1
కలలందం
కారుమబ్బులు కమ్ముకొస్తే
శిలను తాకు అలలందం.
మనసందం
గాలికి తెగిన గాలి పటం
స్వేచ్ఛ అందం.
పరుగందం
ఇక సీతాకోక, అవని కాదు
అందని ఆకాశమందం.
ప్రేమ అందం
ఎడారి మాటున తడారిపోయిన
నారుల నమ్మికమందం.
సహవాసమందం
సంద్రపు అలల సాహసం
కరిగినా వీడని తీరమందం.
కవనం అందం
ఎగిరే మినుగురులు, తలపులు
కలసి కాగితంపై వాలే తీరు అందం.
మట్టి అందం
మరుపెరుగని గురుతులందం
గురుతెరుగని మరుపు అందం.
***
2
సోది
కావాల్సిందల్లా సోది చెప్పడమే…
ఒక నాడది కొందరి జీవనోపాథి
ఈనాడు…అందరి జీవన దారి.
అమ్మాయికి చెప్పాలి…
గుండె గూటిలో వెలసిన దేవత తానని
ఈ మగజాతికి చెప్పాలి…
వేరు పురుషుడి ముఖమే చూసెరుగనని
ఆ నవజాతి కోవెలలో ముక్కోటి దేవతార్చనలు
ఈ యువనారీ కలువ కనులలో వేల పుప్పొడులు.
ఒక సంతకానికో చిన సాయానికో వాగాలి…
మునుసుబు ముత్తాత గారి పినమాంగారు
ఆ బాగున్న రోజుల్లో మా ఇంటెనుక పెదపాలేరు.
చుట్టం, రేపు పందిరి కింద చేరాలంటే…చాలు,
టీ కాఫీలు నంజుకి నాలుగైదు పొగడ్తలు
ముఖానికిచ్చెయ్ చిరునవ్వు
వీపుకెలానో విఱుపేగా.
సరసానికీ అవసరానికీ,
సాయానికీ సంబంథికీ,
కావాల్సిందల్లా…సోది.
మాటలే పరిచయాల ఖరీదు
అవసరాలే ఆఫ్యాయతల బేరీజు.
వాగితేనే తెలివి
లేకుంటే దద్ది.
పనుంటే మనోడు
లేకుంటే వాడెవడు.
ఇదే నేటి మను స్మృతి
మన స్ధితి అందరి గతి
***
3
సమాజం మాయపుటద్దం
ఆ మాయలో పడిన ప్రతిబింబం
నీ నా జీవన పయనం-పతనం
కనురెప్పల చాటున కలలు
తెలవారున కనులకు కన్నీరు
కలలు కలతలు కలలు కలతలు
కలలు కలలు కలలు కలలు
కలతలు…
తననెరిగిన వాడికెందుకు కల
కాలంతో ఈదుకపో కలతలేల
కలగన్న వాడు ఓడాడేమో కానీ
రేపన్నది తోచని వాడికెక్కడిది
గెలుపు ఓటమి
విన్నావా ఏం అడిగిందో జనం
కావాలంటారు కలలు కలలు
కలలు కలతలు
ఎందుకు? ఇంకేం చెప్పింది ఆ అద్దం
నీడని చూసి వెలుగునే మార్చే మాయపుటద్దం
*








Add comment