మనకి తెలియని మనవాళ్ళ కథలు!

మంచి, చెడు అనేవి మనిషి లక్షణాలైనప్పుడు వాటిని మతానికి ఆపాదించటమెంతవరకు సబబు?

  టీవల వచ్చినకథా మినార్కథా సంకలనం చదవటం ఒక ప్రత్యేక అనుభవం. మనతో కలిసి, మన మధ్య జీవించేవారిని గురించి మరింత తెలుసుకోవటం నిజంగా బావుంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులు నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నపుడు మౌనంగా ఉండిపోతే వారు అనుభవిస్తున్న దుఃఖం ఇతరులకి తెలిసే అవకాశం లేదు. వారు మౌనం వీడవలసిందే. సమాజంలో వస్తున్న అస్తిత్వవాదాలన్నీ అలా పుట్టుకొస్తున్నవే కదా.

ఈ పుస్తకం ద్వారా ముస్లిం జీవితాలను దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుంది. తమ జీవితాల్లోని సంఘర్షణలకీ, తమవే అయిన సమస్యలకీ అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కథల రూపాన్నిచ్చేందుకు రచయితలు చూబించిన శ్రధ్ధ, కృషి అభినందించదగ్గవి. వారి జీవితాల్లోని క్లిష్టతను సమాజమంతా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ కథలన్నింటినీ ఒకచోట కూర్చి ముస్లిం జీవితాల్లో ఉన్న ప్రత్యేకమైన కోణాలని, వారిపట్ల పాలకులు, మిగిలిన సమాజం చూపుతున్న అనాదరణనీ పాఠకులకు తెలియజేసేందుకు సంపాదకులు ఖదీర్ బాబు, షరీఫ్ ఇద్దరూ మంచి ప్రయత్నం చేసేరని చెప్పవచ్చు.

సంపాదకుల ముందుమాట చాల విషయాలను చెబుతుంది. వారి ఆవేదన, ఆరాటం వారి మాటల్లోనే చెప్పాలంటే,

దాడికి వీలయ్యే సమూహమూ, దాడి చేయగల సమూహమూ ఉన్నాయంటే ఆ సమాజం చాలా అసమంజసమైన ధోరణిలో నడుస్తున్నదని అర్థం. నేడు చాలా సమూహాలు ఈ పీడనకు లోనవుతున్నా వర్తమానంలో అందరికంటే ఎక్కువగా వివక్షకు, వేదనకు, అభద్రతకు, అలక్ష్యానికి గురవుతున్నది ముస్లింలే అని అధ్యయన పత్రాలు నిరూపిస్తున్నాయి. ‘

‘… ముస్లింల జీవితాలకు సంబంధించి వాస్తవాల కన్నా అపోహలు ప్రచారం చేయటం ఒక నిరంతర చర్యగా కొనసాగుతూ వస్తోంది………………ముస్లింలకు నోరెత్తనీయని పరిస్థితులు కల్పిస్తే నోరెత్తగలిగే మెజారిటీ శ్రేణులను భయభ్రాంతం చేసే సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ద్వేషంతో విభజితమయ్యే సమాజంలో శాంతి మనుగడ సాధించలేదనే చిన్న విషయం గురించి ఎరుకలేని ఉన్మత్తతలోకి సమాజం కూరుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.’

ఈకథలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రచయితల కథలు. దేశంలో జరుగుతున్న ఘటనలకు వర్తమాన తెలుగు ముస్లిం సమాజం ఎలా అనుకంపనం చెందుతున్నదో తెలియజేయటానికి శాంపిల్ గా తీసుకున్న కథలివి

ఇలాటి ప్రయత్నం దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి, అన్ని భాషల నుంచి రావాలని, ముస్లిం సమాజ అంతరంగం మరింతగా ఆవిష్కృతం కావాలని సంపాదకుల ఆకాంక్ష.

ఈ పుస్తకంలోని రచయితలందరూ వ్యక్తం చేసిన భావాలు ఒక్కటే. ముస్లింలలో ఉన్న వెనుకబాటుతనానికి అవిద్య, అనైక్యత, దారిద్య్రం కారణాలని చెబుతున్నారు. ‘ముస్లింలు చాలా రకాలుగా చీలిపోయి ఉన్నారని, చెప్పటానికి, పాటించటానికి మధ్య ద్వంద్వ విలువలు పాటిస్తున్నారనిరచయిత షేక్ హుసేన్ సత్యాగ్ని చెప్పగా, ‘ఏమతానికైనా, సమూహానికైనా కాలానుగుణమైన సంస్కరణ తప్పనిసరిఅని రచయిత సలీం చెబుతున్నారు. ‘అర్బన్ సమాజంలోనూ వివక్ష స్పష్టంగా ఉన్నదనిపత్రికా రంగంలో ఉన్నయువ రచయితలు చెబుతున్నారు.

కథలన్నీ వేటికవి వేర్వేరు కథావస్తువులను తీసుకున్నవే. ‘సందల్ ఖోడ్కథలో తల్లి గంధపు చెక్కలా అరుగుతున్న వైనాన్ని తండ్రి దౌష్ట్యాన్ని చిన్న పిల్లవాడుగా ఉన్న కొడుకు గ్రహించి తిరగబడతాడు. అలాగేగోద్’, ‘మొదటిసారి’, ‘చట్రంకథలు స్త్రీలకెదురయ్యే బాధాకరమైన అనుభవాలు చెప్పినపుడు అవి మతాతీతమని మన సమాజపు అనుభవం చెబుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా కథలలో కనిపిస్తాయి. ఆడపిల్ల ఉనికి, చదువు, పెళ్లి కూడా అతిపెద్ద సమస్యే. ‘కష్టం ముద్దకథలో ఖాదర్ కుటుంబమంతా కష్టపడి సౌకర్యంగా జీవించటం పట్ల అతని ఆఫీసులో ఉద్యోగులు తమాషాగా అయినా అన్నమాటలు చదువరులకు కష్టం కలిగిస్తాయి. ‘హలాలాకథ ముస్లిం జీవితంలో ఉన్న ఒక పార్శ్వం చూబిస్తుంది.

ఈదుల్ ఫితర్’, ‘పానీ’, ‘ఎర్ర చందనం’, ‘ధక్కాకథలు కంట నీరు పెట్టిస్తాయి. పానీ కథలో కూతురు పరాయి యువకుడితో వెళ్లిపోయిందని తెల్సినపుడు, ‘నీళ్లు మోసితెచ్చే బాథ తప్పేందుకు కూతురు కోరుకున్నట్టు గోషాను పెడతాడా లేదా ఆ యువకుడుఅని మాత్రమే తల్లి కన్నీళ్లమధ్య అనుకుంటుంది. తలాక్, ఖులా వంటి ముస్లిం ఆచారాల గురించి ఇందులో కొన్ని కథలు చర్చించాయి. ‘బుజ్జిమేకపిల్లకథ ఈ వ్యవస్థలో ప్రశ్నించటం నేరమని చెబుతోంది. చదువు, ఆలోచన సమాజంలో పెరిగితే వివక్షని ప్రశ్నించే గొంతులు బలం పుంజుకునే ప్రమాదం ఉందన్నది తోడేళ్ల భయం. ‘బైపాస్ రైడర్స్కథ మానవత్వ విలువలకు పరాకాష్ట. ఈ కథ ఇటీవల సారంగ వెబ్ మ్యాగజైన్ లోఅనగనగా ఒక మంచి కథగా పరిచయం చెయ్యబడింది. ఈ పుస్తకంలోని ప్రతి కథా చదువరులను ఆలోచింపజేస్తుంది.

ఖదీర్ బాబు కథగెట్ పబ్లిష్డ్లో నయాబ్ పాత్ర ఉలిక్కిపడేలా చేస్తుంది. ఏడేళ్ల ముష్టాక్ చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటాడు మనకి. అత్తరు పూసిన అందమైన కన్నీటి కథ ఇది. ‘ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నా మెజారిటీల చేయూత ముస్లింలకు ఉందన్న సంగతి మర్చిపోరాదుఅన్న రచయిత మాటలు భవిష్యత్తు మీద ఆశను పుట్టిస్తున్నాయి.

సాధారణంగా వివక్షకు గురైనవాళ్ల ఆక్రోశంలో కొంచమైనా తీవ్రత ఉంటుంది. కానీ ఈ రచయితలంతా కథలను చాలా సంయమనంతో చెప్పారు. ఎక్కడా ఎలాటి తీవ్రతా ఆగొంతుల్లో వినిపించదు. అందరూ కూడా తమ మతంలో ఉన్న అనైక్యతని, అవిద్యని, మూఢనమ్మకాల్ని గురించి వేదన వెలిబుచ్చారే కానీ ఎవరిమీదా ఆగ్రహాన్ని చూపలేదు. వందల ఏళ్ళుగా సమాజంలో భాగమై ఉండి కూడా పరాయితనాన్ని ఎదుర్కొంటున్న తమ అసహాయతను తెలియజేసారు. 

ఇక్కడొక విషయం జ్ఞాపకమొస్తోంది, రెండేళ్ల క్రితం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తిరిగినపుడు ఒక ప్రసిధ్ధ హిందూ దేవాలయం ముందుకేవలం హిందువులకు మాత్రమే ప్రవేశముఅని ఉండగా, ఒక ప్రసిధ్ధ దర్గా ముందు, ‘అన్ని మతాలవారికి ప్రవేశముందిఅన్న బోర్డు ఉంది. మతాలన్నీ హృదయాలను విశాలం చేసుకోవలసిన అవసరం ఉందన్నది స్పష్టం.

మంచి, చెడు అనేవి మనిషి లక్షణాలైనప్పుడు వాటిని మతానికి ఆపాదించటమెంతవరకు సబబు? తామే ఏర్పాటుచేసుకున్న మతాలు మనుషుల మధ్య వేర్పాటుని సృష్టిస్తుంటే వారి వివేకం ఏమైందన్న ప్రశ్నఎదురవుతోంది. ఇప్పటికైనా ఇలాటి వివక్షలను వదిలి భావితరాలకి ఆరోగ్యకరమైన సమాజాన్నివ్వాల్సిన  బాధ్యత మనదే. తోటి మనిషి పట్ల సహానుభూతిని మరచిపోతున్నామన్న విషయాన్ని ఎవరికివారు గ్రహించుకుని మారవలసిన అవసరం ఉంది.

సమాజపు ఒక పార్శ్వాన్ని నిశ్శబ్దంగా గాయపరుస్తున్న ఇలాటి అనుభవాలను ప్రశ్నించే కథలు మరిన్ని రావాలి. వేల సంవత్సరాల సంస్కృతీ సంస్కారాలను తలుచుకుని గర్వపడటంతో ఆగిపోకుండా, భిన్న సంప్రదాయాల మధ్య జీవించే మనం సమైక్య భారతీయరాగాన్ని ఆలాపించవలసిన సమయమిది. కథా మినార్ రచయితలకు, సంపాదకులకు మరొక్కసారి అభినందనలు. కానీ రచయిత్రుల సంఖ్య మాత్రం ఒక్కరికే పరిమితమైందన్నది కాస్త నిరాశను కల్గిస్తుంది.

ముఖచిత్రం గా లక్ష్మణ్ ఏలే రూపొందించిన అందమైన శీర్షిక, చక్కని డిజైన్ తో పుస్తకం ఆకట్టుకునేలా ఉంది. 

 

 

 

 

అనురాధ నాదెళ్ళ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కథా మినార్ లాంటి సంకలనాలు మరిన్ని రావాల్సి వుంది.

 • […] సమాజపు ఒక పార్శ్వాన్ని నిశ్శబ్దంగా గాయపరుస్తున్న ఇలాటి అనుభవాలను ప్రశ్నించే కథలు మరిన్ని రావాలి. వేల సంవత్సరాల సంస్కృతీ సంస్కారాలను తలుచుకుని గర్వపడటంతో ఆగిపోకుండా, భిన్న సంప్రదాయాల మధ్య జీవించే మనం సమైక్య భారతీయరాగాన్ని  […]

 • Congratulations to Khadeer Babu garu and Suresh garu for putting together this compilation of stories and to Anuradha garu for writing about the book. I look forward to reading it.

  I have, however, a somewhat different opinion on the following comment by Anuradha garu.
  ఇక్కడొక విషయం జ్ఞాపకమొస్తోంది, రెండేళ్ల క్రితం
  గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తిరిగినపుడు ఒక ప్రసిధ్ధ హిందూ దేవాలయం ముందు ‘కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశము’ అని ఉండగా, ఒక ప్రసిధ్ధ దర్గా ముందు, ‘అన్ని మతాలవారికి ప్రవేశముంది’ అన్న బోర్డు ఉంది. మతాలన్నీ హృదయాలను విశాలం చేసుకోవలసిన అవసరం ఉందన్నది స్పష్టం.

  I have personally witnessed shoe-clad, Western tourists walking through seated local worshippers at Angkhot Wat. The locals are too polite to ask the tourists to get out or stay out.

  At a Buddhist temple in Seoul, I found a Western tourist seated with his feet towards the idol, watching the locals pray. I told the guy that he should sit like the others or leave.

  I don’t see a problem with any religion excluding others from visiting their its of worship, unless the visitor is properly educated about the local traditions and customs.

 • Sorry. The last paragraph should read:

  I don’t see a problem with any religion excluding others from visiting its places of worship, unless the visitor is properly educated about the local traditions and customs.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు