1
యుద్ధ సమయంలో ముద్దు పెట్టుకుందాం
కూలిపోనీ వేల సామ్రాజ్యాలు
రాలిపోనీ రాజభవంతులు
పారిపోనీ పిరికి పాలకులంతా
పతనం కానీ ప్రపంచమంతా
పునర్భవించనీ భువనాలన్నీ
సంతసిల్లనీ సకలజనావళి
సాకారం కానియ్ స్వప్నాలన్నీ
ఎగరనీ స్వేచ్ఛాగగనాన
పక్షుల్లాగా ఖైదీలంతా.
తడవనీ స్వాతంత్ర్యపరామృత-
వర్షధారల్లో సామాన్యులంతా.
ప్రేమించేద్దాం భయరహితంగా
కవాతు చేద్దాం సమానతలకై
ఐక్యత గీతం ఆలాపిస్తూ
మ్రోగించేద్దాం ప్రభాతభేరీ!
యుద్ధసమయంలో ముద్దులు ఇద్దాం
మానవప్రేమకు ప్రాణం పోద్దాం
మనముద్దులే మనికికి సాక్ష్యంగా
ప్రపంచశాంతిని ప్రభవించేద్దాం!
2
శాశ్వత నిద్ర
ముద్దుముద్దు పాపలు
ముద్దులతో నిద్ర పోతారు
ముద్దులతో నిద్ర లేస్తారు
కానీ ఏ ముద్దులు ఇకపై వారిని
ఈ నిద్రనుండి లేపలేవు.
3
ముప్పై మూడున్నర రకాల ముద్దులు
ఆమెను ఇరవై మూడు రకాలుగా
ఎలా ముద్దు పెట్టుకోవాలో
గూగులయ్య నేర్పుతాడు
ఆమె పెదవులను, నాలుకను ఆక్రమిస్తూ
ఆమె మాటలను నొక్కివేస్తూ
ఆమెను నిశ్శబ్దంగా మార్చివేస్తూ.
నాదెప్పుడూ డొంకతిరుగుడేగా!
ప్రపంచం అతణ్ని శపిస్తున్నప్పుడు
నా ప్రేమికుని దగ్గరికి వెళ్ళి
ముప్పై మూడున్నర రకాలుగా
ముద్దు పెట్టుకున్నాను.
ఇప్పుడు నేనే గూగులమ్మను!
ఆమె అతణ్ని ఎలా ముద్దు పెట్టుకోవాలో
నేను నేర్పిస్తాను, ఏ ఆక్రమణ లేకుండా
రెండు నాలికల నాట్యవిన్యాసంగా!
*
చిత్రం: సృజన్ రాజ్








Add comment