కఠినసుందర కవితా ‘ప్రస్థానమూర్తి’

ప్రసాదమూర్తి ఇప్పటికీ తన ఊళ్లోనే ఉండిపోయారు. ఏమాత్రం ఎదగలేదు. ఏ నాగరికతలూ నేర్వలేదు. ఏ నగర సంస్కారాలూ ఒంటబట్టించుకోలేదు. తనకు మూలాలంటే ఇష్టం.

‘‘యం లేదు… ప్రాధేయపడను

చిట్టచివరి నెత్తురుబొట్టు దాకా

స్వేచ్ఛకౌగిలిలో నలుగుతాను

మీకు మాత్రం కత్తులతో కాపురం ఎంతకాలం!?’’ అని ఎవరు ప్రశ్నించగలరు?

‘‘ప్రాణమే కదా తీసుకుపోండి

స్వేచ్ఛను ప్రేమించాను

కోటిసార్లు కోట్లలో జన్మిస్తాను’’ అని ఎవరు ధీమాగా జవాబివ్వగలరు?

ఒక్క కవి మాత్రమే ఆ పని చెయ్యగలడు. ప్రశ్నఖడ్గం ఝుళిపించినా, జవాబుజెండా ఎగరేసినా… అది కవికి మాత్రమే  సాధ్యం. సంకెళ్లను సహించని, స్వేచ్ఛను వదులుకోని కవి మాత్రమే అలా కఠినసుందరంగా కవిత్వభాషలో కంఠం విప్పుతాడు.

ఈ కంఠం ప్రసాదమూర్తిది. ఈ ప్రశ్న, ఈ జవాబు, ఈ స్వేచ్ఛాగానం… అన్నీ ప్రసాదమూర్తివే.

‘‘కొంచెం స్వేచ్ఛ చాలు

శరీరంలోని సమస్త రంధ్రాల నుండి

స్వేచ్ఛను పీల్చుకోవాలి’’ అని నిర్భయంగా ప్రకటించిన ప్రసాదమూర్తి పాఠకలోకానికి కొత్త కాదు.

‘‘మీ మృత్యుకాంక్ష ఎంత సనాతనమో

నా పువ్వుల భాష అంత పురాతనం

ఇది యుగయుగాల పౌనఃపున్య

సహనాసహన సంఘర్షణ’’ అంటూ జీవన మార్మికతను కవిత్వంగా మలచిన ప్రసాదమూర్తి కవిత్వానికి కొత్త కాదు.

కలనేత, మాట్లాడుకోవాలి, నాన్న చెట్టు, పూలండోయ్ పూలు, చేనుగట్టు పియానో, మిత్రుడొచ్చిన వేళ, దేశం లేని ప్రజలు, నాన్న సైకిలు వంటి సంపుటాలతో కవిత్వంలో తన పాదముద్రలకు ప్రత్యేక కొలతల్ని నికరం చేసుకున్న సృజనశీలి ప్రసాదమూర్తి.

ఇరవయ్యేళ్ల వ్యవధిలో తాను వెలువరించిన ఏడు కవితాసంపుటాల నుంచి కొన్ని కవితల్ని ఏరి ప్రత్యేకంగా ప్రచురించిన Selected Poems పుస్తకం చదవటం ఓ కుదిపేసే అనుభవం. ఈ వచన కావ్యం ఆసాంతం చదివి, మళ్లీ మళ్లీ వెనక్కీ ముందుకీ ప్రయాణం కట్టి, ఆ మజిలీల మడతల్లోని భావోద్విగ్న రహస్యాలను ఆరా తీయటం ఓ చైతన్యభరిత శిక్ష.

అసలీ కవి తన కవితను ఎక్కడ మొదలు పెడుతున్నాడు? ఆ పద్యానికి ఎట్లా నడక నేర్పుతున్నాడు? ఎలాంటి అలంకరణతో దాన్ని తీర్చిదిద్దుతున్నాడు? ఏయే సామగ్రిని దట్టించి, దాన్ని ముట్టించి మనపైకి వదులుతున్నాడు? ఎట్లా ముగిస్తున్నాడు? అంతిమంగా ఎలాంటి తీర్పునిస్తున్నాడు? ఏమని తీర్మానిస్తున్నాడు?

దాడి చేసిన కొన్ని ప్రశ్నలకైనా సమాధానం వెతుక్కొనే పనిలో విధిగా నిమగ్నమవుతాం.

*****

ప్రసాదమూర్తి కవిత ప్రశాంతంగా మొదలవుతుంది. ప్రసన్నంగా మొదలవుతుంది. గుప్పిట మూసి, అందులో ఏదో ఉందన్న తరహా మాయాజాలం మచ్చుకైనా కనిపించదు. హాయిగా వస్తువును చంకనెత్తుకొని, పసితనపు ఛాయలకు అక్షరాలు తొడిగి ప్రదర్శనకు పెడతారు.

కవి ఓ పూల మార్కెట్టుకు వెళ్లారు. ఎటు చూసినా పూలే. పరిమళాలే. రంగుల రాసులే. పూల కాపరులే. ఆ సుమసుందర దృశ్యాన్ని అక్షరాలతో అభిషేకించాలనుకున్నారు. అలా రాసిన ‘‘పూలండోయ్ పూలు’’ కవితా ప్రారంభం చూడండి…

‘‘పూలమ్ముకొని బతికిపోయినా బావుండు

నిత్యం రంగుల సుగంధాల వానలో

నృత్యం చేసేవాడిని’’.

మరో కవిత ఎలా ప్రారంభమవుతుందో చూడండి…

‘‘సాయంత్రపు సువాసన నా వైపు నీడలా పాకుతున్నప్పుడు

నేను ఆ ఆశ్రమం వైపు అడుగులు వేసాను’’ (బుద్ధాశ్రమం).

ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు రాసిన కవిత ఇది. మలిసంధ్యలోని మనుషులు మసలే తావును కవిత్వంలోకి తర్జుమా చేస్తున్న కవి ‘‘సాయంత్రపు సువాసన’’తో కవితను ప్రారంభించటం ఎంత ఔచిత్యం! మలిసంధ్యను సాయంత్రంతోటీ, అక్కడి ప్రశాంత జీవనసౌరభాన్ని సువాసనతోటీ ముడిపెట్టి గురిపెట్టిన ఈ కవిత నిరాటంకంగా పాఠకుడి గుండెల్లోకి దూసుకుపోకుండా ఉంటుందా! పైగా ‘వృద్ధాశ్రమం’పై రాసిన కవితను ‘బుద్ధాశ్రమం’ అనే శీర్షికతో అలంకరించి, అదనపు సొగసును గుది గుచ్చటం కవి నైపుణ్యం కాక మరేమిటి!

 

*****

చిన్న పాయగా మొదలైన అక్షరఝరి కాలువలా మారి, నదిలో కలిసి, కొండలూ గుట్టలూ ఎక్కి, అక్కడి నుంచి జలపాతమై దూకుతున్నట్లు ఉంటుంది ప్రసాదమూర్తి శైలి. అమాయకంగా పసివర్ఛస్సుతో ప్రారంభమై, చూస్తుండగానే ఆరిందాలా మారి, అమాయకఛాయలు వీడి, వికసిత జ్ఞానదేహంతో బలం పుంజుకుంటుంది ఈయన కవిత. ప్రశ్నలు సంధిస్తుంది. సమాధానాలు సమాయత్తం చేస్తుంది. మానవ జీవన మూలాల్లోకి ఎలబారి, తాత్త్విక భావనల్ని ప్రదర్శనకు పెడుతుంది. మానవీయ సౌందర్యాన్ని, జీవన కాఠిన్యాన్ని సరిసమానంగా ఆవిష్కరిస్తుంది.

ఇంతకీ మనం ఈ భూమ్మీదికి ఎందుకొచ్చాం?

ప్రశ్న చదవగానే ఉలిక్కిపడినా, ‘ఏదో పనిమీదే వచ్చి ఉంటా’మని గుర్తు చేసుకుంటాం.

ప్రశ్నతో ఒక్క పోటు పొడిచి, కవి సాధించే ప్రాథమిక విజయమిది.

‘‘రుతువుల చక్రాలు తొడుక్కొని పరుగులు తీస్తున్న

ఈ బండి మీద హాయిగా పడుకోని పోవడానికి మాత్రం రాలేదు’’ అని కవే కర్తవ్యబోధ చేసి ‘అమ్మ కడుపులో ఉమ్మనీటి పొరలో/ నువ్వు రచించిన స్వప్నలోకాల’ గురించి గుర్తు చేస్తాడు.

‘‘కొత్త లోకాల కోసం అక్షరాలు పోగేస్తున్న చీమలరెక్కల మీద

ఇసుక రేణువంత ఇటుక ముక్కైనా అవుతావేమో’’ ఆలోచించుకొమ్మని హెచ్చరిస్తారు.

కలయిక అంటే కవికి మహా ఇష్టం. ‘‘ప్రతి కలయికా/ అలసిన కళ్లకు కలల విసనకర్రలు కానుకగా ఇవ్వాలి’’ అంటారు. ‘‘కలయికలే జీవితం/ కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం’’ (పిడికెడు కలలూ దోసెడు జ్ఞాపకాలు) అని చెబుతారు.

శ్రీనగర్ నుండి ముజఫరాబాద్‌కు తొలిసారి బస్సు నడిచిన సందర్భంలోనూ కలయికకున్న కమనీయ సౌందర్యాన్ని వర్ణిస్తారు…

‘‘బస్సు అంటే

దేహాల మూటలూ ఆత్మల పెట్టెలూ మోసే

కూలియంత్రమే అనుకున్నాను

రెండు దేశాల హృదయస్పందన

అని ఇప్పుడే తెలిసింది’’.

ఆ బస్సు రెండు దేశాల ఆత్మల్ని రెండు రెక్కలుగా చేసుకుని పక్షిలా ఎగురుతోందని గొప్ప ఊహతో కవితను నిర్మిస్తారు. అది రెండు దేశాల గుండెల్ని జెండాలుగా ఎగరేసుకుంటూ ఒక సైనికుడిలా దూసుకుపోతోంది అంటూ అగాథాలను చదును చేస్తారు.

దూరం అంటే కవికి అయిష్టం. మనుషుల మధ్య, మనసుల మధ్య, ప్రకృతి-ప్రాణుల మధ్య… అది ఎక్కడ దూరినా దుర్లభమే. ఈ అంశాన్ని అత్యంత వైవిధ్యంగా ప్రసాదమూర్తి ‘‘దూరం’’ కవితలో ఆవిష్కరించారు. ఎక్కడా రొడ్డకొట్టుడు భావనలూ, అరిగిపోయిన ఉపమానాలూ, నినాదాలూ లేకుండా చిక్కని ఇమేజరీలతో అల్లిన తీరు అబ్బురపరుస్తుంది. ‘అన్ని దూరాలూ మైలురాళ్లతో కొలవలేం’ అంటూ మొదలైన కవిత ఎన్నో లోతుల్లోకి ప్రవహిస్తుంది…

మన్నలి వీలైనంతగా డిస్టర్బ్ చేసి, తను చెప్పదల్చుకున్న అంశాన్ని మన మెదడులోకి సరఫరా చెయ్యటంలో ఈ కవి సఫలీకృతమయ్యారు. మనం నిస్సందేహంగా ఆ దిశగా తల తప్పి, కొత్త చూపును శ్రుతి చేసుకుంటాం.

అట్లా అని, భారం మొత్తం మన మీదే వెయ్యరు. ఆయనే ముడులు విప్పుతారు. సులువైన పరిష్కారాలు చెబుతారు. సమస్త అపోహలూ పటాపంచలు కావాలంటే మనసు విప్పి ‘‘మాట్లాడుకోవాలి’’ అంటారు. మాటలకు షవర్ బాత్ చేయించి, ఫ్రెష్‌గా ఎదుటి వాళ్లముందు ఉంచాలంటారు…

‘‘మాట్లాడితే

శుభ్రంగా మంచు కడిగిన నిలువెత్తు అరిటాకు మీద

ఆత్మీయుల కోసం నిన్ను నువ్వు వొడ్డించుకున్నట్టుండాలి

మాటకు బొమ్మేకాని బొరుసు లేదు

మాటకు వెలుగేకాని చీకటి లేదు’’.

కవికి చీకటి నచ్చదు. నిర్బంధం నచ్చదు. తలుపులు, కిటికీలతో బంధించి ఉండే ఇల్లు జైలుతో సమానం. అవేవీ లేకుండా తెరచి ఉంచిన ఆశ్రమంలా కట్టిన ఇంట్లో సందడి పరవళ్లు తొక్కుతుందని చెబుతారు. సందేహపు ముసుగుల్లేకుండా ఎవరెవరో హాయిగా వస్తారు, పోతారు. బతికున్న బంధుమిత్రులే కాదు, గతించిన బంధాలు కూడా ‘‘లోపలి కావిడిపెట్టెలో కలరా వుండలు పెట్టి దాచిపెట్టిన ఆత్మల్ని తీసి తొడుక్కుని ఆడుకుంటా’’యని సంబరంగా ప్రకటిస్తారు. ‘రుతువుకో రంగు చొక్కా వేసుకుని, గాలి పచార్లు చేస్తూ ఆ ఇంటికి వస్తుంది పోతుంది’ అంటారు. ఆ ఇంటికి ‘‘వాస్తు శిల్పి’’ తన తల్లేనని సంతోషంగా దండోరా వేస్తారు.

‘‘అక్షరాలు పేర్చి ఒక గది కట్టుకుంటాను

వాక్యాలను ఊచలుగా బిగించి

కిటికీలు పెట్టుకుంటాను’’ అంటారు ‘‘చిన్ని ఆశ’’ కవితలో.

మూసి ఉంచటంలోని నిర్బంధాన్ని, తెరచి ఉంచటంలోని నైర్మల్యాన్ని ప్రసాదమూర్తి ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు ప్రశస్తనీయం.

నిషేధాన్ని కవి నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. స్వేచ్ఛ లేని జీవితం శిక్షతో సమానం అంటారు. నిషేధాన్ని నిరసిస్తూ నిర్భయ నినాదాలతో హర్తాళ్ చేస్తారు.

ప్రజలే నిజమైన ఆస్తులు. ప్రజలే దేశపు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఎన్నార్సీ అనే భూతం ఏకంగా ఆ ప్రజల్నే దేశం నుంచి ఖాళీ చేయించే మంత్రాన్ని బుట్టలో వేసుకుని బయల్దేరింది. కవి కన్నెర్ర జేయకుండా ఉంటాడా?

‘‘మొలకెత్తిన చోటు నాదే అని

మొక్క మొరాయిస్తే కుదరదు

ఏ పరాయి దేశంలో జరిగిన

పరపరాగ సంపర్క ఫలమో నిగ్గు తేలాలి’’ (దేశం లేని ప్రజలు) అని గర్జించారు.

ప్రకృతిని గుండె నిండా పొదువుకున్న కవి పర్యావరణంపై వర్తమాన బీభత్సాన్ని ఎండగడుతున్నారు. మనిషి బాధ్యతారాహిత్యాన్ని తూర్పార బడుతున్నారు.

నదుల్ని కూడా మాయం చేస్తున్నాం. ఎక్కడని వెతకాలి, తప్పిపోయిన నదిని? అయినా, తిరునాళ్లలో పిల్లాడు తప్పిపోయినట్టు నది తప్పిపోవటమేమిటి?

‘‘నీటిని చూసి నది వుందనుకుందామా

నీటిని ఒరుసుకుంటూ నిలబడ్డ మనుషులెక్కడ?

నది తీసుకొచ్చే మట్టినో ఇసుకనో పురాపరిమళాలనో

దేహరంధ్రాల నుంచి పీల్చుకునే మనుషులెక్కడ?’’ సమాధానం వెతకాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.

ఖండించాల్సిన దానిని ఖండించటంలో కవి కంఠం పదునెక్కుతుంది. పశ్చాత్తాపం ప్రకటించాల్సిన సందర్భంలో కవిస్వరం సవినయంగా పలుకుతుంది. మొదటి అంశాన్ని ‘‘బుష్ మళ్లీ రావద్దు’’ కవితలోనూ, రెండో అంశాన్ని ‘‘మహాత్మా పూలే’’ కవితలోనూ అద్భుతంగా ఆవిష్కరించారు.

‘‘మన ఆత్మహత్యల ఆర్థికపత్రాల మీద

ఒక నక్క సంతకం చేసిపోయింది

మన సార్వభౌమత్వం మీద

ఒక డేగ కన్నేసిపోయింది’’ అంటూ బుష్ పై విరుచుకుపడిన ప్రసాదమూర్తి…

‘మహాత్మా పూలే’ గురించి తెలుసుకోలేకపోయినందుకు ‘సిగ్గు పడుతున్నాను చితికిపోతున్నాను’ అని నిజాయితీగా ఒప్పుకొని

‘‘గుప్పెడు మట్టితీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా

ఎవడు ఏ సందులో ఎలా ఎప్పుడు

విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి

నీ సమాధి మీద

ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పివుంచిన

కుట్రదారుణ్ణి ఇప్పుడు బయటపెట్టాలి’’ అని నిలదీశారు.

ప్రసాదమూర్తి కవిత్వంలో అక్కడక్కడా మాంత్రికశైలి కవితను కొత్త ఎత్తులకు తీసుకుపోతుంది. అది నమూనాలను మాత్రమే ఉటంకిస్తూ చెప్పదలచుకున్న విషయాన్ని గాఢమైన అభివ్యక్తులతో తీర్చి దిద్దుతుంది. విషయాన్ని సాంద్రతరం చేస్తూ పొడవు, వెడల్పు, లోతుల్ని మరింత విస్తరిస్తుంది.

‘‘ఎక్కడో తలలు తెగిన మొండిచెట్లు

గుండెలు బాదుకుంటున్నాయని

పొద్దున్నే దేహాన్ని ఇంట్లోనే వదిలి

ఖాళీ బట్టలతో బయటపడ్డాను’’ (రాత్రి కూలిన చెట్టు)

‘‘ఉదయం సాయంత్రం చంకలో ఓ జోలె తగిలించుకుని

ఆకాశంలో భిక్షాటనకు బయల్దేరతాను

సూర్యుడి గుమ్మం ముందో పక్షుల గూళ్ల ముందో

ఏ మబ్బుల నీడల వారగానో నిల్చుంటాను’’ (చిన్ని ఆశ…)

పునరావాసంపై రాసిన కవితకు ‘‘పునరామోసం’’ అనే శీర్షిక పెట్టడమే ఒక ఛర్నాకోల దెబ్బ. ఇక ఆ కవిత ఊరుకుంటుందా!

‘‘మట్టి మనిషితో- మనిషి గాలితో

గాలి నీటితో

ఏదో గుసగుసలాడ్డం

చెవులకు కాక గుండెకు వినిపిస్తోంది’’ అంటూ ఊళ్లు ఖాళీ చేసి వెళ్తున్న జనహృదయ ఘోషను ఆర్తిగా వినిపిస్తుంది.

‘‘డ్యూటీ’’ గురించి ఏం రాస్తాం? సమయపాలన, విధి నిర్వహణ, నియమనిబంధనలు, ఆంక్షలు.. ఇవే కదా గుర్తొస్తాయి. కానీ, ప్రసాదమూర్తి దాన్ని అద్వితీయంగా కవిత్వం చేశారు.

‘‘ఆఫీసుకు వెళ్లడం అంటే

చెవుల్ని ఎఫ్.ఎం. రేడియోలో నానబెట్టడం కాదు’’ అంటారు.  మరేమిటి? రోడ్డు మీద వెళ్లేటప్పుడే డ్యూటీ చేయాలంటారు. బాధ్యత గుర్తెరగాలంటారు. ఏమిటా బాధ్యత?

‘‘కనపడని తాళ్లతో కట్టబడిన

కొన్ని జంతువులు కనపడతాయి

భవనాల మీద ఆకాశం పచార్లు చేస్తున్న

దృశ్యాలను అవి కళ్లప్పగించి చూస్తూ

భూమిలోంచి మొలుస్తున్న మరో భవనం కాడెకి

మెడలు అప్పగించడానికి పోతున్నాయి

జంతువులు కాదు మనుషులే! వాళ్లని మనిషిలా చూడు’’ అని ఉపదేశిస్తారు.

*****

ప్రసాదమూర్తి ఇప్పటికీ తన ఊళ్లోనే ఉండిపోయారు. ఏమాత్రం ఎదగలేదు. ఏ నాగరికతలూ నేర్వలేదు. ఏ నగర సంస్కారాలూ ఒంటబట్టించుకోలేదు. తనకు మూలాలంటే ఇష్టం. తల్లివేరంటే ఇష్టం. సహజత్వం కోల్పోని వనరులంటే ఇష్టం. వర్షాన్ని ముందేసుకుని వరండాలో కూర్చున్నా, ‘ముసురు పట్టిన మనసుకు మూత పెట్టి/ ఖాళీ శరీరాన్ని పెదవిలా విరిచిన ఊరు’ గుర్తుకొస్తుంది. ‘‘ఊరూ వానా…’’ కవిత మనల్ని నిలువెల్లా తడిపేస్తుంది.

ఊళ్లో కాలువ వదిలినప్పుడు చూడాలి, అదో జలసందడి! ఆకుమడి విత్తనాల కోసం దాచిపెట్టిన వడ్లబస్తాలు, చిలక్కొయ్యలకు వేలాడే ఎద్దులగంటలు, ఉప్పటి చెమట తడికోసం ఉబలాటపడే తుమ్మచెట్ల నీడలు, కరువు కాలంలో కూలిజనాల ఎదురుచూపు… వీటన్నిటికీ ఒక్క కాలువ ప్రవాహంతో విముక్తి లభిస్తుంది.

‘‘ఊరి బాల భగీరథులు/ గోచిగుడ్డల్ని జెండాలుగా వూపుతూ

ఊరికొస్తున్న కాలువకు/ ఉత్సాహంగా స్వాగతం పలుకుతారు’’. ఈ హడావుడినంతా ‘‘కాలువ సంబరంలో మా ఊరు’’ కవిత బొమ్మ కట్టిస్తుంది.

ఇప్పుడు, ఇన్నాళ్ల తర్వాత కవి వెనక్కి వెళ్లి చూసుకుంటే అంతా గందరగోళం. ఇంటిపక్క చెరువు కుళ్లిన గొడ్డుదేహంలా కంపు కొడుతోంది. పచ్చని పొలాలను చేపల చెరువులూ రొయ్యల చెరువులూ మింగేశాయి. పక్షులు వలస పోయాయి. కొల్లేరు, రకరకాల జీవాలు ఖాళీ చేసిన ‘జూ’ లాగా నిర్వేదంతో ఉంది. ఆ నిర్వేదాన్ని ‘‘గుండె కొల్లేరు’’ కవితగా వినిపించారు…

‘‘నీటికాకినై నీళ్లల్లోకి మునిగి

నా కొల్లేటి బాల్యాన్ని వెతికి పట్టుకునే వేటలో పడ్డాను

చేపలు ఎండబెట్టుకునే గట్టుమీద

నేను నా స్మృతులతో

తడిసిన కవితల్ని ఆరబెట్టి

దేహాన్ని అక్కడే కాపలాగా వదిలేసి

దిసమొల ఆత్మతో అమాంతం

సరసులోకి దూకేశాను’’. లారీల్లోకి, ట్రక్కుల్లోకి ఎక్కి రాష్ట్రాలూ దేశాలూ దాటిపోయిన కొల్లేరు ఎముకల గూడు మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఈ కవిత ఓ పెద్ద చేపలా పైకెగిరి మన కళ్లమీద తోకతో ఠపీమని కొడుతుంది.

కవికి తొలి గురువు తల్లే. ఆమెను మించిన బోధివృక్షం లేదు. ఆమె చేసిన జ్ఞానబోధతోనే తన మనో వినీలాకాశం కాంతులీనుతోందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆమె నీళ్లు మోస్తూ జారి పడిపోయి కాలు విరిగిన సందర్భంలో రాసిన కవిత ‘‘అమ్మా ఫెమినిస్టువి కావే’’. ‘ఆడదాని శరీరంలో ఏ అంగాన్నీ సజీవంగా మిగల్చని’ మగాళ్ల అనాగరికతను తనకూ అన్వయించుకుని బాధ పడతారు.

‘‘నువు పొద్దస్తమానం మా చుట్టూ తిరిగితే

సూర్యుడు నీ చేయి చుట్టూ తిరుగుతాడు’’ అని తల్లిని తలచుకుని

‘‘నాకు మగ జన్మనిచ్చి

ఒక దుఃఖిత హృదయాన్నిచ్చి

రెండు కన్నీటి చెలమలనిచ్చి

ఏ రాత్రీ నిద్రరాని జీవితాన్నిచ్చి

అమ్మా ఈ మగజాతి మీదిలా కసి తీర్చుకున్నావా’’ అంటారు. ఆ వాక్యాలు స్క్రూడ్రైవర్లలా మారి మన గుండెల్ని చీలుస్తాయి. తనను శపించమని వేడుకుంటారు. ఆఖరికి,

‘‘నీ పాదాల దగ్గర కూర్చుని

మేం ఫెమినిస్టు పాఠాలు నేర్చుకుంటాం’’ అని వినమ్రంగా వేడుకుంటారు.

కూతుర్ని తన కవిత కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు ప్రసాదమూర్తి. చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్ల దాకా, పప్పీషేముల నుండి పట్టుపావడాల దాకా ఆ పాప వేషాలన్నీ ఆయనకు అపురూపమే. ఎక్కడికెళ్లినా, ఎవర్ని చూసినా తన కూతురే దర్శనమిస్తుంది…

‘‘కిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా

నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి

చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది’’. పాప పుట్టినరోజు వస్తే, తనే ఓ బెలూనై ఆకాశానికి వేలాడతారు. కొమ్మకొమ్మకీ చాక్లెట్లు, కేకులూ వేలాడదీసి పక్షులకు ఫలహారంగా పెడతారు.

‘‘నాకు కూతురంటే

ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ

మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ’’ (పిచ్చి నాన్న). ఈ చివరి వాక్యాలు పూర్తి కాకముందే ఆ పాప మనకూ బంధువైపోతుంది.

నానమ్మతో అనుబంధం కూడా కవికి అమూల్యమే. ఆమె కలలోకొచ్చి చేసిన ‘అల్లరి’ని విభిన్నమైన కవితగా మలిచారు. తను బడి ఎగ్గొడితే ఆమె బడితెపూజ చేసేది. గోళీకాయల ఆటకు అడ్డు చెప్పేది. అంతేనా! తాయిలం కొనుక్కోమని బొడ్లోంచి డబ్బులు తీసి ఇచ్చేది. పుల్లట్లు వేసి పెట్టేది. కతలు చెప్పేది. పరజపిట్ట వేపుడు చేసి పెట్టేది…

‘‘చింతచిగురూ ఏట మాంసం

ఏదీ నీ చేత్తో ఓ ముద్ద పెట్టవే నానమ్మా

జీవితమంతా ఆకలేనే

ఏ జీతమూ ఏ కౌగిలీ తీర్చలేని ఆకలే ఇది’’ అని నిద్రలో కలవరిస్తారు. కలలోనే ఆ బంధం తాలూకు మాధుర్యాన్ని నెమరు వేసుకుంటారు.

పిల్లలంటే కవికి ప్రాణం. ‘‘ఈ ప్రపంచం పిల్లలదే’’నని ప్రకటిస్తారు. పిల్లల్ని అలా వదిలేయొద్దు అంటారు. పిల్లలు దిక్కులేని వాళ్లయితే దేశమూ దిక్కు లేనిదేనంటారు…

‘‘ఆకాశం కష్టపడి నేసిన ఇంద్రధనస్సు వస్త్రాన్ని

పిల్లలకు కొత్త బట్టలుగా కుట్టించాలి

చుక్కలకు రంగులు వేసి

వాళ్ల చొక్కాలకు గుండీలుగా కుట్టాలి’’. ఎంత అందమైన ఊహ! అనివార్యమైన ప్రతిపాదన!

2014లో ఉగ్రవాదులు పెషావర్‌లో ఒక బడి మీద దాడిచేసి, 60 మంది పిల్లల్ని చంపేసిన సందర్భంలోనూ ప్రసాదమూర్తి ‘‘పిల్లలేం చేశారు?’’ అంటూ నిలదీశారు…

‘‘మరకలంటని నవ్వులతో

మర్మమెరుగని చూపులతో

కలల పడవలు తయారు చేసుకుంటారు తప్ప-

కపటాల కనురెప్పల వెనక

జరిగే యుద్దాలు వాళ్లకేం తెలుసు?’’

*****

జైసల్మేర్ కోట ముందు తువ్వాలు పరచుకుని రాజస్థానీ యంత్రవాద్యంతో అందరికీ వినోదం పంచుతున్న తాతను చూసినప్పుడు ప్రసాదమూర్తి ‘‘తాత కోసం’’ ఓ కవితగా మారిపోయారు.

ఆ తాత ముఖం, గొంతు, వణుకుతున్న చేతుల నిండా కాలం చేసిన గాయాలు కవికి మాత్రమే కనిపిస్తాయి. ‘పరచిన తువ్వాలు మీద/ రాలిన నోట్లలో/ రుతువులు రాల్చిన నెత్తురు బొట్లు’ కనిపిస్తాయి. ‘అతని జంత్రవాద్యం చుట్టూ/ రాజుల చిత్రపటాల మీద ముసురుకున్న/ గబ్బిలాల కారుచీకట్లు’ కనిపిస్తాయి. కవికే కాదు, కవిత చదివే మనకూ అవి స్పష్టంగా దర్శనమిచ్చి, మనలోని భరోసాతనాన్ని భగ్నం చేస్తాయి. ఇన్ని ఆనవాళ్లను పట్టి చూపిన కవి, ఆఖరికి ఏమంటారో చూడండి…

‘‘ఈసారి నీ కోసం ఓ గుర్రాన్ని తెచ్చి

నీ చేతుల్లో ఖడ్గాన్ని పెట్టి నీతో దౌడు తీయిస్తా

తిరగబడ్డ భూమిలోంచి సామాన్యుల కళేబరాలు

కొత్త పుస్తకాలు పూచిన చెట్లై మొలుచుకొస్తాయి

పొడిచే సూర్యోదయాలన్నీ నీ నుదుటి మీదే తాతా!’’.

కవిత చదవటం ముగియగానే మనం సేద దీరతాం. ఆశావహ దృక్పథాన్ని ఆబగా కౌగిలించుకుని ఊపిరి పీల్చుకుంటాం.

కవి ఓ ఆటో ఎక్కటానికి నిరీక్షిస్తారు. వచ్చిన ప్రతి ఆటో ఎక్కరు. అందులో ఆమె ఉంటేనే ఎక్కుతారు. ‘హ్యాండ్‌బ్యాగ్‌లో సంసారం సర్దుకుని/ బాక్సులో అన్నంతోపాటు బాధల కూర కలుపుకుని’ అపార్టుమెంట్లలో పని చేసేందుకు వెళ్లే ‘ఆమె ఉంటే బతుకువాసన వేస్తుంది’. పోనీ, ఆమెతో మాటలు కలిపారా? బాధల గురించి ఆరా తీశారా? లేదు. మౌనం చెప్పే కథలే గొప్పవంటారు. ‘‘షేరింగ్ ఆటో’’ శీర్షికన రాసిన ఈ కవితను ‘నదులతోనూ షేర్ చేసుకోవచ్చు’.

కవి కోరుకునే అంతిమ సుగుణం- మానవత్వం. ఓ వృద్ధురాలు రైల్వేస్టేషన్ మెట్లమీద అడుక్కునే దృశ్యం ప్రతిరోజూ కవిని వెంబడించేది. అది కవిత్వమై జాలువారింది…

‘‘ఈ మధ్య ఎక్కడ మెట్లెక్కినా

ఏదో ఓ మెట్టు మనిషిలా తగులుతోంది’’ అంటూ మొదలవుతుంది ఈ కవిత. కవి వస్తువును ఎంత ప్రతీకాత్మకంగా, ప్రభావశీలంగా కవిత్వంలో నిక్షిప్తం చేస్తారంటే… దాని తాలూకు సమస్త ఛాయలూ మన చుట్టూ రంగుల వలయాలై విస్తరిస్తాయి. మనుషుల్నీ రుతువుల్నీ కదలని కనురెప్పల నుంచి కనికరంగా చూసే బిచ్చగత్తె హృదయం అక్షరాలై జాలువారుతుంది. ఆమె చూపుల వాడికి తన హృదయం సంశయసోపానాల మీద ఏ లోయల్లోకో దొర్లిపోతుందంటారు. ఎండ, వాన, చలి ఆమెను ఇబ్బంది పెట్టకుండా దయగా తప్పుకు వెళ్తున్నాయన్న ఆశాకాంక్షను అక్షరీకరిస్తారు…

‘‘ఎంత పేట్రేగే వర్షాలైనా

ఆ మెట్టు దగ్గరకొచ్చేసరికి

ఓ మెట్టు దిగి దారి మార్చుకుంటాయి’’ అంటారు. ఆకులు, చెట్లు, కొమ్మలకున్న దయాగుణం మనిషికి లేదని వాపోతారు. ‘‘దయామయి’’ శీర్షికతో ఈ కవిత మనకు ఉన్నతంగా కనిపిస్తుంది.

ఒకటా రెండా, ప్రసాదమూర్తి కవితల్లో మనల్ని వెంటాడే వాక్యాలు బోలెడు. కొన్నిటినైనా ఆస్వాదించకపోతే దాహం తీరదు…

‘‘పక్షులు తుపాకులు పట్టుకు తిరగటం

అడవికి అభ్యంతరం కానప్పుడు

వేటకాడు వేలెత్తి చూపడం కొంత వింతగానే వుంటుంది’’ (ఆయుధం)

‘‘అతని చుట్ట చివరి మండే సూర్యుణ్ణి చూస్తూ

యవ్వనాన్ని వేడి చేసుకున్న వాళ్లం కదా

అతని నిష్క్రమణ కూడా మనకు విప్లవమే’’ (క్యాస్ట్రో ద హీరో)

‘‘మనిషి ఎండిపోతే చెట్లకే దిగులెక్కువ

నిలువెల్లా పూత పూసిన మనిషి కావాలి

మనిషి మీద వాలే వసంతం కావాలి’’ (ఒక్క రుతువు)

ఇంత అద్భుతమైన కవితాపొత్తం వెలువడటానికి కారణమైన ‘గీత’కు ఆశీరభినందనలు.

ముందుమాటలో లక్ష్మీనరసయ్య అన్నట్లు…

‘‘విషయపరంగా ప్రసాదమూర్తి శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు, శివారెడ్డి, నగ్నముని, మద్దూరి నగేష్ బాబుల వారసత్వానికి చెందినవాడు. కవితాకళ పరంగా ఇస్మాయిల్, దేవీప్రియ, శిఖామణి, ఆశారాజుల స్కూలుకి చెందినవాడు. ఈ రెండిటి మేలు కలయికగా ఇతని కవిత్వం కనిపిస్తుంది’’.

 

(ఆగస్టు 1… ప్రముఖ కవి ప్రసాదమూర్తి గారి జన్మదినం సందర్భంగా ఈ చిరు వ్యాసకానుక)

—0—

ఎమ్వీ రామిరెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రసాద మూర్తి గారిని నిలువెల్లా తడిమి, గుండెలకు హత్తకున్నట్లనిపిస్తోంది…

  • ఎమ్వీ రామిరెడ్డి గారు ప్రసాదన్న గూర్చి రాసిన ఒక్కొక్క మాట అక్షరసత్యాలు ఆమూలాగ్రంగా సింహావలోకనం గావించాయి .కఠిన సుందర మూర్తి పేరు చక్కగా వన్నెతెచ్చినది .మా నవోదయ మూర్తి ఏకబిగిన చదివి ఆగిపోయాను.మీరు ధన్యులు మీ వాక్యాలు ప్రశంసనీయం.

  • ప్రసాదమూర్తి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రామిరెడ్డిగారు

  • ప్రసాదమూర్తి లోని కవినీ , ఆ కవిలోని అంతరంగాన్నీ చక్కగా ఆవిష్కరించారు. రామిరెడ్డీ ప్రసాదమూర్తీ ఇద్దరికీ అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు