నేనంటే నేనే

నేను నేనే
మరొకరిని ఎలా అవుతాను.
నేను అయిదక్షరాల పేరునే కాను
పంచభూతాలను నాలో పొదువుకున్న విశ్వాన్ని

నేనంటే నేనే
నాకళ్ళల్లోకి దీర్ఘంగా చూడు
నేనే మెరుస్తూ కన్పిస్తాను

నేను అమ్మని
ఊపిరిని బంధించి
నీకు శ్వాసనందించిన దాన్ని
నా శరీరంలో ప్రవహించే రక్తాన్ని
నీకోసం ధారపోసాను
గుండెలో శబ్దించే నరాలనుండి
పాలధారనుచేసి కుడిపాను
గుర్తు రావడంలేదా
ఒక్కసారి నువ్వు తాగిన
పాలరుచిని తల్చుకో
అమ్మరుచి తెలుస్తుంది

నేను అలలకన్నెని
సముద్రపు హోరులో
నాకథని వైనాలు వైనాలుగా
అలలు వినిపిస్తూనే ఉన్నాయ్
ఓసారిటు చెవి ఒగ్గి విను
అస్తిత్వాన్ని మున్ముందుకు
ప్రదర్శించాలనుకున్నప్పుడల్లా
వెనక్కిలాగే  సాగరబలాన్ని
మరింత బలంగా తోసుకుంటూ
రెట్టించిన ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని
ఉరకలు వేస్తూనే ఉన్నాను
నేను సాగరకన్యనే కదా

నేను సారించిన విల్లుని
లక్ష్యం తెలిసిన దాన్ని
ఆదాముతో సంగమించిన అవ్వను నేనే
ఈ జగత్తుకు మూలశక్తినీ నేనే
ముగ్గురమ్మల మూలపుటమ్మను నేనో కాదో కానీ
ఆదిమ శక్తి స్వరూపాన్ని
యుగాల మీదుగా నడుస్తూ నడుస్తూ
నన్ను నేనే నిర్మించుకున్న దాన్ని
అగ్నిప్రవేశం చేసిన నా పాదాల్నిండా
అనుమానపు జ్వాలల్లో
రగిలిన అవమానంబూడిద
ఇంకా మసి పారాణై మెరుస్తూనే ఉంది

పన్నెండు నెలల కాలయంత్రాన్నే కాదు
యుగాయుగాల పర్యంతమూ
తలచుకున్నవాళ్ళకు తలచు కున్నంత
మరుపు కోరేవాళ్ళకు జోలపాడేంత
నవ్వేవాళ్ళకు పరిమళమంత
దుఃఖితులకు ఆలింగనమంతగా
నేనెప్పుడూ నేనే!

*

చిత్రం: స్వాతి పంతుల 

శీలా సుభద్రాదేవి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నేను సారించిన విల్లును , లక్ష్యం తెలిసిన దాన్ని – చక్కగా చెప్పారు సుభద్రాదేవి గారు! లక్ష్యాన్ని తెలుసుకోలేక పోవడం స్త్రీలకున్న ముఖ్యమైన వెనుకబాటు తనం. అది అవగాహన చేసుకొన్న నాడు సూటిగా దూసుకుపోవడం కష్టం కాదు.

  • మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీల గారూ

 • చాలా చాలా బావుందమ్మా
  బిడ్డకు ఊపిరిచ్చి పాలిచ్చి పెంచినా ఎక్కువ శాతం స్త్రీలకు తనని తాను తానుగా ఆ పుట్టిన సంతానం దగ్గర కూడా ప్రకటిచుకోవాల్సిన సందర్బాలు నేటికీ అనేకమందికి అనేకసార్లు ఎదురౌతున్నాయ్!

  నేనంటే నేనే
  స్త్రీ యొక్క ఆస్తిత్వం ఆత్మ గౌరవం తాలూకు గుర్తు గొప్పతనం కవితలో కనిపిస్తుంది.
  ప్రతీ వాక్యం 👌👌👏👏🙏🙏
  నమస్సులమ్మా 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు