బర్మాకేంపులో గోదావరమ్మ

 ‘హరిబాబూ’ అని గట్టిగా పిలిచేవోడు వెంకటస్వామి కేంపులో రోడ్డు మీద సైకిల్ తో నుంచోని. మా అమ్మ దగ్గర కూర్చుని సాయంత్రం కబుర్లు చెబుతోన్న నేను ఆ పిలుపుతో సర్రున రోడ్డుకి పరిగెట్టేవోడిని. వెంకటస్వామి చేతిలోంచి నాన్న పంపించిన వైరుసంచి, కేరేజి తీసుకుని ఇంట్లో ఇచ్చేసేవాడిని. సంచీలో నాన్న మూడుకప్పుల కేరేజి ఉండేది. ఆ కేరేజి చాలా ప్రత్యేకమైనది మూడు కప్పులు అవి కదలకుండా కేరేజి పైన స్పూను.

డ్యూటీనుంచి వెంకటస్వామితో కేరేజి పంపించేసిన నాన్న పార్టీ సమావేశాలు, యూనియన్ పనులు చూసుకుని ఇంటికి వచ్చేవారు, వచ్చేటపుడు కేంపు కిందనున్న హైవే దగ్గర తోపుడు బళ్ల దగ్గర నుంచి వేపిన సెనగపప్పు, డాలిపప్పు, పకోడి పట్టుకొచ్చేవారు. మేమంతా తినేవాళ్లం కానీ మా అమ్మ ముట్టుకునేది కాదు.

ఇలాంటి తూరుపు తిళ్లు మా అమ్మ తినదు, అమ్మా నాన్నలది ఇద్దరివీ గోదావరి జిల్లాలే, మా నాన్న ఎప్పుడో తన ఇరవయ్యోయేట వైజాగ్ చేరేరు. ఆయనది పశ్చిమగోదావరి. అమ్మది తూర్పుగోదావరి. తాత మోతుబరి రైతు, ఊర్లో రాజకీయాల్లో పెద్దమనిషి. గోదావరి జిల్లాల వాళ్లకి తూరుపోళ్ల వంటలు, మాట, యాస నచ్చవు. విశాఖపట్నమేమో మత్స్యకారుల పల్లె.  గవర్లు, రెల్లీలు, విజయనగరం, శ్రీకాకుళపోళ్లతో పూర్తి తూరుపు సాంప్రదాయాలతో చారూ పిండొడాలతో, గులివిందల,కవ్వళ్ళ పులుసులతో వర్ధిల్లుతుండేది. కానీ మా అమ్మ ఏనాడూ ఇక్కడ సాంప్రదాయాలు గానీ, వంటలు గానీ, మనుషుల్ని గానీ, పద్దతుల్ని గానీ లోకువ చేసింది లేదు. ఇంటి చుట్టుపక్కల అందరితో ఎంతో బాగా ఉండేది. వారికి తోచిన సాయం చేసేది.

నా పనేమో ఇంట్లో తెలీకుండా కేంపులోను, కప్పరాడ స్కూలులోనూ అలగాగుంటలతో గోళీలాడుకోవడం, పిండొడాలు తినడం, కేంపులో ముసలమ్మలు పావలాకి అమ్మే చింతపండు ముద్ద కొనుక్కుని దానికి ఈనుపు పుల్ల తగిలించి లాలీపాప్ లా చేసి కొంచెం కారం, ఉప్పు అద్దుకుని సప్పరించడం, సిద్ధార్ధనగర్ నుంచి కేంపు వరకు దారులన్నీ కొలవడం, కర్రాబిళ్లా ఆడటం, గెలిచిన గోళీలని దార్లోనే పడేసి ఇంటికి మాత్రం బుద్దిగా వచ్చీడం. ఎందుకంటే గోళీలాడానని తెలిస్తే మా అమ్మ చమడాలెక్కదీశేస్తది. కారం పొగ పెట్టేస్తది. ఇక శని, ఆదివారాలయితే కొండలెక్కడం, నూకాలమ్మ గుడిచుట్టూ తిరగడం, ఇంటి చుట్టుపక్కల వాళ్లు చేసే సంతోషిమాతా వ్రతం,త్రిమూర్తుల పూజలకి భక్తుడిలా వెళ్లడం, వ్రత మహాత్మ్యం అంతా వినడం, ప్రసాదాలు తీసుకోవడం ఇలా గడిచిపోయేది.

మేము కేంపుకు రాకముందు తుమ్మడపాలెంలో అయితే మా ఇల్లు రైలు పట్టాలకు కాస్త దూరంలోనే వుండేది. అక్కడ గుంటలతో రైలు పట్టాలమీద పదిపైసల బిళ్ల పెట్టి ఆడుకోవడం, చెక్కరైలు వంతెనమీద పడకుండా నడవటం, పట్టాలు దాటి రైల్వే లోకోషెడ్ వైపు వెళ్లడం, రైల్వే క్వార్టర్స్ లో దబ్బకాయలు కోసుకోవడం, రైల్వే వాళ్లదగ్గర దొరికిన రింగులతో క్రికెట్ ఆడటం, గూడ్స్ ట్రయిన్లు, వరుసట్రాకులు ఇవన్నీ కలతిరగటం చేసేవాడిని. మబ్బుపట్టినపుడు, పూలవాన పడేటపుడు ఊదారంగులో రైల్వే క్వార్టర్ల సౌందర్యం చెప్పనలవికానిది.

అందరి కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్లాగే మా నాన్న కూడా నన్ను సెంట్రల్ స్కూల్ లో చేర్పించి ఒక నేవీ వాడ్ని చేయాలని చూసేడు. మా నాన్న స్నేహితుడి కొడుకుతో నేను కూడా ప్రవేశపరీక్ష రాసేను, అదృష్టవశాత్తు సీటొచ్చింది. స్కూలుకేమో రైల్వే ట్రాకులన్నీ దాటుకుంటూ వెళ్లాలి. కానీ మా అమ్మ వొప్పుకోలేదు. ‘ ఈ రైల్వే ట్రాకులన్నీ దాటి నా కొడుకు ఆ స్కూలుకి వెళ్లడానికి నేను ఒప్పుకోను, పిల్లాడి ప్రాణాలకంటే స్కూలు ముఖ్యమా దగ్గరలో స్కూలులో చేర్పించండి ‘ అంది. హవాయి చెప్పులు లేదా బూట్లు ఈడ్చుకుంటూ నడుస్తూ, దారిలో ఆగిపోయి, అన్నీ పరిశీలించుకుంటూ వచ్చే నేను ఏ ఆగివున్న గూడ్సుబండి కిందో గోళీలు ఆడేసుకుంటూ ఉండిపోతానని మా అమ్మ భయం. సరే, బర్మాకేంపులో ఆనందంగా గడిచిపోతోన్న కాలంలో ఎండలు మొదలయ్యే మార్చినెల వచ్చిందంటే నా గుండె గుభేలయిపోయేది. మేమున్నది పెంకుటిళ్లు, మా ఎదురిల్లు కోమటాయన కట్టుకున్న డాబాఇల్లు, కానీ మా ఇంటి వెనుక పోతురాజు ఇళ్లు , దాని ఎదురుగా బాదం చెట్టుకింద బొగ్గు లక్ష్మి గారిల్లు , అటుపక్క నున్న అక్కయ్య ఇల్లు, కొండ ఎక్కే దారిలోని భాగ్యలక్ష్మి ఆంటీ ఇల్లు ఇలా అన్నీ కమ్మలిల్లులే.

‘రంగ్… ఠంగ్… ఠంగ్.. ఠంగ్..” అని నీళ్లు ఒంపుకుంటూ, ఖాకీ బట్టలేసుకుని పొడుగు నల్లబూట్లేసుకునే గంటల్లారీ వొకటి సరిగ్గా మధ్యాహ్నం వేళ వెళిపోతుండేది. అంటే బర్మాకేంపులోనో, కప్పరాడ దగ్గరో, తుమ్మడపాలెంలోనో, పట్టాభిరెడ్డి తోటకాడో ఎవరివో కొంపలు తగలడిపోతన్నాయని అర్ధం. గంటల్లారీ వెనకాలే పరిగెట్టి ఎవరి కొంప తగలడిందో చూడటానికి జనం వెలిపోయేవారు, ఒకవేళ గంటల్లారీ మనకు అందకుండా వెళిపోతే ఎక్కడ తగలడిందో అడ్రస్ తెలుసుకుని వెళ్లి తనివితీరా చూసి ‘చు.. చు.. చు.. అయ్యో’ అనడం అప్పటి జనం అలవాటు. బర్మాకేంపు నూకాలమ్మ గుడి అవతల పంతులమ్మగారి కళ్లాలు  లో ఎర్రపార్టీ వాళ్లు గుడిసెలు వేసారు. వందకు పైగా గుడిసెలు. ఆ బంజరును పేదలు ఆక్రమించుకుని కమ్మలిళ్లు కట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు నగర్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడే లెనిన్ లా సీరియస్ గా ఉండే కిలపర్తి జగన్నాధం గారు, పొట్టిగా తెల్లగా ఉండి చక చకా తిరిగే రెడ్డి వెంకటరావు గారూ, ‘అల్లుడూ మా అమ్మాయిని చేసుకుంటావురా?’అని కనపడ్డపుడల్లా సరదాగా ఆటపట్టించే ఒరియా బ్రామ్మడు పాణిగ్రాహి ఇంకా అనేక కుటుంబాలు ఉండేవి.

తగలెట్టేసారో … తగలబడిపోయాయో తెలీదుగానీ ఒక రోజు మధ్యాహ్నం వంద కొంపలూ అంటుకుపోయాయి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లే సరికి మా అమ్మ ఇంటి దగ్గర లేదు. కాసేపటికి గాబరా పడుతూ వచ్చింది, చీరకు అక్కడక్కడ మసి. “ ఇళ్లు తగలబడిపోయాయిరా మధ్యాహ్నం , సామాన్లనూ మనుషులనూ బయటకు తీసుకురావటంలో సాయం చేసాను, గంటల్లారీ వొచ్చేలోగా జనం అంతా బకెట్లతో, గోళాలతో పాకలు ఆర్పేరు. ఆ తరువాతెప్పుడో గంటల్లారీ వచ్చింది.  పరిస్థితి చాలా దారుణంగా ఉందక్కడ’ అంది. ఆ తరువాత గబగబా భోజనాలు వండి కొంతమందికి పట్టికెళ్లింది. అది మొదలు సంఘం కార్యక్రమాలలో పాల్గొవడం మొదలుపెట్టింది. మెల్లగా అమ్మను మహిళాసంఘంలో చేర్పించారు నాన్న.

ఆడాళ్లంతా కలిసి బర్మా కేంపులో మంచినీళ్ల వసతి కోసం, ఇళ్ల పట్టాల కోసం ధర్నాలు చేయడం. ఊర్వశి జంక్షన్ దగ్గరో కంచరపాలెం మెట్టు దగ్గరో జరిగే మీటింగ్లకు వెళ్లడం ప్రజానాట్యమండలి పాటలు వినడం, జెండాలు పట్టుకు తిరగడం. “ ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా’ పాటలు వినడం ఇలా గడిచిపోయేది. ఓ రోజు నేనూ మా తమ్ముడూ ఇంట్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ జెండా పట్టుకొని రోడ్డు చివర వరకూ పరిగెట్టుకుంటూ వెళ్లి గాలికి ఎగరేస్తన్నాం. దారిన పోయే నాయుడొకాయన ‘అరేయ్ పోలీసులు చూస్తే అర్రెస్టు చేస్తార్రా! పోండి’ అన్నాడు. ఎందుకు అరెస్టు చేస్తారో అర్ధం కాక నేనూ మా తమ్ముడూ మొఖమొఖాలు చూసుకున్నాం.

మా బంధువుల కంటే పార్టీలో ఉన్న మిగతా కుటుంబాలే మాకు ఆప్తబంధువులు అందరినీ చిన్నాన్న, పిన్నీ, మావయ్య అని రకరకాల బంధుత్వాలతో పిలుచుకోవడంతో అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. ఓ రెండు మూడు సంవత్సరాలకు కేంపులో చాలా మార్పులు రావడం మొదలయ్యాయి, చిన్న గ్రామం లా ఉండే కేంపు కాస్తా నెమ్మదిగా బస్తీలా మారడం మొదలయింది, తగాదాలు ఎక్కువయ్యాయి. రోడ్డు మీద బూతులు మాటాడుకుంటూ జనం కొట్టేసుకునేవారు. నేను చూస్తుండగానే రోడ్డుమీదే కత్తులతో పొడుచేసుకునేవారు. కేంపు రౌడీ ఇజానికి పేరుమోయడం మొదలయింది. ఇక లాభం లేదని ఇక్కడుంటే పిల్లలు పాడవుతారని అక్కడకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకిచ్చిన ఇళ్ల స్థలం కొనుక్కొని మమ్మల్ని తీసుకుపోయారు మా నాన్న. అక్కడ ఒక డాబా ఇల్లు కట్టేరు. ఈ కొత్త వూరు  తూరుపుకొండల కింద సౌందర్యంతో, గడ్డివాములతో, మామిడి జీడి తోటల నానుకుని, కొండలమీద నుంచి వచ్చే గెడ్డ వాగులతో, తూనీగలతో, రాత్రుళ్లు నక్కల అరుపులతో, కీచురాళ్ల రొదలతో చాలా అందంగా ఉండేది. మా అమ్మ ,నాన్న, తమ్ముళ్లూ మేమంతా విశాలమైన ఆ ఇంటి చుట్టూ కర్రలతో దడి కట్టుకోవడం. అక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే సంతనుంచి నేనూ మా అమ్మా వెళ్లి కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం ఇలా గడిచిపోయేది. అధికార పార్టీ హవా మాత్రమే నడిచే ఆ ప్రాంతంలో అక్కడా అక్కడా ఉన్న ఒకటి రెండు మిగతా కుటుంబాలను కూడగట్టి మళ్లీ పెద్ద సంఘమే తయారు చేసారు అమ్మా,నాన్న.

చుట్టూ కోళ్లఫారాలుండే ఆ ఊరిలో ఒకసారి నేనూ మా తమ్ముడూ కలిసి కోడిగుడ్ల కోసం వెళ్లాము. కొత్తగా ఉన్న మమ్మల్ని చూసి ‘ రెల్లీల పిల్లలా మీరు?” అంది ఆ చౌదిరీలావిడ. కులం అంటే తెలీని, అప్పటికి ఇంట్లో దేవుడి పటాలు లేని మేము ‘రెల్లీలంటే ఎవరమ్మా?’ అని ఇంటికెళ్లి అమాయకంగా అడిగేసరికి గోదావరి జిల్లా శెట్టిబలిజ అయిన మా అమ్మకు కోపం నషాలానికొచ్చి మమ్మల్ని అడిగినావిడ దగ్గరకు తీసుకెళ్లి ఆవడని బయటకు పిలిచి ‘పిల్లలతో కులం ఏమిటి అంటావా? ఎవరిది ఏ కులం అయితే నీ కెందుకు?” అని తాటతీసేసింది. ఆ కోళ్ల ఫారాలావిడ అమ్మ వాగ్దాటికి ఒక్క మాట తిరిగి మాటాడితే ఒట్టు. ఇంకోసారి అక్కడకు దగ్గర ఉన్న పెందుర్తి స్కూల్లో నోటి దురద ఉన్న మాస్టారొకరు అస్తమానూ మా ఇంటి పేరుతో పిలుస్తూ వెటకారం చేస్తుండేవాడు. ఇంటికొచ్చి దీర్ఘంగా మా ఇంటి పేరు ఇలా ఎందుకు వుండాలి? అందరూ మా ఇంటి పేరు చూసి ఎందుకు నవ్వాలి? అని తెగ దీర్ఘంగా ఆలోచిస్తావున్న నన్ను “ ఏం జరిగిందిరా ?” అని అడిగింది. నేను జరిగింది చెప్పాను. నేను వస్తాను మీ మాష్టారుతో మాటాడుతానులే అని ఏమీ అనలేదు మా అమ్మ. విన్నాది. ‘ఊ సరేలే ” అంది అంతే. మరో రెండు రోజుల తరువాత మాస్టారు మా ఇంటి పేరుతో వెటకారం చేయడం మానీ సేడు. కారణం మా అమ్మ అని ఒక వారం పది రోజుల వరకూ తెలీలేదు.

నా పదోతరగతి పూర్తయ్యాక నేను కాలేజీకి వెళ్లి చదువుకుంటానని గోల, మా నాన్నేమో ఐటిఐలో చేర్పిస్తానని ఏదో ఒక కేంద్రప్రభుత్వ ఉద్యోగం వచ్చి జీవితం భద్రతగా ఉంటుందని శపధం పూనారు. ఐటిఐలో ఆక్సాబ్లేడ్ లు, వెల్డింగులు, వెంటనే ఉద్యోగవేట తలచుకుని నేను చదవనంటే చదవనని చెప్పాను, కొన్నాళ్లు ఆ గోలలోనే ఇంటర్ కాలేజీకి వెళ్లాను. ‘ఏదో ఒకటి అవుతారులే వాడికి నచ్చినది చదువుకోనీయండి ” అని నన్ను కాపాడింది మా అమ్మ, గోదావరి జిల్లావాళ్లకు వెటకారాలెక్కువ మా బంధువులకు మరీను. మేము సెలవులకో, శుభకార్యాలకో ఊరు వెళ్లినపుడు మా అన్నదమ్ములను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు మా అమ్మ చేతిలో చివాట్లు పడిపోయేవి. వెటకారం చేసినా, మనుషులను కించపరిచినా వాళ్లకు మా అమ్మ దగ్గర చివాట్లు తప్పేవి కావు.

తొంభయ్యోదశకం ప్రధమార్ధం అక్షరాస్యత ఉద్యమం, అని సారా వ్యతిరేక ఉద్యమం అని మా అమ్మ అందులో పనిచేసింది, అమ్మతో పాటే నేను కూడా తోడుగా వెళిపోయేవాడిని. కొన్నాళ్లకు ఖాళీగా ఊరుకి దూరంగా ఉన్న ఈ శివారు ప్రాంతాలు కూడా జనంతో కిక్కిరిసిపోసాగాయి. శ్రీకాకుళం, విజీనగరం నుంచి జనం వచ్చి ఇంటద్దెలు కట్టుకోలేక అల్లల్లాడిపోయేవారు. మా అమ్మ బంజర్లు, కొండకింద ప్రాంతాలు చదును చేయించి పార్టీ అండతో వందల పాకలు వేయించింది, వాళ్లకి ఇంటిపన్ను కరెంటు వచ్చేట్టు చేసింది. బుల్డోజరో, ప్రొక్లెయినరో, ఎమ్మార్వో ఆఫీసోల్లో, రెవెన్యూ వాల్లో వచ్చి పాకలు పీకేయబోతే అడ్డుగా ఉండి ప్రభుత్వంతో మాట్లాడేది. వాళ్లు చాలాకాలం నుంచి ఉంటున్నారని, వాళ్లకు గవర్నమెంటే కరెంటు, ఇంటిపన్ను వేసిందని చట్టబద్ధంగా వాదించేది. ఇప్పుడా కొంపలన్నీ పక్కా ఇళ్లు అయిపోయేయి. చిన్న చిన్న పనులు చేసుకున్నోళ్లంతా ఏ అద్దె బాధా లేకుండా హాయిగా ఉంటున్నారు. ఇన్నేళ్ల కాలంలో మానాన్న ఆఫీసులో పీకల్దాకా తాగి తాగి చచ్చిపోయిన చాలా మంది కుటుంబాలకు ఉద్యోగాలొచ్చేట్టు చేసారు యూనియన్ తరపున మాటాడి, వాళ్లకు గవర్నమెంటు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేట్టు చేసేవారు. అందుకు విశ్వాసంగా  ఏ రోజన్నా శెనక్కాయో, చింతపండో తీసుకొస్తే “ నాయుడూ పట్టుకెళ్లిపో నేను తీసుకోను’ అని ఖచ్చితంగా చెప్పేసేవోరు.

మా అమ్మ దగ్గరకు మాత్రం బర్మాకేంపులో నూకాలమ్మ తల్లికి భక్తులు కోడిని కోసినట్లు , కొంపలోళ్లు గౌరవంగా కోడిని పట్టుకొస్తారు. ‘తీసుకెళ్లిపోండి బాబూ ..వొద్దు సార్‌కు తెలిస్తే దెబ్బలాడతారు ‘ అంటాది. అయినా వినరు, పిల్లలొచ్చేరు కదండమ్మా తీసుకోండమ్మా అంటారు. సరే తీసుకుంటాను కానీ నా మాట కాదనకూడదు అని ఇంట్లోకెళ్లి ఆ నాటుకోడి విలువకు రెండింతలు డబ్బులు వాళ్లకిచ్చేసి ‘తాగేయకుండా పిల్లలకు ఏదైనా కొనుక్కొని తీసుకెళ్లు ‘ అని చెప్పి ఇచ్చేస్తుంది. ఆడాళ్లకయితే ‘బట్టలు కొనుక్కోండి’ అని ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తుంది. గోదావరి జిల్లా మోతుబరి రైతు కుటుంబం నుంచి ఎప్పుడో ఇక్కడకు వచ్చి ఇక్కడ జనాలతో కలిసిపోయి వాళ్లకు సాయం చేసిన మా అమ్మ జనాలకు ‘అమ్మగారు’ నాకు మాత్రం ‘గోదావరి తల్లి’ మేమిద్దరం ఎన్నిసార్లు జనం గురించి,కొంపలు గురించి, పార్టీ గురించి దెబ్బలాడుకున్నా సరే.

*

Avatar

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • “బర్మా కాంప్ లో గోదారమ్మ” కధ చాలా బాగుంది.పెద్ద కధ గా అనిపించింది.రెండు కథలుగా విభజిస్తే బాగుంనేమో.మీ ఓపిక్కి జోహార్లు.చిన్ననాటి విషయాల్ని ఇప్పటికి గుర్తుంచుకొని కథగా మలచడం అభినందనీయం.

 • బర్మా క్యాంపు కథలు శైలి బాగుంది. …

  కథ పెద్దదైన బాగుంది.

  బర్మా క్యాంపు గురుంచి అక్కడి కమ్మ లిల్లు ,

  జన జీవితం, ప్రభుత్వ స్కూల్స్ లో

  కథకుడి జీవితం కళ్ళకు కట్టినట్లుగా వుంది.

  మా ఊహ ల్లో బర్మా క్యాంపు అందంగా వుంది..

  అక్కడ ఎలా ఉందొ కానీ.

  పార్వతి దేవి

 • Chala bagundi hari…chaduvutunnanta sepu..chinnappati vishayalu gurtu vachevi…ni Bhasha kuda chala saralanga ardam ayyetattuga chakka undi..

 • వైజాగ్ లో రెండు బర్మా క్యాంపు లుండేవని గుర్తు. ఒకటి కంచర పాలెం దగ్గర ఉండేది. కొన్ని కుటుంబాలు సింగ్ హోటల్ జంక్షన్ లో ఉండేవి. నాస్తిక సమాజం నాయకుడు జయగోపాల్ కూడా బర్మా నుండి వచ్చిన కుటుంబమే అని చెప్పారు. నాగి రెడ్డి గ్రూపుకి సానుభూతి పరుల కుటుంబం ఒకరు చెప్పిన దాని ప్రకారం, తెలుగు వాళ్ళు బర్మా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించారు.
  బ్రిటన్ లో నేను కలిసిన ఒక బర్మా తెలుగు వారు దీనిని ధ్రువ పరిచారు.

  బర్మా నుండి వచ్చిన తెలుగు వాళ్ళు మాంచెస్టర్ (బ్రిటన్) దగ్గరలో ఉన్న ప్రెస్టన్ అనే పట్టణం లో 1950 ల నుండి ఉన్నారు. తణుకు పరిసర ప్రాంతాల నుండి బర్మా కు వెళ్లి, అటునుండి బ్రిటన్ కు వచ్చిన రెడ్డి కుటుంబాలు.

  తీగల భాస్కర్ (హైదరాబాద్నే) తన పరిశోధనలో భాగంగా ప్రెస్టన్ తెలుగు వారితో కొద్దిరోజులు గడిపారు.

  Interesting social history.

 • Dear Hari Ji!
  I have just completed reading your article on recycling, as published by Saranga Magazine . It was an exceptionally well-written article and created many interesting facts on the particular area (Barma Camp) subject.

  I particularly liked the fact that it was an objective look at the issues at Barma Camp…

  I would like to thank you for both a well spent life at Camp area and well-written article.
  Finally I liked it usually I don’t spend much time on article….. But completed without boring even one minute…. Thanks

 • మీ గోదావరి తల్లి సూపర్ …చదువుతుంటే చూడాలనిపించింది. హాట్స్ ఆఫ్ టు హర్ . చాలా బాగా రాస్తున్నారు హరి గారూ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు