏముందిక్కడ అనే వైరాగ్యం మీద, ఏదో ఉందనే ఆసక్తి మీద ఏమీ లేదిక్కడ అనే జ్ఞానం మీద తనకేదో పట్టు దొరికిందని కాస్త తాత్వికతని మనమీదకు విసిరేస్తుంది. ఇక నిశ్చింతగా తలుపు తెరుచుకోవచ్చు అనే కవిత వెనక ఇంతకు ముందు రాసుకున్న అన్ని కవితా వాక్యాల్లో కనబడిన ఆపేక్ష, ఆర్ద్రత, అతిశయం ఇక చాలు అని ఒక మృదువైన భావంతో ఇక ఎదురుచూడ్డం తన వల్లకాదనే భావాన్ని సూటిగా చెబుతుంది. అలా అంటూనే మళ్ళీ ”నిజం చెప్పు  ఇదేనా నువ్వు కోరుకున్నది ఈ ఎవరూ లేనితనాన్నేనా …? అని మళ్ళీ చిగురాశని కల్పిస్తూ మాటలాడుతుంది. ఈ ముందూ వెనకా సంశయాలు, వెళ్ళలేని ఉండలేనితనాలు జీవితంలో భాగమని తనకి తెల్సు, తాను చూసిన జీవితాల్లో ఉండే పెనుగులాట దగ్గరనుంచి చూసిన వ్యక్తిగా తన కోణం నుంచి వాళ్ళకి చెప్పవలసిన మాటలుగా ఈ కవిత్వాన్ని రాసుకుంది రేఖ. ఆమెని చూస్తే జాలేస్తుంది అనే కవితలో మొత్తంగా ఇదే ఫీల్ కనబడుతుంది.
”కట్టుకునే చీర, పెట్టుకునే బొట్టు
మెరుస్తున్న నేరు పాపిడి అన్నీ అతని ఇష్టాలే అట
అతనిని మననం చేసుకునేందుకేనట” అని అంటూ అతన్ని వదిలిరాలేని ఆమెని చూస్తే జాలేస్తుంది అంటుంది. ఎందుకు మనుషులన్నా బంధాలన్నా ఈ మనిషికి ఇంత ఇష్టం అంటే.. తాను కేవలం ఒట్టి మనిషే కనుక , స్నేహాన్ని ఇష్టపడే ఒక సాధారణ స్నేహిత కనుక. అందుకే తన చుట్టూ ఉండే స్నేహాలని, తాను పెంచుకుంటున్న పూల మొక్కల్ని ఒకేలా చూస్తుంది. అంటు కడుతుంది, నీరు పెడుతుంది, ఎక్కడైనా కాస్త చేదున్న భాగాన్ని సున్నితంగా తొలగిస్తుంది. కానీ ఈ క్రమంలో తాను విపరీతంగా గాయపడుతుంది, లోలోన వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ భాషని ఆ బాధని కవిత్వం లోకి ఒంపుకుని సంతృప్తి చెందుతుంది. అందుకే ఆమె గొప్ప స్నేహిత, ఆమె చెప్పిన కథలన్నీ కొన్ని జీవితాల్లో కొంత భాగాలే.
ఇందులో కవిత్వం ఉంది అని చెప్పడం కన్నా ఇందులో ప్రేమ ఉంది, ఆపేక్ష ఉంది, సున్నితంగా భుజం మీద చేయివేసి చెప్పిన భరోసా ఉందని మాత్రమే చెప్పాలి.
ఈ  కవితల్లో ఉండే ఆపేక్ష మొత్తం హాయిదనపు పారవశ్యంతో ఉంటుంది. ఎక్కడో తప్పిపోయి మళ్ళీ మనకి మనం వెతుక్కునే క్రమంలో ఇవన్నీ మజిలీ రాళ్ళలాగా  అనిపిస్తాయి. రేఖ చాలా గొప్ప ప్రయత్నం చేశారీ పుస్తకంలో ప్రతీ  స్టాంజా దేనికది విడిగా ఉన్నట్టు గానే ఉంటుంది కానీ చివరన వాటి మొత్తాన్ని ఒక ముగింపుకి తీసుకువస్తారు. “నాలుగు కళ్ళు కలగన్నాక
ఇవాళ తోడుగా సముద్రం మాత్రమే ఉంది.. అందుకే ఏదైనా కొత్తగా రాయి” అంటారు. ఈ మొదలు, ముగింపుకి మధ్యన ఉండే అపరిమితమైన అంతః శోధన మనల్ని ఆలోచనలో పడేస్తుంది.
వాకిలి, పబ్లికేషన్స్ నుంచి వచ్చే కవిత్వం పుస్తకాల లాగానే ఈ పుస్తకం ఉంటుంది. కవర్ పేజీ నుంచి లే ఔట్ దాకా ఆర్టిస్ట్ గిరిధర్ పనితనం మెప్పిస్తుంది. మైథిలి అబ్బరాజు గారి హృద్యమైన ముందుమాట, బీవీవీ ప్రసాద్ గారి ఆత్మీయ వాక్యం. వెనక అట్ట మీద ఆకుపచ్చని అఫ్సర్  అక్షరాల్లో ఒదిగిన ఆపేక్ష ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణలు.
ఎల్లకాలం భావోద్వేగపు దుఃఖాన్ని మోయడం ఎవరికీ సాధ్యం కాదు. రేఖ కూడా అందుకు మినహాయింపు కాదు, మమకారపు పరిధిలో ఉంటూనే మళ్ళీ తనదైన కొత్త బాటను తాను ఎన్నుకోవాలని, ఈ ఆగిన చోటునుంచి తన కవితా ప్రస్థానం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటూ…
పుస్తకం కావాలంటే ‘ఛాయా ‘ ప్రచురణలని సంప్రదించండి.
*

అనిల్ డ్యాని

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పుస్తకాన్ని పరిచయం చేస్తున్నట్టుగా కాకుండా… కవిత్వం చదివేక మెరిసే కళ్ళతో మీ అనుభూతిని చెబుతున్నట్టు వుంది. అక్షరాలను అంతిదిగా హత్తుకోవడం కొత్త కలాలకు వరమే. మరో కొత్త అక్షరాన్ని మీ వేలితో చూసే వేళ కోసం ఎదురుచూస్తూ..

  • Very simple yet elegant poet…. as I know the writer from years
    And this article describes that
    elegance perfectly💞

    Wishing rekha akka more such blissful moments ahead….

    And anil garu your pen always show cases selective n beautiful personalities…. keep going…

  • భలే ఉంది. మీరు quote చేసిన కవితలు, మీ వాక్యాలు❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు