అది 1995అనుకుటాను.అప్పటి స్టేషన్ డెరైక్టర్ దుర్గా భాస్కర్ గారు స్ట్రిక్ట్ గా ఉండేవారు.ఒక్కోసారి సరదాగా ఉండేవారు.రిటైర్మెంట్ ఫంక్షన్ లు ఫేర్వెల్ డిన్నర్ తో ముగిసేవి.
ఆ ఫంక్షన్ లు ఎక్కువగా మనోరమా,దుర్గాభవన్, అనుపమ హోటళ్ళలో జరిగేవి.అలాంటి ఒక రిటైర్మెంట్ సభ కోకా సంజీవరావు గారిదనుకుంటాను.ఆయన గొప్ప అనౌన్సర్ మాత్రమే కాదు.నాటకాలు ప్రొడ్యూస్ చేసేవారు.నటించేవారు.ఆయన క్లాస్మేట్స్ లో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, హీరోలు కృష్ణ, శోభన్ బాబు లు ఉండేవారు.. ఆయన చాలా సింపుల్ గా ఎటువంటి భేషజాలు లేకుండా ఉండేవారు.
ఆయన మరో మొహంజదారో నాటకంలో ప్రొఫెసర్ పాత్ర వేస్తుండేవారు.ఎన్..ఆర్.నంది రాసిన ఆ నాటకం ప్రేక్షకులను ఉర్రూతలూగించేది.ఒకసారి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రదర్శించినప్పుడు చూసే అవకాశం లభించింది..
అసలు విషయం లోకి వస్తాను.ఆరోజు సంజీవరావు గారి ఫేర్వెల్ మనోరమ హోటల్ లో జరిగింది..స్టేషన్ డైరెక్టర్ మేడం మా మిత్రుడు డి.బి.రాజేంద్రప్రసాద్ చేత అడిగి మరీ మిమిక్రీ చేయించుకున్నారు. అంతవరకు బానేఉంది.
ఆవిడ సడెన్ గా “ప్రసాద్ గారు మీరు నన్ను కూడా ఇమిటేట్ చేస్తారని విన్నాను.చేయండి” అన్నారు.అందరూ ఉలిక్కిపడ్డారు..డిబిఆర్ (తనని అలాగే పిలిచేవారం) ముందు కంగారు పడినా తర్వాత వారడిగినట్లు చేసి చూపించాడు..ఆవిడేమంటారేమోనని కంగారు పడ్డాం కానీ నవ్వేశారు..నవ్వుతో సరిపెట్టకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు..
నిజానికి విజయవాడ స్టేషన్ లో ఉన్న హోమ్లీ అట్మాస్పియర్ ఉండేది.
అందరూ సరదాగా జోకులు వేస్తుండేవారు.. రత్నాకర్ బాబు గారని ఒక మిత్రుడు ఉండేవారు.ఆయన ఫార్మ్ అండ్ హోం యూనిట్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తుండేవారు..
అప్పట్లో రేడియో కార్యక్రమాల్లో స్టాక్ కేరక్టర్ లు ఉండేవి.వ్యవసాయ కార్యక్రమాల్లో పెదబాబు, చినబాబు స్టాక్ కేరక్టర్లుండేవి.పెదబాబు కేరక్టర్ ని మిత్రుడు కె.రత్నాకర్ బాబు పోషిస్తుండేవారు.చినబాబు గా టి.ఎస్.సి.బోస్ పాల్గొనేవారు.రత్నాకర్ బాబు ఒకపట్టాన వెళ్ళేవాడు కాదు..ప్రతిరోజు రాత్రి ఏడుంపావుకు ప్రసారమయ్యే పంటసీమలు కార్యక్రమం ప్రసారమయ్యేది..అది ప్రసారం అయ్యేవరకు ఉండేవాడు..ఆ కార్యక్రమం ప్రసారం పూర్తయ్యాక “అన్నా విన్నా..బానేఉంది” అంటూ మాకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయేవాడు.. ఇదెందుకు చెబుతున్నానంటే
ఆరోజుల్లో పనిచేసిన వారంతా ఎంత కమిటెడ్ గా ఉంటారో చెప్పటం కోసం..
ఈసందర్భంగా కొన్ని నవ్వు పుట్టించిన సంఘటనలు ఒకటి రెండు చెబుతాను.
ఒక ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కు ఓ అలవాటు ఉండేది..పావుగంట ప్రసారానికి అరగంట రికార్డు చేస్తుండేవారు ..ఆ టేప్ తనకు అటాచ్ చేసిన డ్యూటీ ఆఫీసర్ కు ఇచ్చి పన్నెండు నిముషాలకు ఎడిట్ చేయమనేవారు.
ఆ డ్యూటీ ఆఫీసర్ అప్పటికి చాలా సార్లు ఇలా అరగంట నుంచి పన్నెండు -పదమూడు నిముషాలకు కుదిస్తూ ఉండేవాడు.రికార్డ్ చేసేటప్పుడు, పావుగంటే రికార్డు చేద్దామని చెప్పి చూశాడు, కానీ ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ వినలేదు.
చూసి చూసి ఏం చేశాడంటే ప్రతి ఇంటర్వ్యూ కి పన్నెండు నిముషాలు అయిపోగానే చివరిలో కామన్ గా ఉండే క్లోజింగ్ వర్డ్స్ ఉంటాయి.. ఉదాహరణకు “డాక్టర్ గారు చాలా విషయాలు తెలియచేశారు నమస్కారం” లాంటివి..ఈ క్లోజింగ్ వర్డ్స్ పన్నెండు నిమిషాల తర్వాత వేసి ఎడిటింగ్ కంప్లీట్ చేశాడు..మరో పదమూడు నిముషాలు ఇంకో పార్ట్ గా చేసి ఇచ్చేశాడు.. ప్రసారంలో మొదటి భాగం విన్న ఆ ప్రోగ్రాం ఆఫీసర్ కంగు తిన్నారు.
“అదేంటి అలా చేశావు” అని మొహమంతా ఎర్రబడుతుండగా తర్వాతి రోజున అడిగాడు.
“రెండో పార్ట్ ఉందన్నా” అని టకీమని జవాబిచ్చాడు సదరు డ్యూటీ ఆఫీసర్.
ఆ తర్వాత నుంచి ఆ ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ తన పంథా మార్చుకుని చేస్తే పదమూడు నిముషాలు లేదంటే రెండు భాగాలు చేయటం మొదలెట్టాడు..
డ్యూటీ రూం అంటే ఎలా ఉంటుందో ఇంతకుముందు చెప్పాను కదా..మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను.
ప్రసారాలు జరిగే స్టూడియోలు లోపలుంటే బయట డ్యూటీ రూం లో ప్రసారాలకు సంబంధించిన టేప్ లు, రికార్డు లు ఉంటాయి.అక్కడ డ్యూటీ ఆఫీసర్ రేడియో ప్రసారాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో రేడియో సెట్ లో వింటూ మానిటర్ చేస్తాడు.. డ్యూటీ రూం దాటగానే లైబ్రరీ ఉండేది.. డ్యూటీ రూం కు
ఉదయాన్నే న్యూస్ పేపర్లు నాలుగైదు వస్తుండేవి..అందులో హిందూ పేపర్ ఒకటి.
ఒక్కోసారి హిందూ పేపర్ సప్లిమెంట్ మిస్ అవుతుండేది.
లైబ్రరీ ఇన్ ఛార్జ్ గా ఉండే ఒక ప్రోగ్రాం ఆఫీసర్ డ్యూటీ రూం కు ఫోన్ చేసి ఆ సప్లిమెంట్ రావడంలేదు..ఈ సప్లిమెంట్ రావడంలేదు అని దండకం చదువుతుండేవారు.
ఇది చూసిన ఒక డ్యూటీ ఆఫీసర్ పేపర్ మూడు రూపాయలు, సతాయింపు ముప్ఫై రూపాయలంటూ చమత్కరించేవాడు.
ప్రముఖ రచయిత,పద్యకవి డా.ఆర్.అనంత పద్మనాభరావు గారు స్టేషన్ డైరెక్టర్ గా కొన్నాళ్ళు ఉన్నారు. ఆయనున్నంత కాలం స్టేషన్ చాలా బిజీగా ఉండేది.సందడే సందడి.. మంత్రులు, శాసనసభ్యులు, సినిమా నటులు, స్వామీజీలు..ఇలా అన్ని రంగాల ప్రముఖులు రేడియో స్టేషన్ కు విచ్చేయటం పరిపాటుగా ఉండేది.ఆయనకో అలవాటు ఉండేది. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ప్రముఖులు బస చేస్తుండేవారు.అక్కడ ఆయన ఉదయాన్నే మార్నింగ్ వాక్ లో వాకబు చేసి వివిఐపిలెవరున్నారో తెలుసుకుని, వారిని స్టూడియో కి ఆహ్వానిస్తూ ఉండేవారు.
ప్రముఖ నటులు భానుమతి ,కొంగర జగ్గయ్య,గొల్లపూడి మారుతీరావు,గీత రచయిత సి.నారాయణరెడ్డి..ఇలా ఎంతోమంది ఆకాశవాణి స్టూడియో కి వస్తుండే వారు.. ఒకసారి ఉదయం ఆరు గంటలకు కంచి స్వామీజీ వచ్చారు.
విఐపిలు వచ్చే టైమెప్పుడో ఎవరికి తెలీదు కాబట్టి, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ చేత చేయించేవారు.. మేము డ్యూటీ ఆఫీసర్లం కదా.. మాకు కొంచెం గైడెన్స్ కోసం ఆయనే కొన్ని ప్రశ్నలు చెప్పేవారు.మమ్మల్ని రాసుకోమనేవారు.. విజయవాడ ఏ కేంద్రం, విజయవాడ వివిధ భారతి కేంద్రం..ఇలా రెండు ఛానెల్స్ ఉండేవి..రెండు ఛానెల్స్ ను ఇద్దరు డ్యూటీ ఆఫీసర్లు ఉండేవారు.ఒకళ్ళు ఇంటర్వూ చేస్తే, ఇంకళ్ళు రికార్డు చేసేవారు.
ఒకసారి కొత్తగా డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్త డి.జి.గారిని పిలిచి లెక్చర్ ఇప్పించారు. ఆయన అంతకు ముందు న్యూస్ డి.జి.గా చేశారు.ఆయన న్యూస్ కు సంబంధించి మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు..
ఆయనే కాదు.. గొల్లపూడి మారుతీరావు గారు డ్యూటీ ఆఫీసర్ గా విజయవాడ లో కొంతకాలం పనిచేశారు..ఆయన అప్పటికే సినిమాలకు రాస్తున్నారు.. ఆరోజుల్లో ఆయన మీదొక జోకుండేది.ఆయనని రేడియో స్టేషన్ కన్నా మనోరమా హోటల్ లో కలవటం ఈజీ అని.. ఆయనకు మాకు ఆయన అనుభవాల్లోంచి ఎన్నో విషయాలు చెప్పారు.
జగ్గయ్య గారు కంచు కంఠం మమ్మల్నందరిని గంటసేపు కదలనివ్వకుండా కబుర్లు చెప్పింది.. అవన్నీ తీపి గురుతులు..
పద్మనాభరావుగారిది గొప్ప సమయపాలన.ఆయన ఉదయమంతా ఆఫీస్ లో బిజీగా ఉంటే సాయంత్రం సభల్లో అధ్యక్షులుగానో,ముఖ్య అతిథిగానో పాల్గొనేవారు.ఇవి కాకుండా పత్రికల్లో రాస్తుండేవారు.. పుస్తకాలు రాస్తుండేవారు.సాహిత్యకాడెమీ వారికి అనువాదాలు చేస్తుండేవారు..ఒక ఆర్టిస్ట్ వచ్చి వెళ్ళిపోయాక ఇంకో ఆర్టిస్ట్ వచ్చేట్టు ఆయన ప్లాన్ చేస్తుండేవారు.నిజంగా అదొక కళ..
రేడియో అంటే సమయపాలన అని మాటల్లో చెప్పడం కాకుండా ఆయన చేతల్లో చూపించేవారు..
ఆయన ఒక ఆదివారం అందరినీ ఆశ్చర్యపరిచారు.. అదేమిటంటే..
*








చాలా బాగా రాస్తున్నారు.
అభినందనలు మీకు
_____డా. కె ఎల్వీ ప్రసాద్
శేరిలింగంపల్లి
హైద్రాబాద్.19
9866252002