కథలు చెప్పేవాళ్ల కథ

అదనపు విలువ ప్రవేశించక ముందు  కూడా మనిషిని లోభపరిచింది ఆధిక్యభావన. దాని పరితృప్తికి కావలసింది అదికారం. ఆ మానసికావసరం మందినుంచి వ్యక్తిని వేరుచేయటానికి అంటే వ్యక్తి తనగురించి మాత్రమే ఆలోచించుకునే దశకి చేరటానికి చాలా కాలం పట్టింది.

రళమైన ఆదిమ సమాజాలలో కథలు చెప్పేవాళ్లు ఎవరు? సంక్లిష్ట సమాజాల వరకూ జరిగిన సామాజిక పరిణామక్రమంలో వారి పాత్ర ఏమిటి? వారిలో వచ్చిన పరిణామాలేంటి?

***

ఈ విషయం ఆధునిక కథని గురించి మాటాడుకునేటపుడు వివరంగా చెప్పుకుందామనుకున్నాను. కొంత భాగం ఇక్కడ కూడా చెప్పవలసిన అవసరం కనిపించింది.

సామాజిక అసమానత దైవకృతమని కొందరూ, ప్రకృతిసిద్ధమని మరి కొందరూ వాదిస్తారు. వారిని పక్కనపెడితే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అనేది ఉండేదని చాలామంది మానవ శాస్త్రజ్ఞులు  ఒప్పుకుంటారు. “మౌలిక వనరుల మీద సామూహిక హక్కు ఉండటం, వారసత్వస్థాయి లేదా వారసత్వంగా లభించే రాజకీయాధికారం లేకపోవటం, మానవ చరిత్రలో దోపిడీ, ఆర్ధిక వర్గీకరణలకు ముందున్న వర్గ రహిత సంబంధాలు ఆదిమ కమ్యూనిజాన్ని సూచిస్తాయి.” అంటారు  Eleanor Leacock(1983). అటువంటి సమాజంలో సామాజిక అసమానత ఎలా ప్రవేశించింది? మానవశాస్త్రజ్ఞులు ఆప్రశ్నని చాలా చర్చించారు.

నానృషిః కురుతే కావ్యం నారుద్రో రుద్రమర్చతే,
న దేవాంశో దదాత్యన్నం నావిష్ణుః పృథివీపతిః (దేవీ భాగవతం)

ఇది విన్నాం.

కవయః క్రాంతదర్శినః , కవయో నిరంకుశః , రవిగాంచనిచో కవిగాంచున్ .. ఇలాంటివీ విన్నాం.

ఇవి కవులకు అంటే కథలు చెప్పేవాళ్లకి ఉండే ప్రత్యేక ప్రతిపత్తి లేదా గౌరవం గురించి సూచనలు.

నిజమే.. ఇవన్నీ పరిణిత సమాజాల నాటివే. సంక్లిష్ట సమాజాల నాటివే.  కథలు చెప్పేవాళ్లకి ఇంత స్థాయి సమాజంలో ఏకాలంలోనైనా ఉందా లేదా అనే చర్చలోకి దిగకుండా మనం గ్రహించగలిగినది ఏమంటే వాళ్లకి అలాంటి స్థాయి లభించింది. మన పూర్వీకులు పైన చెప్పినంత స్తాయిలో ఇచ్చిన గౌరవానికి సమాంతరంగా ప్రాశ్యాత్యులూ గౌరవించే ఉండాలన్నది నా ఊహ.

మనుషులంతా సమానులుగా బ్రతకటంతో ఆరంభమైన ఆదిమ సమాజాలలో కథలు చెప్పేవాళ్లు ప్రత్యేకంగా ఉంటారా? ఈ సమానత ఏమిటో పైన తెలుసుకున్నాం. సమాజంలో సభ్యులకు సమాన దర్జా ఉన్నప్పటికీ వ్యక్తులుగా వారిలో తేడాలు ఏమటి? ఏవిధమైన వర్గభేదాలూ లేని చరిత్ర పూర్వదశలో ఉండే శ్రమవిభజన ఏమిటి?

వయోభేదం ఒకటి. లింగభేదం ఇంకొకటి. శారీరకమైన నిర్మాణ భేదం మరొకటి. ఇందులోకే మేధోపరమైన సామర్ధ్యాల భేదం చేరుతుంది. ఈ మేధోసామర్ధ్యమే కథలు చెప్పటానికి కావాలి. విషయాన్ని కథలుగా చెప్పటంలో సృజనాత్మకత ఉంటుంది.

ఆ సృజనాత్మకతలో ప్రధాన మేధో సామర్ధ్యాలను(faculties) ఆరుగా గుర్తించారు శాస్త్రజ్ఞలు. వివేచన లేదా హేతునైజం(reason), జ్ఞాపకం(memory), గ్రహణశక్తి(perception), సంకల్పం లేదా పూనిక(will), స్ఫురణ లేదా తట్టడం (intution), కల్పనాశక్తి(imagination).

పాపినేని శివశంకర్ గారి పరిశోధనా గ్రంధం సాహిత్యం- మౌలికభావనలు. దానిలో వారు ఆదిమమాయ అనే పదబంధం వాడారు. Primitive magic అనే ఆంగ్ల పదబంధాన్ని వారలా అనువదించారు. తన చుట్టూవున్న ప్రకృతిని అదుపులో ఉంచుకునే అతీత శక్తి ఉందన్న నమ్మకం,అది తము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చగలదన్న నమ్మకం అన్ని ఆదిమజాతులలోనూ కనిపిస్తుందని ఆదిమమాయ యెక్క తత్వం(philosophy)  గురించి చెపుతూ జార్జ్ ఎస్. పెయింటర్ అంటారు. ఈనాటి ఆదునిక కాలంలో కూడా సగానికి పైగా ప్రపంచ జనాభా ఈ అతీత శక్తులని (మాయని) నమ్ముతారని వారు అంటారు.

ఈమాయని గురించి వివరించేపని ఆదిమ కథకులది. ఆదిమ మానవునికి అగమ్యగోచరంగా ఉండే ప్రకృతిశక్తుల(వరదలు, భూకంపాలు, తుఫానులు, జంతువులు, కొండచరియలు విరిగి పడటం, కార్చిచ్చు,) భీభత్సాన్ని తట్టుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలంటే వారిలో ఎవరో ఒకరు కారణం చెప్పాలి. వాటిని వశం చేసుకునే ఉపాయం చెప్పాలి. ఇంచుమించుగా ఆధునిక సైంటిస్టులలాగే.. వివరించాలి. కారణం ఏమిటి.. దానిని వశపరుచుకునే లేదా అధిగమించే తంత్రం ఏమైనా ఉందా.. జరుగుతున్న దానిలో ఏదైనా క్రమం ఉందా .. వంటి వాటికి జవాబు చెప్పాలి. సూర్యుని ఉదయాస్తమయాల క్రమం, ఋతువుల క్రమం, వాన వస్తే వరద వచ్చే అవకాశం.. చెప్పటమే ఆనాటి అవసరం.  పైన చెప్పిన మేధోసామర్ధ్యాలు గల వ్యక్తులు తమ కల్పనా చాతుర్యంతో కారణాలు తమకు తట్టిన విధంగా చెప్పేవారు. వారు చెప్పిన వాటిని తదితరులు తదనంతర తరాల వారూ జ్ఞాపకం ఉంచుకుని కొత్త గ్రహింపుతో తమ ఇచ్ఛ మేరకు వ్యాప్తి చేసేవారు. ఆ విధంగా కథ మానవుడి ఉమ్మడి సృష్టి అయింది. మనం శృతులు, స్మృతులు గురించి విన్నాం. అంటే విన్నవీ, జ్ఞాపకంలో ఉన్నవీ పరిణిత సమాజాల నాటికి  క్రోడీకరించిన గ్రంధాలని అర్ధం,

వీరు చెప్పిన కథలు, ( జరిగిన ఘటనలకి ఇచ్చిన వివరణలు) మిగుల్చుకున్న జ్ఞాపకాలూ, కష్ట నివారణ కోసం అతీత శక్తులైన దేవతలని ప్రసన్నం చేసుకోటానికి ఆరంభించిన క్రతువులు, కర్మకాండలు, చనిపోయిన వారికి భూమ్మీద వారితో ఉండే రాగద్వేషాలు, ఆకలిదప్పులూ వంటివి అనంత మానవయాత్రలో సమాజ నిర్మాణానికి పడిన తొలి ఇటుకలుగా భావిస్తాను. చిన్ని చిన్ని ఆదిమ మానవ సమాజాలలో శరీర ధార్ఢ్యం, సాహసం గలవారితో బాటు ఈ కథలు చెప్పేవాళ్లు పొందిన ప్రాధాన్యత పొందారు. సామాజిక పరిణామంలో ముందుగా శ్రమ విభజనకీ, క్రమంగా అసమానతకి ఈ ప్రాధాన్యతలే తొలిబీజాలు  కావచ్చు. ఇది సమాజంపై ప్రభావం చూపే రూపం దాల్చటానికి వేలాది సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. నా యీ అభిప్రాయం ఇంకెవరికైనా కూడా కలిగి ఉండవచ్చు. వ్యక్తుల శారీరక సామర్ధ్యాలలో ప్రకృతిసిద్ధమైన తేడాలు(శరీరం, మెదడు రెంటిలో) వేల సంవత్సరాల పరిణామంలో సామాజిక అసమానతలకు దోహదం చేసాయని నేను అభిప్రాయపడుతున్నాను. దాని గురించి సమగ్రమైన పరిశీలన జరిగిందో లేదో నాకు తెలియదు. (ఇటీవల origin of stories అనే పుస్తకం గురించి ఇంటర్నెట్టులో సమాచారం లభించింది. రచయిత Brian Boyd. లభించిన ప్రివ్యూ మేరకి.. దాని గురించి రాసిన పరిచయాల మేరకీ కళ, కథ చెప్పటం, cognition(ప్రజ్ఞానము, గ్రహింపు) ల పరిణామం రాసారుట.  డార్విన్ origin of species పరిణామ సిద్ధాంతం తర్వాత విద్యావంతులందరూ పరిణామ వాదులే అయారు అంటారు ట్రాట్స్కీ. Brian Boyd గ్రంధంలో కథలు చెప్పటంలో పరిణామాన్ని సమగ్రంగా చెప్పారుట. కనక ఆ కథలు చెప్పటం మానవ సమాజనిర్మాణంలో పాత్ర గురించి చర్చించే ఉండాలి.)

సమాజాన్ని ఒకటిగా ఉంచటంలో, సంస్కృతిని కొనసాగించటంలో కథలు చెప్పుకోటమనే కార్యకలాపానికి చాలా పాత్ర ఉన్నదని చాలామంది చెప్పారు. ఈ కథలు చెప్పేవాళ్లు క్రమంగా పురోహిత వర్గంగా కొన్నిచోట్ల, ప్రభువర్గంగా మరికొన్ని చోట్ల పరిణమించారు. ఈ పరిణామం గురించి వివరంగా మాట్లాడుకుందాం తర్వాతి పేరాలలో. Priest అనే ఆంగ్ల పదానికి దేముడికి మనిషికి మధ్య సంధానకర్త అనేదే ప్రధాన అర్ధం. అర్చకుడు అనేది దానికి దగ్గర పదం. పురోహితుడి పాత్ర మన నేలమీద కొంత భిన్నమైనది. priest చేసేపనులలో ఈ పురోహితుని పనులు కొంచెం ఉన్నప్పటికీ  వారు మిగిలిన నేలల మీద అర్చకులకి దగ్గరవారు.

పోతే కథలు చెప్పేవాళ్లు… మరోమాటలో చెప్పాలంటే తెలివి కలవాళ్లు (ఆధునిక భావనలో IQ కాస్త ఎక్కువ కలవాళ్లు)  ఆదిమ సమాజాలలో దైవం పేరుతో మోసం చేసినవాళ్లా?

అయే అవకాశమే లేదు. అందరిలాగే తామూ భయపడి తమకి తాము ధైర్యం చెప్పుకునే క్రమంలోనే తమ సమూహానికి వారు చెప్పారు. అదనపు విలువ ప్రవేశించక ముందు  కూడా మనిషిని లోభపరిచింది ఆధిక్యభావన. దాని పరితృప్తికి కావలసింది అదికారం. ఆ మానసికావసరం మందినుంచి వ్యక్తిని వేరుచేయటానికి అంటే వ్యక్తి తనగురించి మాత్రమే ఆలోచించుకునే దశకి చేరటానికి చాలా కాలం పట్టింది.(ఇక్కడ కోహం గురించి ప్రస్తావించాలి. అది మరోమారు మాటాడుకుందాం.) కోహం అనే భావనకి కోహం అనే పదం పుట్టుకకీ ఉన్నంత దూరం అని నేను ఊహిస్తున్నాను.

మన నేలమీద కథలు చెప్పేవాళ్ల నుంచి బ్రాహ్మణ వర్ణం ఏర్పడింది. తమ కథలతో వీరు ఏకంగా భూమిమీద దేవుళ్లయారు. ‘బ్రహ్మ నోటినుంచి మొదట పుట్టిన బ్రాహ్మణులే జ్యేష్ట సంతానం. కనక సకల సంపదలకూ వారే హక్కుదారులు. వారు నియమించిన క్షత్రియులు భూమిని నియంత్రిస్తారుఅంటూ  ఇలాదేవి కొడుకైన పురూరవుడి ప్రశ్నకి  వాయుదేవుడు సమాధానం ఇస్తాడు. పురుషసూక్తానికి సంబంధించిన ఈ వివరణ మహాభారతంలోనిదని అంబేద్కర్ రాసారు. బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల మధ్య ఆదిక్యత పోరుకి సంబంధించిన కథలు అనేకం ఉన్నాయి. అది పక్కనుంచితే అతీత శక్తుల గురించి, వాటికి చేయవలసిన శాంతుల గురించి, ఇవ్వవలసిన బలుల గురించి కల్పన చేయగలిగిన వారు సమాజంపై అదికారం సాధించినా మన నేలమీద వారు శారీరక ధార్ఢ్యం కలవారినే పాలకులుగా అంగీకరించారు. ఈ పరిణామం తతిమ్మా ప్రపంచంతో పోలిస్తే చాలా భిన్నమైనది. నేనో కథలో “శాసనాధికారం మాది పాలనాధికారం మీది. కాని ప్రజలకి స్వతంత్రంగా ఆలోచించుకునే నిర్ణయించుకునే అధికారం ఇస్తే మన పని ఇంతే” అని హరిశ్చంద్రునితో వసిష్టుడు అన్నట్టుగా రాసాను.

దీనికి భిన్నంగా భూమిమీద గ్రీకు, చైనా, జపాన్, ఈజిప్టు వంటి అనేక ప్రాచీన నేలల మీద కథలు చెప్పేవారి నుంచే (మాంత్రికులు అంటే ప్రకృతిశక్తులను వశం చేసుకునే అతీత శక్తి సంపన్నులు) ప్రభువర్గాలు ఏర్పడ్డాయి. వారు తదనంతర కాలంలో కర్మకాండలు, దైవ వ్యవహారాలు జరిపేందుకు priestలను నియమించి వారికి కొన్ని అదికారాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మన నేలమీద బుషులకి శపించే శక్తులు, దేవుళ్లకి వరాలిచ్చే శక్తులు, కోపం వస్తే కరువులు, గాలివానలూ సృష్టించే అతీత శక్తులు ఉన్నాయి. అక్కడి ప్రభువులకి దేవుళ్లతో ఉన్న చుట్టరికం వల్ల అదేరకమైన అతీత శక్తులు ఉన్నాయి.  గ్రీకు దేవుళ్లు మన దేవుళ్లు పక్కపక్కన పెట్టి చూస్తే ఆదిమ మానవుల ఊహలలోని లేదా కథాకల్పనలోని సామ్యం తెలుస్తుంది. కాకపోతే priest kings(పురోహిత రాజు) అక్కడ ఏర్పడితే రాజులు వేరుగా పురేహితులు వేరుగా ఏర్పడటం ఇక్కడ జరిగింది

ఈ ప్రధానమైన తేడా వల్లనే మన నేలమీద పురోహిత(priest) వర్గాల నుంచి రూపొందిన బ్రాహ్మణవర్ణం తన ఉనికిని కాపాడుకుంది. సమాజంపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యథాతధ స్థితిని కాపాడేందుకు కథలు కట్టింది. పాలకులకి వత్తాసుగా ఉండే తత్వం రూపొందించుకుని ఆ పాలకులు ఎవరైనా పట్టించుకోకుండా తమ ఉనికి మీదనే శ్రద్ధపెట్టింది. బహుదేవతారాధన మతాల జనదోపిడీ వత్తాసు విధానాలకు వ్యతిరేకంగా ఏకేశ్వర మతాలు ప్రపంచమంతా పుట్టాయి. మన నేలమీద అలా పుట్టిన బౌద్ధ జైనాలు నిష్క్రమించటానికి గాని.. కొన్ని ప్రదేశాలకే పరిమితమై పోటానికి గాని.. కారణం పరోక్షాధికారంతో సరిపెట్టుకునే బ్రాహ్మణ వర్ణ తత్వం(philosophy) అని నాకనిపిస్తుంది. ఇది నా ఊహ.

అయితే కథలు చెప్పేవాళ్లంతా ఇలా మారారా.. మారే వీలుందా? కాలవాహినిలో వీరిలో వచ్చిన ఇతర పరిణామాలేంటి?

‘అభ్యాసంతో, శిక్షణతో ఈ చాతుర్యాలను మెరుగు పరుచుకోగలమని  గ్రహింపు ముందుగా పుట్టింది. ఆ తర్వాతనే పిల్లలు తనకే పుట్టారన్న మగవాని గ్రహింపు పుట్టింది. ఆ గ్రహింపులు కలిగాకనే.. కథలు చెప్పే చాతుర్యాన్ని తమ బిడ్డలకి దారాదత్తం చేయటమనే పరిణామం.. ఆరంభమయింది.’ ఈ నా ఊహని ఒప్పుకుంటే మన పూర్వీకులలో వర్ణవ్యవస్థ ఆరంభాన్ని గుర్తు పట్టవచ్చు. వర్ణవిభజన ఆదిలో ఎంపిక ఆదారంగా జరిగేదని  అంబేద్కర్  వంటి మేధావుల పరిశీలన. అది సంభావ్యమే. ఈరకమైన సామాజిక విభజన ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తుంది కాని పురుషసూక్తం లాగ చాలా తెలివిగా నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థని దైవకృతంగానూ, పవిత్రంగానూ నమ్మబలకటం మరెక్కడా జరగలేదని వారి పరిశీలన. ఈ పురుషసూక్తం కూడా వేదాలలో తర్వాత కాలాల వారు చేర్చారని వారు తేల్చారు. మానవ సమాజ పరిణామంలో శ్రమ విభజన, ఈ తర్వాత ఆ శ్రమలలో ఉచ్ఛనీచాలు, వాటిని పకడ్బందీగా అమలు చేయటం వంటివి క్రమంగా జరిగాయనుకుందాం. ఈ క్రమంలో వారసత్వ చైతన్యం అనేది శ్రమ విభజన తర్వాత వచ్చిందని నేను భావిస్తున్నాను.

ఈ వారసత్వం(hereditary)  అనేది నిర్ణాయక స్థాయికి చేరిన తర్వాత కథలు చెప్పేవాళ్లలో చాలా మార్పులు వచ్చాయి.

కథలు చెప్పేవాళ్లందరూ ఒకే అదికారస్థాయిని అనుభవించే అవకాశం క్రమంగా తగ్గింది. ‘సహజంగా ఉండే చాతుర్యాలను మెరుగు పరుచుకోటం సాధ్యం. శిక్షణతో కొంతైనా సాధించవచ్చు. సమాజంలో లభించిన గౌరవాన్నీ స్థాయినీ శ్రమకి దూరంగా ఉండటానికి ఉపయోగించుకోవచ్చు.’ ఇలాంటి ఆలోచనలు కలిగినవారు ఒకరకంగా పరిణమించారు. కల్పనలతో కథలు చెప్పేవారు కొందరైతే, విన్న కథలు చెప్పటంతోనే ఆనందించేవారు మరికొందరు. ఆ కథలను నాటకం, నృత్యం వంటి రూపాలలోకి మార్చేవారు కొందరు, బొమ్మలలో చూపేవారు కొందరు.

సామాజిక స్థాయి పెంచుకుని ప్రభువుల ఆనందాలకి కథలు చెప్పేవారు కొందరు. వారి అదికారం సుస్థిరం చెయ్యటానికి నావిష్ణుః పృద్వీపతిః వంటి కల్పనలతో దేవుళ్లతో సమానం చేసారు. సూర్య చంద్రుల  వంశజులుగా కల్పించారు. వారికి ఆనందం కలిగించి, వారి అధికారానికి ప్రచారం చేసి తద్వారా తాము పొట్టపోసుకోటానికి తమ బిడ్డలకి శాశ్వతంగా భుక్తి కల్పించటానికీ కొందరు ప్రయత్నించారు. ఇదంతా సరళమైన ఆదిమ సమూహాల కాలం నుంచి సంక్లిష్ట సమాజాలు ఏర్పడి మరింత సంక్లిష్టమయేవరకూ జరిగిన ప్రస్థానం. ప్రభువులు, వారి సిబ్బందితో నగర రాజ్యాలలో జనావాసాలు పెద్దవయోయి. అక్కడ ఉండేవారిని పురపదులు అంటున్నాను. లేదా ఎక్కువగా ఉపయోగంచే పదం శిష్టులు. పల్లెలలో ఉండేవారిని జానపదులు అనటం మనకి తెలుసు. ఇంకా అడవులనే అంటిపెట్టుకుని ఉండిపోయిన వారున్నారు. వీరందరిలోనూ ఈ కథలు చెప్పటానికి తగిన IQ కలవారుంటారు కదా.. వారెలా పరిణమించారు?

జనపదాలలో కథలు చెప్పేవాళ్లు వీరుల గురించి, వీరత్వాల గురించి చెప్పారు. శ్రమ నుంచి విరామం కలిగించే పాటలు కట్టారు. కథలు కట్టారు. స్త్రీలు తమ పాటలలో పురాణ పాత్రలైన సీతమ్మ, ఊర్మిళ వంటి వారిలో తమని చూసుకుంటూ అత్తింటి ఆరళ్లనీ పుట్టింటి పరిమితులనీ తమ అనుభవాలమేరకు కథలు కట్టుకున్నారు. ప్రతి కులమూ తమతమ పురాణాలను(గతాన్ని) కథలు కట్టుకున్నారు.(పులికొండ సుబ్బాచారి గారి పరిశోధనా గ్రంధం కులపురాణాలు తప్పక చదవవలసిన గ్రంధం). ఈ కుల పురాణాలను చెప్పేవాళ్లు ఏ కులానికి వారి కథ చెప్పే ఉప లేదా ఆధారిత లేదా యాచక కులాలుగా పరిణమించారు. పోతే ఇతర ప్రపంచంలో వీళ్లు ఏమయ్యారు అనే ప్రశ్నగురించి అవసరమైనపుడు మరోమారు మాటాడుకుందాం. మన నేలమీద అడవులలో ఉండిపోయిన వాళ్లు కూడా రామాయణం, భారతం వంటి ఇతిహాసాల పాత్రలతో తమతమ కథలు అల్లుకున్నారు.(గోండు రామాయణం గురించి పురిపండా అప్పలస్వామి గారి వ్యాసం నా బ్లాగులో ఆసక్తి కలవారు చూడవచ్చు.)

భారతదేశంలో పుట్టిన అవైదిక మతాలు బౌద్ధం, జైనం తమతమ కథలు కట్టుకుంటూనే వైదిక ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల పాత్రలతో నూతన కల్పనలతో కథలు కట్టారు. వారి మీద వీరు.. వీరి మీద వారు కథలే కథలు.. ఈ పని చేయటంలో సృజనాత్మక కార్యకలాపాలకు కావలసిన మేధోశక్తులు కలవారిదే ప్రధానపాత్ర అని మనం గుర్తించాలి.

ఆదిమ సమాజాలలో ఆదిమమాయను తట్టుకునే నిబ్బరం కలిగించిన కథాసామర్ధ్యం కలవారు.. సమాజ నిర్మాణంలో సంస్కృతి కొనసాగింపులో ప్రధానపాత్ర వహించటంలో పరిణామాలను చూసాం.

కథ కథానికగా ఎప్పుడు మారింది? చెప్పటం-వినటం నుంచి రాయటం-చదువుకోటంగా ఎప్పుడు మారింది? ఈ రెండూ ఒకటే అని ఎలా అనగలం? పోలికలేంటి? తేడాలేంటి?

తర్వాత మాటాడుకుందాం.

…..

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • <>

  …అప్పటికే జనబాహుళ్యంలో ఉన్న కథను వాల్మీకి రామాయణం గా రాశాడంటారు. వాల్మీకి గిరిజనుడు. అడవుల్లో ఉండేవాడే. అంటే అడవిలో ఉండే వారిలో కూడా వాల్మీకి రాయడం కన్నా ముందే ప్రాచుర్యంలో ఉండి ఉండాలి.

  ఇక్కడ మీరు చెప్పినట్లు…. అడవుల్లో ని వారు రామాయణం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా..?

  • తులసి గారూ
   ౧.భాష అనేది మన అలోచనలను అదుపు చేస్తుంది. ఉదాహరణకి వాల్మీకి గిరిజనుడు. గిరిజనుడు అనే పదం వినగానే చదవగానే మన మెదడులో ఒక భావన కలుగుతుంది. వర్తమానంలో అడవులలో నివసించేవారిని గిరిజనులు అంటున్నాం. కాని వారి సంఖ్య ఈ రోజు తతిమ్మా జనాభాతో (వారి జీవనశైలి నుంచి దూరంగా వెళ్లిపోయినవారితో) పోలిస్తే తక్కువ. కాని వాల్మీకి అనే ఆయన ఉండి ఉంటే ఆ కాలానికి వారి జనాభా చాలా ఎక్కువ. కనక జనబాహుళ్యంలో అంటే అప్పటి ఆ గిరిజనులనే ప్రధాన స్రవంతి అని మనం అర్ధం చెప్పుకోవాలి.
   ౨. ఇక్కడ మీరు చెప్పినట్లు…. అడవుల్లో ని వారు రామాయణం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా..? ఈ మీ ప్రశ్నలో రామాయణం నుంచి వారు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించినట్లు కనిపిస్తోంది. నేనన్నది ఇది. మన నేలమీద అడవులలో ఉండిపోయిన వాళ్లు కూడా రామాయణం, భారతం వంటి ఇతిహాసాల పాత్రలతో తమతమ కథలు అల్లుకున్నారు.(గోండు రామాయణం గురించి పురిపండా అప్పలస్వామి గారి వ్యాసం నా బ్లాగులో ఆసక్తి కలవారు చూడవచ్చు.) ఈ అడవులలో ఉండిపోయినవాళ్లు వాల్మీకి కాలం వాళ్లు కారు. వాళ్లు నేటి గిరిజనులూ కారు. ఇలా మీరు ఆలోచిస్తే మన ఆలోచనా చక్షువుల ముందు మానవ సమాజ పరిణామం అనే దృశ్యం కనబడుతుంది. నేను చెప్పటానికి ప్రయత్నించినది ఆ పరిణామంలో ఈనాడు కూడా మిగిలున్న ఆనవాళ్ల వాస్తవం మాత్రమే.
   త్రీ. రామాయణంలో మూలకథ ఏమిటి? ఒకరి భార్యని మరొకరు ఎత్తుకుని పోతే వాడు పదిమందినీ పోగుచేసి -ఒర్నాయనోయ్ ఈవేళ నాకయింది రేపు మీకవుతుందని నచ్చజెప్పి- తీసుకెళ్లి వాడిని తన్ని తన పెళ్లాన్ని తెచ్చుకోటం. ఇది ఎప్పుడు జరిగుంటుంది? ఏకదంపతీ వ్యవస్థ ఏర్పడుతున్న తొలి దశలో ఇలాంటి ఘటనలు ప్రపంచమంతటా జరిగుంటాయి. ఇలాంటి ఘటన నుంచి కథలు పుట్టటానికి అవకాశం ఉంది. మారుతున్న కాలంతో బాటు అవి మారటానికీ అవి అనేక సమాజాలలో అనేక రూపాలు తీసుకోటానికీ సంభావ్యత ఉంది. ఈ దృష్టితో చూస్తే ౩౦౦ల వరకూ ఉన్న రామాయణాలకీ గ్రీకు పురాణాలకీ మనం ఒకే వివరణ ఇవ్వగలం.

   ౪. కనక జరిగుండటానికి అవకాశం ఉన్నదాన్ని చెప్పటమే గాని దాని అవసరం జనాలకు ఉందా లేదా అనేది మనం నిర్ణయించలేము. ఆలోచించండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు