వినటం ఒక కళ

రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే లా ఉన్నాయి సంభాషణలు, వినటాలు, వినిపించుకోవటాలు. సామాజిక మాధ్యమాల హోరులో, దృశ్య పరమైన సమాచారం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండటంతో, వినటం అనేది చాలా తగ్గిపోయింది. ఏదైనా మిగిలి ఉన్నా,  అది కాస్త పరధ్యానంతో వినటం, వివిధ రకాలైన పనులు చేస్తూ వినటం, సమాచార ఒరవడిలో విన్నవి కాస్తా గాలిలో కలిసిపోవటం జరుగుతున్నది. కానీ బంధాలైనా, వృత్తి అయినా, వికాసమైనా మొత్తం అన్నీ సమాచారం అనే పునాదులపైనే నిలబడి ఉంటుంది. సరైన సమాచారం లోపించినపుడు ఏదైనా కుప్ప కూలే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సమయంలో , పాట్రిక్ ఇంగ్ రాసిన “హౌ టు లిజెన్ విత్ ఇంటెన్షన్ “ అంటే ఉద్దేశ్యపూర్వకంగా వినటం ఎలా అనే పుస్తకం చదువుతుండగా ఈ నాలుగు మాటలు రాయాలని అనుకున్నాను. స్టీఫెన్ కోవీ అంటారు, “చాలా మంది అర్థం చేసుకోవటం కోసం వినరు, తిరిగి సమాధానం ఇవ్వాలి కాబట్టి వింటారు” అని.  అర్థం చేసుకోవటం అనేది లోతైన సంభాషణల వలనే సాధ్యం అవుతుంది. కాని అంతటి శ్రద్ధ ఆ వ్యవధి ఎవరికి ఉండటం లేదు. విషయం లోతుగా అర్థం అవుతే అది మన ఆలోచనా సరళినే మారుస్తుంది. తిరిగి సమాధానం చెప్పేటప్పుడు కూడా, పైపైన సమాధానాలు కాకుండా సంక్లిష్టమైన ఆలోచన విధానాలతో ఇవ్వటం జరుగుతుంది. సంక్లిష్టమైన ఆలోచన విధానం అంటే క్రిటికల్ థింకింగ్ గురించి ఇంకో సందర్భంలో ప్రస్తావిస్తాను.

సహజంగానే మనిషి వినటంలో అంత గొప్పవాడు ఏమి కాదు. మనిషి మెదడు వినటం కన్నా కూడా మనుగడకి కావలసిన మనిషి సామర్ధ్యం వరకే పరిమితమైంది. మనలో ఉండే అంతర్గత యుద్ధాలు, సమాధానం కి కావాలసిన పదాలు వెతుక్కోవటం, మనలో పక్షపాతాలు, అభిప్రాయాలు, ఇవన్నీ మనని సరిగా విననివ్వకుండా చేస్తాయి. వీటన్నిటిని అధిగమించటానికి పాట్రిక్ ఇంగ్ సూచించిన విషయాలు క్లుప్తంగా ఇక్కడ రాయటం చదువరులకి ఉపయోగం అని భావిస్తున్నాను.

ముందుగా తెలుసుకోవలసినది, పదాలని మించి మనం వినగలగాలి. సమాచారం అంటే కేవలం పద శబ్ధాలు మాత్రమే కాదు. శబ్ధానికి అతీతంగా వేరే విషయాలు అంటే మనిషి బాడి లాంగ్వేజ్, ముఖంలో కదలాడే భావనలు, ఇంకా ఏ స్వరంలో మాట్లాడుతున్నారు అనేది కూడా మిళితమై ఉంటాయి. మాట్లాడే వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ భావాలు అర్థం కావాలంటే మిగతావన్ని కూడా గమనించుకోవాలి.

వినటానికి సహజ సిద్ధమైన కుతూహలం ఉండాలి. అపుడే సరైన ప్రశ్నలు వేయగలము. లేకపోతే విన్నది సగం సమాచారం కింద ఉండిపోతుంది.

క్రియాత్మకంగా  వినటం అనేది అలవరచుకోవాలి.  చాలామంది, తమ వంతు వచ్చినపుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు తప్ప క్రియాత్మకంగా అందరూ చెప్పేది వినాలని అనుకోరు. క్రియాత్మకంగా వినటం మూలంగా విలువైన సమాచారం దొరుకుతుంది.  అక్రియాత్మకమైన వినికిడి ఎపుడూ సంపూర్ణం కాదు.

మనదైన ఒక వినే శైలిని పెంపొందించుకోవాలి అంటాడు పాట్రిక్ ఇంగ్. ఇవి రకరకాలు. ఉన్నది ఉన్నట్లుగా పూర్తి సమాచారాన్ని వినటం, సంక్లిష్టంగా విన్నదాని పర్యవసనాన్ని అంచానా వేయగలటం, సానుభూతితో వినటం మొదలైనవి. అసలు ఇలా చెప్పే వరకు మనం అనుకోను కూడా అనుకోము వినటం పలురకాలున్నాయి అని. అవతలి వారు శైలి ఏంటి అనేది అర్థం అవుతే మనం ఏ  శైలి లో వినాలి అనేది తెలుస్తుంది.

సంభాషణ అనేది కొనసాగాలి అంటే, వేసే ప్రశ్నలు సంభాషణ కొనసాగించేవిలా ఉండాలి. ఉదాహరణకి “ఎలా ఉన్నారు?” అని అడిగితే “బాగున్నాము” తో ఆగిపోతుంది, అలా కాకుండా “మీ గురించి చెప్పండి” అని అడిగితే సంభాషణ కొనసాగుతుంది. అక్కడ ఏమీ విషయం లేకపోయినా, ఎదుటి వారికి సంబందించిన ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని “అది మీకు ఎలా అనిపించింది?” అని అడగటంలో సంభాషణ ముగిసిపోకుండా ముందుకు వెళ్తుంది.

భావోద్వేగాల మేధోశక్తి. దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీని గురించి చాల ప్రస్తావనే ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ లో 5 ప్రధాన భాగాలు ఉంటాయి. సానుభూతితో వినటం, మోటివేషన్ (ప్రేరణ) తెచ్చుకోగలటం, స్వీయ భావేద్వాగాల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం, మనల్ని మనం నియంత్రించుకోగలటం. ఇవన్నీ కూడా వినటం అనే క్రియలో చాలా పెద్ద పాత్రవహిస్తాయి.

అన్ని సంభాషణలు సజావుగా ఉండవు. కొన్ని సవాలుగా, వివాదాలుగా మారుతాయి, అప్పుడు కూడా సహనం కోల్పోకుండా వివాదాన్ని విని అర్థం చేసుకోవటం కూడా ఒక కళ. ఇలాంటి సమయంలో క్రియాత్మకంగా, శాంతంగా , గౌరవాన్ని కోల్పోకుండా వినడం అనేది అలవర్చుకోవాలి.

షిఫ్ట్ రెస్పాన్స్ , సపోర్ట్ రెస్పాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఎవరైనా మనకి ఏదైనా చెప్పినపుడు, వెంటనే అది మనకి అనువదించేసుకుని ఆలోచిస్తాము. ఎలా అంటే “నేను పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగుతాను” అని చెప్పగానే, మనకి అన్వయించేసుకుని వారిని మాట్లాడనీయకుండా ” నాకు బ్లాక్ కాఫీ ఇష్టం ఉండదు. నేను టీనే ఎక్కువ ఇష్టపడతాను” అని చెప్పటం వంటిది షిఫ్ట్ రెస్పాన్స్ అవుతుంది. అలా కాకుండా వారికి బ్లాక్ కాఫీ ఎలా, ఇష్టమో, ఎపుడు పరిచయమో తెలుసుకోవటం సపోర్ట్ రెస్పాన్స్ అవుతుంది అని చెప్తారు పాట్రిక్ ఇంగ్ తన పుస్తకంలో. అలా మనకి అన్వయించుకోకుండా వినగలగటం ఒక కళ.

మంచి శ్రవణంలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా, ప్రజలు విశ్వసించగలిగే మరియు ఆధారపడే వ్యక్తిగా మారవచ్చు. సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి, నమ్మకాన్ని పెంపొందించుకోవటానికి కూడా చాలా ఉపయోగమైనవి ఈ విషయాలు.

*

విజయ నాదెళ్ళ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వినటం , చదవటం నిజంగా ఒక కళే. అది అలవర్చుకోవాలి. మీరు చెప్పినట్టు, వినటం అనేది నిజంగా తగ్గిపోయింది. ఎంతటి సంక్లిష్ట విషయం అయినా ఒక నిమిషం లో చెప్పాలి అని ఎక్పెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న విషయం అర్ధం చేసుకోవాలి అంటే తగిన సమయమే కాకుండా మీరు చెప్పిన ధోరణి అలవాటు చేసుకొవాలి. మంచి విషయాలు అందించినందుకు ధాంక్స్.

  • సహజంగానే మనిషి వినటంలో అంత గొప్పవాడు ఏమి కాదు. బాగుంది మేడం. విశ్లేషణాత్మమైన వ్యాసం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు