పాత సంవత్సరం     

నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు నేనెలా ఉన్నానో గుర్తు చేసుకుంటాను.

“తెల్లారి లేచి చూస్తే, అదీ మనం తెచ్చిపెట్టుకుంటేనే, క్యాలెండర్ మారిపోతుందంతే. కొత్త సంవత్సరమంటే అంతకుమించి ఇంకేం ఉండదంటారు కొందరు. ఇంకొందరు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇదొక అవకాశమంటారు”.

ఆఫీస్‌లో కూర్చొని ఇలాంటి మాటలేవో ఒక స్టోరీ కోసం రాస్తుంటే, ఆ చివరి వాక్యం దగ్గర ఆగిపోతాను. వెనక్కి తిరిగి చూసుకొని పాత సంవత్సరమంతా నువ్వే ఉన్నావని చెప్పడానికి, నీ ప్రొఫైల్ తీసి చూసి, నువ్వు ఆన్‌లైన్ ఉండటం గమనించి ఫోన్ పక్కన పడేస్తాను. తిరిగి పనిలో పడిపోతాను. ఆ రోజులో ఎన్నోసార్లు గుర్తొస్తావు.

ట్యాంక్‌బండ్ ఫ్లై ఓవర్ మీద బండాపి, చంద్రుడ్ని ఫొటోలు తీసుకుంటూ, నీకే అది పంపాలని దాచుకుంటాను. నాతో ఏమాత్రం సంబంధం లేనట్టే అక్కడున్న బండ్లన్నీ దూసుకుపోతుంటాయి.

అక్కడే, అదే దారిలో ఒక అందమైన అమ్మాయి నాకోసం ఆగి, “ఏమైనా చెప్తావా?” అనడగాలని కోరుకుంటాను.

ఆ అమ్మాయిని అదే ఫ్లై ఓవర్ మీద కూర్చోబెట్టి, చంద్రుడ్ని చూపిస్తూ, ఈ చంద్రుడ్ని ఎప్పుడైనా చూశావా అనడుగుతా.

“రోజూ చూస్తాగా” అంది.

“అలా కాదు. పొద్దున చూశావా అతడ్ని?”

“డామ్! ఐ యామ్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్” అంది.

నేను నీతో కలిసి ఉదయాన్నే చూసిన ఆ చంద్రుడి గురించో, లేదా రాత్రి నీకోసం వాడ్ని నాలో దాచిపెట్టుకొని పొద్దున్నే నీకు చెప్పడం గురించో చెప్తాను.

“ఇంట్రెస్టింగ్! ఆమె గురించి చెప్పు..” అనడిగింది ఆ అమ్మాయి.

ఏ రోజు నుంచి మొదలుపెట్టను? పోయినేడాది చివరిరోజు నీ దగ్గర కూర్చొని, “ఏడవొచ్చా” అని ఏడ్చాను చూడు.. అక్కడ్నుంచి చెప్తా. ఒక్కో రోజు గురించి చెప్తా. నువ్వు నా గురించి అడిగితే, నీకు చెప్పేవాడ్నిగా, నీ కాళ్ల దగ్గర కూర్చొని. అలా నీ గురించి రాత్రంతా చెప్తా. బండ్లన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. చంద్రుడు రకరకాల రంగుల్లో కనిపిస్తుంటాడు. లైట్ తగ్గుతుంది. తెల్లారేసరికి ఆమెకు ఆ చంద్రుడ్ని చూపించి, “ఇదే!” అంటాను.

“స్వీట్. యూ మిస్ హర్?” అనడిగింది.

నవ్వుతాను నేను.

“ఐ నో యూ మిస్ హర్!” అంది.

ఆ అమ్మాయి కాళ్ల దగ్గర్నుంచి లేచి ఒక హగ్ ఇచ్చి, మళ్లీ నవ్వుతాను.

ఆ అమ్మాయి వెళ్లిపోతుంది.

పొద్దునెప్పుడో ఇక్కడిక్కడే నడుస్తూ రాత్రి ఆ అమ్మాయికి చెప్పినవన్నీ ఒక్కొక్కటీ గుర్తు తెచ్చుకుంటాను.

హ్యాంగోవర్ ఉన్నట్టు ఉంటుంది. ఈ సందూ, ఆ సందూ తిరుగుతూ, కనిపించే ప్రతి బండి మీద నెంబర్ వెతుకుతుంటా.

7043, 4961, 9342, 2941, 1352, 7603.. ఏవేవో. సరిగ్గా ఇవే నెంబర్లు కాదు కానీ, కనిపించిన ప్రతీ బండి నెంబర్ చదువుతాను. నిజంగానే ఒక బండి కోసం వెతుకుతున్నట్టే, ప్రతిదీ శ్రద్ధగా చదువుతాను.

ఇవే సందుల్లో వెనక్కి వెళ్తూ, ఇక్కడున్న బండ్లే మళ్లీ ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, కేవలం నెంబర్లే చదివాను కాబట్టి, నెంబర్లే చదువుతూ పోతాను. చాలా బండ్లు అక్కడే ఉన్నా, ఒక్క నెంబర్‌ను మాత్రం కచ్చితంగా రెండోసారి చదువుతున్నట్టు అర్థమై ఆగిపోతాను. అది మొదటిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతిని గుర్తు చేసుకుంటాను.

నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు నేనెలా ఉన్నానో గుర్తు చేసుకుంటాను. నువ్విప్పుడు పక్కన లేకపోవడం ఎంత బాధగా ఉందో అనుకుంటాను. పెయిన్ ఉన్నప్పుడు కాలనీల్లో హీరోలు స్పీడ్‌గా నడిచెళ్లినట్టు వెళ్తుంటాను.

ఒకావిడ చిన్న పాపను చంకలో వేసుకొని చెయ్యి చాచి అడుగుతోంది. నేను నా జేబులన్నీ వెతికి, ఏమీ లేవని తెలుసుకొని, ఆమె దిక్కు చూసి, నిన్నివాళ కలిస్తే చూసేటట్టు చూస్తాను.

సరిగ్గా అప్పుడే ఒకతను, “ఏమ్మా! ఏమన్నా తింటావా? ఇడ్లీ తింటావా? రెండు ప్లేట్ ఇడ్లీ ఇయ్యవయ్యా వీళ్లిద్దరికీ!” అని ఆర్డర్ చెప్పాడు పక్కనే ఉన్న ఇడ్లీ బండి అతనితో.

ఆమె నవ్వింది. అతనూ నవ్వి, “తినండి.” అని డబ్బులిచ్చి వెళ్లిపోయాడు.

నేను చిన్నగా నవ్వి, ఇంతకుముందులా కాక చిన్నగా నడుస్తూ వెళ్లిపోతా.

ఇంతవరకు వచ్చాక నీకు చెప్పే కథ అయిపోయిందనిపిస్తుంది.

ఇప్పుడు ఈ కథ మొత్తంలో నేను మాత్రమే ప్రెజెంట్‌లో ఉన్నా చూశావా! నేనొక్కడినే నడుస్తున్నా గమనించావా? నువ్వు ఇక్కడికొస్తే నీకవన్నీ చూపించాలని ఉంటుంది నాకు. లేదా నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ రావాలని ఉంటుంది.

బేబీ! ఎక్కడున్నావు?

*

 

 

 

 

 

 

 

 

వి. మల్లికార్జున్

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మల్లికార్జున్ గారూ, చాలా హృద్యంగా వ్రాశారు.

  • బావుంది మల్లిఖార్జున్ గారూ! ఎవరో ఒకరి ఊహలు కాలాన్ని చెయ్యిపట్టుకుని నడిపిస్తుంటే భలేవుంటుంది కదూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు