స్వేచ్ఛ ఎగరేసిన అక్షర పతాక

కవిత్వం కల లాంటిది. కాంతి లాంటిది. భవిష్యత్ దర్శనమిది. నిద్రావస్థలో మానవత్వాన్ని  తట్టి లేపేది కవిత్వం. కరుణను కురిపించేది. కవిత్వం. బతుకును ఒడపోసి జల్లెడ పట్టేది కవిత్వం. బండలను కొండలను కరిగించే శక్తిగలది కవిత్వం

స్వేచ్ఛ అంటే  ఎవరికిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పది కదా!  అందుకే స్వేచ్ఛ అందరి  ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆకర్షించింది నన్ను. ఎంత మంచి పేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి మట్టి పూలగాలి ‘ పేరుతో కవిత్వాన్ని తెస్తున్నానని  చాలా ఆనందించాను. అపురూపంగా  అన్పించింది. ప్రస్తుతం స్వేచ్ఛ టీవీ 9 లో న్యూస్ రీడర్ గా పని చేస్తోంది.స్త్రీ లు  రచనారంగంలో ఎంత ఎక్కువగా వస్తే  అంత ఆనందించే తత్వం నాది. అందుకే పోరాడి మరీ స్త్రీల కవిత్వం మీదే రిసెర్చ్ చేశాను.

స్త్రీలు  రచనలు చేయడానికి వెనకుండే సామాజిక కారణాలు, సమాజ దుర్నీతి , స్త్రీల  శక్తి సామర్ధ్యాలను  అంగీకరించే వ్యవస్థ లేకపోవడం , స్త్రీల రచనలపై విధించే సెన్సార్ షిప్ లు, తాము మాత్రం అనుమతించిన  భక్తి మొదలైన అంశాలకే స్త్రీలను పరిమితం చేయడం, ఇవన్నీ మనందరికీ  బాహాటంగా కన్పిస్తున్న విషయాలే. ఇంకొక ప్రధానమైన విషయమేమిటంటే , స్త్రీల రచనలో వ్యక్తీకరించిన  భావాలన్నీ  ఆమె వ్యక్తిగతమైనవనీ, ప్రేమ, విరహం, శృంగారం, వియోగం స్త్రీలకు నిషిద్థవిషయాలనీ సమాజం భావిస్తోంది.  ఇవే భావాలను పురుషులు వ్యక్తీకరిస్తే  అవి వారి రసికతకీ , ప్రేమోద్దీపనకీ గుర్తులని భావించడం. స్త్రీల  రచనల్లో ఏ మాత్రం కనబడినా ఎవరై వుంటారు? అని డైరెక్ట్ , ఇండైరెక్ట్ గా చర్చిస్తూ వుంటారు. ఈ స్థితి మారాలింకా.

ఇలాంటి కాంక్రీటు  అరణ్యంలో కూడా అప్పుడప్పుడూ ఇలా ‘స్వేచ్ఛ’ లా సహజంగా  స్వచ్ఛంగా , సెలయేటి ప్రవాహంలా మేఘాల జడివాన కవిత్వ ఆకాశంలో  కురుస్తూ వుంటుంది. ఎందుకో మరి స్వేచ్ఛకు మేఘమంటే ఇష్టం. ఎంతిష్టమంటే , మేఘాలకు ఎన్నెన్నో రూపాల శరీరాన్ని తొడిగి , రకరకాల  అర్థాలతో  వినూత్నంగా చెప్పడం ముచ్చటేసింది.

‘స్వేచ్ఛ’ ఇవ్వాల్టి కవయిత్రి. అందుకే ఇలా రాయగలుగుతోంది. చాలా చిన్నచిన్న మాటల్లోనే లోతైన భావాల్ని చెప్పింది. ప్రకృతిలో మమేకమైంది. మానవ సంబంధాలన్నీ విధ్వంసమవడాన్ని  భరించలేక , మనుషులుగా కూడా మిగలకుండా , మానవత్వపు ఊట ఇంకిపోయి ఎడారి బతుకులుగా మిగిలిన వైనాల్ని చాలా స్పష్టంగా తన కవిత్వంలో చెప్పింది. చదువుతుండగానే కళ్ళు  చెమర్చి, మసకబారిన దుఃఖంతో నిండిన కవిత ‘ఎలా గుర్తు పట్టాలి ‘ –

సమ సమాజపు బడికి పోయిన బిడ్డలు

ఇంటికొస్తున్నారు

బిడ్డని  తల్లి గుర్తుపట్టి తెచ్చు కోవాలి

ఒక బిడ్డకి  రొమ్ములు కోసి వున్నాయి

ఇంకొకరికి  కళ్ళు పీకేసివున్నాయి

కాళ్ళు చేతులు, ఆఖరికి జననాంగాలు 

ఒంట్లో ఉన్న అవయవాలన్నీ

ఛిద్రమై పోయాయి

ఓయమ్మా! ఎట్ల గుర్తు పడతావే

బిగించిన  పిడికిలొక్కటే  గుర్తు

బిడ్డల ఆశయపు  దారెంట

గొంతు తెగినా పాట ఆగదు

దేహం గాయాల జల్లెడయినా

ఎరుపుకు మెరుపు  తగ్గదు

చాలా మామూలు మాటలతోనే విప్లవాభివందనం చేస్తూ  మెరుపు తగ్గదని హెచ్చరిస్తూ ,మొన్నటి వాస్తవ చిత్రపటాన్ని మనముందుంచింది.  గొప్ప జీవన తాత్వికతను  వెల్లడించిన కవితలు అనేకమున్నాయి.

‘జీవితపు అలికిడి’ కవితలో

ప్రేమంటే దొరికి పోయిన చేప

పరాధీన తరంగం కింద

కదిలే దొంగ అడవి

ఎగరాలంటే తేలాలి

రాతిముడి జారాలి

నా బరువునంతా  

ఆవిరి చేసుకు పో….

మనసుకూ తడికీ 

తెగతెంపులు చేసి

   ఇలాంటి ఆలోచనాత్మక పాదాల గుర్తులు పుస్తకం నిండా దాగివున్నాయి. ఎవరికి వాళ్ళు ఈ కవిత్వాన్ని అనుభూతిస్తూ చదువుకోవాల్సిందే.  జీవితంలో ఎదుర్కొనే శక్తినీ , ఆత్మవిశ్వాసాన్ని, పోరాడే తత్వాన్ని, కుంగిపోయినప్పుడల్లా, మళ్ళా మొలకెత్తేదీ  నేనే, నమ్మకమే మోసంచేసి  బతుకునుంచి లోయలోకి  తోసినప్పటికీ  పైకి నిలబడిందీ. నేనే,  అంటూ తనను తాను. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, చెట్టుపై తాత్కాలికంగా సేదతీరాలనుకున్నా, ఆ చెట్టుకూడా తానే నన్న ‘జ్ఞానస్పృహ’ ను కలిగిన చైతన్యం  ఈ కవయిత్రిలో వుంది.

స్త్రీల జీవితాల్లో వుండే ‘ద్విపాత్ర’ లధారణను కవిత్వీకరించింది.  మనుషులకోసం ఎంత  తండ్లాడినా  దొరకకపోవడంతో , పసితనపు సంద్రంలోనైనా దొరకొచ్చేమో అని సమాధానపడింది.  అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ కొన్ని చోట్ల ఇలా-

జలపాతపు  గొంతు పూడుకుపోయి

శిలల్లో  కరిగినట్టు

. తేమలో

కనురెప్పల  స్నానపు నాట్యం

నీ పాద పదాలకి  మిత్రమా….(క్షాళన)

మౌనంలో వుండే రహస్యాల్ని, తుఫానుల్నీ

మౌనసునామీ’ లో చూపించింది.

 

ఇంకొక చోట-

కనుకొలకుల తడిలోంచి  చూస్తే

కప్పుకుందే దుఃఖపు దుప్పటిఅనేస్తుంది అవలీలగా

దుఃఖమూ. నాలాంటిదే

ఒంటరిగానైనా ముందుకే పయనిస్తుంది

  దారి కొత్తదో, పాతదో

తోవంతా

కన్నీటి పూలే.

మనం ఇక్కడ ఆగి, దుఃఖ దేహ శరీరాన్ని  గురించి ఎంతైనా చర్చించుకోవచ్చు. ఒంటరిదుఃఖ దారిని సైతం కళ్ళముందుంచింది.  వేదనా స్వరంతో తాను రచిస్తున్న నేపథ్యాన్ని ఆ  క్షణాలను నిండుగా చేతుల్లోకి  తీసుకొని

ముద్దాడబోతే

అక్షరాలై 

అరచేతుల్లో తడిమి

గాల్లో కరిగి పోయాయి…….

‘ఎక్కడికి పోతానిప్పుడు’- లాంటి ఎన్నో కవితా శీర్షికల్ని చూసినప్పుడు ఆలోచనాత్మకంగా వుండి, కవిత గుండెను విప్పి చూపినట్లున్నాయి. మేఘమంత, మిణుగురు, పగిలిన జీవితం, దుఃఖపు తోట, నిన్ను తాకలేని రాత్రి , పునర్జన్మ, స్నేహితురాలు, పునర్జననం,   రేపటి సంభాషణ కోసం, అమ్మ నాన్న, ఓ  కోరిక, శ్వాస,  వెలితి, విన్నపం , కల, నగ్నంగా, మట్టిపూలగాలి వంటి కవితల్ని ఎవరికి వాళ్ళు మబ్బుల్ని చూస్తూ,  ఆకాశం కింద, గాలి మాట్లాడుతుంటే , చీకటి మిణుగురులను మోసుకొస్తుంటే,  తడి మేఘం కురిసి మనం. గడ్డకడ్తుంటే, ఒక్కో పుటలోని అక్షరాలకు  రక్త మాంసాలద్ది చదువుకుంటేనేగాని, తృప్తి మిగల్చని కవితలివి.

స్వేచ్ఛ కవిత్వంలో పదేపదే వస్తుండేవి- జ్ఞాపకాల పొరలు, మేఘం, దుఃఖపు రజను, వర్షం,  పసి చినుకులు, సముద్రం, కన్నీ్ళ్ళు, ప్రేమరాహిత్యపు వేదన, కలలు, అన్వేషణలు, కొండలు, ఆకాశం, విరహం, వేదన, ఆలోచన, భవిష్యత్ పోరాట జీవితాలు, నిర్ణయ ప్రకటనలు, పోరాటస్ఫూర్తి, అంతిమ విజయం  తమదేనన్న  విశ్వాస ప్రకటనలు పుస్తకమంతా వ్యాపించి వున్నాయి.

ఒకేసారి వందల తెల్లకోడి పిల్లల్ని. కాళ్ళకడ్డం పడేసినట్లు

అలల  నురగలతో

మాటిమాటికీ  బతిమాలుతోంది సముద్రం

అంటుందొకచోట-(అలలఒడ్డున)

వెన్నెట్లో, మబ్బుల వనంలో, దేహనావతో మనసు పలికే  ఆహ్వాన గీతాల్ని చివర్లో ఇలా…..

నీ కోసం మట్టి పూల గాలిని

దోసిట్లో పట్టుకొని ఎదురు చూస్తున్నా…..

త్వరగా వచ్చెయ్.

రాబోయే కాలంలో ఆనందాన్ని వర్షించే రోజుల్ని ఊహిస్తూ, కొంగ్రొత్త ఆశతో

అక్షర ఆయుధాన్ని ధరించి, బంగారు భవిష్యత్తును  కలం ద్వారా కలగన్న వర్తమానమిది.

కవిత్వం కల లాంటిది. కాంతి లాంటిది. భవిష్యత్ దర్శనమిది. నిద్రావస్థలో మానవత్వాన్ని  తట్టి లేపేది కవిత్వం. కరుణను కురిపించేది. కవిత్వం. బతుకును ఒడపోసి జల్లెడ పట్టేది కవిత్వం. బండలను కొండలను కరిగించే శక్తిగలది కవిత్వం. మృదుభాషిణులుగా మిగిల్చేది కవిత్వం. ఊహకు మెరుపై నిలిచేది కవిత్వం. భవితకు బాటసారై నిలిచేది కవిత్వం. బాధాగ్ని రేణువులకు స్వాంతన లేపనం  కవిత్వం. మనిషి దృక్కోణాల  వేదిక కవిత్వం.

ఇన్ని విధాల కవిత్వ స్పర్శను మనలో కలిగించి  ఒక మంచి పదాల కూర్పుతో అక్షర దేహధారియై మనముందుండి మనసుల్లో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన స్వేచ్ఛను  మనసారా అభినందిస్తున్నాను.

*

శిలాలోలిత

శిలాలోలిత

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • లోతైన పరిశీలనాత్మక విశ్లేషణ మేడం.

  స్వేచ్ఛగారి కవిత్వం భిన్నమైనది. ‘ ఎలా గుర్తుపట్టాలి ‘ కవిత సామాజికంగా ప్రజతో ఆమెకున్న గాఢత తెలుస్తుంది.
  ‘ జీవితపు అలికిడి ‘ కవిత సాధారణంగా అనిపించినా లీనమైతే దుఃఖం పురితం. జీవితంలోని బంధాలను గురించి సున్నితంగా చెప్పారు.

  ‘ ఒకేసారి వందల కోడిపిల్లల్ని కాళ్ల కడ్డం పడేసినట్లు
  అలల నురగలతో
  మాటిమాటికీ బతిమాలుతోంది సముద్రం ‘ వాక్యం చాలు ఒక మాటను, ఒక వాక్యాన్ని సరళంగా, పరిణతతో నేర్పుగా కవిత్వం చేయగల కలం ఆమెదని చెప్పడానికి.
  భిన్న వస్తువులను అలతి పదాలతో కవిత్వం చేస్తున్న స్వేచ్ఛగారికి అభినందనలు

  • మట్టిపూల గాలి…లో ఉన్న స్వచ్ఛమైన భావాలు….స్వేచ్ఛ….ను చాలా లోతైన స్వేచ్చావిశ్లేషణ చేశారు. మట్టిపూల గాలిని చదువుతున్నప్పుడు మనల్ని మనం స్పర్శించుకున్నట్లు… తప్పిపోయిన మనల్ని మనం కనుగొన్నట్లు అనిపించింది. మీ విశ్లేషణ… ఆ పూలగాలిలో మట్టి మొలకెత్తుతున్న ఆనవాళ్లను చూపించింది.

 • మట్టిపూల గాలి…లో ఉన్న స్వచ్ఛమైన భావాలు….స్వేచ్ఛ….ను చాలా లోతైన స్వేచ్చావిశ్లేషణ చేశారు. మట్టిపూల గాలిని చదువుతున్నప్పుడు మనల్ని మనం స్పర్శించుకున్నట్లు… తప్పిపోయిన మనల్ని మనం కనుగొన్నట్లు అనిపించింది. మీ విశ్లేషణ… ఆ పూలగాలిలో మట్టి మొలకెత్తుతున్న ఆనవాళ్లను చూపించింది.

 • Swecha …..swecha గా రాసిన …మెరుపులు ఉరుములే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు