విషాదాన్ని కథగా మలచడంలో తడబాటు

ఒక మంచి కథకు మంచి ఇతివృత్తం ఉంటే సరిపోదు, దాన్ని కథగా మలిచే శిల్పం కూడా ముఖ్యం. తగుళ్ళ గోపాల్ రాసిన “నువ్వులు చల్లిన తొవ్వ” గుర్తుండిపోయే కథ.
చిన్న వయసులోనే పెళ్లై, పిల్లల్ని కని, అత్తింట్లో కష్టాలు పడి, అనారోగ్యం పాలై, చివరకు పిల్లల్ని కూడా చూడలేని స్థితిలో చనిపోయే ఒక స్త్రీ విషాదం ఈ కథ. ఆ విషాదమే మనల్ని కదిలిస్తుంది. కానీ ఆ కదిలింపే సాహిత్య విలువకు కొలమానం కాకపోవచ్చు. కథ చదివాక మనలో ఏ ప్రశ్న మిగిలిందన్నదే అసలు కొలమానం కావచ్చు. ఈ కథ ఆ ప్రశ్ననే రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది. చాలా చోట్ల అది ఫలించింది కూడా.
కథ మంగమరణంతో మొదలవుతుంది. అంబులెన్స్‌లో మంగశవం వస్తోందని తెలియగానే ఊరంతా హనుమంతుడి గుడి దగ్గరికి చేరి, రావిచెట్టు కింద నిలబడి ఎదురుచూడటం, చెట్ల మీద కాకులు వాలడం – విషాద వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి.
పదో తరగతి పరీక్షలు కాగానే మంగకు పెళ్లవుతుంది. ఏడాది తిరగకముందే కొడుకూ, రెండేళ్లకే బిడ్డా పుడతారు. ఆమె బాల్యం ముగిసేలోపే వయసుకు మించిన బాధ్యతలు భారంగా మారుతాయి. ఒక స్త్రీగా, తల్లిగా, కోడలిగా, కూలీగా భరించలేని ఆ భారంతో శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోతుంది. “వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉండొద్దు” అనే సామాజిక ఆలోచన ఒక జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో ఈ కథ మన కళ్ల ముందు ఉంచుతుంది.
మంగ అనారోగ్యం వెనుక కథ చెప్పే కారణాలు గమనార్హం. తోటకు మందు కొట్టడం, ఆ వాసనలోనే వారం రోజుల పాటు పని చేయడం, పెదాలు వాచడం, చేతులూ కాళ్లూ పగిలి ఉబ్బడం, ఊపిరితిత్తుల సమస్య అని డాక్టర్లు చెప్పడం – ఇవన్నీ ఒక్కొక్కటిగా కథలోకొస్తాయి. మంగ జీవితం కేవలం కుటుంబసమస్యలతోనే కాదు, వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థతోనూ ముడిపడి ఉందనర్థమవుతుంది.
అసలు మంగని చంపిందెవరు? ఒక వ్యక్తా? ఒక వ్యవస్థా? మొగులమ్మా? రమేషా? పురుషాధిక్య కుటుంబవ్యవస్థా? బాల్యవివాహమా? లేక వ్యవసాయ మందులా? కథ ఈ కారణాలన్నింటినీ తాకుతుంది కానీ, దేన్నీ బలంగా నిర్మించకుండానే, చివరికి ఆ దుష్టత్వాన్నంతా మొగులమ్మ పాత్రపైకే నెట్టేస్తుంది.
రమేష్ పాత్రలో మంచి లోతుకు అవకాశం ఉంది. అతనికి పిల్లలంటే ప్రాణం. కానీ భార్య అంటేనే ప్రేమ లేదు. మంగని ఇంటి నుంచి పంపించాక ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. పిల్లల్ని చూడాలని మంగ ఫోన్ చేస్తే, “నీ రోగం పిల్లలకంటనింకెనా?” అని బెదిరిస్తాడు. భార్యని ప్రేమించని భర్తగా, పిల్లల్ని ప్రేమించే తండ్రిగా ఉన్న ఈ వైరుధ్యాన్ని ఇంకాస్త లోతుగా చూపించుంటే పాత్ర ఇంకింత బలపడేది.
ఇదేలోపం మొగులమ్మ విషయంలోనూ కనిపిస్తుంది. ఆమె కోడల్ని ప్రేమించదు. మంగ చావుని కొడుక్కి ఎదురైన సమస్యగానే చూస్తుంది. శవంగా పడి ఉన్న మంగ కళ్లలో సూదులు గుచ్చడం, కాళ్ల బొటనవేళ్లను దారంతో కట్టడం, దారి పొడవునా నువ్వులు చల్లడం – ఇవన్నీ మంగ దయ్యమై వస్తుందనే భయంతోనే చేస్తుంది. ఆమెను పూర్తిగా క్రూరత్వానికి ప్రతీక చేయడం కంటే, ఆమె వెనుకున్న మానసిక, సామాజిక కోణాల్ని ముడిపెట్టుంటే పాత్ర ఇంకాస్త సహజంగా ఉండేది.
ఈ కథకి పెద్ద బలం భాష. తెలంగాణ గ్రామీణ పలుకుబడిని పాత్రల మాటలకే పరిమితం చేయకుండా కథనంలోనూ వాడటం బాగుంది. “పానం”, “తొవ్వ”, “దిక్కులేనోళ్లు”, “చెల్క”, “దవఖాన”, “సచ్చింది” లాంటి పదాలు కథాప్రపంచంలో సహజంగానే కలిసిపోయాయి.
అయితే కథనం చాలావరకు సమాచార క్రమంలోనే సాగుతుంది. “ఇప్పుడు ఇది జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది” అన్నట్లు మంగ జీవితాన్ని వివరిస్తూ పోతుంది. కొన్ని చోట్ల “చెప్పడం”, “చూపడం”ను మించిపోతుంది. మంగ పిల్లలకోసం ఏం అనుభవించిందో చెప్పడం కంటే, ఆ తపనని చూపే ఒక చిన్న సన్నివేశం బలంగా ఒకటి ఉండుంటే ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేది.
కథ క్లైమాక్స్‌లో మంగను స్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు అత్త దారిపొడవునా చల్లే నువ్వులు – మంగ ఆత్మ ఇంటికి తిరిగిరాకుండా అడ్డుకునే మూఢనమ్మకానికి ప్రతీక. అదే సమయంలోనూ ఆ నువ్వులే, చనిపోయిన తల్లి తన పిల్లల దగ్గరకు రాకుండా కట్టుదిట్టం చేసే కుటుంబవ్యవస్థకూ ప్రతీకే.
ఒక మనిషి చనిపోతే ఊరంతా వచ్చి, “మంచి పిల్ల” అనో, “పాపం” అనో బాధపడతారు. అదే దినాలకీ, ఆమె బతికున్నప్పుడు ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆపడానికీ ఒక్కరూ రారు. రచయిత అంతర్లీనంగా చెప్పదలచుకున్న మాట ఇదేనని నాకర్థమైంది.
సుబ్బమ్మ పాత్ర మంగని అర్థం చేసుకున్న వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమె మంగ కళ్లలోని సూదుల్ని తీస్తుంది, అట్లాగే కాళ్లకు కట్టిన దారాన్నీ తెంపుతుంది. సుబ్బమ్మ పాత్ర, “మంచి మనిషి”గానే మిగిలిపోతుంది కానీ, ఆమెలోని అంతర్గత సంఘర్షణ కథలో ఏమీ పెద్దగా కనిపించదు. ఆమెకి కోపం, బాధా, ప్రేమా – అన్నీ ఉన్నా, తిరుగుబాటు చేసే, నిర్ణయం తీసుకునే వ్యక్తిత్వమున్న మనిషిగా కనిపించదు. ఆమె జీవించిన మనిషి కంటే కూడా “బాధిత స్త్రీ”కి ప్రతీకగానే కనిపిస్తుంది.
మంగను గుర్తుండిపోయేలా చేసేది ఆమె చావో ఇంకోటో కాదు, ఆమె శ్రమ మాత్రమే. “పనొక్కటే నాదని బతికింది” అనే మాటలోనే ఆమె జీవితపు గాఢతుంది. పని చేసే స్త్రీకి తన పని తప్ప మరేమీ సొంతం కాదు. చివరికి ఆమె శవాన్ని పూడ్చే ఆరడుగుల స్థలం కూడా ఆమెది కాకుండా పోయింది.
చివర్లో దారిపొడవునా చల్లిన నువ్వుల మధ్య తల్లి పక్షి తన పిల్లలతో వచ్చి ఒక్కొక్క గింజనూ ఏరుకుంటూ పోతుంది. ఇక్కడ మనిషి వేసుకున్న దారి తల్లిని పిల్లల దగ్గరికి రానివ్వలేదు. కానీ అదే దారి పక్షికి అడ్డు కాలేదు. ఈ విరుద్ధతే కథ మిగిల్చిన పెద్ద ప్రశ్న!
(ఈ కథ సారంగలో 1 సెప్టెంబర్ 2026 సంచికన ప్రచురితమైంది.)

బాలాజీ పోతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.