“ప్రాణాల కన్నా విలువైనది స్వేచ్ఛ”

వి వరవరరావు ప్రధాని ‘మోడీ’ హత్యకు కుట్రపన్నారనే నెపంతో “భీమా కోరేగాం” కేసులో నిందితుడిగా ప్రస్తుతం జైల్లో వున్నారు. వి.వి కి జైలు జీవితం కొత్త కాదు. ఇలా 1973 నుండి 2014 వరకు 25 కేసుల్లో గతంలోనే 8 సార్లు అరెస్టయ్యారు. అన్ని కేసుల్లోనూ నిర్ధోషి గా విడుదలయ్యారు. వీటిల్లో ప్రధానంగా రాంనగర్ కుట్రకేసు 1986 నుంది 2003 వరకు, సికింద్రాబాద్ కుట్రకేసు 1974 నుండి 1989 వరకు సుధీర్ఘంగా కొనసాగాయి. “కన్నబిరాన్ ” గారు కేసు వాదించేవారు. సికింద్రాబాద్ కుట్రకేసప్పుడు  ఒక నెలరోజులు ‘కండీషన్డ్ బెయిల్ ‘మీద 1975 మే లో బైటికి వచ్చారు. అదే సమయంలో “ఎమర్జెన్సీ ” వచ్చింది.
భారతదేశంలో ‘ఎమర్జెన్సీ’ 25 జూన్ 1975 నుండి 21 మార్చ్ 1977 వరకు 21నెలల పాటు కొనసాగింది. దేశవ్యాప్తంగా దాదాపు లక్షమంది దాకా అరెస్ట్ కాబడి, జైలుకు పంపించబడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలను బ్యాన్ చేసారు. వి.ర.సం, ఆరెస్సెస్ , జమాత్ – ఎ – ఇస్లామీ మొ.న 50 సంఘాలపై నిషేధం విధించారు. అరెస్టయిన ప్రముఖుల్లో జయప్రకాశ్ నారాయణ, వాజ్ పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్  మొ.న వారితో పాటు బెయిల్ పై వచ్చిన వరవరరావు ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
ఎమెర్జెన్సీ కాలంలో జైళ్లో వుంటూనే కవిత్వం రాసారు. “ఇపుడు సంకెళ్లు రాస్తున్నాయి” అనే కవిత  1977 లో రాసిండు. మిగతా కవిత్వంతో పాటు ‘ఎమర్జెన్సీ’ లో రాసిన కవిత్వాన్ని కలుపుకుని “స్వేచ్ఛ” పేరుతో 1978 లో పుస్తకంగా తీసుకొచ్చారు.
నిర్బంధంలో వున్న రాజకీయ ఖైదీలు చాలామంది సాహిత్యరచనలు చేయడం కొత్తేం కాదు. దాశరథి జైలుగోడలపై కవిత్వం రాసిండు. అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ “మాలపల్లి” ని, మేరీ టేలర్ “భారతదేశంలో నా జైలు జీవితం” ను, జూలియస్ ఫూజిక్ “Notes on the Gallows (రక్తాక్షరాలు)ను, జార్జ్ జాక్సన్ “సాలిడాడ్ బ్రదర్స్ ” ను, కిమ్ చిహా అనే దక్షిణకొరియా కవి “మతాచార్యుని ఆత్మకథ” ను, గుగివా థియాంగో “Devil on the Cross” ను, బొజ్జా తారకం “నది పుట్టిన గొంతుక” మరియు “ఒక తెలంగాణ (1946 – 51) రైతాంగ గెరిల్లా (కా. బండ్రు నర్సింహులు) అనుభవాలు”  ను జైళ్ళల్లో వుండే రాసారు.  వరవరరావు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు రాసిన 13 లేఖలు ఇండియన్ ఎక్స్ ప్రెస్  మరియు ఆంధ్రప్రభ పత్రికల్లో అచ్చుకాబడి ఆ తర్వాత “సహచరులు” పేరుతో పుస్తకంగా ముద్రించబడింది.
ఇలా జైళ్ళో వున్న సమయంలోనే “అరుణతార” పేరుతో ఒక లిఖిత పత్రికను నడిపారు. (ఇప్పటి ‘అరుణతార’ 1977 నవంబర్ లో ప్రారంభమైంది) రాజకీయఖైదీల రచనలు అందులో వుండేవి. వివిధ జైళ్ళల్లో వున్న వారి అభిప్రాయాలు, అక్కడి తీరుతెన్నులు అన్నీ అందులో ప్రతిబింబించేవి. ఈ లిఖిత పత్రిక మాత్రం అధికారుల సెన్సార్ షిప్ ని తప్పించుకొని చక్కర్లు కొట్టడం ఇప్పటికైతే ఆశ్చర్యమే.
*
ఇపుడు సంకెళ్లు రాస్తున్నాయి
~
” ఇదివరకు
వికసించిన పువ్వులు విసిరిన పరిమళాలు
నాతో రాయించేవి
ఇప్పుడు
నీ అబద్ధాలు రాయిస్తున్నాయి
నిజాలు
ఇదివరకు
ఊపిరిసలపని ఉద్యమాలు, ఉత్తేజం
నను నిలబెట్టేవి, నడిపించేవి
ఇప్పుడు
ఊపిరాడనివ్వని నీ నిర్బంధం, ఉక్కుహస్తం
నన్ను ఉక్కుమనిషిగా మారుస్తున్నాయి
నా విశాల ప్రపంచాన్ని దురాక్రమించి
చిన్న చిన్న అరలుగా కత్తిరించి
అటూ ఇటూ మెసలరాని అరలో నను బంధించి
అతిక్రమిస్తే జాగ్రత్త అంటున్నావు
నా చెయ్యి లోపలే వుంది
నువ్వే కదా కట్టేసావు
నా కలం నువ్వే కదా విరిచేసావు
నా కలల అలలు వ్యాపిస్తున్నాయని నీ ఆందోళన
నా కాళ్లు ముడుచుకునే వున్నాను
ఈ చీకటి కొట్లో;
నేను నడచివచ్చిన బాటలో
నేను మొదటివాణ్నీ కాను చివరివాణ్నీ కాను
ఆ బాటలో ప్రాణం పోసుకున్న నా పాటకు
కాళ్లు వచ్చాయి
నేనేం చేయను
కలల్ని బోనెక్కించి నేరారోపణ చేస్తున్నావు నువ్వు
నవ్వుతున్నాను నేను
నా చుట్టూ కట్టిన నీ ఎత్తైన గోడలు
నా కళ్లు ఆకాశమంత ఎత్తునుంచి
ప్రపంచాన్ని చూడనేర్పినయ్
ఎప్పుడూ నేలచూపులతో రొటీన్ జీవితంలో
పరుగెత్తే నన్ను
నీలాకాశంలోకి
స్వేచ్ఛావిహంగాల విహాయసంలోకి
ఎదిగే అంతర్ముఖుణ్ణి చేసినయ్
నీ కుర్చీని కాపాడుకోవడానికి
నువ్వెంతగా జనానికి దబూరమయ్యావో
ప్రజలు, అశేషప్రజానీకం మాత్రమే
ఫాసిజాన్ని నాశనం చేస్తారన్న విశ్వాసం
నాకంతగా పెరిగింది
బయట నువ్వెంత ఒంటరివో
నీ నీడ కూడ నీకు నిజం చెప్పలేక
ఇచ్ఛకాలే చెప్తున్నదో
లోపల నేనంత బలగంలో వున్నాను
సిద్ధాంత బలంతో వున్నాను
ఇవ్వాళ మౌనంగా వున్నా
ఇపుడో రేపో లావాలెగజిమ్మే
అగ్నిపర్వత సదృశ ప్రజాబలంతో వున్నాను
దీర్ఘనిశ్శబ్ధ నిర్బంధంలో
ఆలోచనల్ని పదును పెడుతూ
ఇపుడు నిగళాలు రాస్తున్నాయి నియంతా,
రేపు గళం విప్పి స్వేచ్ఛలో పాడుతాను “
ఎవరా నియంత? అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. నిగళాలు అంటే సంకెళ్లు. “రేపు గళం విప్పి స్వేచ్ఛలో పాడుతాను” అనడం ఆశావాహ ధోరణితో కూడిన ముగింపు.  కవి ఎవరిని ఉద్ధేశించి మాట్లాడుతున్నాడో స్పష్టంగా వుంది. నిర్బంధంలో మనుషులు ఎలా వుంటారు? ఎలా ప్రవర్తిస్తారు? ఎలా తయారవుతారు? ఆ మనుషులు కవులైతే.. నిత్యం ఉద్యమాల్లో ఊపిరి సలపకుండా వుండే వారైతే.. స్వేచ్ఛను ప్రాణం కంటే మిన్నగా భావించేవారైతే.. జైలు గోడలు వారి కలల్ని ఆపుతాయా? నిర్బంధానికి గురిచేసిన వ్యవస్థ పట్ల వుండే వైఖరి ఎలాంటిది? ఇవన్నీ ప్రధానంగా చర్చకు వస్తాయి.
“నేనేం చేయను/ కలల్ని బోనెక్కించి నేరారోపణ చేస్తున్నావు నువ్వు/నవ్వుతున్నాను నేను” అన్నప్పుడు కవి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడో, ఎంత ధీమాగా వున్నాడో, మరింత ఉక్కుసంకల్పాన్ని ఎలా కూడగట్టుకుంటున్నాడో గమనించవచ్చు. ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథం నేర్పించగలదు?.. అంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంత ధృఢచిత్తంతో వుండటం!
అధికారం తిరిగి నిలబెట్టుకోవడం కోసం ప్రజలకు దూరమైన ప్రభుత్వ ఫాసిజం వైఖరికి ఖచ్ఛితంగా ప్రజలే బుద్ధి చెప్తారని తీర్మానించడం చూస్తాం.
“లోపల నేనంత బలగంలో వున్నాను/ సిద్ధాంత బలంతో వున్నాను/ ఇవ్వాళ మౌనంగా వున్నా/ ఇపుడో రేపో లావాలెగజిమ్మే/ అగ్నిపర్వత సదృశ ప్రజాబలంతో వున్నాను” అని నినదించడం మామూలు విషయం కాదు. అంతేకాదు.. నేను నడిచివచ్చిన బాటలో మొదటివాన్నికాదు..చివరివాన్ని కాదనే ఎరుక వున్నవాడు కవి.
అప్పటి అధికారిక “ఎమర్జెన్సీ” కాలానికీ, ఇప్పటి అనధికారిక “ఎమర్జెన్సీ” కాలానికి పెద్దగా తేడా లేనట్లే అనిపిస్తుంది. జడ్ కేటగిరీ భద్రత వుండే వ్యక్తుల్ని వి.వి లాంటి కవులు “హత్యకు కుట్రపన్నారనే అభియోగం” ఎంతమాత్రమూ నమ్మశక్యంకాని అంశం. మరి వీళ్ళని చూసి రాజ్యం ఎందుకు భయపడుతున్నట్టు?  ప్రశ్నించే కలాల్ని, గళాల్ని తొక్కివేయడమే ఫాసిస్టు ప్రభుత్వాల పని. ఆ పని ఇప్పటి మోడీ ప్రభుత్వం భేషుగ్గా చేస్తుంది. అందుకే నిరసన తెలపడం లాంటి భావప్రకటనా స్వేచ్ఛ కూడా నిషేధమే అవుతుంది. ఇప్పటి మన భయమంతా ప్రశ్నిస్తే అణచివేస్తారని, వేధింపులకు గురిచేస్తారని, జైళ్లల్లో నిర్భందిస్తారని అంతే! అదే అందరం ప్రశ్నిస్తే, అందరం నిలదీస్తే జైళ్లు సరిపోతాయా? ప్రభుత్వాలే కూలిపోతాయి.  ఇంతటి చైతన్యం మన ప్రజల్లో వస్తుందా?
*
“ముస్లింలు ఎంతమంది చచ్చారో ముస్లింలు చెప్తారు. హిందువులు ఎంతమంది చచ్చారో హిందువులు చెప్తారు. కాని మనుషులు ఎందరు చచ్చారో చెప్పే మనుషులే అరుదయ్యారు”
మీరట్ మతకలహాల సంఘటన నేపథ్యంలో మీరట్ ను సందర్శించి అస్గర్ అలీ ఇంజనీర్ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘ లో రాసిన వ్యాసంలోని ఈ వాక్యాలు  “సహచరులు” పుస్తకంలోని ‘పక్షులు’ అనే లేఖలో కనిపిస్తాయి. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు సమాజం ఎలా చీలిపోయి వుందో అర్థమవుతుంది.
ఇపుడు వాక్యాలు గాకుండా, వాక్యాల మధ్య వున్న సారాంశాన్ని అన్వయించుకుందాం. వి.వి విషయంలో గొంతు విప్పడానికి అతను ముస్లిమో, హిందువో కాదు. విరసమో, ఆరెస్సెస్ వ్యక్తో కాదు. బహుజనుడో, మనువాదో కాదు. అతను మనలాగే ఒక మనిషి. మనుషుల స్వేచ్ఛ కోసం నిరంతరం తాపత్రయపడే మనిషి. అలాంటి మనిషి కోసం మాట్లాడ్డం, మద్ధతు కూడగట్టడం, ఒక్క అక్షరమన్నా రాయడం కనీస స్పృహ వున్న మనుషులు చేసే పనిగా గుర్తెరగాలి. మనకోసం నిలబడి కొట్లాడే మనిషి కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి.
ఇపుడు వి.వి ని, వి.వి లాంటి రాజకీయ ఖైదీలను, జి.ఎన్ సాయిబాబా వంటి మేధావుల్ని విడుదల చేయమని కోరడం అప్రజాస్వామికం కాదు. ఇది కరోనా విజృంభించిన కాలం. జైల్లో వున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం వుంది. పైగా వి.వి కి 70 సం.లు పైబడిన వయస్సు, దానికి తోడు అనారోగ్యం. ఏ కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించినా విడుదల చేయమనడం సబబే అనిపిస్తుంది.
*

బండారి రాజ్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కమ్యూనిస్టులు స్వేచ్చ గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం ఏమో !

  • నువ్వు సీరియస్ గా రాస్తే ఇంత బాగుంటుందని నాకు తెలుసు. కంగ్రాట్స్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు