“ఆహా”
“ఇంకా ఎరకల టపటప కొట్తుందా?”
“అలా సాహసింపలేదు”
రాజుగారు చిలుకను ఒకసారి చూడాలన్నాడు. చిలకను రాజు వేలితో పొడిచాడు. “అది ఆ అనలేదు, ఊ అనలేదు. దాని కడుపులోనమటుకు గ్రంధప్రతుల యొక్క శుష్క పత్రములు కసకస గజగజ చేయసాగినవి” ఇలా ముగుస్తుంది కథ.
మిగిలిన కథలన్నీ స్త్రీ జీవితం, స్త్రీ పురుషుల సంబంధం గురించినవి. తనను ప్రేమ పేరుతో మోసం చేసిన యువరాజు గుండెల్లో ఖడ్గం దింపి, తాను కూడా ఆత్మాహుతి చేసుకునే సరళ కథ ‘ప్రణయ జ్వాల? కాదు ప్రళయ జ్వాల ‘. వయసు మళ్ళిన భర్త ద్వారా సంతానం కలగకపోగా అతడి అనుమానాలకు అవమానపడే గృహిణి ఒక దొంగ సన్యాసి ద్వారా సంతానం పొందడం ‘మూడు తలల తాటిచెట్టు’ కథలో చూడవచ్చు.
ప్రేమ ప్రకటన తెలీని యువతీయువకులు, ప్రేమానుభవం అంచులదాకా వెళ్ళినా, అది పొందలేని బిడియం మరణతుల్యం అని చెప్పిన కథ ‘పరాన్ కుట్టి’. ఇది కేరళ ప్రాంతీయ నేపథ్యంలో రాసిన కథ. ‘హోలీ పండుగ ‘ కథ బెంగాలీ నేపథ్యంలో రాసిన మరో కథ. హోలీ పండుగరోజు యువతీయువకులు గులాములు చల్లుకుంటూ యౌవ నృత్యాన్ని వయో కల్లోలాన్ని సృష్టిస్తూ ఆనందిస్తుంటే మరోవైపు రోగగ్రస్తుడైన భర్తను కోల్పోయిన ఒక పడుచు భార్య కథ ఇది. ‘రవణ సాహసం’ అనే కథలో రవణది ఇష్టంలేని పెళ్ళి. 50 ఏండ్ల రెండొ పెళ్ళికొడుకు. రవణకు ఇది ఇష్టం లేదు. మనసు పడిన సుందరయ్యతో చెప్పలేదు. భర్తతో కాపురానికి వెళ్ళకముందే మంచినీళ్ళ మడుగు దగ్గర సుందరయ్యతో ఏర్పడిన సమాగమం. అది అలవాటయ్యాక పదిహేనురోజుల్లో భర్త వచ్చి కాపురానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు దెయ్యం పట్టినదానిలా నటిస్తుంది రవణ. అలా మూడుసార్లు కాపురానికి వెళ్ళకుండా తప్పించుకొన్న రవణ, ఇక భర్త నాలుగోసారి తప్పదన్నట్లు వస్తే, ఆ ఉదయం అదే నీళ్ళ మడుగులో ఎర్రతామరలలో కలిసిపోయిన రవణ, ఆమె మరణంతో ముగిసిన కథ ‘రవణ సాహసం’.
ఈ కథలన్నిట్లో స్త్రీ బాధకి కవిత్వ దృష్టితో చలించాడు పఠాభి. భావకవుల్లాగా కాకుండా, స్త్రీ జీవితంలోని దుఃఖం, ప్రేమరాహిత్యానికి నిష్కృతిగా రక్తమాంసాలతో కూడిన ప్రేమను ఈ కథల్లో పఠాభి చూపించాడు. ప్రేమరాహిత్యంలో బాధపడే రవణ నీటి మడుగు దగ్గరకు పోయినప్పుడు చీకటిపడుతుండగా వర్ణించిన దృశ్యం ఇది. “తామర పూవులన్నీ మూసుకుపోయియున్నవి. జాబిలి ప్రతిబింబము గడ్డకట్టిన నిరాశలాగ జలాంతరంగంలో కనిపిస్తుంది”.హోలీ పండగలో శేఫాలికను వర్ణిస్తున్నప్పుడు “తన లలాటముననున్న కుంకుమపు చుక్క ఈడేరని కోరికలచేత నిండిన తన గుండియలాగా మండుచున్నది” అంటాడు.
మొన్న మీ ఉపన్యాసం కి పూర్తి పాఠం గదూ ! చాలా సమగ్రంగా ఉంది వ్యాసం .