రాత్రిని ప్రేమించి మృత్యువును కౌగలించుకొని…

ఆమె రాత్రిని ప్రేమించింది. నిశా దేవతను కౌగలించుకుంది.

రాత్రిలో నిగూఢమైన రహస్యం దాగి ఉన్నదని భావించింది. మంచువర్షం కురుస్తున్న ఏకాంతపు రేయిని ఆహ్వానించింది. పరిమళంతో నిండిన వెన్నెల రేయిని ఆరాధించింది. దుఃఖ భారంతో విరహవేదనతో వేగిపోతున్న కల్లోల నిశిలో జీవితం గడిపింది. అన్ని రాత్రుళ్లూ వాటి సమ్మోహన శక్తిని ప్రయోగిస్తే మనకు తెలిసిన రూపాలనే మనం గుర్తించలేనంతగా మార్చేస్తాయి.. అని ఆశపడింది.

ఆమె ఎవరో కాదు, బాల్యంలో జీవితం కోల్పోయి, జీవితంలో బాల్యం, యవ్వనం కోల్పోయి తనది కాని జీవితంలో తానే జీవిస్తూ ఏదీ అనుభవించకముందే అకస్మాత్తుగా తార అయిన తార- మీనా కుమారి.

అందరు పిల్లలూ స్కూళ్లకు వెళుతూ, ఆటలాడుకునే నాలుగేళ్ల వయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించి మహజబీన్ నుంచి  మీనా కుమారిగా మారిన ఆ అసాధారణ తార  39 ఏళ్ల వయసులో 92 సినిమాల్లో నటించడం ద్వారా కోల్పోయిన జీవితం విలువ ఆమెకే తెలుసు. కుటుంబం కోసం సంపాదించడమే కాని తనకోసం జీవించడం తెలియని మీనా కుమారి అంటే మనకు బైజూబావ్రా,  సాహిబ్ బీబీ ఔర్ గులామ్, పాకీజా వంటి అఖండ విజయాలు సాధించిన అద్భుత సినిమాలు గుర్తొస్తాయే కాని ఈ సినిమాల వెలుగో కొవ్వొత్తిలా కరిగిపోతున్న ఆమె జీవితం గుర్తు రాదు. తెరపై ఆమె కంటతడిపెడితే కన్నీరుమున్నీరయే ప్రేక్షకులు ఆమెకు ఒక విషాద రాణిగా నామకరణం చేసి ఆరాధించారే కాని ఆమె వ్యక్తిగత జీవితంలో అశాంతి, కుటుంబం నుండి ఎదురయిన కష్టాలు ఎవరి హృదయాలనూ తాకలేదు. ‘చల్తే చల్తే యుహి కోయీ…’ అని పాడుతూ నర్తించిన ఆమె పాదాలు ఎందరో రసజ్ఞుల హృదయాలపై నడిచి వెళ్లాయి కాని వారికి ఆమె మనసులో అల్లకల్లోలం గురించి తెలియదు.

తనను డబ్బు సంపాదించే యంత్రంలా మాత్రమే చూసిన తండ్రి బారినుంచి తప్పించుకునేందుకు  పాకీజా దర్శకుడు కమల్ అమ్రోహీతో వివాహమూ భగ్నభుగ్నమైంది. ఒంటరితనం మదిరను ఆలంబన చేసుకుంది. అదే ఆమె జీవితాన్ని కబళించింది. కాలేయ వ్యాధితో మరణించే చివరి రోజుల్లోనూ ఆమ నటించారు.

ఈ మీనా కుమారి కవిత్వాన్ని ప్రేమించేవారని చాలా కాలం క్రితం వరకు ఎవరికీ తెలియదు. ‘అడుగుల చప్పుడు రాకముందే వాటి సవ్వడిని పసిగట్టగలను, జీవితమా. నిన్నూ చాలా దూరం నుంచే గుర్తించగలను’ అని రాసిన ఫిరాఖ్  గోరఖ్ పురి ముషాయిరా కు ఒక రోజు మీనా కుమారి వెళ్లారు. అంతే, అప్పటి వరకు హర్షధ్వానాలు చేస్తూ ఆయన కవితాపఠనాన్ని అనందిస్తున్న వారంతా మీనా కుమారి చుట్టూ చేరారు. గోరఖ్ పురి ఆగ్రహంతో అక్కడి నుంచి నిష్క్రమించేందుకు బయలుదేరారు. ‘సార్, నేను మీ కవిత్వం వినడానికి వచ్చాను..’ అని మీనా కుమారి ఆవేదనతో పలికింది.  కాని ఆ కవి  చలించలేదు. ‘ముషాయిరా ముజ్రాగా( నృత్యవేడుక) గా మారింది. ఇక్కడ నేను ఉండలేను.. ‘అని గోరఖ్ పురి వెళ్లిపోయారు. కాని అదే మీనా కుమారి నాజ్ పేరుతో అద్భుత కవిత్వం తన డైరీల్లో రాసుకుంటోందని ఆయనకు అప్పుడేమి తెలుసు?

ఈ మీనా కుమారి కవితల్ని ప్రముఖ సాహితీ వేత్త, వందలాది రచయితలను అనువదించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద గ్రహీత తుర్లపాటి రాజేశ్వరి అనువదిస్తున్నారని, త్వరలో వాటిని పుస్తకంగా తేవాలనుకుంటున్నారని చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలిగింది.  ఒడిషాలో బరంపురంలో ఉంటూ తనకు నచ్చిన రచనలన్నీ తెలుగులో అనువదించే తుర్లపాటి రాజేశ్వరి మీనా కుమారినీ, ఆమె  కవిత్వాన్ని ప్రేమించిన సున్నిత హృదయురాలు కావడమే ఈ అనువాదాలకు దారితీసింది. రాజేశ్వరి షాహిర్ లూధియాన్వీ కవితల్ని కూడా అనువదించారు.

మీనాకుమారి జీవిత చరిత్రను ప్రముఖ జర్నలిస్టు వినోద్ మెహతా అద్బుతంగా రాశారు.  ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక ఇంగ్లీషు అధ్యాపకుడు నూరుల్ హసన్ ఆమె కవిత్వం గురించి ‘మీనాకుమారి- ద పోయెట్’ పేరుతో మరో పుస్తకం ప్రచురించారు. నిజానికి అంతకు ఎంతో కాలం ముందే మీనాకుమారికి స్నేహితుడైన గుల్జార్ ఆమె డైరీల్లో రాసుకున్న అనేక కవితల్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.

తుర్లపాటి రాజేశ్వరి మీనాకుమారి కవితల్ని అనువదించిన తీరు ఆమె ఆ మహానటి అంతరంగంలో ప్రవేశించినట్లు కనపడుతుంది. ఒక్కో అనువాదం చదువుతుంటే మీనా కుమారి తన జీవితం గురించి మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

ఇదే జీవితం

ఉదయం నుంచి రాత్రి వరకు

మనం అన్ని ఇతరుల కొరకే చేయాలి

ఈ జీవన దృశ్యం ఆకర్షణీయంగా కనబడాలి

దృశ్యాన్ని అందంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఊసే ఉండదు ఎక్కడా
జీవితం అంటే ఏమిటి?

అని మీనాకుమారి తనను తాను ప్రశ్నించుకుంటుంది.

ప్రేమ ఒక స్వప్నం

అయితే ఆ స్వప్నం ఏమైంది అని నన్ను అడగద్దు

నీతిగా నిజాయితీగా ఉండటం అన్న నేరాన్ని చేసినందుకు

నాకు లభించిన శిక్ష ఏమిటో నన్ను అడగద్దు.

అని తనను తాను పరిచయం చేసుకుంటుంది.

రాత్రి అన్నిటినీ మార్చగలదని మీనాకుమారి. భావిస్తుంది. ఉదయమంతా నటిస్తూ వచ్చిన ఆ మహానటికి రాత్రి స్వాంతన కలిగించింది.  ముక్కలు ముక్కలుగా పగలు ముగిసింది అని రాసుకున్న ఆమె రాత్రి చీకటిలో తన కలల్ని అన్వేషించింది.

మారిన రాత్రి

అక్కడేదో నిగూఢ మైన రహస్యం దాగి ఉందన్న స్పృహ

మేఘావృతమైన ఆకాశంలో కాంతి ఉందన్న భ్రమ

ఏవేవో నీడలు జాడలు ఇంద్రజాలి పర్వతాలు

పలు పుష్ప పరిమళాలు

సర్వం మారింది

బహుశా అది రాత్రి!

రాత్రి అన్నింటిని మార్చగలదు

అది హిమ వర్షం కురుస్తున్న ఏకాంతపు ఏకాంతపు రేయి కావచ్చు

సువాసనా భరితమైన వెన్నెల రేయి కావచ్చు

దుఃఖ భారంతో విరహవేదనతో వేగిపోతున్న కల్లోల నిశి కావచ్చు

అన్ని రాత్రులు వాటి ఇంద్రజాలిక శక్తిని ప్రయోగిస్తే

బాగా తెలిసిన రూపాలనే మనం గుర్తించలేనంతగా మార్చేస్తాయి

అని ఆమె రాత్రిలో మునిగిపోతుంది.

 

ఈ రేయి ఈ ఏకాంతం ఈ గుండె సవ్వడి

భయం గొల్పే ఈ నిశ్శబ్దం

కుంగిపోతున్న తారల నిశ్శబ్ద గజల్ గానం

కాలం కనురెప్పల మీద

ఏకాంతపు నిదుర

ప్రేమానుభూతి యొక్క ఆఖరి కంపనం

అని రాత్రి  ఏకాంతంలో తన గుండె సవ్వడిని మీనాకుమారి వింటున్న దృశ్యాన్ని రాజేశ్వరి అక్షరాల్లో ఆర్ద్రంగా అనువదించారు. కేవలం కొన్ని నక్షత్ర రాత్రులకు మాత్రమే పునర్జన్మ వైభోగం రాత్రిగా సమాప్తమయ్యే అదృష్టం ఉంటుంది అని మీనా కుమారి రాసుకున్నారు.

ఒక్క క్షణం రా

నువ్వు మూసుకుంటున్న

నా నయనాలని వలపు స్వప్నంతో

సజ్జితమొనరించు.

అని నిజమైన ప్రేమకోసం తపించిన మీనాకుమారి ‘కనీసం ఒక్క నేస్తం బాసటగా ఉంటే నువ్వు అతడితో అడుగులో అడుగు వేసే దానివి’ అని బాధపడుతుంది. ‘నిగూఢ సుప్త భావనల కొలిమిలో కాలి కాలి మేను విరహతాపంతో జ్వలించి పోతున్నది దాహంతో నాలుక పిడచ గట్టుకు పోతున్నది .ఈ పిపాస బహుశా ఎవరో వచ్చి నాకోసం తెచ్చిన హాలాహలాన్ని అందిస్తే కానీ తీరదు’ అని ఆమె దహించుకుపోయింది.

మీనాకుమారి తనను తాను దహించుకున్న ఒక అందమైన ఆత్మ. తీరని ఆంక్షల జ్వాలల్లో తనను తాను ధగ్దం చేసుకున్న ఒక వెలుగు రేఖ. మనసంతా ప్రేమ నింపుకుని, కనులలో విషాదం ద్వారా ఆ ప్రేమను ప్రవహించిన మనోజ్ఞ. ఆమె మనసును చదివే ప్రయత్నం చేసినప్పుడు మన మనసులో కరడుతనం కరిగిపోయి, మనమే నీరై ప్రవహిస్తాం.

నా హృది అశ్రు జలాన్ని కురిపిస్తుంది

నాకు ఇలాంటి వర్ష ఋతువే రాసి ఉంది మరి!

అని రాసుకున్న మీనా కుమారి

నాకంటూ ఏమీ మిగల్లేదు

నావి రిక్త హస్తాలు

ఒకప్పుడు నాలో మది దోచే స్వప్న సంరంభాలు

అయితే అవి నా దుఃఖాన్ని నైరాశ్యాన్ని

లేశమైనా తగ్గించలేక పోయాయి

ఇప్పుడు కొన ఊపిరితో చిగురంత ఆశ!

అదే లేకుంటే….. అన్నీ పోయేవే!

పంటి బిగువున జీవన గమనాన్ని సాగిస్తున్నా

కానీ జీవితం తిరిగి నాకేం ఇచ్చింది?

నేను కన్న కలలే నన్ను కాటేశాయి

నా ఊహలే నన్ను కబళించాయి.

అని రాసుకున్నప్పుడు ఏ ప్రపంచం ఆమెను పట్టించుకుంది? ఎన్నో సినిమాల్లో, ఎందరి ముందో ఆమె నటించినా, ఆమె ఒక్క చూపు కోసం లక్షలాది మంది తహతహలాడినా ఆమె మాత్రం ఒంటరిగానే పయనించింది.

ఒంటరిగానే

వెన్నెల రేడు

ఒంటరి వినీలాకాశమూ

దేహం ఒంటరి – ఆత్మ ఒంటరి…

ఒంటరిగా మింటనున్న దీపం వెలుగులో నిలబడింది

ఒక శిధిల గృహం ఒంటరిగా నాకోసం

అది శతాబ్దాలైన నిరీక్షించగలదు

నేను ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను ఒంటరిగానే

అని ఆమె చెప్పుకుంది.

జీవించాలని, ప్రేమించాలని తహతహలాడినా, విరహాగ్నితో తపించే తన నయనాలను చల్లబరిచే గుప్పెడు ప్రేమ కలల్ని కోరుకున్నా మీనా కుమారి మృత్యువును ప్రేమించడమే ఒక విషాదం. ‘వర్తమానం ఒక భ్రమ.  నేను దానిని తాకటానికి యత్నించిన క్షణమే అది దూరంగా జారిపోయి గతంగా మారిపోతుంది. వర్తమానాన్ని చూసినవారు ఎవరైనా ఉన్నారా? దానిని అర్థం చేసుకున్నారా? నా ఊహకి కూడా అందనంత దూరంలో ఎక్కడో సంజె చీకట్ల శిబిరంలో భవిష్యత్తు ఉన్నది.అందుకే నేను గతాన్ని ఆశ్రయిస్తాను.’.అని ఆమె గతంలో జీవిస్తూ మృత్యువును ఆహ్వానించింది.

ఆశలు ఆకాంక్షలు ఏమీలేని

జీవితం సుందరమైనది

నిజంగా మృత్యువు కౌగిలిలో నువ్వు ఉంటే

మెలకువగా ఉండాలనే తపన ఎందుకు?

ఇవాళ మృత్యు దేవతది

పెండ్లి కుమార్తె సౌందర్యమా?

అని ఆమె ప్రశ్నించింది

తాను ప్రేమించిన రాత్రి ఆమెకు చివరకు భయం కూడా కలిగిస్తుంది.

ఇది చలితో గడ్డ కట్టించే శీతరాత్రి

అన్ని వెలుగులూ కట్ట కట్టుకొని

ఏ అవ్వలి దారిలో

వెలుగులు నింపటానికి వెళ్ళాయో

నాకు తెలీనే తెలీదు.

వణికించే క్రూరమైన తిమిరాన్ని

అంతటా పరివ్యాప్తం చేసి

యుగాల కాంతులు

చాటుమాటుగా

ఏదో ఊరేగింపులో

పాల్గొనటానికి వెళ్లిపోయాయి

ఈ తిమిరాంధకారం భయం గొల్పుతోంది.

ఈ విషాదనిశి భయం గొల్పుతోంది

 నా హృదయావరణలో చీకటి అలముకుంది

 ఆకసం లో ఒక్క తార కూడా కానరాదు

 అవనిపై ఒక్క మిణుగురు జాడైనా లేదు

అని రాసుకున్న మీనా కుమారి చివరి వరకూ ఎవరి పద ధ్వనుల కోసమో వేచి చూసింది

చూడు…. చూడు

చంద్రజ్యోత్స్న జలధి మీద దారిని పరిచింది

పాంధుడు ఒక్కడైనా కళ్ళబడలేదు

కేవలం అవిరామంగా పదధ్వనులే వినవస్తున్నాయి

కనబడని పదముల అడుగుల సవ్వడి.

దూరంగా…. సుదూరంగా ………

 

కాని ఆ అడుగులు సమీపించనే లేదు.

నేను ఒంటరిగానే జీవించాలనే నుదుటిరాతని

ఔదల దాల్చి నీ ప్రపంచం నుంచి వెడతాను

దూరంగా అగాధమయ శబ్ద ప్రపంచం నుండి

పరిచితమైన నీ ఊపిరి పరిమళాల నుంచి

దేవళంలో పవిత్రంగా ఓ విగ్రహంలా ఉండే నీ నుండి

దుర్మార్గంగా చిన్నాభిన్నం చేసిన నా గూడు నుంచి

నా హృదిని పదే పదే గాయపరుస్తున్న ఈ కంటకం నుంచి

చిదిమేసిన నా కలల రాజ్యం నుంచి

చీకటి రేయిలోని మంచు శకలాల నుంచి

గొంతులు నులిపేసిన ఈ తారా సమూహాల నుంచి

ఆపిన పయనాన్ని పునః ప్రారంభించవచ్చనే

ఆశల నుంచి చేసిన వాగ్దానాల గురించి…..

దూరంగా సుదూరంగా

అయ్యో…. నీ ఇంద్రజాలి స్పర్శ నుంచి

నీ అడుగుల సడి కూడా వినిపించని తీరాలకు

దూరాలకు నీడలు జాడలు లేని ప్రదేశానికి సాగి

నా సమస్తమూ కేవలం ప్రతిధ్వనులే కాగా

శూన్యాన్ని కౌగిలించుకుని శాశ్వతంగా కనుమరుగవుతాను .

అని మీనా కుమారి ఈ దుర్మార్గ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచంలో మీనా కుమారిలకు స్థానం లేదు. ప్రేమించే హృదయాలకు, కళ్లలోకి చూస్తూ కాలపు స్వర్గపు టంచుల్ని చవి చూసే ప్రేమికులకు, చేతి వ్రేళ్లను స్పృశించి గుండె నాడుల్ని తడిమి, నీలి ఆకాశపు మేఘాల్ని అనుభవించే ఆరాధకులకు ఇక్కడ స్థానం లేదు.

మీరా కుమారిని మరిచిపోకుండా మన గుండె తలుపులు తట్టే ప్రయత్నం చేసిన రాజేశ్వరికి కృతజ్ఞతలు. త్వరలో ఆమె కవితలు సంకలనంగా రావాలని ఆశిద్దాం.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.