తన ఆకాశం, తన నేలా సృష్టించుకున్న “చిత్ర” సూర్యుడు!

ఇంటర్ నెట్ పుణ్యాన ప్రపంచం లో ఎంతో మంది బొమ్మలు చూసా గానీ సూర్య ప్రకాష్ ఒకే ఒక్కడు. 

మా ఖమ్మానికి ఇద్దరు మహబూబ్ అలీలు ఉన్నారు.

ఒకరు నిజామ్స్ కస్టమ్స్(కరోడ్ గిరీ) లో పనిచేశారు మరొకరు ఆర్ట్ టీచర్ గా మధిర పరిసర ప్రాంతాల లో పనిచేశారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసో లేదో గానీ  ఒకరు ప్రసిద్ధ ఉర్ధూ కవి, మక్షూమ్ మొహిద్దీన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు. కస్టమ్స్ లో పనిచేసిన మహబూబ్ అలీ కొడుకు కౌముది కూడా ముఖ్థూమ్ కు దగ్గరి మిత్రుడు. ఆయన కొడుకు మహబూబ్ అలీ(అఫ్సర్) అని చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ఇద్దరు మహబూబ్ అలీలు గతించిన చరిత్ర పేజీలలో, వర్తమాన చర్చల్లో కనీసం కనబడరు వినబడరు. కారణం మనువు కు తెలుసు ఆయన వారసులు రాసిన చరిత్రకు తెలుసు.

ఆర్ట్ టీచర్ మహబూబ్ అలీ మధిర ప్రభుత్వ బళ్ళో ఆర్ట్ టీచర్ గా పనిచేసే రోజుల్లో అక్కడ ఒక ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్ ను కనుగొన్నాడు. అతనే సూర్య ప్రకాష్.
డెబ్భై ఎనిమిదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా మధిర లో పుట్టిన ఆయన ప్రాధమిక మాధ్యమిక విద్య మధిర లొనే జరిగింది.

ఆయన మాటల్లోనే ” నేను పెద్ద చదువరిని కాదు ఇంటర్ పాస్ అవడానికి చానా కష్టపడ్డా, ఒక దశలో ఇంటర్ లెక్కల.పరీక్ష లో కాపీ కొట్టి మరీ గట్టెక్కా. ఈ మాట చెప్పుకోడానికి నిజాయితీ ఉండాలి. నాకొచ్చిన మార్కులు నన్ను ఎక్కడికీ తీసుకొని వెళ్లదు అందుకే నాకు ఎక్కడా సీట్ రాలేదు.మా దూరపు బంధువు నన్ను బరోడా దిశగా నడిపాడు అక్కడ చేరడం అయితే జరిగింది కానీ ఏం చేయాలో ఏం గీయాలో తెలిసేది కాదు. నాకు బొమ్మలు వేయడం తప్ప ఇంకో పని చేతకాదు అందుకే చేతనైన పని చేస్తున్నా, గొప్ప గొప్ప తాత్విక విషయాలు నాకు చేతకాదు నాకు అర్ధం అయ్యింది ప్రకృతి .అలా రైలు ఎక్కి కిటికీ పక్క కూర్చొని రైలు కట్ట పక్క నీళ్ళు చెట్లు పుట్టలు పూలు చూడడం నాకిష్టం వాటినే బొమ్మలుగా వేస్తా అంటాడు ఆయన. యాభై లలో బరోడా లో చదివిన ఆయన . అక్కడ అధ్యాపకులు గా పనిచేస్తున్న విద్యా భూషన్ లాంటి వాళ్ళ చొరవ ఆయన ఆర్ట్ మీద శ్రద్ధ పెంచేలా చేసింది. అక్కడ చదువు అయ్యాక హైదరాబాద్ లో గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం వచ్చింది, మూడేళ్లకు మించి పనిచేయలేక పోయా.  ఇంకా చదవాలి అని ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ ఆర్టిస్ట్ శ్రీరామ్ కుమార్ దగ్గర ఆరునెలలు పనిచేసాక గానీ ఆర్ట్ ప్రపంచం ఎంత విస్తృతమైనదో అర్ధం అయ్యింది.”

ఇక ఆయన రంగుల ప్రపంచం రహదారులు పరిచింది. హైదరాబాద్ రాళ్ళు, ఆటో మొబైల్ స్క్రాప్ ఆయనను బాగా ఆకర్షించింది. శిధిల మైన ఆ ఇనుముతో జీవకళ ఉట్టిపడే లా ఆకృతులు చేసాడు.

ఒక హుస్సేన్, శివప్రకాశ్, లక్ష్మగౌడ్, వైకుంఠం, లక్ష్మణ్, కాళ్ళ, స్టాన్లీ,  వీళ్ళు చూడడానికి సాధారంగా కనిపించినా అసాధారణ రంగుల ఒరవడి. తెలంగాణ మట్టి మనుషులు.
సి సి ఏం బి భార్గవ తో పరిచయం  కలిసి రెసిడెంట్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఆకృతులు మ్యూరల్స్ చేసాడు అని విన్నా నిజానికి నేను తర్నాక లొనే పదేళ్ళు ఉన్నా పత్రికల్లో చదవడం వినడం మినహా ఎప్పుడూ చూడలేదు. ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి ఆయన ప్రపంచ శ్రేణి పెయింటర్ అని అర్ధం అయ్యింది. కలవాలి మాట్లాడాలి అని అనుకున్నా ఆయన బొమ్మలు చూసాక ఆయనగురించి రాయడం మనలాంటి పీపీలికాలకు సాధ్యం కాదు అనిపించింది.

మొన్న డిసెంబర్ లో  హైద్రాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆయన షో జరిగితే ఖమ్మం వాడు అనే ప్రేమతో వెళ్ళా..అరె బాప్ రె ఏం బొమ్మలు అవి, ఎగిరే ఆకులు, విస్తారమైన మైదానాలు, తటాకాలలో కమలాలు (సంఘీ మాత్రం కాదులే)

ఆ షో చూసాక ఒకటి అర్ధం అయ్యింది

జీవం లేని తుక్కు లో రాలిపడిన ఆకుల లో ఆయన జీవం చూసాడు.సృష్టికి ప్రతి సృష్టి అంటే ఏమిటో ఆయన విశాల మైన కాన్వాస్ నిండా పరిచిన రంగుల తెరలు తెరలు చూసాక తెలిసింది. ఆ   వర్షం లో మునకేసా.

ఇనుము, కొండలు, తటాకాలు, పచ్చటి మైదానాలు ,ఎండిన ఆకులు , నీరు,ఆకాశం ఆయన ప్రధాన మాధ్యమాలు . ఇంటర్ నెట్ పుణ్యాన ప్రపంచం లో ఎంతో మంది బొమ్మలు చూసా గానీ సూర్య ప్రకాష్ ఒకే ఒక్కడు.

సూర్య ప్రకాష్ యల్ వి ప్రసాద్ హాస్పిటల్ లో రెసిడెంట్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు అని విన్నా. ఒకటి నిజం ఆయన బొమ్మలు సంపన్నుల ఇళ్ళలో కార్పొరేట్ అద్దాల మధ్య జిగేల్ మనవచ్చు. అవి ఏ వర్గ ప్రయోజనాల కోసం అయినా ఉపయోగ పడవచ్చు. కానీ వేసిన బొమ్మకు ఒక ప్రయోజనం ఉండొచ్చు ఉండక పోవచ్చు. కానీ ఈ రంగుల ప్రపంచం సాధారణ మనిషికి అర్ధం కాదు. అలా అర్ధం అయ్యేలా బొమ్మలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆచరణ లేని వాళ్ళే ఎక్కువ .  కాళ్ళ ,చిత్తప్రసాద్ బొమ్మల్లో లా ఎండిన డొక్కలు బండ పెదాలు లేదా ఉద్యమ నీడగా ఆయన బొమ్మలు లేకపోవచ్చి. కానీ సూర్యప్రకాశ్ ఎన్నుకున్న మాధ్యమాల లో లోతైన ప్రపంచం ఉంది. వలయాలు వలయాలు గా పెనవేసుకున్న రంగుల కాల బిలాలు ఉన్నాయి. ప్రపంచం కాలుష్య కాసారంగా మారుతున్న కాలం, సూర్య ప్రకాష్ బొమ్మ  ధ్వంశం అవుతున్న ప్రకృతి పట్ల వలపోత కావొచ్చు. ఎండిన కాలువలు, చెరువులు,కుంటలు అందులో ఉన్న వృక్ష జల సంపద మన కళ్ళకు చూపించడం కావొచ్చు.
నాకయితే విపరీతంగా నచ్చాయి రంగుకే రంగేసినట్టు ఉంటాయి ఆయన బొమ్మలు. సూర్య ప్రకాష్ బొమ్మలు మన చెరువులు కుంటలు కావొచ్చు కానీ ఆ బొమ్మలు ప్రపంచం చుట్టేసాయి.

ఆయనను దగ్గరగా చూసా. హుందాగా వినమ్రంగా కనిపించాడు.ప్రపంచం మొత్తం ఆయన బొమ్మలతో చుట్టేసిన ఒక అసాధారణ మనిషిలా అనిపించాడు.
ఈ రోజు  ఉదయం మనందరికీ దూరం అయిన సూర్య ప్రకాష్ మధిర నుండి ప్రపంచం చుట్టేసి హైదరాబాద్ లో శాశ్వత నిద్రలోకి పోయాడు.
ఆయనకు భార్య ఇద్దరు బిడ్డలు అని తెలిసింది.

మహబూబ్ అలీ లాంటి అరుదైన కవి, మేధావి,ఆర్ట్ టీచర్ మనకు తెలియక పోవచ్చు ఆయన శిష్యుడు సూర్య ప్రకాష్ లో మహబూబ్ అలీ కన్న రంగుల కళలు ఉన్నాయి. అవి చాలు ఈ కాలానికి.

రెస్ట్ ఇన్ పవర్ సర్.. అక్కడ హుస్సేన్,మహబూబ్ అలీ అనే మైనారిటీ చిత్రకారులు ఉంటారు ఇక్కడ ఎలాగో ప్రజాస్వామ్యం లేదు అక్కడయినా ఆంక్షలు లేకుండా బొమ్మలు వేసుకోండి…

ఇక్కడ అంతా బాగానే ఉంది.

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అన్నా! హ్రుదయం పులకించింది. మన మధిర, మన ఖమ్మం, మన సూర్య ప్రకాష్, మాది రాయపట్నం.

 • ప్రపంచ శ్రేణి మేటి చిత్రకారులు సూర్యప్రకాష్‌ గారికి ఓ గొప్ప నివాళిని అర్పిస్తున్న ప్రియమైన డా. గుర్రం సీతారాములు గారూ! చర్విత చరణంలా ఉన్నా వారి గురించిన మరిన్ని విశేషాలు, వార్తా పత్రికల కధనాలు ఇక్కడ పొందుపరుస్తున్నా.

  విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను సమున్నతంగా ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు చెరుకుమల్లి సూర్యప్రకాష్‌ (80) హైదరాబాద్‌లోని స్వగృహంలో 23-05-2019 బుధవారం కన్నుమూశారు. కళ్లు చెదిరే రంగులతో ప్రకృతి చిత్రాలు వేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రకృతి ప్రేమికులు కూడా అబ్బురపడేలా తన కుంచెతో పచ్చదానికి వింత కాంతులద్దిన ప్రముఖ చిత్రకారుడు, ఆయిల్‌, అక్రిలిక్‌ పెయింటింగ్స్‌, అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌లో నిపుణుడు. He was inspired by French impressionists.

  ఆయన ఖమ్మం జిల్లా మధిరలో 1940న జన్మించారు. జేఎన్‌టీయూ కాలేజీలో ఫైన్‌ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్టర్ కోర్సులో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1961 నుంచి 1964 వరకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సూర్యప్రకాశ్ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీరాంకుమార్ వద్ద ఆరు నెలలు అప్రెంటిస్ చేశారు. మొదట ఆయన సిసిఎంబికి రెసిడెన్సియల్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు.

  సహజసిద్ధమైన ప్రకృతికి సైతం ప్రతికృతికాని సౌందర్యపూర్వకమైన చిత్రాలతో, మిలమిలా మెరిసిపోయే రంగులతో సూర్యప్రకాశ్‌ రచించే ప్రతిచిత్రం అందించే నిశ్శబ్ద సంగీతం కళాహృదయుడైన ప్రేక్షకుణ్ణి వినూత్న లోకాలలోకి చేరవేస్తుంది, ఆనందపు అనుభూతులలో విహరింపజేస్తుంది. రంగుల మేళవింపుల్లో, మూర్తి కల్పనలో అసాధారణ రీతిని ప్రదర్శించారు.

  ప్రకృతి చిత్రాలలోనైనా, లోగడ వేసిన పలు నైరూప్య తైలవర్ణ చిత్రాలలోనైనా వెలుగురేఖలు, రంగుల నర్తనం ప్రత్యేక ఆకర్షణలు. ఆ తర్వాత ఆకులను, గాలిలో ఎగిరిపోయే పత్రాలను వేశాడు. కొంతకాలం శీర్షికలేని నైరూప్యాలు చిత్రించాడు. పిదప లోయలు, నీలాల నీళ్ళు, లిల్లీలు, చెట్లు, చేమలు, రకరకాల రంగురంగుల వనాలు వేశాడు. దాదాపు దశాబ్ధంన్నర ప్రకృతి చిత్రాల పారవశ్యంలో మునిగిపోయిన సూర్యప్రకాశ్‌ తాను అనుకున్న భావాన్ని కూర్చడానికి వర్ణ సమన్వయంలో, రేఖా లావణ్యంలో ఆయన అమోఘమైన వైవిధ్యాన్ని సాధించారు. గత ఐదు దశాబ్దాలుగా తాను చూసిన, తాను నమ్మిన అంశాలను, తనకు నచ్చిన అంశాలనే తన చిత్రాలలో ప్రతిబింబించానంటాడు. ప్రకృతి, అంతరిక్షం, కాంతి, రంగులే ఆయన చిత్రాల్లో విశ్వరూపం ధరిస్తాయి.

  సూర్యప్రకాశ్‌ యాభై ఏళ్ల క్రితమే ఆటోమొబైల్‌ వ్యర్థాలు, పాత ఇనుప వస్తువులతో కళాకృతులను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. అవశేషం, శిథిలం అనేవి సహజ ఉనికి అన్న భావన ఆయనలో స్థిరపడటం, అక్కడి నుంచి ఆయన స్థిరంగా తనను తాను అన్వేషించుకుని పోయేలా చేసింది. ఆటోమొబైల్‌ స్క్రాప్‌ తర్వాత ఆయన వడలి పోయినవి, రాలిపోయిన ఆకులు ఎంతగానో ఆకర్షించాయి. వాటిని ‘డెడ్‌ లీవ్స్‌’అని అన్నప్పటికీ, ఆయనకు అవి మృత ప్రాయం కాదు. మృత్యువు కానే కాదు. ‘మృత్యువు కూడా విశ్వంలో ఒక జీవితమే’అని చెప్పేవారు.

  1971-1996 మధ్యకాలంలో ప్యారిస్, వాషింగ్టన్, టోక్యో, లండన్ తదితర నగరాల్లో సూర్యప్రకాశ్ తన పెయింటింగ్స్‌తో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు ఎంతగానో అకట్టుకున్నాయి. నీటిపై తేలాడినట్లు ఉండే ఇటలీలోని వెనీస్‌ నగర అందాలను కాన్వా్‌సపై బంధించారు. ఆ పెయింటింగ్‌ సిరీ్‌సకు దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ లభించింది. నీళ్ళ దారులలో తేలిపోయే నగరం వెనీస్‌. అక్కడి నీటిదారుల దరిలో నెలకొన్న భవనాలు, వాటి శిఖరాలు, చర్చ్‌లు, వంతెనలు`నీటిలో వాటి ప్రతిబింబాలు, అలంకరించిన రంగురంగుల పడవలు, సందర్శకులకు ముచ్చటగొల్పుతాయి.

  ఇవిగాక నాలుగు దశాబ్దాల క్రితమే డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, బ్రిటన్‌ తదితర దేశాల్లోని చిత్రకళా ప్రదర్శనలు విశేష ఆదరణ పొందాయి. చిత్రప్రదర్శనలలో సూర్యప్రకాశ్‌ గీసిన బొమ్మలకు ప్రముఖ స్థానం లభించింది. ఎందరో దేశ, విదేశీయులు, ప్రభుత్వ సంస్థలు, మ్యూజియంలు వీరి చిత్రాలను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా వీరి చిత్రాలకు విదేశాలలో విశేషమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రప్రదర్శనలలోనూ పాల్గొన్నారు. తన కళా ప్రస్థానంలో దాదాపు డెభ్భైకి పైగా సోలో ఎగ్జిబిషన్స్‌ నిర్వహించారు.

  1970లలో శ్రీనగర్‌కాలనీలో ‘సూర్య ఆర్ట్‌ గ్యాలరీ’ని ప్రారంభించారు. తన కుంచె నుంచి జాలువారిన చిత్రరాజాలతో కొలువుదీరిన ఆర్ట్‌ గ్యాలరీని ఎం.ఎఫ్‌ హుస్సేన్‌ ఆవిష్కరించారు. ఆర్ట్‌ గ్యాలరీ ద్వారా మరెందరో ఔత్సాహిక, వర్ధమాన చిత్రకారులను ప్రోత్సహించారు. పలు ఆర్ట్‌ క్యాంపులను నిర్వహించారు. ఆ శిక్షణా శిబిరాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్‌తో, చైనాకు చెందిన లియాన్‌ వంటి అనేక మందిని నగరానికి తీసుకువచ్చి, వర్ధమాన చిత్రకారులకు శిక్షణ ఇప్పించిన ఘనత సూర్యప్రకాశ్‌కు దక్కింది.

  సూర్యప్రకాశ్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ కూడా వచ్చింది. “ ఏ జర్నీ బియాండ్ కలర్స్ “ అనే పుస్తకాన్ని సూర్యప్రకాశ్ రచించారు. ఈ పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం రచించినందుకు న్యూఢిల్లీలోని ఆలిండియా ఫైనార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారు 1997లో కళావిభూషన్ అవార్డును ప్రదానంచేశారు. సూర్యప్రకాశ్‌ కళా జీవితంపై ‘ఏ అబ్‌స్ట్రాక్ట్‌ రియాల్టీ’, ‘ఏ పర్స్‌పెక్టీవ్‌ ఐ’ పేరుతో పుస్తకాలు వెలువడ్డాయి. ఆయన కళాసేవను వివరిస్తూ మన్మోహన్‌ దత్‌, సిసిర్‌ సహానా అనే చిత్రకారులు డాక్యుమెంటరీలనూ రూపొందించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు