వేవ్స్

హారాష్ట్ర మధ్యలో కుంబే జలపాతం.. ఉదయం 6 గంటలకు..

“కాఫీ కలపాలా?”

“వద్దు. స్థిరంగా బాగానే ఉన్నా. ఎత్తులో కెఫైన్ ఊపిరాడనివ్వదు నాకు.”

కొంచెం దగ్గరగా జరిగి “ఈరోజు ఏంటో తెలుసా?” అని అడిగింది బార్బరా ఎదురుగా కూర్చున్న మేఘన వంక చూస్తూ. తెలుసు అన్నట్టు తలూపింది. “ఈరోజు ఏంటో తెలుసా?” అని కదిలిస్తూ ఇంకోసారి అడిగింది. తలెత్తి బార్బరాని చూసి “తెలుసు” అంటూ నవ్వింది మేఘన.

“ఇవాళ ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసా?” అని చుట్టూ సందడి నిండిన వాతావరణాన్ని గమనిస్తూ బార్బరా గుర్తు చేస్తే, “తెలుస్తుంది” అంటూ కళ్లు పెద్దవి చేసి మరోసారి నవ్వింది.

“చేయగలవా?”

“కచ్చితంగా..”

“మరి పట్టుదల?”

“కావలసినంత ఉంది.”

ముందుకొచ్చి తన కుడి మోకాలిపై కూర్చుని మేఘనని తాకుతూ “జరిగిందంతా మర్చిపోవడానికో, లేక కిందకి దిగాక కొత్త దిక్కులు వెతుక్కోవడానికో నువ్వు ఇక్కడికి రాలేదని గుర్తుపెట్టుకో మేఘా!” అని తనవైపు సూటిగా చూస్తూ, “ఇంతకుముందు కింద చేసింది కాదు ఇవాళ పైన చేయబోయేది. అనుమానాలు, భయాలు అన్నిటినీ మించి నీకున్న ఆవేదనని పక్కనపెట్టి నాతోరా!” అంది.

కదలలేదు. కనీసం సమాధానమైనా ఇవ్వలేదు మేఘన. వచ్చిన మూడో రోజే తను కిందున్న రోప్ మీద అలవోకగా నడిచినా, ఎత్తుల్లో నడవడానికి ముందు కుదురుగా నిల్చోవడమే అక్కడ పెద్ద సమస్య అని తెలుసు తనకి. మేఘన ఆలోచనంతా అక్కడ లేదు. తన ప్రయాణం కొద్ది రోజుల్లో ముగుస్తుందన్న భయమో, లేక తిరిగి తేరుకున్న జ్ఞాపకాల్లోకే మళ్ళీ వెళ్లాలన్న వణుకో మరి! అవన్నీ కలిసి తనని బార్బరాతో చెక్ పాయింట్ అంచుకి నడవకుండా ఆపుతోంది.

ఎవరో రాత్రి పెట్టిన చలిమంట చుట్టూ చిందులేస్తూ పాడుతుంటే తల తిప్పి చూసింది. ఆ సెగ వెనుక క్యాంప్ వైపు మొదటిసారి నడిచొస్తున్న కొందరు కనిపించారు. గుంపులో అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టుంది. మాటలు, అరుపులు, పరిగెత్తే ఆటలు అన్నీ తన వయసున్న వారివే. ఈ ముప్పై రోజుల క్యాంప్ ఇక ఎన్నేళ్లయినా మర్చిపోలేమేమోనన్న ఉత్సాహం అందరిలో కనిపిస్తోంది. కొందరికి ఇది ఏళ్ల నుంచి ఎదురుచూసే కల అయితే, ఇంకొందరికి నిన్నగాక మొన్న తెలుసుకున్న కుతూహలం. ఏదేమైనా..మహానగరాలకి దూరంగా, భూమి నుంచి భయపడే ఎత్తులో, ఇంటర్నెట్ వదిలి ఇన్ని రోజులు గడపాలన్న సరదా అందరిలో ఉన్నట్టుంది. కళ్లు చెదిరే అందాలున్న కొండ మీదికి పరుగు పరుగున వస్తున్నారు.

అందరి ఆసక్తినీ గమనిస్తున్న మేఘన ఆ దారిలోనే మొదటిసారి నడిచొచ్చిన తన రోజుని గుర్తు చేసుకుంది. అలసిపోయిన ఒంటితో బార్బరా తనని మీదికి నడిపిస్తుంటే, అడుగడుగునా పడుతూ లేస్తూ దెబ్బలతో ఇక్కడ పడుకున్న మొదటి రాత్రి అది. ఎక్కడ మునిగినా బయటపడి బతకాలన్న తన బలమే ఆ రాత్రి తనని ఇక్కణ్నుంచి కిందకి దూకకుండా ఆపిందని బాగా గుర్తొచ్చింది తనకి. ఇన్ని రోజులకి, ఇంత సాహసానికి..వీళ్లిద్దరి ప్రేమకి ఇంకా తేరుకోకపోతే ఇక్కడికొచ్చి అర్థమేంటని బార్బరా వైపు చూసి తనని లేపి కౌగిలించుకుంది మేఘన.

“నిలబడ్డా, కిందపడ్డా..మళ్ళీ లేచి ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తావని నమ్ముతున్నా” అని బార్బరా తన చెవిలో చెప్పిన మాట మేఘనకి ఇంకాస్త ధైర్యాన్నిచ్చింది. కళ్లు మూసుకుని విడవకుండా అలాగే కౌగిలించుకున్న తన భుజం మీద చెయ్యేసి “Freshmen are here” అని అందరి వంకా చూపిస్తూ అంది టిఫ్ఫనీ.

***

ముప్పై మంది ఉన్న ఆ గుంపుని మూడు పదులుగా విభజించి నిల్చోబెట్టారు బార్బరా, టిఫ్ఫనీ. అనుకున్నట్టుగానే పదిహేను రోజులుగా క్యాంప్‌లో ట్రెయిన్ చేస్తున్న ‘వర్టిగో’ బ్యాచ్ అందర్నీ చెక్ పాయింట్ వైపు నడవమని చెప్పింది టిఫ్ఫనీ. అందరితోపాటు కదులుతున్న మేఘనని ఆగమని టిఫ్ఫనీ చెవిలో “Just fix their body gear and come back” అంది బార్బరా. అర్థంకాక ఆలోచిస్తున్న టిఫ్ఫనీ వంక చూస్తూ మళ్ళీ “let them experiment” అని నవ్వి తనని పంపించి, ఫ్రెష్ మెన్ వైపు తిరిగింది.

మొదటిరోజు ఏం జరగబోతుందా అన్న ఆత్రుత అందరిలో ఉన్నట్టుంది. విడిపోయిన గుంపులు మళ్ళీ ఒక్కటై మాటలతో ఆపుకోలేని ఉత్సాహాన్ని బయటపెడుతున్నారు. ఆ గుంపుని, ఆ అల్లరిని, ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువ ఉన్న ఆ బ్యాచ్‌ని చూస్తుంటే బార్బరాకి ముచ్చటేసింది. అందరినీ గమనిస్తూ మేఘనని దగ్గరగా లాక్కొని, “ఈ పదిహేను రోజులు ఈ బ్యాచ్ నీదే మేఘనా! భూమ్మీద నిల్చొని నడవడం తెలిసిన వీళ్లందరూ బాడీ గెయిర్‌తో గాల్లో నడిచేదాకా నీదే బాధ్యత” అని నవ్వింది. తిరిగి తన జవాబేంటని కూడా వినకుండా నవ్వుతూనే మేఘనని వాళ్ల ముందుకి తోసింది.

బార్బరా చురుకు అసహజంగా ఉన్నా తన ఆలోచనల దూరం వేరు. మేఘనను చూసిన మొదటి రోజు నుంచి తన జీవితాన్ని యథాస్థితికి తీసుకురావాలన్నదే బార్బరా పట్టుదల అంతా. రోజుల కొద్దీ ఏడుస్తూ కుంగిపోయే మేఘనని చూసి తట్టుకోలేక ఎన్నిసార్లు తను కంటతడి పెట్టుకుందో టిఫ్ఫనీకి మాత్రమే తెలుసు. నాలుగేళ్ల ప్రేమని రెండేళ్లుగా తలుస్తూ ఒంటరిగా బ్రతికే తనని చూసిన ఆ క్షణం బార్బరా ఎప్పటికీ మర్చిపోలేదు. తన ముప్పై ఏళ్ల వయస్సులో మేఘనని మించిన దురదృష్టవంతురాలైన అమ్మాయిని చూసుండదు బార్బరా. అనాథగా పద్దెనమిదేళ్లు పెరిగింది మేఘన. ప్రేమ అంటే తెలియని జీవితం తనది. ఒకానొక ఉదయాన పరిచయమైన అతను, నాలుగేళ్లు పలకరించి ఇంకో అర్ధరాత్రికి తనని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయిన వేదన మేఘనది.

అతణ్ని మర్చిపోయి ముందుకెళ్లలేక, కూర్చొని ఏడవలేక, ఏడుస్తూ బ్రతికే ఓ పూట ఓ చీకట్లో తన భుజం తట్టి ఏళ్ల తర్వాత మాట్లాడిన మొదటి వ్యక్తి బార్బరా. తాకిందే మొదలు, తన కళ్లు తుడుచుకుని బార్బరాతో బయలుదేరింది మేఘన. ఇద్దరి ఈమాత్రం ప్రయాణానికే మరి ఇంతమందిని మేఘన ట్రెయిన్ చేయగలదా అన్న అనుమానం లేకపోలేదు బార్బరాకి. అయినా గడిచిన పదిహేను రోజుల్లో గంటల తరబడి ఇష్టానికి తన ఒంటిని ట్రెయిన్ చేసుకున్న తీరుని చూసి నమ్మక తప్పలేదు. భయపడి వెనక్కు తిరుగుద్ది అనుకుంటే ఇంకొక అడుగు ముందుకేసి అందర్నీ పలకరిస్తున్న మేఘనని చూసి ఆశ్చర్యపోయింది బార్బరా. నవ్వుకుని వెనక్కు తిరిగి ఒకసారి తన వెనుక చూసిన మేఘన, కిందున్న రోప్స్ నుంచి మూడింటిని చేతిలోకి తీసుకుని మొదలెట్టింది.

***

“హైలైన్ కమ్యూనిటీని వెతుకుతూ వచ్చిన మీ అందరికీ వెల్కమ్! మహారాష్ట్ర మూలన హైలైనింగ్ అనే ఒక బ్రహ్మాండం దాగుందని ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. విచ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఇది వినడానికి మీకు వింతగా ఉన్నా, నన్ను నమ్మండి. హైలైన్ స్పోర్ట్ అనేది కొండల మధ్య బాడీ గెయిర్ వేసుకుని రోప్ మీద నడవడం మాత్రమే కాదు. వెయ్యి అడుగుల ఎత్తులో నడుస్తున్నప్పుడు నీకొచ్చే కిక్ కొన్ని క్షణాలే అయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ దొరికే హైస్ అన్నిటినీ అనుభవించే మాయ కిందకి దిగాక ఇక్కడ మన మధ్యే ఉంది. ఇక్కడ మనకు పరిచయమై, మనతోనే నడుస్తూ, మన మధ్యే అన్నీ పంచుకునే ఈ చిన్న కమ్యూనిటీలోనే ఆ హైస్ ఇచ్చే కిక్ అంతా ఉంది. నువ్వు కిందపడకుండా కాళ్లని బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకు నడవాలో చెప్పే నీ ట్రైనర్, పడితే మళ్ళీ లేచి తాడుపై లేచి నిల్చోవాలో అరుస్తూ ఊరించే ఇక్కడి స్నేహితులు, దెబ్బలతో తిరిగివస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుకునే నీ ఫిజీషియన్.. ఒక్కరని కాకుండా, నీకు అక్కడ దొరికే హైస్ అన్నీ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఇంకా చెప్పాలంటే..గాల్లో నిల్చున్న నీ గెలుపు భూమ్మీదున్న మా అందరి సొంతం. నిజానికి ఇదే మొదటిసారి అని కంగారుపడకుండా, కొండంత ఉత్సాహంతో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు భయమేస్తోంది” అని నవ్వింది మేఘన.

“నా వెనుక నిలుచున్నది బార్బరా! వర్టిగో బ్యాచ్‌ని అటు చెక్ పాయింట్ వైపు తీసుకువెళ్లింది టిఫ్ఫనీ. గుర్తుపెట్టుకోండి! ప్రపంచమంతా తిరిగినా ఇలాంటి ఇద్దరినీ మీరెక్కడా చూసుండరు” అని వెనక్కు తిరిగి ఇంకాస్త నవ్వుతూ, “ఒకవేళ చూసినా ఈ ఇద్దరు మనకు పంచే గొప్ప స్పిరిట్, ఇద్దరికీ ఈ స్పోర్ట్ పైనున్న పిచ్చి, ఒక్కొక్కరినీ ట్రెయిన్ చేసే ఓపిక మాత్రం కచ్చితంగా మీకెక్కడా దొరకదు” అని తిరిగి బార్బరా పక్కనొచ్చి నిల్చుంది.

తన భుజం మీద బార్బరా చెయ్యేసుకొని, తననే చూస్తూ “పదేళ్ల ముందు కన్న ఓ తీయని కలను ఏడు వేల మైళ్లు దాటొచ్చి ఐదేళ్లుగా మా అందరికి చూపిస్తున్న నీకు, టిఫ్ఫనీ కి ఇదే నా ముద్దు” అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టింది. అందరితో గట్టిగా “మహారాష్ట్రా! ఇక మొదలెడదామా?” అని అరిచింది. మేఘన జోరు టీమ్‌లో అందరినీ తాకినట్టుంది. ఒక్కొక్కరిగా ఒకరిని చూస్తూ ఇంకొకరు ‘హైలైన్..హైలైన్..హైలైన్..’ అంటూ అరవడం మొదలుపెట్టారు.

తన ముందు జరుగుతున్న ఆ సందడిని చూస్తుంటే నమ్మలేకపోయింది బార్బరా. స్టార్ట్ చేసి మూడేళ్లు దాటినా, ఫ్రెష్ మెన్ నుంచి అలాంటి ఎనర్జీ ఎప్పుడూ చూసింది లేదు. హైలైన్‌పై నడిచి తిరిగి తన క్యాంప్‌కి వచ్చే అథ్లెట్స్ తప్ప రోప్ కూడా సరిగ్గా ఎక్కడం తెలీని ఫ్రెష్‌మెన్ అరిచే ఆ అరుపులకి మతిపోతోంది బార్బరాకి. తను చూస్తుంది మేఘననేనా? భయం వదిలి, నిన్నటి ఏడుపు పక్కనపెట్టి, అదిరిపోయే హంగుతో అందరినీ ఆడిస్తోంది తనేనా అని నమ్మలేక ఆగిపోయింది ఒక్క క్షణం.

అరుస్తున్న అందరినీ నెమ్మదించిన బార్బరా చెక్ పాయింట్ దిక్కు చేయి చూపిస్తూ “ఆ దారిలో ఒక కొండ దాటితే కనబడుతుంది మీరు నడవబోయే హైలైన్ రోప్. ఇక్కడి నుంచి నడిస్తే ముప్పై నిమిషాలు. కానీ కిలోమీటర్ పొడవున్న అక్కడి రోప్‌పైన నడవాలంటే మాత్రం మీకు ఇక్కడ పదిహేను రోజుల ట్రైనింగ్ పట్టుద్ది. To be honest, I need a promise from you all before we start training” అని ఆగి మేఘనని చూసి, “అదేంటో నీ టీమ్‌కి నువ్వే వివరించు” అని తన చేతిలో ఉన్న ఫ్లాగ్స్ చూపించింది బార్బరా.

కోతుల్లా కలిసిపోయిన గుంపుని మళ్ళీ జట్లుగా విడగొట్టి మూడు రంగులున్న ఫ్లాగ్స్‌ని అందరికీ చూపిస్తూ “ఈ ఫ్లాగ్సే తను మీ అందరి నుంచి అడిగే ప్రమాణం” అంటూ తిరిగివస్తున్న టిఫ్ఫనీ వంక చూసింది మేఘన. “పది మంది ఉన్న ఒక్కో టీమ్‌కి ఒక్కో కలర్ ఫ్లాగ్స్ ఇస్తాం. టీమ్‌కి పదిమంది మాత్రమే ఉండాలన్న పట్టుదలేం లేదిక్కడ. మీ ఫ్రెండ్సో, మీకు పరిచయమైన వ్యక్తో ఇంకో టీమ్‌లో ఉంటే, మీరు ఆ టీమ్ కలర్ ఫ్లాగ్‌ని మా దగ్గర్నుంచి తీసుకుని అందులోకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. కొంతమంది ఒక్క మాటతో ఎదుటి వ్యక్తితో కలిసిపోతే, కొంతమంది పరస్పరం కొన్ని ఇష్టాలు కలవందే కలిసిపోలేరు. కొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డా తమ వ్యక్తిత్వాన్ని పంచుకోలేరు. అదో బలహీనత. నాలాగే!” అని ఆగింది.

మళ్ళీ మొదలుపెడుతూ “అలా ఎవరైనా మిగిలిపోతే వారితో ఒక్కరైనా చివరివరకు ఉండాలన్నదే మా ఆలోచన. మనం గెలిస్తే అరిచి గోల చేసే స్నేహితుడు ఒక్కరైనా తోడుంటే ఎవరికి నచ్చదు! ఈ హైలైన్ వెతుక్కుంటూ వచ్చిన మీ అందరి నుంచి బార్బరా, టిఫ్ఫనీ అడిగే ప్రమాణం ఇదొక్కటే. Befriend at least one of us here and make their adventure unforgettable I say!” అంటూ తన చేతిలో ఉన్న ఫ్లాగ్స్ అందరికీ పంచడానికి ముందుకెళ్లింది. ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆ కొండ మీద ఫ్రెష్‌మెన్ గోల మళ్ళీ మొదలయ్యింది.

జరిగేదంతా మౌనంగా గమనిస్తూ బార్బరా పక్కకొచ్చి నిల్చున్న టిఫ్ఫనీ మేఘనని, తన చుట్టూ పెరిగిన సందడిని చూస్తూ నమ్మలేక నవ్వుతోంది. ‘ఇంత సేపు మాట్లాడింది మేఘనేనా?’ అని కళ్లతోనే అడిగింది బార్బరాని. తనని మరింత ఆశ్చర్యపరిచేలా మేఘన అందరితో ‘హైలైన్.. హైలైన్’ అంటూ ఇంకోసారి అరిపించడం మొదలుపెట్టింది.

ఉక్కులాంటి బార్బరాని కన్నీళ్లతో కరిగించిన మొదటి వ్యక్తి మేఘన. పదిహేను రోజులకి ఇవాళ పట్టరాని సంతోషంతో పరిగెడుతున్న తనవైపు అడుగైనా నడవకుండా ఆ ఇద్దరూ తననే చూస్తూ నిలబడ్డారు. ఇంకొక క్షణానికి టిఫ్ఫనీ బార్బరాతో “Can you believe her?” అంది నవ్వుతూ.

“Dancing her heart out in the day and drowning in an ocean of grief by night, Fucking unbelievable!” అంటూ బార్బరా వైపు తిరిగి, “what we have been doing and what we have with us is pure magic, isn’t it?” అని అడిగింది.

మురిసిపోతూ మేఘనను చూస్తున్న బార్బరా తన చెల్లి వైపు తిరిగి “Yes it is Tiff! Magic..it is indeed” అంది.

***

కొన్ని వారాల ముందు.. చంద్రభాగ బీచ్, జోరు కేఫ్, కోణార్క్..రాత్రి ఏడు గంటలు

“ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ రావడానికే రెండేళ్లు పట్టింది టిఫ్! మర్చిపోయావా?”

“It’s our start, B! మూడేళ్లలో ఎంత దూరం వచ్చామో గమనించావా? స్టేట్స్ నుంచి వచ్చిన కొత్తలో ఇలానే ఆలోచించి ఉంటే హైలైన్ ఇంతమందికి తెలిసేదా? మనల్ని నమ్మి ఇంతమంది మనతో నడిచేవారా? వెస్టర్న్ ఘాట్స్‌లో ఎంత సత్తా ఉందో, ఈస్టర్న్ ఘాట్స్‌లోనూ ఉంది. వెతికితే దొరకని కొండలా మనకి రోప్స్ వేయడానికి? దగ్గర్లో ఖల్లికోటె అడవుంది. ఒక వారం వెతికి చూద్దాం! దొరక్కపోతే మహేంద్రగిరి వైపు నడుద్దాం” అంది బార్బరా ముందు కూర్చున్న టిఫ్ఫనీ.

“వెస్టర్న్ ఘాట్స్ వదిలి ఇక్కడే ఎందుకు?” అడిగింది బార్బరా.

“ఇక్కడే అన్న పట్టుదలేం లేదు నాకు. మహారాష్ట్ర కింద కర్ణాటక అయినా..అడుగునున్న కేరళ అయినా.. ఇంకెక్కడైనా పర్లేదు. స్టేట్‌కి కనీసం ఒక్క చోటైనా హైలైన్ ఉండాలన్నదే నా ఆలోచన” అని చుట్టూ చూస్తూ, “ఇది ఇండియా బీ! వెతికితే వంద కిలోమీటర్లకి ఒక భాష మాట్లాడే మనుషులు ఎదురుపడతారు. కొందరికి హైలైన్ అంటే అపరిచితులతో చేసే అడ్వెంచర్. ఇంకొందరికి ఇది ఫ్రెండ్స్‌తో పొందే సరదా. ఇండియాకి కొండలు కరువా? మనకి రోప్స్ కరువా? ఆలోచించు. మజా వస్తుంది బీ” అంది ఉత్సాహంగా.

“టిఫ్! బేబ్స్! నువ్వన్నది బాగుంది. కానీ ముఖ్యమైన మూడు విషయాలు మర్చిపోతున్నావు. నీకు వేరే చెప్పాలా?” అని తన చేతికున్న చివరి మూడు వేళ్లను చూపించింది బార్బరా.

“ఏంటవి?”

“ఒకటి. పూర్తిస్థాయిలో అడవి వాతావరణాన్ని పరిశీలించి క్యాంప్ సిద్ధం చేయాలంటే దాదాపు మూడు నెలలు పట్టుద్ది. రెండు..అధికారుల నుంచి అనుమతులకు ఇంకో ఆర్నెల్లు. ఇక మూడోది..అన్నిటికంటే ముఖ్యమైంది. మనల్ని మించి లైన్స్ అండ్ రోప్స్ తెలిసుండి, మన ఆలోచనలతో పూర్తిగా కలిసే వ్యక్తి దొరకాలంటే కష్టమేమో?” అంది.

“We’ll employ, what’s the big deal?” అంటూ వచ్చిన రెండు కాఫీల్లో ఒకటి బార్బరాకి ఇచ్చింది. కాసేపు మౌనం.

టిఫ్ఫనీ వైపే సూటిగా చూస్తూ “మనం విచ్చలవిడిగా పెంచడానికి హైలైన్ ఏమీ కార్పొరేట్ కాదని నీకు మళ్ళీ గుర్తుచేయాలా? ఇంకొకరికి ట్రైనింగ్ ఇవ్వాలంటే రోప్స్ అంటే నీకున్న పిచ్చిలో సగమైనా ఉండాలి. అయినా ఐదేళ్లకు కాంట్రాక్ట్ తెచ్చుకునే ఎంప్లాయికి, అరవై ఏళ్లు మనతోనే ఉండే మనిషికి తేడా లేదా? ఈ కమ్యూనిటీ పెంచాలన్నా లేక ఇంకో చోట రోప్స్ వెయ్యాలన్నా జీతం తీసుకునే ఎంప్లాయిస్‌ని కాదు మనం వెతకాల్సింది. మనల్ని నమ్మి హైలైన్‌ని ప్రేమించే ఓ అభిమాని కావాలి మనకు” అంటూ సముద్రం వైపు తిరిగి చల్లారుతున్న కాఫీ తాగడం మొదలెట్టింది బార్బరా.

కాసేపటికి..

“వందమందిని అలా ఒక్క చోట చూడటానికి నా రెండు కళ్లు సరిపోలేదు ఇవాళ” అంటూ టిఫ్ఫనీ వైపు తిరిగి, “ఇందాక నాటకం మధ్యలో ఆ ఐదుగురు ఇత్తడి పళ్లెంపైన నిల్చోని నాట్యం చేశారు గుర్తుందా? అదేంటో తెలుసా నీకు?” అని అడిగింది బీ.

“తరంగం” అంటూ బార్బరా వెనుక ఎవరో తెలిసిన ముఖాన్ని చూసింది టిఫ్ఫనీ. తనేనా?

“తర.. ఏంటది?” అని మళ్ళీ అడిగింది.

“తరంగ నృత్యం అయివుంటుంది బహుశా! కూచిపూడిలో నా అర్ధజ్ఞానానికి తెలిసి ముఖ్యమైనవి మూడుంటాయి బార్బరా. న్రిట్ట అంటే స్వచ్ఛ నాట్యం. న్రిత్య అంటే అభినయ నాట్యం. నాట్య అంటే నాటక నృత్యం. దీని అర్థాలు, పర్యాయపదాలు ఇంకా తెలుసుకోవాలంటే నీ వెనకున్న నాట్యమయూరిని అడుగు” అంటూ బార్బరా వెనుక ఒంటరిగా కూర్చొని సిగరెట్ కాలుస్తున్న మేఘనని చూపించింది టిఫ్ఫనీ.

‘తను తనేనా?’ అన్న కాసేపటి అనుమానానికి అర్థమయింది బార్బారాకి తనెవరో, తనని ముందు ఎక్కడ చూసిందో. తిరిగి టిఫ్ఫనీ వంక తిరిగి “అక్కడ నాట్యం చేసిన ఐదుగురిలో మొదటి వ్యక్తి తనే కదా!” అంటూ, “What a contrast!” అని నవ్వుకొని తన కాఫీ ముగించింది బార్బరా.

మేఘనని మౌనంగా చూస్తున్న టిఫ్ఫనీకి బార్బరా చివరిమాట, తన నవ్వు అర్థంకాక “కాంట్రాస్ట్ ఏంటి బీ?” అని అడిగింది. ‘తెలీట్లేదా నీకింకా’ అన్న చూపుతో బార్బరా “సిగరెట్స్ అండ్ కూచిపూడి?” అని తిరిగి మేఘనని ఇంకోసారి చూసింది. “Dancing at dawn and smoking at dusk. ఇది కూడా ఓ గొప్ప వ్యక్తిత్వమా?” అని ఇంకోసారి నవ్వింది.

“గొప్ప వ్యక్తిత్వాలకి మూడన్నర ఇంచుల సిగరెట్స్‌కి సంబంధం ఏంటి?” అడిగింది టిఫ్ఫనీ.

“వందల ఏళ్ల చరిత్ర ఉన్న కూచిపూడిని తను ఏమాత్రం గౌరవించినా, ఇలా సిగరెట్స్ కాలుస్తూ తన కెరీర్‌ని అవమానించుకోదు” అంది బార్బరా.

“కూచిపూడినే తన కెరీర్ అని నీ చెవిలో చెప్పిందా?” అన్న టిఫ్ఫనీ ప్రశ్నకు బార్బరా ఆశ్చర్యంతో, “ఉదయం తన నాట్యం చూసి కూడా నీకింకా అనుమానమా?” అని నవ్వుకుని మేఘనని మళ్ళీ చూడటానికి వెనక్కు తిరిగింది.

***

(పన్నెండు గంటల ముందు) కోణార్క్ సూర్య దేవాలయం, ఉదయం ఏడు గంటలు.

సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కుకు నమస్కరించి మొదలెట్టిన ‘కృష్ణ తరంగ – పంచనాటకం’ వందమంది సమూహంతో గంటసేపు జరిగింది. పదమూడో శతాబ్దంలో నరసింహదేవ నిర్మించిన ఈ ఆలయం నాట్యానికి పెట్టింది పేరు. నాట్యం, నర్తకులు, సంగీతకారులు అంటూ శిల్పాలపైన ప్రతి రాయి నృత్యరూపాల్లో కనిపిస్తుంది.

పదేళ్లు తను ఆశ్రమంలో నేర్చుకున్న ఒక సాయంత్రపు సరదాని ఆ రోజు వేలమంది మధ్య ప్రదర్శిస్తుందని మేఘన కూడా ఊహించి ఉండదు. నందోత్సవం(కృష్ణుడి జన్మం)తో మొదలైన నాటకం, గోవర్ధన లీల(గోవర్ధన పర్వత కృష్ణ కథ), భామాకలాపం (సత్యభామ అభినయం), రాసలీల(గోపికల ఆట) అంటూ విశ్వరూప దర్శనం(కృష్ణుడి బ్రహ్మాండరూపం)తో ముగిసింది. అర్ధరాత్రి మొదలు..నాట్యానికి ముందువరకు తనని వెంటాడిన ఓ బరువు ముగిసిన మరుక్షణానికి కన్నీళ్లుగా తన నుంచి పారిపోయింది. బరువంతా జరగబోయే నాటకం కంటే ఎక్కువ తన భుజాన చెయ్యేసి ‘నువ్వు చెయ్యగలవ్’ అన్న ధైర్యాన్నిచ్చే మనిషి లేడే అన్న వేదన మేఘనది.

దేవస్థానం మధ్యలో జరిగే నాటకాన్ని చూడటానికి వేలమంది గుమిగూడారు. అందరి తోపులాటని తట్టుకొని మరీ నాట్యాన్నంతా చూశారు బార్బరా, టిఫ్ఫనీ. కలిసి ఉన్న సమూహం కథల్ని అనుసరిస్తూ, విడిపోతూ, తిరుగుతూ చేసే నాట్యాన్ని చూసి విస్తుపోయారు విదేశీయులు. భాగాలుగా మొదలెట్టి నాటకాన్ని అందరితో ముగించినా, మధ్యలో జరిగిన భామాకలాపం, తరంగం, చివర జరిగిన విశ్వరూప దర్శనం మాత్రం వరుసలో ముందు నిలుచున్న ఐదుగురు మాత్రమే చేశారు. నీలిరంగు చీరలు కట్టుకున్న ఆ ఐదుగురి నడుమ నిలుచున్న మేఘన చీర గంధం, బంగారు వర్ణం పట్టులో మెరిసింది. కోటి కాంతుల మధ్య తను చేసిన ‘భామాకలాపం’ ఒక అద్భుతమని పొగడటం అతిశయోక్తి కాదు.

***

మూడు జతల బట్టలున్న బ్యాగ్‌తో తను ఇంటి నుంచి బయలుదేరి ఆరు నెలలు దాటింది. కిందపడితే జాలిపడే తోడు కూడా లేకుండా అనాథగా పెరిగిన మేఘనకు ఇవాళ తడుస్తూ, జడుస్తూ, దారులు వెతుక్కుంటూ అర్ధరాత్రులు ఒంటరిగా తిరగడం పెద్ద ఇబ్బంది కాదు. తిరిగి రమ్మనడానికి తనకున్న ఏకైక పరిచయం కూడా తనని వదిలి వెళ్లి రెండేళ్లు దాటింది. పొద్దుటికి తిరిగి వస్తాడని రాత్రులు ఏడుస్తూ పడుకున్నా, మేఘనని చూడటానికి ఇంకెప్పుడూ రాలేదు అతను. ఆరింటికి దెబ్బలతో ఆస్పత్రిలో చేరి..పన్నెండుకు ముందే ప్రాణాలు వదిలేసినవాడు మళ్ళీ తిరిగి ఎలా వస్తాడు?

పది నెలలు బాగా ఏడ్చి అంతలా వాణ్ని గుర్తుపెట్టుకోవడానికి ఏముందని ఒకరోజు అలిసిపోయి ఆలోచిస్తే, ఇరవై ఆరేళ్ల తన జీవితంలో నాలుగేళ్ల వాడి ప్రేమ, నలభై నెలల ఇద్దరి సహజీవనం గుర్తొచ్చింది. మరో ఆరునెలలకి.. కలిసున్నంత మాత్రాన అతణ్నే తలుస్తూ ఇంకెన్నేళ్లు కూర్చోవాలని కాస్త విసుక్కున్నా, తనతో ఆడుకొని, ముద్దాడి, దగ్గరగా పడుకోబెట్టింది అతను కాక ఇంకెవరని ఇంకాస్త ఏడ్చింది. రాత్రులు తలుచుకొని ఉదయానికి వదిలేసే విషాదం కాదు తనది. అయినా తేరుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న తపనతో బయలుదేరింది. ఆ తపనే తనని ఆరు నెలలకి పూరీ దాటించి కోణార్క్ వైపు నడిపింది.

రాత్రికి చేరుకొని ఉదయాన్నే మొదలెట్టిన ఆ నాటకం, అందునా తన ముఖాభినయాలు, ఆ తల కదలికలు, ఆ వేళ్ల వర్ణింపులు, రాగానికి తగ్గ నాజూకు అడుగులేస్తూ కడుపులో ఉన్న బాధ కంట్లో కనిపించకుండా చేసిన ఆ నృత్యం వర్ణనాతీతం. వేదిక మీదున్న వందమందిలో ఐదుగురు కనిపిస్తే.. ఆ ఐదుగురిలో తనని మాత్రమే అక్కడున్న వేలమంది..ఆ ఇద్దరు విదేశీయులు చూశారు. ఇన్ని కళ్లు తన నాట్యాన్ని చూసి సంభ్రమించినా, ఒక్కరైనా తనని తాకి తనవాడిలా హత్తుకోలేదన్న బాధే సాయంత్రానికి మళ్ళీ తనది కానీ దారిలో తనని నడిపింది.

***

వెనక్కు తిరిగి మేఘననే చూస్తున్న బార్బరాని “నీ ఇబ్బంది తను సిగరెట్ తాగడమా లేక కూచిపూడి చేయడమా?” అని అడిగింది టిఫ్ఫనీ. చినుకులు మొదలయ్యాయి. కడలి నుంచి వచ్చే ఈదురుగాలి తోడుకి చినుకులు ఇంకాస్త చలిగా ఇద్దరినీ తాకుతున్నాయి. జల్లుల మధ్య సముద్రం చేస్తున్న శబ్దం భయపెడుతున్నా బార్బరా చూపు ఇంకా మేఘన పైనే ఉంది. జడివానగా మారుతున్న చినుకుల్ని చూస్తూ టిఫ్ఫనీ “బార్బరా! లోపలికి వెళదామా?” అని తనని కదిలించింది.

తిరిగి టిఫ్ఫనీతో ఏదో అడగలేక ఆగిపోయిన బార్బరా ఒక్క క్షణం జోరైన వాన వైపు, దాన్ని పట్టించుకోని మేఘన వైపు చూసింది. వేల మంది మధ్య నాట్యం చేస్తూ వెలిగిపోయిన ఆ ముఖమేనా ఆ మూల ఒంటరిగా తడుస్తుందని నమ్మలేక నిలుచుంది బార్బరా. సఫారీ బ్యాక్‌ప్యాక్ భుజాన వేసుకొని టిఫ్ఫనీతో కదులుతున్న తన చూపు ఇంకా వెనుకున్న ఆ మనిషి మీదే ఉంది.

వర్షం విరుచుకుపడుతున్నా, చల్లటి గాలి వణుకు పుట్టిస్తున్నా, అంటించిన సిగరెట్ కాలుస్తూ అడుగైనా జరగకుండా మేఘన అక్కడే కూర్చుంది. మైళ్ల దూరం నడిచొచ్చిన తన కాళ్లు ఒకవైపు అలసటనిస్తే, రెండేళ్ల తర్వాత పెట్టుకున్న పారాణిని, కట్టిన గజ్జల్ని చూడటానికి అతను లేడన్న బాధ ఇంకోవైపు తుంచేస్తోంది మేఘనని.

 

లోపలికి నడుస్తూ తడుస్తున్నా లెక్క చేయని మేఘనని చూసిన బార్బారా, ఆశ్చర్యాన్ని వదిలి తన కథేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. టిఫ్ఫనీ మాట ‘కాల్చే సిగరెట్ తన వ్యక్తిత్వాన్ని చెబుతుంది’ అన్న ఆలోచనకి ఆగిపోయిన బార్బరా మేఘన వైపు అడుగులేసింది. ప్రస్తుతాన్ని కోల్పోయి సముద్రాన్ని చూస్తున్న ఆ కళ్లని తనతోపాటు కొండల అంచుల్లోకి తీసుకువెళ్లాలని ఆరాటపడుతోంది బార్బరా. ఆలోచనల దూరాలకు హద్దులే లేవని తెలిసిన వ్యక్తి తను. కొందరు మాటలతో బయటకి వస్తే, ఇంకొందరు బయటపడితే తప్ప మారలేరని టిఫ్ఫనీ ద్వారా తెలుసుకుంది తను. చినుకులు ముఖాన్ని ఈడ్చి కొడుతున్నా కదలని తనని దగ్గరగా చూస్తే పదిహేడేళ్ల తన చెల్లి టిఫ్ఫనీ గుర్తుకొచ్చింది బార్బరాకి. కళ్లు తడిశాయి. ఒక్కసారిగా టిఫ్ఫనీ వంక తిరిగి మౌనంగా తనతో రమ్మని సైగ చేసింది బార్బరా.

పరిగెత్తి చేరుకున్న టిఫ్ఫనీ మేఘనకు ఎడమ వైపు కూర్చుంటే, తనని తాకిన బార్బరా కుడివైపు కూర్చుంది. ప్రాణం లేని తన కళ్ళని చూసిన అరక్షణంలో మేఘన బార్బరా భుజాన్ని పట్టుకుని ఏడవడం మొదలెట్టింది. తనని తాకిన బార్బరా చేతుల్ని మళ్ళీ మళ్ళీ తాకుతూ, భుజాల మీద వాలి లోపల బాధంతా బయటపడేలా ఏడ్చింది. వాడు దూరమైన ఇరవై ఆరు నెలలకు తనని తాకి ‘ఏమైందని’ పలకరించిన మొదటి మనిషి బార్బరా. తాకితేనే ఏడుస్తానని తనకైనా తెలిసుండదు. తెలిసుంటే ఇన్ని రోజులు కచ్చింగా ఒంటరై బ్రతికుండదు. పెరుగుతూ ఒక్కరితో అయినా దొరకని దగ్గరి స్నేహం ఇన్నేళ్లకు ఇంటికి దూరంగా ఈ ఇద్దరితో దొరికింది మేఘనకి.

కాసేపటికి ఇద్దరితో కలిసి అలల పక్కన నడుస్తూ…

“తాకితేనే ఏడ్చేశావ్. ఆగి భుజాన చెయ్యేసి, కాసేపు మాట్లాడే ఒక్క తోడు లేదా?” అని అడిగింది టిఫ్ఫనీ.

“వాడు చనిపోయిన ఒకటి, రెండు నెలలు అందరూ పక్కనే ఉన్నారు. ఆకలి వేస్తే వండేవారు, అడగకుండానే ఓదార్చేవారు, అన్నీ చేశారు. ఒకటో నెల కొందరు దూరమైతే, రెండో నెల ఇంకొందరు. ఆరు నెలలకి నేనొక్కదాన్నే మిగిలాను. ఇంకో ఇద్దరు ఉండేవారు, నెలకోసారి కావాల్సింది ఇచ్చే నా బడి స్నేహితులు. కదిలిస్తే ఏడుస్తున్నానని కొన్నేళ్లకి వాళ్లు కలవడం మానేశారు.

అందరూ మర్చిపోవాలి, ముందుకెళ్లాలి అని వేదాంతాలు పలికే వారే తప్ప, ఎలాగో మాత్రం ఏ మహానుభావుడూ చెప్పలేదు. నలుగురున్న కుటుంబంలో ఒకడుపోతే మిగిలున్న ముగ్గుర్ని చూస్తూ బతికేయొచ్చు. పాతికేళ్ల జీవితానికి నాకున్న కుటుంబం వాడొక్కడే. వాడే పోతే మరి బయటపడేదెలా? పద్దెనిమిదేళ్లు ఒంటరిగానే కదా బ్రతికానన్న మొండిధైర్యమే వాడు పోయినా నన్ను చావకుండా ఇంకా ఆపుతుంది” అని అరికాళ్లకి అలలు తాకేలా ఒడ్డున నిల్చుంది మేఘన.

“మనల్ని వదిలేసిన వ్యక్తి జ్ఞాపకాల్లోంచి ఎలా బయటపడాలో ఏళ్లు గడిచినా కొందరు తెలుసుకోలేరు” అని టిఫ్ఫనీ వంక చూసి నవ్వుతూ “నీ అదృష్టానికి తేరుకొని, నచ్చింది వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు. ఇదే మొట్టమొదటి..” అని ముగించేలోపే, “లేదు. నచ్చింది వెతుక్కుంటూ నేనిక్కడికి రాలేదు బార్బరా! ఇక్కడికొచ్చాక తెలిసింది నాకు నచ్చిందొకటి ఇక్కడ జరుగుతుందని” అని ఆగింది. ఇంకో క్షణానికి “ఆర్నెల్ల నుంచి నేను వెతుకుతూ తిరిగేది నాట్యం కోసం కాదు…” అని ఆకాశాన్ని చూసింది మేఘన.

“మరింకేంటి?”

“ప్లెజర్స్..”

“ప్లెజర్సా?” అన్నారు బార్చబా, టిఫ్పనీ ఆశ్చర్యంగా.

“Yes. Ecstasy of pleasures” అని తలాడిస్తూ, “తీవ్రమైన మనస్తాపం నుంచి బయటపడటానికి మందు, మాదకద్రవ్యాలు, మనుషులతోపాటు ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన సముద్రాలు ఉన్నాయన్న సంగతి రెండేళ్లకు తెలిసింది నాకు. ప్లెజర్, హై, కిక్..పేరేదైనా నాలాంటి మానసిక రోగులకి వాటి అవసరం చాలా ఎక్కువ. సిగరెట్ తాగితే వచ్చే కిక్ ఒక్క నిమిషమొతే, గంజాయి కొడితే వచ్చే కిక్ గంటసేపు ఉంటుంది. మందు తాగితే రాత్రంతా కిక్ ఉంటుంది. ఇక సెక్స్ చేస్తే ఆ కిక్ వారం దాటి ఉంటుంది. ఇలాంటి కిక్స్ ఎన్ని దొరికినా మనల్ని వెనక్కి లాగుతాయే తప్ప, లోపలున్న భయాలని భయపెట్టి మనల్ని ముందుకు నడిపించవు. నెలకో కొత్త కిక్ అంటూ ఇరవై నెలలు ఇంట్లోనే గడిపా. ఏ ఒక్కటీ సరిపోలేదు. అందుకే అన్నీ వదిలి అడవులని, కొండలని..ఇదిగో ఇలా సముద్రాలని తిరుగుతుంటే పదేళ్లు నేర్చుకున్న కూచిపూడి కనిపించింది. కానీ చేశాకే తెలిసింది, నన్ను చూడటానికి నాకంటూ ఎవరూ లేరని. మళ్ళీ మొదలు..” అంటూ డబ్బాలో ఉన్న సిగరెట్ ఒకటి తీసి అలల మధ్యే కూర్చొని వెలిగించింది.

***

“నాతో వస్తావా?” అడిగింది బార్బరా తన పక్కనే కూర్చుంటూ.

“నీతోనా?” అంటూ అనుమానంగా చూసింది మేఘన.

“అవును, మాతో వచ్చేయ్” అని భుజానున్న బ్యాక్‌ప్యాక్ మేఘనకు చూపిస్తూ, “నువ్వు వెతుకుతున్న ఆ కిక్..నీ ఊపిరి ఆగి గొంతు ఎండేలా నిమిషాలు, రోజులు, నెలలు కాదు..నీకు జీవితాంతం సరిపోయే ఒక హై ఉంది దీంట్లో” అంటూ దాన్ని తన పక్కన పెట్టింది టిఫ్ఫనీ.

అర్థంకాక నవ్వుతున్న మేఘన బార్బరా వంక చూసి “గంజాయా లేక ఫారిన్ సరుకా?” అని బ్యాగ్ తెరవబోయింది. తాకబోయే తన చేతిని అందుకున్న టిఫ్ఫనీ “తెరిస్తే దాంట్లో దాక్కున్న మాయ ఎగిరిపోద్ది” అంది. తన దిక్కు సూటిగా “మా ఇద్దరినీ నమ్మి మాతో నడుస్తానంటే రా! ముప్పై రోజుల్లో భూమ్మీద ఉన్న నిన్ను ఆకాశానికి తీసుకెళ్లే ఒక కిక్. నీ భాషలో చెప్పాలంటే, that pleasure you are desperately seeking for, we’ll give it to you” అంది. బార్బరా వంక చూసి నవ్వుతూ “నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా బీ?” అని అడిగింది.

 

“రెండు గంటల ఫ్లైట్, రాత్రికి ఎనిమిది గంటల నిద్ర, లేచాక ఆరు గంటల ట్రెక్. అంతవరకు ఆగితే నీ కళ్లతో చూడొచ్చు” అని నిల్చొని మేఘన వైపు చేయి చాపింది బార్బరా. జరిగేదేంటో అర్థం కావట్లేదు, జరగబోయేదేంటో తెలీదు. అయినా ఇరవై ఆరు నెలల నుంచి తను వెతికే ఓ సమాధానం ఆ ఇద్దరితోనే దొరుకుతుందన్న నమ్మకం కుదిరింది మేఘనకు. బార్బరా చేయి అందుకుని లేచింది. అది మొదలు..

30 డేస్ క్యాంప్. 30వ రోజు. చెక్ పాయింట్. సాయంత్రం 4 గంటలు..

కుంటుతూ తనవైపే నడుస్తున్న సీతను చూసి “పది రోజులు దాటింది. ఇంకా కుంటుతున్నావేంటి సీతా?” అడిగింది మేఘన.

“రెండ్రోజుల ముందు నాలుగు అడుగులేశా. రాత్రికి హాఫ్ తాగితే కానీ తగ్గలేదు నొప్పి” అంటూ దగ్గరగా ఉన్న బండ మీద కూర్చున్నాడు సీత. “అయినా నేను కిందకి వెళ్లిపోతా అంటే నువ్వే ఒప్పించి ఆగమన్నావ్. ఇక్కడ నేను తప్ప అందరూ రోప్ ఎక్కుతున్నారు” అని చేతిలో ఉన్న కర్రను కోపంగా లోయలోకి విసిరేశాడు. ఇంకో పది సెకన్లకు గానీ అది భూమిని తాకదు.

అది ఏ దిక్కున వెళ్తుందా అని లోయలోకి చూసిన మేఘన, అలిగిన సీత పక్కన కూర్చుంటూ “తిరిగెళ్లి చేసేది ఏముంది? మహా అయితే బెడ్డు మీద బోర్లా పడుకొని ఆపకుండా రీల్స్ చూస్తావ్, అంతేగా! నీకో రహస్యం చెప్పనా? దగ్గరుండి ఒక్కొక్కరిగా రోప్ ఎక్కే అందరినీ చూస్తూ అరుస్తుంటే దొరికే ఆ కిక్, అంత ఎత్తులో రోప్ మీద నిల్చున్న నీకు దొరకదు. నమ్మకపోతే ఇవాళ ఒక్క రోజుకి నా మాట విను.

చీకటి పడటానికి ఇంకా రెండన్నర గంటలుంది. ఇక్కణ్నుంచి కదలకుండా, ఎవ్వరినీ కదిలించకుండా ఈ సాయంత్రం పూర్తయ్యేలోపు మేఘాల మధ్య నడవబోయే అందరినీ చూడు. కూర్చొని అరుస్తావో, లేచి విజిల్ వేస్తావో నీ ఇష్టం. కానీ కన్నార్పకుండా పడుతూ లేచి మళ్ళీ నిల్చొని నడిచే అందరినీ చూసి రెండు కాళ్ల మీద తిరిగి క్యాంప్ చేరుకో! హైలైన్‌లో ఉన్న మాయేంటో అర్థమవుద్ది నీకు. రాత్రికి హాఫ్ కాదు, ఒక్క పెగ్ కూడా వేయాలన్న ఆలోచన రాదు” అంటూ లేచి బార్బరాని పిలవబోయింది.

అంతలో సీత మేఘన చేయి పట్టుకొని “బయటకి కనపడని నా గాయం మానిందని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నావు?” అని అడిగాడు. కళ్లు మూసుకొని దానికి జవాబేంటో చెప్పేలోగా బార్బరా ముందుకొచ్చి “మొదటి రోజు నుండి తనని చూస్తున్నావు ఇంకా అర్థం కాలేదా?” అని నవ్వుతూ మేఘనని పిలిచి రోప్ వైపు నడిచింది.

“డాక్టర్ అని చెబితే సరిపోయేదిగా!” అంది చేతిలో ఉన్న రోప్‌నే సుదీర్ఘంగా చూస్తున్న మేఘన.

“కొన్నిసార్లు డాక్టర్ చెబితే కాదు, ఇక్కడ ఏం చెబుతుందో వినాలి” అంటూ గుండె మీద చేయి వేసుకుని,

“ఇది చెప్పింది వినేగా అన్నీ వదిలేసి ఇంట్లో నుంచి వచ్చేశావు.”

“ఇది చెప్పింది వినేగా దారినపోయే నాతో ఇంత దూరం నడిచావు.”

“ఇది చెప్పింది వినేగా వెయ్యి అడుగుల ఎత్తులో అక్కడ నిల్చున్నావు.”

“ఇది చెప్పింది వినేగా ఇంతమందిని అంతలోనే దగ్గర చేసుకున్నావు.”

“ఇది చెప్పింది వినేగా ఎవరినైనా ట్రెయిన్ చేయగలవని నమ్మి అడుగేశావు.”

“ఇది చెప్పింది వినేగా నీ ముందున్న రోప్ చూసి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎక్కాలా అని ఆరాటపడుతున్నావు” అని ఆగింది.

ఇంకాసేపటి మౌనానికి  మళ్ళీ “ఇది చెప్పింది వినేగా తిరిగి ఇంటికి వెళ్లాలా లేక ఇక్కడే మాతో ఉండిపోవాలా అని ఆలోచిస్తున్నావు” అని నవ్వింది బార్బరా.

తన చివరి మాట మేఘనకు ఏళ్ళుగా జారే కన్నీళ్లను కాక సరికొత్తవి పరిచయం చేసింది. రోప్ ఎక్కిన సాయంత్రం ఇక ఏం జరిగినా ఏడవకూడదన్న తన బలమైన ప్రమాణాన్ని మరిచి బార్బరా భుజాన చేరి మళ్ళీ ఏడవడం మొదలెట్టింది మేఘన. అయితే ఈసారి ఎగిరిపడి వచ్చే ఆ కన్నీళ్లు తను ఇంకెప్పటికీ చూడలేని తన రాముడి కోసం కాదు, వాడి జ్ఞాపకాలతో ఇకపై ఎలా బతకాలో చూపించిన బార్బరా కోసం.

వదిలేస్తే ఏడుపులోనే మునిగే తనని తీసుకువచ్చి, వందల మీటర్ల రోప్‌ని పరిచయం చేసి, అరుస్తున్నా వదలకుండా దానిపై నడిపించి, ఏ తోడూ లేని తనకి ముప్పై మంది ఉన్న ఓ కుటుంబాన్ని పరిచయం చేసింది బార్బరా. ఇక మిగిలింది అడగకుండానే మేఘనని తనతో ఉండిపోమని అడగడం మాత్రమే. అడిగితే ఆగిపోద్దని తెలిసినా, వాడి ఆలోచనల వల్ల ఆగిపోయిన తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగించాకే మేఘనని మళ్ళీ తనతో నడవడానికి పిలుస్తానని నిర్ణయించుకుంది బార్బరా.

“ఉండిపోనా?” అడిగింది మేఘన తన ముందున్న మేఘాల్ని చూస్తూ.

“మరి పీజీ?” అని అడిగింది బార్బరా తన కళ్ల కిందున్న లోతుల్ని చూస్తూ.

“తొందరేముంది. ముప్పైలోపు పూర్తి చేస్తా ఎలాగూ!”

“మరి సర్వీస్?”

“ప్లస్ టు నుంచి ఆర్థోపెడిక్స్ వరకు స్కాలర్‌షిప్స్‌తోనే చదువుకున్నా. లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ అయినందుకు ఎలాగైనా కోట్లు సంపాదించాలన్న కోరిక లేదు. రోజంతా చదివే మెడిసిన్ కంటే, సాయంత్రాలు ఒక గంట నేర్చుకునే కూచిపూడి అంటేనే ఇష్టం నాకు. పీజీ పూర్తయ్యాక సర్వీస్‌లో వచ్చే డబ్బుతో ఎప్పటికైనా కూచిపూడి స్కూల్ పెట్టాలన్నదే ముందు నుంచి ఉన్న ఆలోచన. దీన్ని తాకేదాకా…” అంటూ చేతిలో ఉన్న రోప్స్‌ని చూపిస్తూ, “అన్నిటినీ ఇది మార్చింది” అని బార్బరా వైపు తిరిగింది. “రెండేళ్ల నా అశాంతిని దూరం చేసి, వాడెప్పుడూ నాతోనే నడుస్తాడన్న ధైర్యాన్ని ఇచ్చింది. దీన్నెలా వదలను?” అని అడిగింది మేఘన.

“వాడి వెనకే పరిగెడుతున్న నీ ఆలోచనలను ఆపింది నిజమే! అంతమాత్రాన ఇదే నీ జీవితమని ఎలా నమ్ముతున్నావు మేఘనా? నెల నుంచి నేర్చుకున్న హైలైన్ మీదే ఇంత ప్రేముంటే, పదేళ్లు నేర్చుకున్న నీ నాట్యం ఏమైపోతుంది? ఇంకా ఐదేళ్ల నీ చదువు ఏమైపోతుంది? నా స్వార్థానికి నిన్ను నాతో ఉండిపోమని అడగలేక కాదు మేఘనా! దీనికంటే ముఖ్యమైన నీ నాట్యం, నీ చదువు నీతో ఏళ్లుగా నడుస్తున్నాయి. దీన్నెలా వదిలేది?” అని తన చేతిలో ఉన్న రోప్స్ తీసుకొని ఎదురుగా ఉన్న హైలైన్‌ని చూసింది బార్బరా.

ఫ్రెష్‌మెన్‌లో ఉన్న అబ్బాయి ఒకడు అప్పుడే రోప్ ఎక్కడం మొదలెట్టాడు. కాళ్ల కిందున్న లోయని చూసి కాస్త భయపడ్డా, అరుస్తూ లేచి నడుస్తున్న వాడ్ని చూస్తుంటే కాలిఫోర్నియాలో తను మొదటిసారిగా రోప్ ఎక్కిన రోజు గుర్తొచ్చింది బార్బరాకి. ఒళ్లు జల్లుమంది. తిరిగి మేఘనని పట్టుకొని “వెళ్లు మేఘనా! నన్ను నమ్మి ఆగిపోయిన నీ జీవితానికి తిరిగెళ్లు. ఇక్కడ హైలైన్ పైన నువ్వు ఒంటరిగా నడిస్తే దొరికే హై కంటే ఎక్కువ నీకు వందమందికి కూచిపూడి నేర్పిస్తేనో లేక వందమందిని ఆప్యాయంగా చూసుకుంటేనో దొరుకుతుంది. నన్ను నమ్ము! ఆ దారిలోనే మళ్ళీ నడవాలి నువ్వు” అని తనని హత్తుకుంది. “ఇక నుంచి ఇండియాలో ఎక్కడ కొత్త లైన్స్ వేసినా, ముందు మనం నడిచాకే అందరినీ పిలుద్దాం. మై ప్రామిస్ టు యూ. నువ్వు, నేను, టిఫ్ఫనీ. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఆర్నెళ్లకు ఒకసారి నా పక్కనే ఉండాలి నువ్వు” అంటూ మేఘాన్ని పట్టుకొని  ఏళ్ల తరువాత మొదటిసారి ఏడ్చింది బార్బరా.

అది మొదలు. పాతికేళ్లుగా దొరకని ఓ స్వచ్ఛమైన స్నేహం, వందేళ్లకు సరిపడా దొరికినట్టు బార్బరాని హత్తుకుంది మేఘన.

***

స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక నవల

  • హాయ్ విశ్వరూప్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి. నేను పుట్టి, పెరిగింది అక్కడే. ఇంజినీరింగ్ చదివాను. డేటా అనలటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నాను.

  • చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవారా?

చిన్నప్పటినుంచి న్యూస్ పేపర్ చదవడం అలవాటు. సెవెన్త్ క్లాస్ తర్వాత మా ఫ్యామిలీ పోత్కపల్లి నుంచి పెద్దపల్లికి వచ్చి స్థిరపడింది. ఆ టైంలో మా నాన్న నన్ను వరంగల్ తీసుకెళ్లారు. అక్కడ లైబ్రరీలోనుంచి ఓ బుక్ నా వెంట తెచ్చుకున్నాను. అలా మెల్లగా పుస్తకాలు చదవడం అలవాటైంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఇంగ్లీషు బుక్స్ తెప్పించుకునేవాణ్ని. మొదట్లో అవి అర్థమయ్యేవి కావు. ఆ తర్వాత అర్థమై, ఇంగ్లీషు పుస్తకాలే ఎక్కువగా చదివాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ఇంటర్‌లో ఉన్నప్పుడు నాకో అమ్మాయి మీద క్రష్ ఉండేది. తను నా గర్ల్‌ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకొని ఒక కథ రాశాను. అయితే అది ఎవరికీ చూపించలేదు. విచిత్రమేంటంటే, ఆ తర్వాత ఆ అమ్మాయే నా గర్ల్‌ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత బీటెక్‌లో ఉన్నప్పుడు కథలు రాయాలన్న ఆలోచన వచ్చింది. మొత్తం కథ రాయలేదు కానీ, కథలకు కావాల్సిన ఐడియాలు మాత్రం రాసిపెట్టుకున్నాను. అన్నీ ఇంగ్లీషులోనే. అప్పట్లో ఒక సోలో ట్రిప్ వెళ్లాను. ఆ ట్రిప్ నా మీద ఎలాంటి ప్రభావం చూపించిందో ఒక కథగా రాశాను. నేను రాసిన మొదటి తెలుగు కథ అదే. దాన్ని కూడా ఎవరికీ చూపించలేదు. ‘సోపతిగాళ్లు’ పుస్తకం కోసం రాసినవే అఫిషియల్‌గా నేను రాసిన మొదటి కథలు.

  • ‘సోపతిగాళ్లు’ కథాసంపుటి నేపథ్యం ఏంటి?

2024లో విపాసనకు వెళ్ళేముందు నా చిన్నప్పటి ఫ్రెండ్ రోహిత్ కలిశాడు. ఇద్దరం కలిసి చాలాసేపు మా చిన్నప్పటి సంగతులు మాట్లాడుకున్నాం. వాటిని కథలుగా రాస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలా కొన్ని కథలు రాసిపెట్టుకున్నాను. విపాసనకు వెళ్లి వచ్చిన తర్వాత మరికొన్ని కథలు రాశాను. మొత్తం నెలన్నరలో 10 కథలు పూర్తిచేశాను. మా ఊళ్లో నా చిన్నప్పుడు జరిగిన విషయాలు, స్కూల్ కబుర్లు, మా ఆటపాటలు..అన్నీ ఆ కథల్లో ఉంటాయి. 2025లో ‘రేగి అచ్చులు’ సంస్థ ద్వారా ఆ కథలన్నీ కలిపి ‘సోపతిగాళ్లు’ పుస్తకం తీసుకొచ్చాను. చదివినవాళ్లంతా బాగున్నాయని మెచ్చుకున్నారు.

  • మీరు గతంలో రాసిన నోస్టాల్జియా కథలకూ, ఈ ‘వేవ్స్’ కథకూ స్టైల్‌లో చాలా తేడా ఉంది. ఈ కథకు నేపథ్యం ఏమిటి?

ఈ స్టైల్‌లో రాయాలి..ఇలా రాయకూడదనే రూల్స్ ఏమీ నేను పెట్టుకోలేదు. నాకు నచ్చిన కథను నచ్చిన పద్ధతిలో రాసుకుంటూ వెళ్లిపోతాను. ‘వేవ్స్’ కథ ఫిక్షనే! అయితే అందులోని పాయింట్స్ నిజమైనవి. ఒకమ్మాయి గురించి మా ఫ్రెండ్ చెప్పిన విషయాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మేఘన క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన ఓ అమ్మాయి పూణెలో హైలైన్ స్కూల్ నడుపుతోంది. వారం రోజులు నేనక్కడ ఉన్నాను. ఆ అనుభవాలు కూడా ఈ కథలో యాడ్ అయ్యాయి.

  • మీకు నచ్చిన రచయితలు..రచనలు?

ఏదైనా పుస్తకం నాకు బాగా నచ్చితే, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అందులో లీనమైపోతాను. ఆనంద్ నీలకంఠన్ కౌరవుల తరఫు నుంచి రాసిన ‘మహాభారతం’ చదివాక ఒకలాంటి ట్రాన్స్‌లో ఉండిపోయాను. అలాగే రైటర్ అనుపమ రాసిన ‘The Tantrik Curse’ పుస్తకం నన్ను చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. నేను చదివిన తొలి ఇంగ్లీషు పుస్తకం అదే. అలాగే కాఫ్కా రాసిన చిన్నకథలు చాలా ఇష్టం. మురకమి, అయాన్ రాండ్ రచనలు కూడా ఇష్టంగా చదువుతాను.

  • ఇంకా ఏమేం రాయాలని ఉంది?

ఇప్పటికే కొన్ని కథలు రాశాను. త్వరలో వాటిని పుస్తకంగా తీసుకొస్తాను. ఆ తర్వాత స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక నవల రాస్తాను.

*

విశ్వరూప్ వేముల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా కొత్తగా ఇప్పటిదాకా నేను చూడని సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సాగిందీ కథ. ముందుకూ వెనక్కూ ఉయ్యాలలూగుతూ సాగిన కథనం కొంచెం అసౌకర్యంగా అనిపించినా మంచి పట్టులో సాగి ఆశావాహ దృక్పథంతో ముగిసింది. అభినందనలు విశ్వరూప్ గారూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.