ఎవరికి ఎవరీ నేనూ నువ్వూ

1.

బంగారు తటిల్లతా..!

నీ చూపులకు

రెక్కలుంటాయి

తేలిగ్గా గాల్లో

తేలుతుంటాయి

నీ నవ్వులకు

మనసూ వుంటుంది.

బ్రతుకులోకి యిట్టే

మిళితమైపోతాయి

దేవదూతల

దూదిరెక్కలు

నీ చూపులతోనే

చేసుంటారు

పూలబాలల

రెక్కల రంగు

నీ బుగ్గనిగ్గులోంచే

దోచుంటారు

వాసంతవనం మీదుగా

వెన్నెల్లో తడిసొచ్చిన

బంగారు తటిల్లతా_

నిన్ను చూడగానే

కలిగే మొదటి తలపు..

నిన్ను చూడని

ఇన్ని ఘడియలు

ఎంత నిరర్థకమయ్యాయో కదా!

2.

నువ్వూ – నేనూ

ఎదురుచూపులో

నువ్వూ నేనే

నేనూ నేనే

ఎదురుపడ్డాకా

నువ్వూ-నేనూ

వేరూ వేరూ

ఏకమయ్యాకా

నువ్వే నేనూ

నేనే నువ్వూ

ఎడబాటులోన

ఎవరికి ఎవరీ

నేనూ నువ్వూ

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.