యామినీ కృష్ణ కవితలు రెండు

పుట్టింది జూలై 1986. సిరిపురం తెలంగాణ లో. చదువు, పెరిగింది అంతా విజయవాడ. వృత్తి రీత్యా గతంలో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా, సోషల్ వర్కర్ గా, ఇంగ్లీష్ మీడియా లో ఫీచర్ రైటర్ గా పనిచేశాను. ప్రస్తుతం ఇంగ్లిష్ తెలుగు పుస్తకాలు, కవిత్వం అనువాదాలు చేస్తున్నాను. రాయకుండా ఉండలేనంత, మోయలేనంత దుఃఖమో, ఆనందమో కలిగినపుడు తప్ప కవిత్వం రాయలేకపోవడం నా బలహీనత అనుకుంటాను. ఇప్పటి కవిత దాదాపు పదేళ్ల నుండి వెంటాడుతున్న ఒక విషాద సంఘటన గురించి రాసుకున్నది. కొంతమంది సాహితీమిత్రులు అన్నట్టుగానే కవిత్వ శైలి విషయంలో అక్క స్వాతి ప్రభావం నామీద ఉందనుకుంటాను.

 

1

సజీవ శిథిలాలు

 

ఐదేళ్ళుంటాయేమో నాకప్పుడు.

పొద్దుటే ప్రేమగా పిలిచే గొంతు..

నవ్విస్తూ నీళ్లు పోసిన చేతులు..

గారాం చేస్తూ తినిపించిన గోరుముద్దలు ..

బడి నుండి రాగానే సేద తీర్చిన వెచ్చని ఒడి..

….

ఆ రోజుకేవీ మిగల్లేదు!

ఒక్క జ్ఞాపకాన్నైనా సజీవంగా మిగుల్చుకోనీయని కాలం..

ఒక్క అమ్మ ఆపేక్ష తప్ప  !!

 

ఎవరో అడిగినట్టు గుర్తు..  అమ్మ తల దగ్గర దీపం రెపరెపలాడుతున్నప్పుడు.

‘రేపట్నుంచీ ఎలారా  నీకు’?..

ఆ ప్రశ్నైతే రాలేదు నాకప్పటికి.

 

బడి నుండి రాగానే అమ్మని అడగాలి.

 

నా పుస్తకాలకు అట్టలేస్తున్నపుడో..

కధ చెప్తూ..  వేడన్నం తినిపిస్తున్నపుడో..

తిర్నాల్లో కొనుక్కున్న బొమ్మలకు బట్టలు కుడుతున్నపుడో..

నాకు తల దువ్వి.. దిష్టి తీస్తున్నపుడో..

చీకట్లో నడిచేప్పుడు భయపడొద్దని చంకకెత్తుకున్నపుడో..

అడగాలి.

రేపణ్ణుంచీ ఏది ఎలానో ..!

 

నాకు జ్వరమొచ్చినపుడు..

-నువు పస్తులున్నపుడు,

ఎండలో నడిచి నా పాదాలు కందినపుడు..

-నువు ఏడ్చినపుడు,

నాన్న కొట్టబోతున్నపుడు..

-నువు అమాంతం నన్నెత్తికెళ్లినపుడు,

ఆదివారం కాకుండానే బళ్ళో సెలవిచ్చినపుడు..

-నిన్ను చూడ్డానికి ఇంటిదాకా ఆగకుండా పరుగెత్తుకొచ్చినపుడు,

 

ఆరవ పుట్టినరోజున తలంటు పోస్తున్నపుడైనా..

అడిగేయాలి మరి.

….

రేపణ్ణుంచీ ఎలా అమ్మా..  అని!

 

2

శోకార్ణవం

 

 

తల్లీ..

నీ మూడేళ్ల పసి వాడి పాదాలు తమలపాకులన్నావే..

చిట్టి లేత అరిచేతుల్లో గోరింటాకు పెట్టావే..

 

వాడు నవ్వితే…  దిష్టి తీసావే..

ఏడిస్తే… కన్నీరయావే..

 

చిన్న నొప్పి కూడా తాళ లేడని పసివాడిని గుండెకి హత్తుకుని జోలలు పాడావే..

కృష్ణుడే పుట్టాడని..  నలుగురికి చెప్పుకుని మైమరచిపోయావే..

 

అష్టమి ముందునాడు అదమరపున తొట్టె లో పడ్డ బిడ్డ ఎన్ని మునకలు వేసి ఉంటాడు..?

నిన్ను పిలవబోయి ఉంటాడు..

ఉక్కిరిబిక్కిరైన ప్రాణం అర నిమిషానికే అలసిపోయి ఉంటది…!!

రోజూ లాల పోసిన నీళ్ళు కదా..

అమాయకంగా నమ్మి ఉంటాడు..

 

వాడు రోజూ ఆడుకునే వాకిట్లోనే ..

పసివాడు కదలకుండ పడుకున్నాడు..

ఎప్పుడూ నిద్దరోయే నీ నేత చీర మీదనే..!

 

వీధి మొత్తం నీ రోదనకి ఉలిక్కిపడి లేచింది ఆ ఉదయం..

పసి పాదాలను హత్తుకుని నేలపై సొమ్మసిల్లావు.

 

బిడ్డ పిలిచినట్టై ..

మధ్య మధ్యలో అదిరిపాటు గా లేస్తున్నావు..

పిచ్చిగా దిక్కులు చూసి..   మళ్ళీ కుప్ప కూలుతావు..

 

కాస్త ఎంగిలి పడు తల్లీ.

ఇంకాసేపు కడుపు దీరా ఏడుద్దువు గాని !

 

నీ చుట్టూ ఏదో హడావిడి..

కన్నీటి తెరల్లో దూరమవుతున్న నీ పసివాడు …

 

ఒక్కసారి పిలువమ్మా నీ గారాల బిడ్డనీ…

నీ గొంతు వింటే ఎక్కడున్నా చిట్టి అడుగులతో పరిగెత్తుకు రావచ్చు ..

వాడెప్పుడూ నిన్ను విడిచి లేడు..

గుక్కపట్టి ఏడిస్తే..  జోల పాడేదెవరు .. ?

 

విశ్వం బద్దలైన్నట్టు..  నీ కేక..

దూరమవుతున్న నీ మూడేళ్ల బిడ్డ ఆ రోజు మారుపలకలేదు ..

పెనుగులాడుతూ కుప్ప కూలావు.

 

ప్రతి పలకరింపుకీ నీ గుండె పగుల్తుంది..

తల్లీ..  నీ శోకం కొలిచే భారమితులేవి..??!!

*

చిత్రం: సృజన్ రాజ్ 

యామినీ కృష్ణ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు