చరిత్ర రచనలో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు

 రిత్ర అనేది ఒక వ్యసనంగా మారింది. అదొక అధ్యయనంగా భావించబడటం లేదు.
నిజానికి చరిత్ర అనేది ఒక ఊహ  మనకి దొరికిన ఆధారాల పై ఆధారపడి చేసే ఊహ. నిజంగా గతంలో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఎవరివల్లా సాధ్యం కాదు. అందువల్ల కాలక్రమంలో కొత్త ఆధారాలు దొరికే కొద్దీ కొత్త ఊహలు మొదలవుతాయి.
భిన్నమైన ఊహలు కూడా ఉంటాయి. అంతేకానీ చరిత్ర అనగానే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు. ఇప్పుడు మన దేశంలో చరిత్ర పైన భక్తి పెరిగింది  చరిత్ర అధ్యయనం కన్నా దానిపై భక్తి అనేది పెరిగింది.దాన్ని చరిత్ర భక్తి అని కానీ హిస్టరీ కల్ట్ అని కానీ అనచ్చు. అటు దళితవాదులు హిందూ వాదులు ఎవరికి తోచినట్లు వారు చరిత్ర అనేదాన్ని చెప్తున్నారు. ఎవరికి తోచిన చరిత్ర వాళ్ళు చెప్తున్నారు. అయితే పురాణం సాహిత్యం కన్నా చరిత్ర అనగానే సాధికారత వస్తుందని నమ్ముతున్నారు .అందువల్ల పురాణం కన్నా సాహిత్యం కన్నా చరిత్ర అనేది గొప్పది అనే భావం పెరిగింది .ప్రముఖ సోషలిస్టు రామ్ మనోహర్ లోహియా అంటారు- చారిత్రక పురుషుల కన్నా పురాణ పురుషులు ప్రభావశీలమైన వారు అని. గాంధీ కానీ , లోహియా కానీ పురాణాలని కేవలం చరిత్ర దృష్టితో చూడలేదు. వాటి అంతరార్థాలని కొత్తగా నిర్వచించటానికి ప్రయత్నించారు. నిజంగా రాముడు కృష్ణుడు భూమిమీద నడిచారా అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. ఆ పురాణ పాత్రల ఆధారంగా ఏం చెప్పబడింది ఏ అంతరార్థం ఉంది అనేది ముఖ్యం అని రాం మనోహర్ లోహియా భావించారు. అందుకే ఆయా పురాణపాత్రలపై వ్యాఖ్యానం చేశారు .పూర్వం వ్యాస భగవానుడు కూడా తత్వం చెప్పడం కోసం పురాణాలు కల్పించినట్లు స్వయం గా చెప్పారు. వేదాంతం ప్రకారం జగత్తు మొత్తం కల్పన మాత్రమే.
ఇప్పుడు బిజెపి చేస్తున్నది దానికి పూర్తిగా భిన్నమైన పద్ధతి .రాముడు ఫలనా చోట పుట్టాడు ఫలానా చోట రాముడి ఆలయం ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు. శిథిలాలు ఉన్నాయి అంటున్నారు. అందువల్ల అక్కడ రాముడికి పవిత్రమైన ప్రాంతంగా భావించాలి అని వాళ్ళు అంటారు .అంటే ఇక్కడ నమ్మకాల కంటే శిథిలాలు పురావస్తువులు  ప్రధానమైనవి. పురాణ వ్యాఖ్యానాల కంటే చరిత్ర ప్రధానమైనది దళితవాదులు బౌద్ధులు కూడా ఇలాగే చరిత్రని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. రాముడు చారిత్రక పురుషుడు కాదని అశోకుడు చారిత్రక పురుషుడని వాళ్ళు అంటున్నారు.
అందువలన వాస్తవంగా చరిత్రలో నిలిచిన పాత్రలనే తీసుకోవాలని వాళ్లు అంటారు .దానివల్ల కవిత్వాత్మకమైన ఊహలు గొప్ప తాత్విక వ్యాఖ్యానాలు ప్రాధాన్యం కోల్పోతాయి. ఇదే పద్ధతిని హిందూ వాదులు కూడా అనుసరిస్తున్నారు. సర్వాంతర్యామి అనే వ్యాఖ్యానం చేయబడిన భగవంతుడిని ఒక ప్రాంతానికి ఒక స్థలానికి కుదిస్తున్నారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలు అన్ని స్థలాలు పవిత్రమైనవిగా దైవ భూములుగా భావించబడతాయి. అనేక స్థల పురాణాలు,మహా పురాణాలు ఉంటాయి .అయోధ్య మాత్రమే కాదు అంతకన్నా భద్రాచలం ఎక్కువ పవిత్రంగా భావించబడుతుంది. రామదాసు కీర్తనలు ఇక్కడ ఎంతో ప్రశస్తికెక్కాయి. భద్రాచలంలో భక్తుడిని బట్టి దేవుడికి గొప్ప స్థానం లభించింది .దేవుడు పుట్టిన స్థలం కన్నా భక్తుల హృదయంలో వెలిసిన స్థలము ఇంకా గొప్పది అని భారతీయులు భావిస్తారు. హృదయమే దేవాలయం గా వాళ్ళు భావించటం వలన భద్రాచలం కి అయోధ్య కన్నా ఎక్కువ ప్రాధాన్యం లభించింది. కేవలం చరిత్రపై చరిత్ర ఆధారాలపై మాట్లాడేవాళ్లు గొప్ప దైవ దర్శనాన్ని పొందలేరు.ఆధ్యాత్మికం గా ఎదగలేరు. ఈ విషయం కమ్యూనిస్టులకి, హిందూ వాదులకి, దళితవాదులకి తెలీదు. ఎందుకంటే వాళ్లు ఎక్కువగా చరిత్ర పై ఆధారపడుతున్నారు. పురాణాలని తత్వాన్ని పక్కన పెడుతున్నారు.
 చారిత్రక దృష్టి వల్ల స్థలకాలాలకు సంబంధించి ఆలోచన పరిమితం అయిపోయింది .ఆలోచనలు, తత్వాలు ఎక్కడ పుట్టాయి ఎటు వెల్లాయి అనేది అసలు ఆ ఆలోచన ఎటువంటిది ఆ తత్వంలో ఎటువంటి నిగూఢత ఉంది అనే దానికన్నా ప్రధానమై కూర్చుంది. మనకి బుద్ధుడు చారిత్రక వ్యక్తి అనే విషయం ఈ మధ్యకాలంలోనే తెలుసు. కానీ బౌద్ధం గురించి శంకర రామానుజాది భాష్యాలలో ప్రసక్తి ఉంది .పూర్వపక్షంగా వివరణ ఉంది .బౌద్ధం ఇతర సిద్ధాంతాలపై ప్రభావం వేసింది అనే విషయాన్ని అందరూ చెపుతూ వచ్చారు. శంకరుని ప్రచ్ఛన్న బౌద్ధుడు అని కూడా అన్నారు. అంటే బౌద్ధం ప్రభావం అద్వైతం పై ఉంది అని రామానుజాది ఆచార్యులు చెప్పనే చెప్పారు. ఆవిధంగా వివిధ సంస్కృతుల మధ్య ఆదాన ప్రదానాలు ఉన్నాయి. అలాగే అబ్రహామిక్ రె లిజియన్స్ తో సంబంధం కూడా హిందూ మతానికి ఉండేది. ఈ ఇచ్చిపుచ్చుకోడాలు ఆదాన ప్రదానాల గురించి ప్రసక్తి తగ్గి చారిత్రక దృష్టి వల్ల వివిధ సంస్కృతల మధ్య ఘర్షణ ప్రధానంగా చూపే అలవాటు పెరిగింది .ఇది వివిధ సంస్కృతులు, మతాలు మద్య పోటీగా మారుతుంది. సమన్వయం సోదర భావం పక్కన పెట్టబడుతున్నాయి. ఇది ఉమ్మడి సంస్కృతికి ముప్పుగా మారింది .అందువల్ల చరిత్ర కన్నా పురాణము స్థానిక కథనాలు ప్రధానమైనవి.అవి ఈ ఖాళీలను పూరిస్తాయి.
   కొంతమంది  స్థానికులు అంటూ ఎవరూ  లేరు, అందరూ ఎక్కడి నుంచో వచ్చారు, అంతా వలస అంతా జన్యుల వలస అని గొప్పగా చెబుతున్నారు. మరి కొంతమంది అంతా ఇక్కడే పుట్టింది అంతా వైదిక సంస్కృతి  అని చెప్తున్నారు. ఇలాంటి హేతుబద్ధంగా కనిపించే కథనాలకన్నా గతంలోని సంప్రదాయ కథనాలు పురాణాలు ఒక ఉమ్మడి సంస్కృతిని నిర్మిస్తూ వచ్చాయి. మీ మాంస భాష్యకారుడైన  శబరుడు వేదాలని అర్థం చేసుకోవడానికి మ్లేచ్చ భాషల అధ్యయనం పనికి వస్తుంది అని రాశారు. ఈ విషయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాశారు.  యవనులలో ఖగోళ శాస్త్రం ఉంది అని అందువలన వాళ్లని ఋషులుగా గౌరవించాలి అని వరాహమిహురుడు రాశాడు.
ఇంక మన దేవతలు కూడా ఎంతో విశాల దృష్టిని కనబరిచారు. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారి అనే ఒక ముస్లిం స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ విగ్రహం తిరుపతి వేంకటేశ్వర ఆలయంలో ఉంది. ముస్లింలు ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
ఇటువంటి వైవిధ్యపూరితమైన కథనాలు మన ఊహలలో ఉన్నాయి అవి అక్కడ ఇక్కడ, అది ఇది, వాడు వీడు, నేను నువ్వు అనే విభజనని తగ్గిస్తాయి. చరిత్ర కథనాలు, సైన్సు కథనాలకి ఆ శక్తి లేదు. అందుకే అవి చాలా డొల్లగా ఉంటాయి .ఊహా తక్కువ గా వున్ననేటి డోల్ల మనుషుల్ని ఆకర్షిస్తాయి. పాఠకులను పెంచుతాయి. కానీ వైవిధ్యాన్ని పెంచవు. ఐక్యతను పెంచవు. ప్రాచీనుల విశ్వాసాలని కథనాలని పురాణాలని పక్కనపెట్టి ఇటువంటి హేతుబద్ధకథనాలలోకి వెళ్లడం ద్వారా మనం పెద్దగా సాధించినది లేదు.
అంతకన్నా లోహియా గాంధీ వంటి వారు తాత్విక వ్యాఖ్యానానికి ప్రాముఖ్య త ఇచ్చారు. తద్వారా ఒక వైవిధ్యాన్ని ఐక్యతని సాధించడానికి గొప్ప కృషి చేశారు. వారి మార్గం మరింత విశాలమైనది. అలాగే కరపాత్ర స్వామి వంటి వారు కూడా గొప్ప కృషి చేశారు. వారు కూడా ఇలా పురాణ పాత్రలని కేవలం చారిత్రక కథనాలుగా దిగజార్చలేదు. జన్యు కథనాల వెంట పరిగెత్తలేదు . రైట్, లెఫ్ట్, దళితవాదుల చారిత్రక కథనాల కంటే పురాణ కథనాలు విశాలమైనవి, ఐక్యతకు సంకేతాలు.
 చరిత్ర దృష్టిలో మొదటినుంచి ఘర్షణ ప్రధానం. కమ్యూనిస్టులు వర్గ ఘర్షణ ని ప్రధానం చేశారు. రైటి స్టులు మత ఘర్షణ ప్రధానమన్నారు. దళితవాదులు కులఘర్షణ ప్రధానమన్నారు.  దళితవాదులు బౌద్ధము శాంతియుతమైన మతం అన్నారు. రై టిస్టులు హిందూ మతం శాంతియుతం అన్నారు. కమ్యూనిస్టులు ఘర్షణ నే ప్రధానం చేసినప్పటికీ ముస్లింలను శాంతియుతమైన వారుగా చెప్పటానికి ప్రయత్నించారు .కానీ వాస్తవం చూస్తే వీరు ఎవరు చెప్పినది నిలవదు. ముస్లింలు కొన్ని సందర్భాలలో మత కారణాలతో దాడి చేయడం నిజమే .అయితే శైవం  వైష్ణవుల పైన బౌద్ధల పైన జైనుల పైన దాడి చేయడం కూడా నిజమే. కమ్యూనిస్టులు కమ్యూనిస్టు దేశాలలోనూ ఇక్కడ కూడా వివక్షతో దాడి చేయడం కూడా నిజమే. పౌర హక్కుల మేధావి  కె.బాలగోపాల్ వ్యాసాలు గుర్తుతెచ్చుకోదగినవి. అందువల్ల చరిత్ర పేరుతో సామరస్యాన్ని స్థాపించటం కష్టం .
అంతకన్నా జనం హృదయాలలో తిష్ట వేసిన పురాణ కథనాలు, సాంస్కృతిక కథనాలు ఒక సామరస్య ధోరణికి దారితీస్తాయి  అందువల్ల చరిత్ర కన్నా పురాణాన్ని స్థానిక కథనాలని అధ్యయనం చేయడం మరింత అవసరం.
 భగవద్గీత ని ఎంతమంది ఎన్నిసార్లు రాశారు అనడం కన్నా భగవద్గీత మన మీద వేసే సబ్జెక్టివ్ ప్రభావాలని అధ్యయనం చేసి వ్యాఖ్యానం చేస్తే మంచిది. తద్వారా ఒక అవసరమైన నూతన వ్యాఖ్యానాన్ని ఇవ్వగలుగుతాము. భగవద్గీత ని కేవలం చారిత్రకంగా చూడడం వలన ఉపయోగం ఉండదు. అలాగే బైబిల్ నైనా సరే.  డెత్ ఆఫ్ ఆదర్ అని ఒక ఆధునిక సాహిత్య సిద్ధాంతం ఉంది. రచయిత రచన చేసిన వెంటనే చనిపోతాడు. ఆ రచన ఆ గ్రంథం పాఠకుడి వ్యాఖ్యానాలపై బతుకుతుంది. అందుకే భగవద్గీత కి అద్వైత ద్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానాలు భాష్యాలు సాధ్యమయ్యాయి. గాంధీ కూడా తనదైన వ్యాఖ్యానాన్ని జోడించి స్వతంత్ర ఉద్యమానికి ఉపయోగకరంగా మార్చారు. వీటిలో ఏది ప్రామాణికం ఏది చారిత్రకం అనేది చరిత్ర పేరుతో బుర్ర పగలగొట్టుకునే వ్యర్ధులకు వదిలేద్దాం.
 చరిత్ర సైన్సు ఆబ్జెక్టివ్ ప్రమాణాల మీద ఆధారపడేవి అని నమ్మకం ఉంది .చరిత్ర విషయంలో చరిత్ర కారుడు నేపథ్యం పనిచేస్తుందని అనేకసార్లు ప్రూవ్ అయింది. వలసవాదులు రచించిన చరిత్రలో వారి పాలనని వారి ఆధిపత్యాన్ని సమర్ధించుకున్నట్లు మనకు తెలుస్తుంది. అదే కమ్యూనిస్టులు కమ్యూనిస్టు దేశాలు, కమ్యూనిస్టు ఉద్యమాలలోని అణిచివేత, లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుంది .హిందూ రైటిస్టులు హిందూ మతం,ఆ హిందూ సంస్కృతిలో జరిగినటువంటి లోపాలని ఘర్షణనని కప్పి పుచ్చారు .అలాగే బౌద్ధులు పూర్వం బౌద్ధులు ఆజీవకులపై చేసిన దాడిని, బౌద్ధ దేశాలలో జరుగుతున్న జాతి హింస ని పట్టించుకోరు. క్రైస్తవులు ఇజ్రాయిల్ ను విమర్శించరు .పైగా బైబిల్ పేరుతో సమర్ధిస్తారు కూడా.  వీళ్ళందరూ ప్రామాణిక చరిత్రను అనుసరిస్తున్నామని, చరిత్ర ఆబ్జెక్టివ్ అని మాట్లాడుతారు. అంతకన్నా సాంస్కృతిక కథలు  ఒక ఉమ్మడి కాన్షియస్నెస్ ని ఉమ్మడి చైతన్యాన్ని ప్రదర్శిస్తాయి.
చరిత్ర అంటే డీ మిస్టిఫికేషన్  అనే అభిప్రాయం ఉంది.నిజానికి చరిత్ర దృక్పథం  మిస్టిఫికేషన్   కి దారి తీసింది.    కొన్ని. సమాజాలు చరిత్ర క్రమం లోనూ చైతన్యం లోనూ వెనకబడి పోయాయని మరికొన్ని పురోగమించాయి అనే వర్గీ కరణ మొదలైంది. ఇది యూరో సెంట్రిజం కి దారి తీసింది. తృతీయ ప్రపంచదేశాలు వలసవాద సామ్రాజ్య వాద పీడిత దేశాలు ప్రిమిటివ్ స్టేజ్ లో మిగిలిపోయాయి మార్పులేని స్థితిలో మిగిలిపోయాయి అనే మిథ్యా  వాదన బలపడింది.   దాంతో యూరప్ ను అన్ని విధాలా అనుకరించే కుహనా మేధావులు పుట్టుకొచ్చారు.అలాంటి అనుకరణ పర్యవసానమే మోడరన్ హిందుత్వ.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం

రాణి శివశంకర్ శర్మ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది. ఇప్పుడు చరిత్ర ఒక ఆయుధం. వ్యతిరేకులపై చేసే యుద్ధంలో ఒక బలమైన ఆయుధం.

  • చాలా ఆలోచింపచేసే వ్యాసం..

  • చాలా సందర్భోచితంగా, సముచితంగా, మనం స్వీకరించవలసిన మార్గాన్ని, ప్రపంచంలో హేతువాదులందరూ తిరగదోడి పునరాలోచన చేయవలసిన అగత్యాన్ని స్పష్టీకరించారు.
    అయినా యిదియిక్కడితో ఆగకూడదు. మరింత ఆలోచించవలసిన, పృఛ్చించవలసిన ఆవశ్యకత చాలా వుంది. మీరు దారితీశారు. ముదావహం.
    మీరు చెప్పినదాన్ని వక్రీకరించే అవకాశం మరింతగా పెరుగుతుంది. అదే విచారకరమైన విషయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు