గత దశాబ్దకాలంగా బాలసాహిత్యం రాయలసీమలో ఇబ్బడి ముబ్బడిగా వస్తోంది. క్రీ.శ.1800 సంవత్సరానికి ముందు బాలసాహిత్యం ప్రత్యేకంగా లేదు. సీరియస్ సాహిత్యకారులే బాలసాహిత్యం రాసేవారని పరిశోధకులు నిర్ధారించారు. దాదాపు నూటాయాభైఏళ్ళ తర్వాత అంటే 1950 తర్వాతనే బాలసాహిత్యం ప్రత్యేకంగా రాయడం ప్రారంభమైదని చెప్పవచ్చు. బాలల రచనలు తొలుత కందుకూరి, గురజాడలు కూడా రాశారు. గురజాడ ముత్యాలసరాలు పిల్లల్ని ఎంతగా అలరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాయలసీమలో బాలసాహిత్యానికి మూలపురుషుడు మాత్రం కడపజిల్లా జమ్మలమడుగుకు చెందిన వావికొలను సుబ్బారావు (1863-1936). ఈయన ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన నీతికథలు, నీతి పద్యాలు, చారిత్రక జానపద కథలు రాశారు.
అనంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాయలసీమలో భాగమైన బళ్ళారికి చెందిన రూపనగుడి నారాయణ స్వామి, ధర్మవరంకు చెందిన సిరిపి ఆంజనేయులు విస్తృతంగా రాశారు. సీరిపి ఆంజనేయలు బాలలకోసం రాయలసీమ కథావాచకాలు మూడు భాగాలు రాశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గుంట సుబ్రహ్మణ్యశర్మ బాలలకోసం ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అనేక పుస్తకాలు రాసి ప్రచురించారు. అనంతపురం జిల్లా ఇల్లూరుకు చెందిన కైప మహానందయ్య తెలుగు, ఆంగ్ల భాషల్లో గొప్ప రచనలు చేశారు. తొలితరం బాలసాహిత్యం ఎక్కువగా ఉమ్మడి అనంతపురం జిల్లాలలోనే కనబడుతుంది. పిల్లలకోసం ఆయన పురాణ, చారిత్రక, ఇతిహాస, సాంఘిక, జానపద కథలెన్నో రాయడం వల్ల ఆనాటి పత్రికలు చందమామ, బాలజ్యోతి, బుజ్జాయి, బాలభారతి పత్రికలు ప్రచురించి ప్రోత్సహించాయి.
బాలసాహిత్యంలో రాయలసీమలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ కవి కవికాకిగా పేరొందిన కోగిర జై సీతారాం. ఈయన బాలసాహిత్యంలో అరుదైన ప్రయోగాలు చేశారు. భాష, సాహిత్యాలను ప్రాథమిక స్థాయిలోనే అవగాహన కలిగేలా పాటలు, పద్యాలు, కథలు విస్తృతంగా రాశారు. స్వయంగా బొమ్మలేసి మరీ బాలసాహిత్య సృజన చేశారు. ఈయన రాసిన మేం పిల్లలం అనే పుస్తకాన్ని పాలపిట్ట ప్రచురించింది. ఈ కాలంలోనే కడప జిల్లా నుండి వెంకటరాజు పల్లెకు చెందిన అంతటి నరసింహం అనేక రచనలు బాలలకోసం రాశారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకుకు చెందిన అవధాని రమేష్ తెలుగు ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసి కేంద్ర రాష్ట్ర బహుమతులు అందుకున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం అప్పరాశ్చర్య గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు అమళ్ళదిన్నె గోపినాథ్ బాలలకోసం హాస్యరచనలు చేశారు.
రాయలసీమలో బాలసాహిత్య రచనలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపుపొందన వారు కె.సభా, కలువకొలను సదానంద. ఇద్దరూ చిత్తూరు జిల్లా వాసులే. కె.సభా స్వగ్రామం, కాట్రకొన కొత్తూరు, ఆయన రాసిన అనేక కథలు, గేయసంకలనాలు భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి. కలువకొలను సదానంద తన పజ్జెనిమిదవ ఏటనే రచనారంగంలోకి వచ్చి అద్భుతమైన బాలసాహిత్యసంపదను సృష్టించారు. వీరి సమాకాలీకులైన పుత్తూరుకు చెందిన గంగరాజు మోహన్ రావు బాలలకోసం అనేక కథలు గేయాలు రాశారు. ఈ కోవలోనే బండమీద పల్లి భీమరావు బాలల్లో పౌరాణిక నాటకాభిలాషను పెంచాలనే ఉద్దేశ్యంతో బాల తపస్వి, భక్త ప్రహ్లాద, అనే పౌరాణిక నాటకాలు రాసి బాలలచేత ప్రదర్శింపజేశారు. పిల్లలకోసం ద్రువు, భక్త ప్రహ్లాద కథలను నాటకాలుగా రాశారు. అనంతపురం గుంతకల్లుకు చెందిన సరిశేపల్లి లక్ష్మీనారాయణ బాలలకోసం విస్తతంగా బాలసాహిత్యాన్ని సృష్టించారు. పిల్లల్లో త్యాగం, ధైర్యం, జ్ఞానం పెంపొందేలా రచనలు చేశారు. అనంతపురానికి చెందిన బద్వేలి రమేష్ బాలసాహిత్యంలో విశేషంగా కృషిచేశారు.
*








Add comment