చింతల బాయి

లుపుల కోసం చూశాను
తాళం ఎక్కడుందని వెదికాను
వర్షం కురుస్తోంది
నెగళ్ళు ఎగసిపడుతున్నాయి
కూలిన పెంకుల్లోంచి
రోదసి తొంగిచూస్తోంది
ఆకాశం కుప్పకూలుతుందేమో మీద
రోదిస్తున్న గాలి గట్టిగా చుట్టుకుంటోంది

 

బయటకు పరుగుతీస్తే
తలుపుల్లేవు
తాళం లేదు
కప్పులేని గోడలు కరిగిపోతున్నాయి
ఈ గదిని మూసేయడం ఎలా?

 

లోపలికీ బయటకీ
బయటకీ లోపలికీ
అటూ ఇటూ
ఇటూ అటూ
దిక్కుతోచని ప్రాణం
దిగులు చారల ప్రాయం
లోపలే కటిక చీకటీ
ఒంటి చువ్వకు వేలాడే గబ్బిలం
ముక్కుమీద నిలబడి కళ్ళల్లోకి చూస్తున్న గుడ్లగూబ

 

అదే వర్షం
అవే నెగళ్ళు
అదే గాలి
అదే మెలి తిరిగిన దేహం
లోపలి నుంచి తలుపు దిట్టంగా ఉంది
గెడ పెట్టుకోవచ్చు
బావురుమంటున్న తాళం కప్పతో
బిగించుకోవచ్చు

 

కనిపిస్తోంది అంతా
గుహలో వేలాడుతున్న రక్త చారికలు
కంటి చినుకులు పడీ పడీ
గుంతలుపడ్డ బండలు
ఒక మూల లేదు ఒదగడానికి
తలను తీసి గుండెలో దాచుకున్నాను
అయినా ఒకటే చప్పుడు
గునపాలతో గోడను కొడుతున్నారెవరో
అన్ని వైపులా

*

చిత్రం: ఏలే లక్ష్మణ్

పసునూరు శ్రీధర్ బాబు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చీకటి, భయం, ఒంటరితనం కలిసి సృష్టించిన ఒక ఉక్కిరిబిక్కిరి చేసే కవితా ప్రపంచం.

  • ఏదో ఒక మార్మిక భావన మనసును కప్పేసిన అనుభూతి కలిగింది… బాగుంది, భయంగా కూడా ఉంది

  • ఈ కవిత మనిషి అంతరంగం పగిలి ముక్కలైనప్పుడు కలిగే గందరగోళాన్ని, మార్మిక భయాన్ని అద్భుతమైన భావచిత్రాలతో దృశ్యమానం చేసిన సైకలాజికల్ పోయెమ్. అభినందనలు కవి గారు

    • థాంక్యూ విల్సన్ రావుగారూ..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.