పొడుగు కైత : విదూషకుని నాటకం

I
మొదటి విదూషకుని రంగప్రవేశం
చెవులున్నవారికి దండాలు పెట్టి చిడతలు తీసుకొని భజన చేయును
అయ్యలారా! అమ్మలారా! రండి
ఈ దేశాన్ని పునీత పరిచినవాళ్లు
ప్రవచన పారాణీలు రాసినవాళ్లు
పురాణాల పట్టువస్త్రాలు చుట్టినవాళ్లు
ఇతిహాసాల పుస్తెల్ని కట్టి చరిత్రని ముత్తైదువుని చేసినవాళ్లు
భాగ్యబుద్ధులారా విచ్చేయండి
సరాసరి మా హృదయాల్లో పార్లమెంటు భవనాలు కట్టాం
కాలు మోపండి
పసుపు నీళ్లు తెచ్చాం
పవిత్ర స్నానాలు చేయండి
ఆవుపేడ తెచ్చాం
ఆ భవనాలు కడిగి మైల పారగొట్టండి.
మీరు ధనస్సులు పట్టని దేవుళ్ళు
కత్తులు పట్టిన దయామనస్కులు
మా పాలిట పాలకడల్లు!
రండి… రండి…
దేవాలయాల సత్రంలో కాస్త అన్నదానం చేయండి
మా గొంతులకి మీ తాయత్తుల తమ్మెలు చుట్టుకొని
మీ కొట్టాల్లో పశువుల్లా మెసుల్తాం
మీ రోడ్లు ఊడుస్తాం, మీ పియ్యెత్తుతాం
మీ స్నానాల గదుల్లో సాంబ్రాణి వేస్తాం
మీ పడక గదుల్లో మా ఆడాళ్ళ గుడ్డలు విప్పుతాం
మీ కాలి చెప్పుల కింద ప్రాణాలపువ్వులు పరుస్తాం
రండి! అయ్యలారా! అమ్మలారా
మీ పాదాల ముందు సాగిలపడి వేడుకుంటున్నాం
దోసిల్లు చాచి అంగలార్చుతున్నాం
ధర్మస్తంభాల పైన మీ శిల్పాలను చెక్కే పనిభిక్ష పెట్టండి
పుణ్యాల కోటల్లో ఒక ఇటుకపెల్లె కానియ్యండి
అదీ కాకుంటే అఖండ స్మశానంలో
మీ సమాధుల మీద ఈగ వాలకుండా
కాపలాకాసే పనప్పగించండి
కుక్క చూపే విశ్వాసం కన్నా గొప్పది మా విశ్వాసం
నమ్మండయ్యా! నమ్మండమ్మా!
వేదకాలం నాటి వైభవాల వనాన్ని సాగుచేసి పెంచే
పనిమతులం ఉన్నాం
పరువుగల వాళ్ళమే కానీ పదవి మీకు కట్టబెట్టేవాళ్ళం
పళ్ళికిలించి పలకరించేవాళ్ళం
మీ కరుణా కటాక్ష అగరొత్తుల పొగ నాసికారంధ్రాలతో పీల్చుకు పులకించేవాళ్ళం
మీ ఎంగిలిస్తరాకుల్ని మా మొకాన పడేయండి
మహా ప్రసాదంలా స్వీకరిస్తాం
తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాం
మా కంచాల్లో ఏరిగినా, మొకాల మీద ఉమ్మినా
రాజకీయ భవనాల్లో మా కోసం మీరు శ్రమపడి
పశువుల కొట్టాల ప్రణాళికలు తెచ్చినా
మా పొలమంతా మీ బోగసాగులకు ఇచ్చి
పిరికెడు పంజల కోసం మొకాళ్ళ మీద పాకుతాం
ఇంతకన్నా విశ్వాసం కుక్కలు చూపుతాయా?
మీ మూడోకాలి బోటినేలు నాకి మీకు మొక్కుంటాం
అవతార పురుషులని వీధి వీధి చాటుకుంటాం
మీ మంటపాల్లో మా బిడ్డల్ని బోగిణీలను చేస్తాం
సగం మందిమున్నా మీ సంకల్లో వెంట్రుకల్లా పడి చస్తాం
మీ పిర్రల్ని ఆన్చటానికే మా భుజాలని బలంగా పెంచాం
మిమ్మల్ని దేశమంతా ఊరేగించి మా దేశభక్తి చాటుతాం
అయ్యలారా! అమ్మలారా! రండి
పరమ పురుషులారా! రండి… రండి…
మీ రాకకై కళ్లు కొబ్బరికాయలు చేసి
నీళ్లు వారబోసి
ఎండు మిరపకాయలు తిప్పేసి
ఉప్పుగళ్ళు పొయ్యిలో పోసి
మీ రథచక్రాల నిమ్మకాయలమవుతాం
నమ్మండయ్యా! నమ్మండమ్మా!
మీ దేవాలయల పహరీల చుట్టూ
మాసిన చెప్పుల్లా పడుంటాం
దయతలచి తొడగండి
మీ పాదాలకి ముళ్లు గుచ్చుకోకుండా
ముత్తెంలా చూసుకుంటాం
రండి అమ్మలారా! అయ్యలారా!
మీ పాదాలను మోపండి.
భారతావనిలో పుట్టినందుకు మోక్షం కలిగించండి
రండి! రండి! రండి! రండి!
గిర్రున తిరిగి విదూషకుడు నేలపై ఒరిగిపోయెను. మోకాళ్లపై కూర్చొని తలవంచుకు భూమిని చూస్తూ ఉండెను. కొంత నిశ్శబ్దం. మెల్లగా లేచెను. గొంతు మార్చి నాట్యం చేయుట ప్రారంభించెను.
మేం తిరుగులేని పత్తిత్తులయ్యాం
ఒడుకుతున్నాం కనపడని ఝంద్యాలను
ఊరేగిస్తున్నాం కొత్తగా పుట్టలోంచి లాగిన చరిత్రలను
మేం కులానికి రక్షకభటులం
సనాతనంకి రథచక్రాలం
హిందూ పందిళ్ళకి గుంజలం
వాడిచ్చిన జండాలను ఊరేగిస్తాం
వాడు చెప్పిన మసీదులను తవ్వుతాం
మా ఇళ్ళ మీదకు మేమే బుడోజర్లను తోలుతాం
మేం సరికొత్త డ్రైవర్లం.
వాట్సప్ యూనివర్శిటీలో ఫార్వర్డ్ సెండ్లం
అబద్ధాలను మోసే అభాగ్యులం
కులహత్యల దండలకి కొత్త తలలను కుట్టే కత్తులం
వీరులం భోగసానులం
మా శ్రమ చరిత్రను మర్చిపోయిన ముష్టులం
ఉత్పత్తిలో పనిముట్లం
హక్కుల గొంతు పూడిపోయిన గొంగళి పురుగులం
లాలూచీ నాయకుల మధ్య కుక్కిన పేనులం
అసలు బానిసత్వానికి సరైన అర్థం చెప్తాం
వాడు గొంతు కోసినా మెడనింకా సాగదీస్తాం
నా కోసం గళమెత్తిన వాడి ఊపిరి చల్లబరుస్తాం
ఒక చరిత్రంటూ లేనివాణ్ణి
వాడికి అనుసరున్ని
వాడు పోసిన ఉచ్చతావుల్ని వెతికి తొక్కేవాన్ని
గడిచిన చరిత్రలో హీనున్ని
గడుస్తున్న చరిత్రలో బానిసని
గడవబోయే చరిత్రలో రాక్షసున్ని
నాకు ఊరు లేదు
నాకు సంస్కృతి లేదు
వాడు దిద్దిన నామాలకి మొక్కునేవాణ్ణి
వాడు పలికిన నామాలనే వల్లించేవాణ్ణి
వాడు ఇడిచిన పంచెను పవిత్రంగా కట్టుకునేవాణ్ణి
వాడు విసర్జించిన తిండినే బొక్కేవాన్ని
వాడి దేవాలయానికి మెట్లుగా దేహాన్ని పరిచినవాన్ని
వాడు కట్టిన కోట ముందు కాపలా కాసేవాన్ని
వాడి నిద్రలో జారిపోయిన కలలను ఏరుకునేవాణ్ణి
వాడి ఎంగిలి మాటలకి స్నానం చేయించేవాన్ని
వాడి దొంగరాతలకి నిజాన్ని అతికించేవాన్ని
కూర్చోమన్న చోట కూర్చొని ఏరగమన్న చోట ఏరిగేవాణ్ణి
నా వినయ సంపన్నతతో ఈ దేశానికి భవిష్యత్తునని చాటుకునేవాన్ని
నా గుళ్ళని కూల్చుకొని
నా ఇళ్లని కాల్చుకొని
నా చరిత్రని చింపుకొని
నా బొట్టుని తుడుపుకొని
నా బట్టను మార్చుకొని
నా మాటను మరుపుకొని
అనుసరిస్తున్నానూ కళ్ళుమూసుకొని కనిపిస్తున్న ఉక్కుపాదాల జాడల్ని
బతుకుతున్నాను అధికారున్నని తెలీని ఆజ్ఞల మధ్య ఒదిగొదిగి
ఏదీ నా చోటూ
ఏదీ నా తల్లీ
అయ్యో! ఈ దేశం మహత్తర సంస్కృతికి వారసున్నే
వాడి పిలక ముడిలో వెంట్రుక ముక్కనయ్యానే
నా తమ్ములను, తోడబుట్టిన వాళ్ళని తన్ని తగలేశానే
ఏరీ నా వాళ్ళూ
గొడ్డుపేగుల ఇంధ్రధనస్సులతో వేరాండ్లు పలికినవాళ్లు
ఏరీ నా జనం
చెట్టు చెట్టుకీ గొంతుని చుట్టుకొని అడవుల్ని కాసినవాళ్లు
అయ్యో! ఏరీ నా తల్లులు
చెట్లగట్ల ముందు కొలువైన చల్లని కళ్ళున్న తల్లులు
బలి కొట్టి పొలి చల్లేదెలా
నా చోటేది?
ఇంత సనాతనాన్ని కాపాడానే
బంధువన్నాడే
ఆఖర్న నాకు చోటే మిగలకుండా పోయిందే
నా ప్రాచీన చోటులో ఇన్నిన్ని ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ అగ్రహారాలేమిటి?
పరాయి దేశం జెండా ఏమిటి?
నా దేశం ఇంకొకడికి తొత్తేమిటి?
నేను ఒకడికి బానిసైతే
నా దేశం ఇంకొకడికి బానిసయ్యిందే
మనుషుల్ని బానిసలుగా చేస్తున్నవాడే
దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నాడు
బానిసకొక బానిసకొక బానిసకొక బానిసకొక బానిసకొక
బానిసకొక బానిసకొక బానిసకొక బానిసకొక బానిసకొక బానిస…
ఇది బానిసల సంత.
ఓహో! నడుస్తున్నది బానిస కొడుకుల చరిత్ర
రాస్తున్నది తాకట్టు చరిత్ర
పోటెత్తుతున్నది పరాయివాడి సంస్కృతి
ఏమి బానిస దేశం. ఎంత కళకళలాడుతున్నద్దీ
ఏడీ సనాతన ధర్మానికి మూలస్తంభం?
ఓహో! పశ్చిమ తీరాల్లో విదేశీ అప్సరసల సాంగత్యంలో సురా సేవనంలో
ధర్మ రక్షణకు శ్రమ పడుతున్నావా నాయనా…
అరే ఎన్ని బుకాయింపు కోతలు కోసావురా!
అడవుల్ని కాల్పించి
కొండల్ని కరిగించి
నదుల్ని ఇంకించి
జనాన్ని నమ్మించి
దేశం గొంతు మెత్తని సనాతన గుడ్డతో కోసావుగా.
ఎన్ని హొయలు పోయావురా!
ఎవడో వచ్చి కులాన్ని నాటాడని
చరిత్రని మార్చాడని
మతాన్ని హతమారుస్తున్నాడని
దేశం సంస్కృతి నశించి కృశించి పోతోందని
శంఖాల గొంతుల్లో జైజై లు పలకండని
నువ్వారా నాయాలా ఈ దేశానికి దారి చూపించేది
ఏ రంగులో ఉండాలి
ఏ తిండి తినాలి
ఏ పలుకు పలకాలి
ఏ గుడ్డ కట్టాలి
ఆఖరికి సంసారం కూడా ఎలా చెయ్యాలో చెప్పేది నువ్వూ
వినేది మేవా?
చెప్పేది ఛీరావ నీతులు కులికేది పక్కోడి పడకలో
ఈ దేశ గచ్చత్తరం తెలీదు
అసలు ఇక్కడి మనుషులు తెలీదు.
అరే! నువ్వొచ్చి 30 శతాబ్దాలు గడిచినా
ఎన్నడన్నా ఈ నేలలో మట్టిగా చెట్టుగా పుట్టగా
పురుగుగా విత్తుగా తిండిగా కన్నీటిగా మారాలనుకున్నావా
నీ ఛాతిని చాచే పరుపుగా ఈ పుడమిని చూశావేగానీ
నీ వ్యాపార పంగలు చాచటానికి అనువుశాల అనుకున్నావేగానీ
ఈ నేల సిరుల్లో కణాలుగా ఎప్పుడన్నా ప్రవహించాలనుకున్నావా
దేవుళ్ళని పెంచి మనుషుల్ని చంపావుగానీ
నదుల్లా ప్రవహించాల్సిన వాళ్ళకి ఎడారులను అడ్డుగా పెంచావుగానీ
అడవుల మాలకి సెలయేరుల దారంలా మారావా
ఎప్పుడన్నా ఈ దేశం అయ్యావా!?
ఇక నీ నంగనాచి పాచి మాటలు చెవున పడటానికి లేదు
హద్దుల పగ్గాన్ని కట్టే మాట్లాడుతున్నా
నా కంచంలో నా మెతుకుల్ని కలుపుకుంటున్నా
దారిలో నా అడుగుల్నే పెనవేసుకుంటున్నా
నీ విషపొడ సొకటానికి లేదు
అన్నిటికీ బదులు చెప్పాలి
చిట్టా పొడవు మూడువేల ఏళ్ల నాటిది
ఇది కొత్త రంగపు నృత్యం
మోగించండి ఇప్పుడు
చప్పట్లు కాదూ డప్పులు కాదూ
మోగించండి ఫిరంగుల్ని
చల్లండి ఇప్పుడు
కుంకుమ కాదూ వేపాకుల రెమ్మలు కాదూ
ఎండిన నెత్తురు పొడిని
జజ్జనకర జజ్జనకర జ్జనారే జజ్జనకర జ్జనారే జ్జనారే
జజ్జనకర జజ్జనకర జ్జనారే జజ్జనకర జ్జనారే జ్జనారే
*
(రెండో భాగం- వచ్చే సంచికలో)

గూండ్ల వెంకట నారాయణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.