ఆక్సిజన్‌

నువ్వసలు ఆయనతో ఎందుకున్నావు? వాళ్ళక్క దగ్గర ఒదిలేసిరా. నువ్వు ప్రశాంతంగా బతకవా? ఇక వచ్చే వారం ఫోన్‌ చేసినప్పుడు ఆయన నీ దగ్గర ఉండద్దు. జనం ఏఁవనుకుంటారు ఏఁవీ అనుకోరు, పీడా వదిలింది అనుకుంటారు. ముప్ఫై ఏళ్ళనించి  నిన్ను చూట్టంలా వాళ్ళంతా ఏఁవీ అనుకోరు ముందు వదిలించుకో…” శిశిర అవతల వైపు నుంచి దాదాపు అరుస్తోంది. అమెరికాలో ఎమ్మెస్‌ రెండో యాడాది చేస్తోంది శిశిర. ఏవిటి చేయడం? శాంతకు కణతలు అదిరి పోతున్నాయి. ఇంతలో లోపల గది నించి టకటకమని కర్ర చప్పుడు… శాంత లోపలికి పరిగెత్తింది.

వీల్‌ ఛైర్‌లో రంగారావు ఊపిరాడక గిలగిలలాడుతూనే చేతికర్రతో పక్కనున్న ఆక్సిజన్‌ సిలిండర్‌ని కొడుతున్నాడు. ముక్కు మీదుండాల్సిన ఆక్సిజన్‌ మాస్క్‌ పక్కకు జారి పోయింది. శాంత పరిగెత్తినట్లే అతని దగ్గరికి వెళ్ళింది ఆక్సిజన్‌ మాస్క్‌ అతని ముక్కుమీద అమర్చి వెనకనించి బిగించింది జారిపోకుండా. ఈ లోపల రంగారావు తన రెండు చేతులతో శాంత భుజాలు గోళ్ళతో గుచ్చి పట్టుకుని దాదాపు గుచ్చేస్తూ ”ఎక్కడికెళ్ళావే ము…” అని అరిచాడు. శాంత నొప్పిని భరిస్తూ ”వదులు శిశిర ఫోన్‌ చేస్తే మాట్లాడాను” అంది చేతులని విదిలించుకుంటూ. ”శిశిర మాట్లాడిందా ఇంకెవడన్నానా” రంగారావు వాగుతూనే ఉన్నాడు. ”ఛీ నువ్విక మారవు” అంటూ శాంత గబగబ పెరట్లోకెళ్ళి వంటింటి గడప మీద కూర్చుంది. వెన్నల విరగ్గాస్తోంది. కానీ శాంత గుండెలు మండిపోతున్నాయి. ఎన్నాళ్ళింకా ఈ చిత్రహింసలు, బూతులు భరించడం? నోరు తెరిస్తే చాలు “యూ బిచ్‌”.. అనో” బజారు ముం..”. లేదా” లం..”అనో.. ఇవి తప్ప తన పేరుతో పిలవడు కదా. ఎంత మదం ఇతనికి., సగం దేహం చచ్చుబడినా ఆక్సిజన్‌ లేనిదే ఊపిరాడని స్థితిలో ఉన్నా, బతుకు కోసం, శ్వాస కోసం పూర్తిగా తన మీదే ఆధారపడినా ఎంత ధాటిగా తన మీద పెత్తనం చేస్తున్నాడు… కించిత్తు పశ్చాత్తాపం లేదు మనిషిలో… తనతో సేవ చేయించుకోవడం తన హక్కన్నట్లు చేస్తున్నాడు అది కూడా తిట్లతో, తన్నులతో జులుం చేస్తూ మరీ…అసలు,

వదిలించుకున్న మనిషిని మళ్ళీ ఎందుకు తగిలించుకుందీ? పిల్లలు ముగ్గురూ ఒద్దంటే వద్దన్నారు. ”వద్దమ్మా మళ్ళీ ఆ ఊబిలోకి వెళ్ళకు ఆయనేమీ మారలేదు నీ అవసరం ఉంది అంతే., ఆయన మొన్నాస్పత్రిలో ఏఁవన్నాడో తెలుసా మీ అమ్మకి నేనుగాక ఇంకెంతమంది మొగుళ్ళున్నారు. మీ ముగ్గుర్ని ఇంత పెద్ద చదువులు, విదేశాలు పంపటాలు ఒంటి రెక్కల మీదే చేసిందీ అంటే ఎట్లా నమ్మటం చెప్పు” అన్నాడు. స్వాతి తన రెండో కూతురు కోపంగా అంది. స్వాతి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నది. ఈ ఏడాది పెళ్ళి కూడా చేయాలి. పెద్ద కూతురు నీహారికకి సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగం. పెళ్ళి అయిపోయింది. తన కష్టాలు చూస్తూ పెరిగిన పిల్లలు తెలివిగా స్టాఫ్‌ సెలక్షన్‌లు, బ్యాంకులో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి పాసై మరీ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. చిన్నది శిశిరను అమెరికాలో చదివిస్తున్నారు కూడాను.పెద్దల్లుడూ గవర్నమెంటు ఉద్యోగే మంచివాడు కూడాను.అంతా బాగానే ఉంది తన పరిస్థితే… శాంతి దిగులుగా కూర్చుంది పెరట్లో. లోపల రంగారావు గొణుగుతూ ఉన్నాడు. తొమ్మిదయ్యింది. రంగారావుకి ఓట్స్‌ ఉడకేసి తినిపించి మందులెయ్యాలి. లేచి ఓట్స్‌ పాలలో ఉడకేసి అతని దగ్గరికి వెళ్ళింది. ఏ మూడులో ఉన్నాడో గమ్మున తినేసాడు… లేకపోతే ఎంత దాష్టీకం చేస్తాడో? తినిపిస్తున్న తన చేతిని గోళ్ళతో పట్టి ఆపేస్తాడు. స్పూను లాక్కుని నోట్లో ఉన్న మెతుకుల్ని తన మొఖం మీదకు ఊస్తాడు. వాటితో పాటు బూతు మాటలను కూడా. వీలైతే కర్రతో అందినంత మేర కొట్టే ప్రయత్నం చేస్తాడు.

రంగారావుకి మందులేసి మంచంమీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. వంటింట్లోకి వచ్చి కంచంలో ఇంత అన్నం వడ్డించుకుంది కానీ తినబుద్ది కాక అన్నం పెళ్ళలను నిర్వికారంగా మళ్ళీ గిన్నెలోకి సర్దేసింది. హాల్లోకొచ్చి మెల్లగా మంచం మీద ఒరిగింది. నిద్దర రావట్లేదు. గోడమీద వర్సగా తన ముగ్గురు బిడ్డలు నీహారిక, స్వాతి, శిశిరల ఫోటోలున్నాయి. ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్లో ఉన్నారు. శిశరైతే ఏకంగా అమెరికాలో చదువుతున్నది. ఎంత కష్టపడింది వీళ్ళనీ స్థాయికి తీసుకు రావడానికి? ఒక్క అణా కాణీ పైసా సాయం చేసాడా అని? పేరుకు మొగుడే కానీ ఇక ఉండలేక ముగ్గురు పిల్లల్నేసుకుని హైద్రాబాదు వచ్చేసింది కాపురం చేయలేక.

పద్నాలుగేళ్ళ పసి వయసులోనే తనకంటే పదిహేనేళ్ళు పెద్దయిన రంగారావుకి ఇచ్చి చేసారు. వర్సగా ఆడపిల్లలు పుట్టేసారు, తనకి ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి. మగపిల్లాణ్ణి ఇవ్వలేదని అత్తా, భర్తా రాచి రంపాన పెట్టారు. ఒకప్పుడు బాగా ఆస్తి ఉన్నవాళ్లు. ఊర్లో పొలాలున్నాయి, స్వంత ఇల్లు ఉంది. తన మావగారు తాగుడు, జూదం, ముండల్ని మరిగి ఆస్తి సగం హారతి కర్పూరంలా కరిగించేసాడు. తండ్రిని ఆదర్శంగా తీస్కున్న రంగారావూ అదే దారి పట్టాడు. విపరీతమైన ఆడపిచ్చి ఉండేది రంగారావుకి. అన్ని సంబంధాలు కూడా ఉండేవి. దానికి తోడు తాగుడు. అంత భూములున్నా, ఎన్నడూ వాటిని దగ్గరుండి చూసింది లేదు. అంతా అత్తగారే చూస్కుంది.

భర్త ఇంటికే ఆడాళ్ళను తెస్తుంటే భరించలేక పుట్టింటికి వచ్చేసింది. పుట్టింట్లో అన్నా వదినల పోరు భరించలేక హైదరాబాద్‌లో తెల్సిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గరకొచ్చేసింది. ఊరిలో చాలా కాలం బతికిన రవూఫ్‌ సిటీలో బిస్కట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య అమీనా బాగా తెలుసు. అమ్మ చేతి ఖర్చులు ఇంకో మూడు వేలు చేతిలో పెట్టి అమీనా దగ్గరికి పంపేసింది. చాలా సంవత్సరాలు బిస్కెట్‌ కంపెనీలో పని చేసింది. అమీనా వాళ్ళింటి పక్కన ఒక గది తీస్కుని మగ్గురు ఆడపిల్లలతో… భర్తా బంధువుల తోడు లేకుండా అర్థాకలి తో  బతికింది. అమ్మ మధ్యమధ్యలో వచ్చిపోయేది. వచ్చినప్పుడల్లా ఊర్నించి ఉప్పులు, పప్పులు,నూనెలు ,వారానికి సరిపడా కూరగాయలు  వీలైనంత మటుకు తెచ్చేది. అన్నయ్య మాత్రం అది మొగుడితో కాపురం చేస్తేనే దాని మొఖం చూస్తాననేవాడు.ఒక రకంగా తన భారం పడకుండా తప్పించుకోనేవాడు .

బిస్కట్‌ కంపెనీలో పనితో పాటు అప్పడాలు, వడియాలు, కారప్పొడ్లూ లాంటివి చేసి అమ్మేది .పిల్లలెంతో సాయం చేసేవారు.వనస్థలిపురంలో  చుట్టుపక్కల నాలుగు కాలనీలు పట్టుకుంది తను.తను ఆంధ్రా నించి వచిందని  అభిమానంతో దాదాపు అందరూ కొనేవారు. రవూఫ్‌, అమీనాలైతే, రక్తసంబంధాన్ని మించి చూసారు. మెల్లిగా కర్రీపాయింట్‌ మొదలు పెట్టింది అమీనా సాయంతో… ఇక నిలదొక్కుకోగలిగింది. తన కష్టం చూసిన పిల్లలు  అర్థం చేసుకుంటూ చాలా కష్టపడి చదివారు. ఈ రోజు బాగున్నారు. ఇరవై ఐదేళ్ళ ఏళ్ళ కష్టం తనది. ఏనాడూ భార్యాపిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న పాపాన పోలేదు రంగారావు. పైగా ఊర్లో కొన్ని పొలాలు తెగనమ్మి సిటీలోనే వనస్థలిపురంలో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ముసలివాడైనాడు. రోగాలు ముసురుకున్నాయి. హై బీపీతో పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు.

ఒకరోజు అత్తగారు తన కర్రీపాయింట్‌కొచ్చి గుర్తుపట్టి గుండెలకు హత్తుకుని ఏడ్చింది. బతిమిలాడి తనతో ఇంటికి తీస్కెళ్ళింది. మనిషంతా పీక్కుపోయి దైన్యంగా ఉన్నాడు. ఒక్కసారిగా తనను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనాడు. తనను పరిశీలనగా చూసాడు. యాభై ఏళ్ళ వయసులో కూడా తను ఆరోగ్యంగా ఉంది. తన కట్టూ బొట్టూ శుభ్రంగా ఉంటాయి. బాగున్నావా? పిల్లలెలా ఉన్నారు… ఇంత కష్టం ఎట్టా బరించావు అని అడగలేదు సరికదా ”మొగుణ్ణి వదిలేసిన దానివి ముగ్గురాడపిల్లల్ని ఎట్టా పోషించావు ., చదివించావు కాస్త చెవుతావా పతివ్రతా  ఊర్లో నీ గురించి మహా చెడ్డగా చెఁవుతున్నారు. ఎవడుంచుకున్నాడే నిన్నూ ఎవరో తురకోణ్ణి మరిగావుట శిరోమణీ? సిగ్గు ఎగ్గూ లేదటే అప్రాచ్యపుదానా” అన్నాడు తనని తేరిపార అసహ్యంగా నిలేసినట్లు చూస్తూ ఎకసక్కంగా. తన రక్తం మరిగి పోయింది. ఊర్లో కులం, మతం,అంతరం లేకండా ఆడాళ్ళతో సంబంధం పెట్టుకున్న వీడు, చెల్లిలా చూస్కుంటున్న రవూఫ్‌తో సంబంధం అంటగడుతున్నాడు. కులం ,మతం అంటూ ఏడుస్తారు కానీ సాయబుల మతంలో ఉన్నంత మంచితనవు ఏ మతంలో చూసిందని ? ఒక్క రవూఫన్నా ,అమీనా బాబీఏనా.,?తమ ఉరునించి బతకలేక వలసొచ్చిన మల్లన్న, ఎంకటమ్మ చచ్చిన బర్లను కోసుకొని, చర్మం వొలుచుకొని చెప్పులు కుట్టుకొని బతుకు ఎల్లబోస్కోనే వాళ్లు . ఊర్లో కాషాయాపోల్లు కొట్టి చంపేస్తున్నారని .,ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పిల్లాపాపలతో సిటీకి పారిపోయి వచ్చే సి .. రోడ్డు వారకి  చెప్పుల కొట్టు పెట్టుకుందామనుకొని .,ఇక్కడ కూడా చంపేస్తారేమో అని భయపడి మల్లన్న రైతు బజారులో పనికి కుదురుకుంటే ., వెంకటమ్మ నాలుగిల్లల్లోపాచిపనికి కుదురుకొని బతికేస్తున్నారు.తన బిడ్డ అమెరికాకి వెళ్తుంటే ఇరవై వేలు కష్టపడి నెలకి ఐదు వందల చిట్ట్లేసుకొని,కూడ బెట్టిన్దంతా తను అడక్కండానే తీసుకో తల్లీ అని చేతిలో పొయలెదూ .,? ఊర్లో తన అత్తారు అంటు,ముట్టు అని దూరంపెట్టిన వాళ్ళే తన హృదయానికెంత దగ్గరయ్యారనీ.,?తను చెయ్యెత్తి దండం పెడితే ఒద్దమ్మా ఒక్కూరి వాళ్ళం కష్టం సుకం చూస్కొకపోతే మడుసులేట్టా అవుతాము ఆనలే వెంకటమ్మ ?ఎంతసేపూ తన బ్రాహ్మణ పుటక అని మురిసిపోయే మొగుడి కంటే వెయ్యిరెట్లు గోప్పాల్లు కారూ తన కష్టాల్లో కన్నీళ్లు తుడిచిన వీళ్ళు ? అత్తగారు వెనకనించి కేకలు వేస్తున్నా వినకుండా ‘ఛీ నీ బతుకు చెడ’ అని తిట్టి వచ్చేసింది ఆవేశంతో గుండెలు మండుతుంటే. అవును అలాంటి నీచుడితో తను ఎందుకుంది?

రెండో కూతురు స్వాతి పెళ్ళికోసం, స్వాతి, పవన్‌ ప్రేమించుకున్నారు. కులాలు వేరని మొదట వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా తండ్రి కూడా దగ్గర లేడు తండ్రి ఉంటే ఒప్పుకుంటామన్నారు. స్వాతి, మిగతా పిల్లలు ససేమిరా ఒద్దు అన్నారు. పెళ్ళికీ, తండ్రి ఉంటానికీ లేక పోవటానికి ఏఁవిటి సంబంధం? అని స్వాతి చాలా వాదించింది. తండ్రి ముందు పవన్‌ నిస్సహాయుడైనాడు. ”మీ అత్తారిని వెళ్ళి భర్తతో కాపురం చేయమని చెప్పు మగాడన్నాక ఏవో కొన్ని తప్పులు చేస్తాడు మరి . దానికే మొగుణ్ణి వదిలి రావాలా… సంబంధం మాట్టాడానికి వగైరా అన్నీ ఆమె భర్తగారింట్లోననే చెప్పు అదే ఇద్దరికీ మర్యాద” అన్నాడు పవన్‌తో, శాంతతోనూ.

ఈ విషయం మీద ఎంతో ఘర్షణ జరిగింది. ‘అత్తయ్యా పోనీ పెళ్ళయ్యాక వచ్చేద్దురు మా కోసం ఒప్పుకోండి’ అన్నాడు పవన్‌ ఒకరోజు స్వాతి లేని రోజు చూసుకొని. అప్పటికే తన అత్తగారున్నారు అక్కడ. ఆవిడ నెల రోజుల బట్టి శాంతను కొడుకు దగ్గరికి రమ్మని బతిమిలాడుతున్నది. ”వాడి తర్వాత ఆస్తంతా నీకూ, నీ పిల్లలకే కదా… లేకపోతే వాడుంచుకున్న ఏ ముండదాని పిల్లలో వచ్చి రాయించుకుంటారు. నేనుండగా నాదే ఆస్తింతానూ. నీ పేరు మీద మార్పించేస్తున్నా వచ్చేయమ్మా పిల్ల పెళ్ళికోసవన్నా ఇంకా శిశిర కూడా ఉంది పెళ్ళికి” అంది. ”ఆస్థి వద్దు అత్తయ్యా నాకు… అతని దగ్గర ఉండలేను. నా వల్లకాదు. మనిషేం మారలేదు. ఎంతసేపూ తనకు లాగా నాకూ అక్రమ సంబంధాలున్నాయంటూ బూతులు తిడుతూంటాడు. నేను రాను” అంటూనే తిరస్కరిస్తూ వచ్చింది. కానీ ఈ రోజు పవన్‌ వచ్చి బ్రతిమిలాడే సరికి… పెళ్ళివరకే… పెళ్ళైనాక వచ్చేస్తే ఏమి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ లోపల అత్తగారు లాయరుతో సహా వచ్చింది. ‘అమ్మా శాంతా… వాడూ… నేనూ రేపో మాపో అన్నట్లున్నాం ఆస్తి అంతా ఈ ఇంటితో సహా ఊర్లో మిగిలిన ఇల్లు పొలాలూ అన్నీ నీ పేర రాయించేసాను. నా బంగారవూ లాకర్లో పెట్టించానమ్మా నీ పేరుతోనే” అని ఇంటి కాయితాలు చేతిలో పెట్టింది. ”వాడికోసం కాదమ్మా నీకు చాలా అన్యాయం జరిగింది తల్లీ” అంటూ ఏడ్చింది. కానీ ఆమె చాలా నిస్సహాయంగా మనిషి తోడుకోసం తన్లాడుతున్నదని శాంతకి అర్థం అవుతూనే ఉంది. విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారావిడ వయసు కూడా ఎనభైల్లో పడిపోయింది. కానీ తాగుబోతు భర్త, కొడుకులతో వేగుతూనే వ్యవసాయాన్ని పాడినీ చేస్కుంటూ కొంచమన్నా ఆస్తిని కాపాడుకోగలిగింది. స్వాతి విసుక్కూంటూనే తల్లితో రంగారావు ఇంటికి వచ్చింది. ”నీ పెళ్ళికాగానే బయటపడదాము స్వాతీ, ఈ పాడు ఆస్తి, మనిషీ మనకు వద్దే వద్దు” అంది శాంత. ఇదిగో అలా వచ్చి పడింది తనీ ఇంట్లో. వచ్చినప్పటినుంచీ తను కనపడ్డప్పుడల్లా ‘యూ… బిచ్‌” అనడమే… రక్తం మరిగి పోతున్నది. వెళ్ళిపోదామా అంటే స్వాతి మామగారి కండిషనూ, వృద్ధురాలైన అత్తగారి దీనస్థితి కాళ్ళకు సంకెళ్ళు అయిపోతూ ఉన్నాయి. ఎవరైనా మనిషిని పెడితే వాళ్ళనీ బూతులు తిడుతూంటే పడలేక వాళ్ళూ వెళ్ళిపోతున్నారు. కడాఖరుకి తనూ అత్తగారూ మాత్రమే మిగిలిపోయారు సేవలు చేయడానికి. స్వాతి ఇంట్లో దిగిందో లేదో  ట్రాన్స్‌ఫర్‌ వచ్చి విజయవాడకి వారంలో వెళ్ళిపోయింది. అత్తగారి మోకాళ్ళకి మర్ధనా చేయడం, రంగారావుకి సేవలు చేయడంతోనే పొద్దు ఏమారి పోతున్నది.

***

”దాని పేర మీద చేసావుట ఆస్తంతా… ఎవడు చేయమన్నాడే నిన్నూ? దీని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాలా నేనూ…” చేతిలోని కర్ర ఆక్సిజన్‌ సిలిండర్‌కేసి కసిగా కొడుతూ అరిచాడు రంగారావు. ఎదురుగా రంగారావు తల్లి అన్నపూర్ణమ్మ నిలుచుని ఉంది. ”అవును అది నా ఆస్థి నాన్నారు నా పేరు మీద రాసిపోయారు. నువ్వెక్కడ ముండల మీద తగలేసి నన్ను అనాధను చేస్తావో అని, నా ఇష్టం” అంది అన్నపూర్ణమ్మ అంతే కోపంగా. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆస్తి అంతా తన పేర రాయమని తల్లి పీకలమీద కూర్చున్నాడు రంగారావు. తాగేసి దాదాపు ఆమె పీక పిసికేసి చంపేసే దాకా వెళ్ళాడొకసారి. సమయానికి ఇంట్లో జీతగాళ్ళు ఆదుకున్నారు కాబట్టి అన్నపూర్ణమ్మ బతికి పోయింది. భర్త పోయి… కొడుకు దుర్మార్గుడై పోయి,మానసికంగా చితికిపోయి అన్నపూర్ణమ్మ  చివరి రోజుల్లో గొడవపడి ఇంట్లోంచి ఆత్మగౌరవంతో ముగ్గురాడపిల్లల్ని తీసుకొని గడపదాటి వెళ్ళిపోయిన కోడలు శాంతను తలవని రోజు లేదు. మగపిల్లాడి కోసం కొడుకుతో కలిసి కోడలినెంత హింసించిందో అంత నరకమూ చూపించాడు రంగారావు తల్లికి. ”ఆడ ముండవి నీకెందుకే ఆస్తి… నీ పేర మీద రాసిన ఆ సచ్చినాడిని అనాలసలు. నా పేరున చేస్తావా లేదా అయినా నీకెవరున్నారే మనవడూ మనవరాలూనూ అన్నీ నేనేగా…” అంటూ తల్లిని తెగ వేధించాడు రంగారావు. ”ఊహూ నీ పేరు మీద మాత్రం రాయను గాక రాయను” అని తీర్మానించింది అన్నపూర్ణమ్మ. సిటీలో ఉన్న ఇల్లు కూడా ఊర్లో కొంత పొలం అమ్మి కొన్నాడు రంగారావు.  కానీ తండ్రి మాత్రం ఆ ఇల్లు కూడా అన్నపూర్ణమ్మ పేరున చేసాడు. ఆ ఇంటికోసం పొలాలు అమ్మేదాకా తండ్రినీ సతాయించాడు కానీ ఇల్లు అమ్మ పేరు మీదే చేయాలన్న షరతుతో పొలాలమ్మి డబ్బిచ్చాడు రంగారావు తండ్రి.

రంగారావు తండ్రి దామోదరరావు కూడా యవ్వనంలో ఉన్నప్పుడంతా తాడు తెంచుకుని వీరంగం ఆడిన దున్నపోతులా… తాగుడు, జూదం, వ్యభిచారం చేస్తూ రెచ్చిపోతూ బతికాడు. యాభైలో పడ్డాక రోగాలు ముసిరి… వృద్ధాప్యంలో భార్య అవసరం తెలిసొచ్చాక కానీ తను ఆమె పట్ల చేసిన పాపాలచిట్టా కనపడలేదు. అర్థమై పశ్చాత్తాపం చెంది కొడుకు అచ్చం తనలా మారడం కోడలు ముగ్గురు పిల్లల్ని వేసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోవటం చూసి ఆస్తి అంతా భార్య పేరు మీదకు మార్పించేసి కోడలు దగ్గరికి వెళ్ళమని చివరి రోజుల్లో భార్యకి చెప్పి కన్ను మూసాడు.

”అవును నాన్నారి కోరిక కూడా అదే… ఇందులో నేను జేసిందేఁవుందీ… అయినా నీకూ, నాకూ గొడ్డు చాకిరీ చేస్తుంది అది… జీవితమంతా ఇంత ఆస్తీ, భర్తా, లంకంత ఇల్లూ ఉండీ రాత్రింబగళ్ళు కష్టపడి ముగ్గురు పిల్లల్ని పెంచుకొచ్చిందని  కాస్తంత కనికరవఁన్నా లేదేఁవిట్రా నీకు… ఊర్లో ఎన్నిసార్లు శాంతనూ పిల్లల్నూ చూసొస్తాంటే… నే సచ్చిపోతా..నే సచ్చిపోతా నువ్వు దాని దగ్గరికిపోతే… నన్నే కాదని పోతుందీ అదీ ఊరంతా నవ్విపోయారు నా మీద. నా పరువు తీసిన దాని దగ్గరకి వెళ్తే నా పీనుగు మీద నుంచి పోవాలని ఎన్నిసార్లు ఆపేసావు కదరా… అయినా తెలీకడుగుతా రేపో మాపో అన్నట్టున్నావు నువ్వేం జేస్కుంటావురా ఆస్తీ… నువ్వుంచుకున్న ఆ లలిత ముండకు ధారవొయ్యడానికేగా., మొన్నొచ్చిపోయిందిగా అది కొడుకునేసుకుని? ఏవేవో గుస్ గుస లాడేసుకొన్నారుకదరా లోన తలుపేసుకొని మరీ ?అదేదో ఏడ్పులు ఏడ్చి నిక్కి నీలిగి పాయినట్లుంది పాపం.తెగ కనికరవు వచ్చేసిందేవో ఆ లలిత ముండ మీద ?దానికేవన్నా ఆస్థి రాసిద్దావన్న ఆలోచన వచ్చి ఉంటే కడిగేసేయ్ ..ఇదిగో రంగా మళ్ళీ మళ్ళీ చెవుతున్నా.,ఇది నా ఆస్తి దీంట్లో ఒక్క కాణీ కూడా శాంతకూ,దాని పిల్లలకూ తప్ప.,ఇంకెవరికీ పోనీయను యావనుకున్నావో ., అన్నపూర్ణమ్మ రంగారావు బుర్రలో ఏముందో బుర్ర కోసి చదివినట్లే చూపుడు వేలితో బెదిరిస్థూ కళ్ళింత చేస్కొని కోపంతో ఎగ రొప్పుతూ అని,అయినా వాడు నీ కొడుకు కూడా కాదాయే, నీకంటే ముందున్న వాడి కొడుకుట వాడు. నీకే పుట్టినా నీకివ్వను ఆస్తి… ఏం చేస్కుంటావో చేస్కో…” అన్నపూర్ణమ్మ ఆయాసంతో ఇక మాట్లాడలేక ఆగింది.

”ఇదేం పతివ్రతా… పచ్చికులట ఎంత మందితో పోకపోతే సిటీకొచ్చి ముగ్గురాడ పిల్లల్ని పెంచి చదివిస్తుంది ఇదీ? షీ ఈస్‌ ఎ బిచ్‌, వేశ్య ఇది, నేను నమ్మను దీన్ని. దీనికిస్తావా నా ఆస్థి?బతికుండగా నాకియ్యవటే ఆస్తి అయితే నిన్ను చంపైనా తీసుకుంటా ” అంటూ రంగారావు కచ్చగా  తన పక్కనే ఉన్న ఫ్లాస్కుని అన్నపూర్ణమ్మ మీదకు విసిరాడు. ప్లాస్కు వచ్చి అన్నపూర్ణమ్మ భుజానికి తాకింది. అమ్మా అని కేక వేస్తూ ఆమె కింద పడిపోయింది. వంటింటిలోంచి ఇదంతా వింటూ రంగారావు మాటలకు రక్తం మరిగి పోతూ వెళ్ళి తందామా వాణ్ణి అని ఎదురు చూస్తున్న శాంత పరుగున అత్తగారి దగ్గరికి వెళ్ళంది. నేలమీద పడి పోయి విలవిల్లాడుతోంది అన్నపూర్ణమ్మ. తన కోసం ఈ వయసులో కొడుకుతో గొడవపడి గాయ పడిన వృద్దురాలైన  అన్నపూర్ణమ్మ మీద హృదయం చలించి పోయింది శాంతకు దుఃఖంతో. తను కావలిస్తే ఆస్తి తన పేరు మీదే ఉంచుకొని ఒక మనిషిని జీతం పెట్టుకొని దర్జాగానే బతకొచ్చు అయినా, ఊర్నించి వెతుక్కుంటూ తన కోసం వచ్చింది. మనసులో ఎంత బాధా, బాధ్యతా  ఉంటే వచ్చి ఉంటుంది? గతంలో కోడరికవుతో బాధ పెట్టింది నిజఁవే. కానీ మనుషులు మారరా? కాలమే మారుస్తుంది కామోసు. అన్నపూర్ణమ్మను ఆసుపత్రికి తీస్కెళ్ళింది శాంత.

***

అన్నపూర్ణమ్మ కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. మంచాన పడింది. రోజు రోజుకీ క్షీణించి పోతున్నది. శాంత దగ్గరుండి ఆమెకి సపర్యలు జేస్తున్నది. రంగారావు కోసం ఒక మగ మనిషిని పెట్టింది. ”నువ్వేం జేస్తావే షోకు పడి వీధుల్లో నిలబడతావా… వాడెందుకు వాడితో పడుకుంటావా” అని మగ కాంపౌండర్‌ని తననీ కలిపి తిడుతుంటే భరించే శక్తి సన్నగిల్లుతోంది శాంతకి. ఇంగ్లీషు చదువు ఇంటరు దాకా చదివాడేమో ఇంగ్లీషులో తిడతాడు తిట్లు…బిచ్ అంటాడేవిటి.,అసలు బిచ్ అంటే ఏవిటి ?ఒక సారి శిశిరని అడిగింది కూడాను .శిశిర ఫోనులోనే ఏడ్చేసింది …ఒద్దమ్మాఅది చాలా చెడ్డ తిట్టు నా ముందు అంటే ఊరుకోను తండ్రి అని కూడా చూడను అంది మళ్ళా తనే నువ్వూ ఊరుకోకే అమ్మా చెప్పుచ్చుకొని కొట్టెయ్ ఇంకోసారి అనడు అంది కూడాను.కానీ తనకి ఉండబట్టలేక అమీనాని అడిగింది .అమీనా భర్త ని కనుక్కొని చెప్పింది .బిచ్ అంటే రోడ్లమ్మట తిరిగే ఆడ కుక్కట .తనకు రక్తం మరిగి పాయిందిస్మీ .తనేంటి పోనీ ?మగ కుక్కనా ..తను అనటం ఎంత సేపూ?కనీసం మావూలు కుక్కలా తిరిగాడా.,? కొవ్వెక్కిన చిత్తేకార్తే కుక్కలా కాదూ ముండలమ్మ ట తిరిగింది కాక తనను బిచ్ అంటాడు వీడు బతుకు చెడ నాలికా కుళ్ళిన మాంసపు ముక్కా వీడి నోట్లో ఉన్నది ? ఇంకా ఏవంటాడు .,  తన రెక్కల కష్టం మీద కాకండా ఆడది కాబట్టి ఒళ్ళమ్ముకొని పిల్లల్ని పెంచింది అంటాడు… అందరితో అదే అంటాడు మొన్న గడ్డం గీయడానికి వచ్చిన కామేశ్వర్రావుతో ”ఇదేం కష్టపడలా పిల్లల్ని పెంచటానికి… బోగం ముండేశాలు ఏసి పెంచుకుంది. ఎంత కష్టం జీతాలతో ముగ్గురు పిల్లల్ని సాకడం” అంటున్నాడు. కామేశ్వర్రావు తన ఊరి మనిషే ”ఛ అవేం మాటలండీ పంతులు గారూ ., అమ్మగారు నిప్పులాంటి మనిషి. ఎంత కష్టపడ్డారో నేన్జూసా అట్టా అనబాకండి కాళ్ళే పోయాయి ఇక కళ్ళు కూడా పోతాయి” అన్నాడు కామేశ్వరరావు. ఒక మంగలివాడిలో ఉన్న సౌజన్యం బాపన పుట్టుక పుట్టిన వీడిలో లేకండా పోయింది. అవమానంతో రగిలి పోయింది. ఎట్టా బరించడం వీణ్ణి… వదలి వెళ్ళి పోతే…? కానీ మంచాన పడ్డ అత్త గారు కాళ్ళ కడ్డం పడుతూనే ఉంది .పాపం చివరి  క్షణం దాకా “శాంతమ్మా ., ఆ త్రాష్టుడు ఎంత వేపుకు తిన్నా ఆస్తివాడి పరం చేయ్యబాకమ్మా అని తనకి వెయ్యిసార్లన్నా చెప్పటమే కాదు .,పిల్లలు ముగ్గురికీ అది మీ ఆస్తి ,మీకే దాని మీద సర్వాధికారాలు ..,మీ అమ్మను ,మీ నాన్నకు ఆస్తిని  రాయనీయకండి అని చెబుతూ నే ఉంది కడదాకా . శిశిరకైతే అమెరికాకి ఫోన్ చేయించి మరీ చెప్పేది . ఈ లోపల ఒక రోజు అన్నపూర్ణమ్మ కాలం చేసింది. ఇల్లంతా బంధువులతో నిండి పోయింది. దశదినకర్మలు పూర్తయ్యాయి. అంతా శాంతను అత్తాగారినీ, కాలు చెయ్యి పడిపోయిన భర్తనూ సాదుతున్న పుణ్యవతి అని దీవించి వెళ్ళారు. రంగారావు ఒకటే ఉడుక్కున్నాడు.తనకు దక్కాల్సిన ఆస్తిని అనాయాసంగా  చిక్కించుకున్న శాంతను చూస్తుంటే ఎవరో తన మీద పెట్రోలు వొంపి అగ్గిపుల్లేసి కాలబెట్టినట్లే భగ భగామండిపోతున్నాడు రంగారావు. పైగా ఈ మధ్య శాంత మునుపటిలాగా పిరికిగానూ,.భయం గానూ కనపట్టం లేదు సరి కదా .,పైనుంచి యుద్ధం చేయడానికి కొత్త శక్తీ వంత మైన కత్తుల్ని పడునేక్కించు కొని  మరీ తన ముందు కోర చూపులు చూస్తూ .,నువ్వంటే నాకేం లెక్కా అన్నట్లు తిరుగుతుంటే అసలు భరించ శక్యం కావట్లేదు దీని దయ దాక్షిణ్యాల మీదా తను బతకాలి ఏదో సేవలు చేయించుకోడం వరకైతే పరవాలేదు .. అది తన భార్య చేయాల్సిందే. కానీ .. డబ్బులకి దీని మీద ఆధార పడ్డవా ., ఎంత సిగ్గు.,మొన్న లలిత కొడుక్కి అవసరం ఒక లక్ష రూపాయలు సర్డమంటే.,తన ఖర్మ కాలి దీన్ని అడగాల్సి వచ్చింది.చెక్కు రాసిమ్మంటే ఎంతకీ ఇవ్వదే తన దగ్గర లేవంటుంది అత్తారి ఆత్మ శాంతించదు అంటుంది.కదాఖర్కు ఇది తన సొమ్మని ఇవ్వను గాక ఇవ్వనని .. ఇట్టా వేపుకు తింటే లాయరు ని పిలిపిస్తా అని బెదిరిస్తుంది ముండ బాగా ముదిరిపాయింది.అంతేనా కోపంతో తను విసిరి కొట్టిన గ్లాసు అందుకొని తన మీదికే తిరిగి విసిరి కొట్టింది కాదూ., ఇంతే కాదు నోరేస్కోని అరవబోయిన లలితను మెడ బట్టి బయటకు గెంటేయ లేదూ … ఇంత తెంపరితనం ఎక్కడిదీ దీనికి?తన ముందు నిలబట్టానికి కూడా పిట్టలా వొణికిపోయిన మనిషి ? తనిలా కాలూ.,చెయ్యి పడిపోయి మంచానికి చచ్చిన నల్లిలా అతుక్కు పోవటవా.,లేక ఆస్తంతా దాని పేరు మీదకు మారిపోయి మహారాణిగా మారి పోవడవా?ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి తల్లి చచ్చాక దీన్ని ఇంట్లోంచి గెంటేసి తాను,లలితా కలిసి ఉండావనుకొన్నారు .కానీ తల్లి తన ఆశలన్నీ నాశనవు చేసింది కాదూ .,కన్నకొడుకన్న కనికరవు లేకుండా ఎట్టా పోయింది ముసలి దానికి ? రంగారావు రగిలి పోయాడు .తను అన్నపూర్నమ్మను ఏనాడు కనికరం తో చూడని సంగతి రంగారావు మర్చి పోయాడు .అన్నిటికీ మించి శాంత కళ్ళల్లో అంతకు మునుపెన్నడు లేని దిఖ్ఖారం భరింప శక్యం కావట్లేదు.ఆఫ్టరాల్ ఆడది .,ఎంతమంది ఆడాళ్ళను డబ్బు వెదజల్లి లొంగ దీసుకోలేదూ.,తనవల్ల ఇంతాస్తి వచ్చింది ఎంత తెంపరితనవు చూ పిస్తోంది ఇది గత్తరొచ్చి పోతే బాగుండు .

***

ఒకరోజు శాంత కూరగాయలకని రైతు బజారు వెళ్ళింది. తిరిగి వచ్చేప్పటికి స్వాతి కాబోయే మామ గారూ, అత్తగారూ వచ్చి ఉన్నారు. వాళ్ళ ముఖాలు మాడిపోయి ఉన్నాయి. రంగారావు దగ్గరి సోఫాలో కూర్చుని ఉన్నారు. చూడబోతే రంగారావుతో కొద్దిపాటి సంభాషణ నడిచినట్టే అనిపిస్తున్నది. ”అరే అన్నయ్యగారూ… వదినా ఎప్పుడొచ్చారు. మాటా, కబురూ లేకుండానే… ఇంట్లోనే ఉండిపోదును కదా మీరొస్తారంటే ఉండండి కాఫీ కలుపుతాను” అంటూ హడావుడి పడుతున్న శాంతను చేత్తో ఆగమని ఆపుతూ… ”లేదమ్మా వెళ్ళొస్తాం నువ్వేమీ ఖంగారు పడమాకు” అంటూ లేచాడు స్వాతి మామగారు… ”మరి ముహుర్తాలు అనీ” అంటూ పాలి పోయి నిల్చున్న శాంతకేసి విముఖంగా చూస్తూ ”చూద్దాం మా సిద్ధాంతితో మాట్లాడి ఏ విషయమూ చెఁవుతాం పద కాంతం” అంటూ చరచరా నడుచుకొంటూ వెళ్ళిపోయారు. శాంత చిన్నబోయి నిలబడి పోయింది. ఇంతకు మునుపెన్నడు ఇట్టా లేరు వీళ్ళు. తనంటే ఎంతో గౌరవంతో ఉన్నారు. జీవితంలో చాలా కష్టపడి పిల్లల్ని పెంచి గౌరవ మర్యాదలు, సంస్కారాలు నేర్పించుకుందని వాళ్ళని ఆర్థికంగా తమ కాళ్ళ మీద నిలబడేటట్లు చేసిందనీను. అట్టాంటిది ఒక్కసారిలా ఎట్టా మారిపోయారు?  రంగారావేఁవన్నా చెప్పి ఉంటాడా. ఏం చెఁవుతాడూ? స్వాతి మాత్రం అతగాడికి కూతురు కాదూ… శాంతి అనుమానంతో… ఒకింత భయంతో ”ఏం జెప్పా, వాళ్ళకి నిజం చెప్పు” అంది రంగారావు వైపు తిరుగుతూ…. రంగారావు వంకరగా నవ్వాడు. రంగారావు మొఖంలో ., గొంతు కొరికాక ఒరగబోతున్న మేక కళ్ళలోని భీతిని,బతకాలన్న పెనుగులాటని  గర్వంగా, సంతృప్తిగా చూసే తోడేలు కళ్ళలోని దుర్గార్గపు మెరపు, నీ చావు నా చేతుల్లోనే అని నీవెరుగవా అమాయకురాలా అనే .,ఒకింత విలాసవూ .,పొగరుతో నిండిన విరుపూ     కనపడ్డట్టై… భయంతో ఒణికింది శాంత.

ఈ లోపల పెరట్లోంచి జయలక్ష్మి ”అమ్మగారూ అంట్లు తోమేసానండీ కూసింత ఇట్టా వస్తార.,?” అని అరిచింది.

”అమ్మగారూ… సారు మీమీద శానా సెడ్డగా సెవుతున్నారండీ. మీకు ఆ తురకాయనకీ సంవందం ఉందనీ… అసలు పెద్ద పిల్ల మాత్రమే ఆయనకు పుట్టిందనీ మిగతా ఇద్దరూ తను వదిలేసాకే సిటీకొచ్చాక ఎవరికి కన్నదో… తురకాయనకే కని ఉంటుందని మీ శీలం మంచిది కాదు కాబట్టే తను వదిలేయాల్సి వచ్చిందనీ సెవుతున్నారండీ. స్వాతి మావగారితో నేనప్పటికీ మాట మారుస్తూనే ఉన్నా అయ్యగారూ నీళ్ళు కావాలా అని వింటేగా … జాగ్రత్తమ్మగారూ… నే ఎల్తా మరి” అంటూ రక్తం ఇంకి పోయిన ముఖంతో శిలలా నిలబడ్డ శాంతను జాలిగా చూస్తూ వెళ్ళిపోయింది జయలక్ష్మి.

”ఏం జెప్పా వాళ్ళకీ?” మీదకి ఉబకబోతున్న లావాలా సలసల కాగుతూ, భగభగమండుతూ, రంగారావు ముందు నిలబడింది శాంత.

రంగారావు ఏం మాట్లాడలేదు. ‘చెప్పూ’ శాంత గర్జించింది. రంగారావుకి కోపం వచ్చింది. ”ఆఁ ఏం చెఁవుతానూ… నువ్వెంత పతివ్రతవో చెప్పాను రవూఫ్‌ గాడితో నీ రంకుతనం చెప్పాను .ఏం తప్పా, అవద్దఁవా అది” అన్నాడు రంగారావు వెకిలిగా నవ్వుతూ. ఆక్సిజన్‌ మీద బతుకుతూ… రేపో మాపో పోయేలాగా ఉన్న ఈ మనిషిలో ఇంత కూడా మనిషితనం లేకుండా ఎట్టా పోయిందీ? చేష్టలుడిగి రంగారావుని చూస్తున్న శాంతకి తన స్వంత పిల్లలని కూడా  మరిచి గుటుక్కున గుడ్లను మింగేస్తున్న నాగుంబాములా కన్పించాడు రంగారావు. వెకిలిగా నవ్వుతున్న రంగారావుకి ఉన్నట్లుండి దగ్గొచ్చింది. తెరిపినివ్వని దగ్గుతో మనిషి మెలి తిరిగి పోయాడు. ఆక్సిజన్‌ మాస్కు పక్కలకంటా జారి పోయింది. ఊపిరాడక ఎగరొప్పుతూ ఆక్సిజన్‌ మాస్కుని కళ్ళతో చూపిస్తూ, వంకర తిరిగిన చేతివేళ్ళతో సైగ చేస్తూ… స్థాణువులా నిలబడ్డ శాంతని… బతిమిలాడ్డం లేదు, బెదిరిస్తున్నాడు. ”యూ బిచ్‌… మాస్కు పెట్టవే” అని అరుస్తున్నాడు, కళ్ళతో శాంతకి మాస్కు వైపుకి దబాయిస్తున్నాడు. శాంతకి వొంట్లోంచి వేడి సెగలు లేచినట్లు అయింది. ఇప్పుడు కూడా… ప్రాణం పోతున్న సమయంలో కూడా తను బిచ్‌ వాడికి… ఊపిరి పొయ్యమని బూతులతో గద్దిస్తున్న వీణ్ణేం చెయ్యాలి…? శాంత కోపంతో ఒణికి పోయింది. రంగారావుకి దగ్గరగా వెళ్ళింది శాంత. ఎడం చేత్తో రంగారావు జుట్టు పట్టుకుంది. ఛెళ్ళు ఛెళ్ళుమని చెంపలు తట్లు తేలేదాకా ఆవేశంతో వాయించేసింది. ఆయాశంతో రొప్పుతూ… నిలబడిపోయింది. ”థూ… నీ బతుకెంత సెడింది” అంటూ రంగారావు మొఖం మీద ‘థూ’ అని తుపుక్కున  ఉమ్మింది శాంత . కళ్ళు, మొఖమూ కోపంతో ఎర్ర బడి పోయాయి. ”యూ… బిచ్‌… ఏం జేస్తున్నావే” అంటానే ఉన్నాడు రంగారావు. తనెదురుగా ఒణికి పోతూ భీకరంగా నిలబడ్డ శాంతను తెల్లబోయి చూస్తూ… శ్వాస ఆగిపోతూంటే ఎగరొప్పుతూ కళ్ళు పెద్దగా అవుతుంటే ప్రాణాలు పోతాయేమో అన్నట్లుగా ఆక్సిజన్‌ సిలిండర్‌ వైపు కళ్ళతో, వేళ్ళతో శాంతకు పెట్టు ,పెట్టూ అన్నట్లు  చూపిస్తూన్నాడు. శాంత ఆక్సిజన్‌ సిలిండర్‌ వైపుకి నింపాదిగా  తిరిగింది. పక్కకి ఒరిగిపోయిన ఆక్సిజన్‌ సిలిండర్‌ని ,తన వూపిరంతా దాంట్లోనే ఉన్నట్లుగా  జాగ్రత్తగా, శ్రద్ధగా నిలబెట్టింది. రంగారావు, శాంతవైపు ఆశగా చూసాడు. ఆక్సిజన్‌ మాస్క్‌ చేతుల్లోకి తీస్కుని రంగారావు వైపుకి తీక్షణంగా చూసింది శాంత . చూసాక ఒకింత నవ్వింది.ఇన్నాళ్ళూ.,చెయ్యనిది ఇప్పుడు చేస్తానన్నట్లుగా నవ్వింది .,ఆ క్షణంలో తనకట్టా నవ్వు రావడం,.నవ్వడం అదీ రంగారావు వూపిరి కోసం తన్లాడుతూ తనని అట్టా బతివిలాడుతూ ఉన్నప్పుడు మరీ తనట్టా విలాసంగా నవ్వటం ఆశ్చర్యమే కాదూ,.ఎన్నదూ తనలో లేనిది ఈ రోజు ఇట్టా బయట పట్టం?శాంత ఆలోచనల్లోంచి తెర్లి పడి రంగారావును చూసింది. తర్వాత ఆక్సిజన్‌ మాస్కుని, రంగారావునీ మార్చి, మార్చి చూసింది… అలా చూసాక ఒక్కసారిగా మాస్కుని రంగారావు ముక్కు దగ్గరగా తీస్కెళ్ళి… చటుక్కున వెనక్కి తీస్కుంది… రంగారావు నిర్ఘాంత పోయాడు. అతని కళ్ళల్లో ఆశ చచ్చిన చేప శవంలా.,ఎండిన చెరువులా., ఆరి పోయింది. శాంత, ఆక్సిజన్‌ మాస్క్‌ అతని ముఖానికి కొద్ది దూరాన పెట్టి ”ఎవరురా బిచ్‌ చెప్పు.,నేను బిచ్ నా చెప్పు.,మరి నువ్వెవడివిరా.,చిత్తేకార్తే కుక్కవా .,నిన్నసలు కుక్కతో కూడా పోల్చకూడదు కదరా .,కన్న బిడ్డ అని కూడా లేదురా నీకు మరి నువ్వెట్టాంటి వాడివో నువ్వే .,చెప్పు చెప్పు” అని ఉరిమింది. ఊపిరాడక గిజగిజలాడుతున్న రంగారావు ఆక్సిజన్‌ మాస్క్‌ వైపు చేయి చూపే ప్రయత్నం చేస్తూ… విఫలమవుతూ పెట్టు… పెట్టు… అని సైగలు చేస్తూనే ఉన్నాడు. శాంత మాత్రం శాంతంగా., ఆక్సిజన్‌ మాస్క్‌ అలానే పట్టుకుని నిలబడ్డది. రంగారావు  ఊపిరి కడగట్టుకు పోతుంటే, పోయే ప్రాణాలనీ… చూపులనీ ఆక్సిజన్‌ మాస్కు మీదే నిలిపి, విలవిల్లాడిపోతూనే ఉన్నాడు. శాంతను నిబిడాశ్యర్యఁవూ… భయంతో చూస్తూ…

***

(”ఇంత చాకిరీ చేస్తున్నా యూ బిచ్అని పిలుస్తాడండీవాడి ఆక్సిజన్మాస్క్తీసెయ్యాలన్నంత కోపం వస్తుందండీఅంటూ వలవలా ఏడ్చిన ప్రశాంతికి.)

గీతాంజలి

16 comments

Leave a Reply to మంజులా దేశ్ పాండే. Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మో చదువుతుంటే భయం వేసింది. ఇంత రాక్షసులు ఇంకా ఉన్నారా చాలా ఆలస్యంగా చంపారు వెధవని.

  • అందరినీ ఆలోచించే లాగా చాలా బాగా రాశారు గీతాంజలి గారూ. వాడి ఆక్సిజన్‌ మాస్క్ఇంకా ఉంచాలా ?!

    • రంగా రావు ఆక్సిజన్ మాస్క్ తీసేయాల్సిందే దేవరకొండ గారు…లేకపోతే శాంతికి ఊపిరాడక చచ్చి పోతుంది.

  • ఎంత ఘోరం …..అంత పాపిష్టి మనుషులు ఇంకా ఈ లోకంలో ఉన్నారా… అసలు అలాంటి వారు కూడా ఉంటారా…!!?? ఎంతో ఆశ్చర్య పడుతూ చదివిన.ఇలాంటి వారిని నిలువునా పాతరేయాలి.

  • భయానకం. ఉంటారిలాంటివాళ్ళు. కాకపోతే, ఈ మగ దురహంకారము ఒక్క కులానికే ప్రత్యేకమయుండకపోవచ్చు. గతంలోనూ మరో కథ చదివాను. అందులో ఓ దురహంకారి కూడా ఈ కులమనే మీరు ప్రత్యేకంగా చెప్పిన గుర్తు. నిజంగా వీళ్ళలోనే ఇలాంటి మగవాళ్ళెక్కువుంటారాండీ?
    ఈ వివక్షకి కులం లేదనుకున్నాను.

    • ఇంత గడ్డు వాస్తవికత భరించలేకపోతున్నామండీ మీ కథల్లో! అవి ఎంత వాస్తవికమైనా. మీ కథలు చదవాలంటేనే భయమేస్తోంది.

      • చంద్ర శేఖర్ గారూ… సామాజిక వాస్తవికతను ప్రతిఫలించదమే సాహిత్య లక్ష్యం.నా కథలన్నీ నా పేషెంట్స్ వాస్తవికంగా అనుభవించినవే.
        సాహిత్యం లో kalpanikatha ఉండాలి కానీ వాస్తవికత దాని కంటే ముఖ్యం.సాహిత్యం ద్వారా పాఠకుడికి సామాజిక వాస్తవికత అది ఎంత భీభస్థమైనదైన తెలియాల్సిందే.డిస్టర్బ్ అయినా ఆలోచిస్తారు .సరిగ్గా సాహిత్య ప్రయోజనాన్ని ..సామాజిక మార్పుకోసం చూడాల్సింది ఇక్కడే. అప్పుడే marginalised people అయిన.,దళిత,ముస్లిమ్స్,ఆదివాసీలు,క్రిస్టియన్స్ అండ్ అన్ని కులాల,మతాలకు సంబందునుంచిన స్త్రీల పట్ల జరుగుతున్న అణిచి వేతను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము.
        శృంగారం పట్ల ఉన్న రొమాంటిక్ ,అవాస్తవిక, పురుషుకేంద్రంగా నడుస్తున్న రాజకీయాల ను .పొరలు. పొరలుగా అల్లిన భ్రమల పరదాలను ఎప్పటికైనా బద్దలు కొట్టాల్సిందే. భయము నొప్పితో కూడిన వాస్తవాలను మా స్త్రీల కళ్ళల్లోంచి పురుషులకు చూపించాల్సిందే.స్త్రీల శరీరాలు ఎలా ఈ పితృస్వామ్య వ్యవస్థ అనే laboratory ల్లో..ఎలుకలు,కుందేళ్లు,పక్షులలాగా experimental animals గా మారి పోయాయో..,ఇప్పటికైనా చెప్పాల్సిందే.చెప్పకపోతేనే అది చారిత్రిక తప్పిదమవుతుంది. కథ చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్ చంద్ర శేఖర్ గారు.

    • లేదండి. స్త్రీలను అణిచివేసే బ్రహ్మణికల్ కల్చర్ అన్ని కులాల్లోని /మతాల్లోని పురుషుల్లో ఉంది.నా మిగతా అన్ని కథల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాను.హస్బెండ్ స్టిచ్ కథలు చదవండి.

      • కదా! అన్ని కులాలలో, మతాలలో ఉన్న ఈ అణచివేతను బ్రహ్మణికల్ కల్చర్ గా ఎందుకు ఉటంకిస్తున్నారు? అమెరికాలో ఉండే సగటు విదేశీయునికి మీరనే ఈ బ్రహ్మణికల్ వాదం ఏదీ తెలీకున్నా నరనరానా అమ్మాయంటే లోకువభావముంటుంది. మీరు ద్వేషించే కులాల ప్రస్తావన రాకుండా నిజాయితీగా వివక్షను గురించి మాత్రమే రాసుంటే బాగుండేదనిపించింది. సర్లెండి. మన దేశంలో కులం లేనిదేదీ ఉండదు. కథ మాత్రం అతీతంగా ఎందుకుండాలి?

      • స్త్రీలను అణచివేతకు గురిచేయడం అనేది బ్రహ్మణికల్ కల్చర్. గొప్ప పరిశోధన 😀😀😀

    • వివక్షకు కులం లేకపోయినప్పటికీ, ఈ వివక్ష ను ప్రవేశ పెట్టింది, దాన్ని కొనసాగించే వ్వవస్థ ను ఏర్పరచింది ఆకులమే! దాని ప్రభావం లేని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా, అది ఏకులమైనా? ఇక్కడ కులం, విదేశాలలో పురష అహాంకారం (అక్కడ కులం లేకపోయినా) దోపిడీ అహాంకారం ఉంది! అదృష్టి గల సంసృతిలో ఉగ్గు పాలతో పెరుగుతున్న మనుషులు ఎక్కడైనా ఒక్కటే!

  • మీ కథ చాలా బాగుంది.
    1. ఊర్లో కాషాయాపోల్లు కొట్టి చంపేస్తున్నారని .,ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పిల్లాపాపలతో సిటీకి పారిపోయి వచ్చే సి .. రోడ్డు వారకి చెప్పుల కొట్టు పెట్టుకుందామనుకొని .,ఇక్కడ కూడా చంపేస్తారేమో అని భయపడి
    2 సాయబుల మతంలో ఉన్నంత మంచితనవు ఏ మతంలో చూసిందని ?

    లాంటి కావాలని చొప్పించిన హిందు వ్యతిరేక వ్యాఖ్యలు మాత్రం బాగలేవు. ఊరు నుండి పట్నానికి రావటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఇలాంటి కారణం వింతగా ఉంది. హిందూ టెర్రరిజం అనేది తప్పుడు వాదం దాన్ని కావాలని కాంగ్రెస్ ప్రచారం చెయ్యడానికి ప్రయత్నం చేసింది. మీరు దానిని మీ కధలో అంతర్లీనంగా చొప్పించడం బాగాలేదు.

    • దురదృష్టమేమిటంటే, వేరే మతాలను మటుకు అవసరమున్నచోట కూడా ప్రస్తావించకుండా లౌక్యం పాటిస్తారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు