ఆకాశవాణి సిలోన్ కేంద్రం

బర్మా క్యాంపు కథలు 8

భాగ్యలక్ష్మి అంటీ వాళ్ళ సొంతూరు సీలేరు , బర్మా క్యాంపులో సగం కొండమీద అరవై గజాల్లో ఉంటుంది ఆవిడ ఇల్లు.
కమ్మలిల్లు, ఇంటి ముందు నీళ్లు నింపు కోడానికి గోలేము, పేడతో అలికి ముగ్గులు పెట్టిన వాకిలి, తలుపులు లేని వరండా, దాటి లోపలి గదిలో కి వెళ్లే ముందు నీలం రంగు పెయింటు వేసిన తలుపులు, గడపకి పసుపు రంగు అంది మీద యెర్ర పువ్వుల డిజైన్లు, ఇంటి ముందు బంతి కనకాంబరం మొక్కలతో ఉంటుందా ఇల్లు.
భాగ్యలక్ష్మి అంటీ పొద్దున్నే బోరింగు ,లేదా కుళాయిలొస్తే అక్కడ నుంచి కొండ మీద వున్న ఇంటికి నీళ్లు మోసుకెళ్తుంది.
పనులన్నీ అయిపోయాక పాము మెలికలు తెరిగినట్లున్న కొండ మీద బాట నుంచి కిందనున్న మా పెంకులింటికి వస్తుంది.
అమ్మతో కబుర్లు, పనుల్లో సాయాలు అయిపోయాక అందరం కాస్సేపు రేడియో వింటాము.
అంటీకి రేడియో అంటే చాలా ఇష్టం , యెంత ఇష్టం అంటే నేనైతే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మాత్రమే వినే వాడిని. భాగ్యలక్ష్మి అంటీ అయితే ఆకాశవాణి విజయవాడ కేంద్రం, హైదరాబాద్ కేంద్రం, సిలోన్ కేంద్రం అన్నీ వినేది.
” రేడియో పాటలు విందాం రా హరి బాబూ ” అనేది. కొండ మీద వాళ్ళ ఇంటిముందు ముర్ఫీ రేడియో లో కొండల మీద నుంచి గాలి, మునగ చెట్ల గాలి, గోరింటాకు మొక్కల గాలి తగులుతుండగా హాయిగా వినే వాళ్ళం.
పొద్దున్నే సూక్తి ముక్తావళి, ఆ తరువాత భక్తి రంజని, జనరంజని, మధ్యాహ్నం వార్తలు, విజయవాడ కేంద్రం వార్తలు, ఢిల్లీ నుంచి ప్రసారాలు, పసిడి పంటలు, సంక్షిప్త శబ్ద చిత్రం, పల్లెసీమలు, ఆదివారం మధ్యాహ్నం గంట సేపు వొచ్చే మనిషి గోతిలో పడ్డాడు లాంటి నాటిక ఒకటేమిటి హిందీ పాటలు , ఆకాశ వాణి సిలోన్ కేంద్రం నుంచి వొచ్చే అన్ని కార్యక్రమాలు వినేసే వాళ్ళం.
” సిలోన్ కేంద్రం పెట్టు హరిబాబు ” అనేది అస్తమాను.
రేడియోని ట్యూన్ చేస్తూ కొండమీద నుంచి వొచ్చే గాలి తగులుతుండగా మొత్తానికి సిలోన్ కేంద్రం పట్టే సే వాణ్ని.
రేడియో ప్రసారం ప్రారంభానికి ముందు వొచ్చే సిగ్నేచర్ ట్యూన్ మొదలుకొని రేడియో ప్రసారాలు అయి పోయే వరకు
వినేసె వాళ్ళం. మధ్యలో చేతితో బియ్యం ఏరుకోవడం, కాయగూరలు కోసుకోవడం చేసేది భాగ్యలక్ష్మి అంటీ.
నేను నా గెడ్డం మీద చేయి తీయకుండా తదేకంగా రేడియో ను చూస్తూ ఊహా లోకంలోకి వెళ్లిపోయే వాడిని.
” అస్తమాను సిలోన్ కేంద్రం పెట్టమంటారు ,సిలోన్ మీ స్వంత ఊరా అంటీ ? ” అంటే ఒకసారి గట్టిగా నవ్వేసింది.
* * *
మద్యాహ్నం మా ఇంట్లో ఫిలిప్స్ టు ఇన్ వన్ రేడియో సెట్ దగ్గర కూర్చొని పాత పాటలు వింటున్న నేను
పాడుతున్న వాళ్ళు డాన్సులు ఈ రేడియో లోపల చేస్తున్నారో లేదో అని రేడియో నట్లు విప్పబోతుంటే
” ఒరేయ్ తింగరి పనులు చేయకు ” అని వొక్కటేయబోయింది మా అమ్మ.
అంతే తిన్నగా కొండ మీదకి పరిగెత్తి అంటీ వాళ్ళ గుమ్మంలో కూర్చున్నాను.
రేడియో ఇచ్చింది అంటీ … ఎన్ని సార్లు ఆ రేడియోని ట్యూన్ చేసినా , స్టేషన్లు మార్చినా
ఒక్కసారి కూడా ఏమి అనలేదు అప్పటికి పిల్లలు లేని భాగ్యలక్ష్మి అంటీ. వాను డ్రైవర్ అయినా అంటీ వాళ్ళ ఆయన పిల్లలు పుట్టాలని నూకాలమ్మ తల్లి కి మొక్కుకొని, శూలాలు గుచ్చుకొని అగ్ని గుండం కూడా తొక్కాడు.
అదిగో ఆ టైము లోనే సీలేరు నుంచి అంటీ వాళ్ళ తమ్ముడు వొచ్చాడు. ఆ వొచ్చిన ఎద్దు లాంటి తమ్ముడికి లోకల్ గైడ్ నేనే , ఇద్దరినీ పరమేశ్వరి పిక్చర్ పాలస్ కి వెళ్లి ” పాపం పసివాడు ” బెంచీ టికెట్లో చూడమని చెరో రెండేసి రూపాయలు ఇచ్చారు మా దయగల అమ్మ, అంటీ.
అంటీ తమ్ముడు ఏమీ అనలేదు ఇద్దరం వెళుతున్న దారిలో ఒక చోట ఆగి అటూ ఇటూ చూసి , ఒక రాయి పక్కకు తీసి గొయ్యి తీసి అందులోంచి ఒక చిన్న చిల్లర మూట తీసాడు .
ఇద్దరం ఆ చిల్లర మూట పట్టుకొని సినిమాకు పోయాము బాల్కనీ లో అయిదు రూపాయల టికెట్ తీసుకొని, చిరు తిళ్ళు కొనుక్కొని, కంటి నిండా ఏడ్చేసి వొచ్చేసాము. ఇంత మంచి తమ్ముడు వున్న భాగ్య లక్ష్మి అంటీ అంటే ఇంకా అభిమానం వొచ్చేసింది నాకు.
* * *
బర్మా క్యాంపులోకి మెల్లగా టీవీలు వొస్తున్న కాలం, 1984 లో ఇందిరమ్మ ని చంపేశారు . బర్మా క్యాంపు అంతా స్వంత కూతురు, అక్క చనిపోయినట్లు ఘొళ్లుమంది , ఢిల్లీ వెళ్ళలేరు కాబట్టి జై భారత్ నగర్ ప్రారంభంలోనే వున్న కాంట్రాక్టర్ మోహన్ రావు గారి డాబా ఇంట్లో చేరిపోయి ఇందిరమ్మ అంత్యక్రియలు దగ్గరుండి టీవీలో చేయించారు. .
తరువాత మెల్లిగా జై భారత్ నగర్ లోకి పోర్టుబుల్ టీవీలు వొచ్చాయి, కమ్మళింట్లో ఉంటున్న వాళ్ళు టీవీలు కొంటున్నారు గాని మా నాన్న మాత్రం టీవీ కొనటం లేదు, శని వారం, ఆదివారం టీవీ చూడటానికి ఇల్లు వెతుక్కుంటున్నాము నేను మా తమ్ముడు రవి కాంత్.
శని వారం సినిమాల నిండా ఆ హిందీ వాళ్ళు ఒకటే తినడం, మాట్లాడుకోవడం ఒకటే బోరు.
ఆదివారం సినిమాలు తెలుగు సినిమాలు “రామాయణంలో పిడకలవేట ” లాంటి ఫామిలీ సినిమాలు. పిల్లలందరికీ పండగ , మధ్యలో అంతరాయం గంటా రెండు గంటలు అయినా ఆ ఇంటి ఓనర్ను విడిచి పెట్టకుండా తిరిగి సిగ్నల్ రాగానే సినిమా పూర్తి గా చూసి అప్పుడు ఇంటికి వెళ్లే వారు గుంటలందరూను..
నేను గమనించు కోలేదు గాని మెల్లగా నేను రేడియో కి , సిలోన్ కేంద్రానికి, భాగ్య లక్ష్మి అంటీ వాళ్ళ ఇంటికి దూరమయిపోయాను.
పోనీ వారం మధ్యలో వెళదాము అంటే చిత్రహార్, చిత్రలహరి , ఏడుగంటల శాంతి స్వరూప్ వార్తలు అన్నీ వొచేశాయి. ఆ తరువాత ఆదివారం రామానంద సాగర్ ” రామాయన్ ” వొచ్చేసింది. నూకాలమ్మ తల్లి పండగకు పోతురాజు తమ్ముడు పాత్ర పోషించే గంగబాబు తాత కమ్మలింట్లో చల్లగా కుదురుకున్నాము . యాభై రెండు అడ్వరిటైజ్ మెంట్లు ఆ తరువాత వొచ్చే రామాయణం సీరియల్ చూసాను బాణాల ఆట, తరువాత క్రికెట్ ఆట ఆడేటప్పటికీ సరిపోయేది.
నెమ్మదిగా కొండమీద నుంచి వినే ” ఆకాశవాణి సిలోన్ కేంద్రం ” దూరమై పోయింది నా లోంచి.
బర్మా క్యాంపు మెల్లగా అలగా జనం తో నిండి పోతోందని, జనం రోడ్లమీదే పడి కొట్టుకుంటున్నారని, అత్తా అల్లుడు తోడల్లుడు బామ్మర్ది కలిసి రోడ్డు అవతల వాళ్ళని బూతులు తిడ్తున్నారని, రెండు పార్టీలు కలిసి కత్తులతో పొడుచుకు ని రక్తాలు కార్చు కుంటున్నారని , పక్కనున్న అల్లూరి సీతారామ రాజు పాకలు ప్రతి వేసవి లోను ఎవరో అంటించేయగా తగల బడి పోతున్నాయని, క్యాంపు నుంచి స్కూలికి వెళ్లినా వొచ్చినా స్మశానం పక్కనుంచే రావాల్సి వొస్తుందని , రోజూ శవాలు ఎదురొస్తున్నాయని….మమ్మల్ని అక్కడకి పద్దెనిమిది కిలోమీటర్ల అవతల వుండే తూర్పు కనుమలలోని, సింహాచలం కొండలకింద మామిడి తోటల పక్కన వున్న వుడా లే అవుట్ లో కట్టిన కొత్త మేడ ఇంటిలోకి మార్చేశారు .
దాదాపు అడవి లా , చుట్టూ టచ్ మీ నాట్ మొక్కలతో,వందలాది తూనీగలతో, గెడ్డల్లో చుక్కల చేపలతో, డొంకల్లోంచి గెంతే గోధుమ రంగు కుందేళ్లతో, సాయంత్రం అయితే అరిచి హోరెత్తించే నక్కలతో వున్న ఆ కాలనీలో మళ్ళీ రేడియో నే మందారం మొక్కల పక్కన మడత మంచం వేసుకొని ఆన్ చేసి వినసాగాను .
కానీ ‘ఆకాశవాణి సిలోన్ కేంద్రం’ వినడం మాత్రం మర్చి పోయాను.
*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

7 comments

Leave a Reply to Dharmapuri Tyaga Raju Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హరివెంకట రమణ గారు రాసిన ఆకాశవాణి సిలోన్ కేంద్రం కధ చాలా బాగుంది. కధ ఆసక్తిగా సాగింది ఎప్పుడో మరిచిపోయిన ఆకాశవాణి సిలోన్ కేంద్రాన్ని,,ఫిలిప్స్ రేడియోను వారి కధ ద్వారా గుర్తుచేశారు.రచయిత అభినందనీయులు.

  • Radio ante emiti ani pillalu adege rojullo unnappudu Radio vachhe stations gurinchi baga chepparu,1984 lo Tele vision lo vachhe ani karyakramala gurinchi chakkaga chepparu. Isukalo dabbulu ravadam and avi malli cheste undadamm really amazing asalu, malle 1980 lo ki tesukoni velli tesukochharu.

  • కథ బాగుంది. ఎనభైల్లో రోజులు గుర్తొక్సియి. హరి గారి పాత్రలు హత్తుకునేలా ఉంటాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు